Previous Page Next Page 
అష్టావక్ర పేజి 30


    రంజిత మొహంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. వేళ్ళు కంపించసాగాయి. మాటలు ఇంకా పూర్తికాలేదు. రవితో చెప్పడానికి దిగ్గున లేచింది.

    అదే సమయానికి రాకేష్ ఆ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. ఆఫీస్ రూమ్ లోనుంచి తన కంఠం లాంటిదే వినిపించడంతో గుమ్మం దగ్గిర ఆగాడు.

    రాకేష్ కి మొదట ఒక క్షణం పాటు అర్ధం కాలేదు.

    కిటికీలోంచి ఓరగా తొంగి చూశాడు. అమ్మాయి అటు తిరిగి వుంది. టేప్ రికార్డర్ స్పష్టంగా కనబడుతూంది. అది భవానీశంకరంది అని తెలుసు.

    వెంటనే అతడికి విషయం అర్ధమైంది. ఆ ఇంట్లో ఒక స్వంత వ్యక్తిలా తిరిగే అతడికి, భవానీశంకరం తాలూకు డెక్టాఫోన్ సంగతి కూడా తెలుసు. తన మాటలు టేపులో రికార్డయ్యాయని అర్ధమయింది.

    ఇంకొకరైతే ఆ క్షణం ఏం చెయ్యాలో తోచక తల్లడిల్లేవారే కానీ రాకేష్ నిలువెల్లా విషమున్నవాడు. ఏమీ తొణకలేదు. ఆ గదిలో ఇంకెవరైనా వున్నారా అని చూశాడు. అక్కడ గానీ, వరండాలో గానీ ఎవరూ లేరు. నౌకర్లందర్నీ రవి ఎప్పుడో తొలగించాడు. అంతా నిర్మానుష్యంగా వుంది.

    రంజిత టేప్ లో మాటలు పూర్తిగా వినలేదు. ఆపుచేసి చప్పున లేచినిలబడింది. మేడమీద బెడ్ రూమ్ లో అలసిపోయి పడుకున్న రవిని లేపటానికి తొందర తొందరగా బయటకు వచ్చింది. ఆమె మొహమంతా చెమట పట్టింది. విన్నది అర్ధం చేసుకోలేక, అర్ధం చేసుకున్నది అన్వయించుకోలేక అల్లల్లాడిపోతూంది. కాళ్ళూ చేతులూ ఆడని స్థితిలో, అయోమయంగా ఆ గదిలోంచి బయటకు వచ్చింది.

    ఆమె వచ్చీ రావటంతోనే వెనుకనుంచి పడింది- తలమీద దెబ్బ!! ఆమె కెవ్వున అరిచే లోపులో మరో దెబ్బ!!!

    రాకేష్ ఆమెని చంపెయ్యదల్చుకున్నాడు. తనకు సంబంధించిన విషయాలు ఏమాత్రం బయటకు వచ్చినట్టు అనుమానం కలిగినా, ఆ వ్యక్తుల్ని నిర్ధాక్షిణ్యంగా కోల్డ్ బ్లడెడ్ గా అడ్డు తొలగించటం ఎప్పుడో అలవాటయింది. ఆఫీసు రూమ్ పక్కనే భూమిలో పాతివున్న యినుపరాడ్ చేతిలోకి తీసుకుని నిశ్శబ్దంగా గుమ్మం పక్కనే నిలబడ్డాడు. ఆమె లోపల్నుంచి వచ్చీ రావటంతోనే తల మీద వరుసగా రెండుసార్లు కొట్టాడు. ఆమె కూలిపోతూ వుండగా మళ్లీ ఇనుపరాడ్ ఎత్తాడు. ఆ దెబ్బ కూడా పడివుంటే ఆమె తల రెండుగా చీలిపోయి వుండేది. కానీ అంతలో దూరంగా అలికిడి వినిపించింది. అటు చూశాడు. రవి వస్తున్నాడు.

    రాకేష్ చప్పున లోపలికి పరుగెత్తాడు.

    ఆఫీసు టేబుల్ వెనుక నక్కి కూర్చున్నాడు. అతడి చేతిలో ఇనుప ఊచ బిగుసుకుంది. రవిగానీలోపలికివస్తే ఆ క్షణం అతడి ప్రాణం కూడా తీసెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

    రక్తపు మడుగులో పడివున్న ఆమెని చూడగానే రవి కంగారుగా 'రంజితా' అంటూ ముందుకువంగాడు. అతడి అనుమానం వెంటనే ఏదో దొంగమీదకు మళ్లింది. ఎవరైనా దొంగ ప్రవేశించి ఆమెని అటకాయించాడేమో అనుకుని ఆఫీసు గదిలోకి ప్రవేశించాడు. గదంతా చూశాడు. ఎక్కడి వస్తువులు అక్కడే వున్నాయి.

    టేబుల్ వెనుక వున్న రాకేష్ ఊపిరి బిగపట్టాడు. రవిగానీ మరొక్క అడుగు ముందుకు వేస్తే, అతడు తనని గమనించక ముందే మీదపడి చంపెయ్యాలని నిర్ణయించుకున్నాడు.

    కానీ అలా జరగలేదు. రవి గిరుక్కున తిరిగి, రంజిత దగ్గరకు వచ్చి ఆమెని చేతులమీద ఎత్తుకుని కారు దగ్గిరకు తీసుకెళ్ళాడు. ఆ సమయంలో అతడు యింటి సంగతి కూడా పట్టించుకోలేదు.

    కారు స్టార్టయి వేగంగా సాగిపోయింది.

    అది దూరమయిందని నిశ్చయించుకున్నాక రాకేష్ లేచాడు. అతడి చేతిలో టేప్ రికార్డర్ వుంది. దాన్ని తీసుకుని తోటలోకి పరుగెత్తాడు. చుట్టూ ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక టేప్ బటన్ నొక్కాడు.

    అర్ధమైందా.... నన్ను కాదని ఆ సిద్ధార్థగాడిని...

    అంటూ వినిపించింది. అక్కడివరకూ విన్నదన్న మాట ఆ అమ్మాయి. వెంటనే టేప్ ని వెనక్కి తిప్పి మొదటినుంచీ విన్నాడు. తన ప్రసక్తి ఎక్కడా లేదు.

    అతడు రికార్డర్ లోంచి కాసెట్ తీసి, అగ్గిపుల్లతో టేప్ ని వెలిగించాడు. భగ్గున మండింది. పూర్తిగా కాలేవరకూ అక్కడే నిలబడి, తరువాత రికార్డర్ పట్టుకుని ఆఫీసు గదిలోకి వచ్చాడు. దాన్ని యధాస్థానంలో పెట్టేశాడు.

    అతను ఏమాత్రం కంగారుపడలేదు.

    రంజితకు స్పృహ రావటానికి రెండు మూడు గంటలు పడుతుందని తెలుసు.

    రంజిత స్వయంగా ఎప్పుడూ తనతో మాట్లాడలేదు. కాబట్టి ఆ స్వరం గుర్తుపట్టి వుండదు. ఆ మాటల్లో ఎక్కడా హత్యా ప్రయత్నం సంగతి లేదు. కాబట్టి భవానీ శంకరం ఆఖరి క్షణాల్లో ఆ మాటలు రికార్డయ్యాయనిగానీ, భవానీశంకరం వాస్తవానికి ఆఫీసురూమ్ లో హత్య చేయబడ్డాడనిగానీ ఆ మాటలవల్ల తెలియటానికి వీలులేదు. 

    అయినా అతడు ఏమాత్రం లొసుగులూ వుంచదల్చుకోలేదు. ఆస్పత్రికి బయల్దేరాడు. ఒకవేళ రంజితగానీ, స్పృహ వచ్చిన తరువాత అనుమానాస్పదమైన స్టేట్ మెంట్ గానీ యివ్వటం ప్రారంభించిదంటే, అక్కడే ఆమెని చంపెయ్యదల్చుకున్నాడు. ఆమెతో పాటూ, అవసరమైతే రవిని కూడా. అతడి జేబులో రివాల్వర్ వుంది!

    బహుశా దాని అవసరం రాకపోవచ్చు!

    అతడి వెనుక రెండు జాగిలాలు నడుస్తున్నాయి! దాదాపు మూడు అడుగుల ఎత్తున జాగిలాలు అవి. ఇద్దరు మనుష్యుల్ని చంపటానికి రెండు క్షణాలు చాలు వాటికి.


                                                        20


    "భవతీ భిక్షాందేహీ! మాతా అన్నపూర్ణేశ్వరీ!"

    మిట్టమధ్యాహ్న సమయం అది. ఎండ నిప్పులు వెదజల్లుతూంది. రాళ్ళు పగిలేటంత ఎండగా వుంది. దూరంగా ఎక్కడో ఒక లేగదూడ తల్లికోసం అరుస్తూంది. పల్లె మధ్యాహ్నపు వేడి తాకిడికి సొమ్మసిల్లి నిద్రపోతూంది.

    "అన్నపూర్ణమ్మ తల్లీ! ఒక్క ముద్ద చెయ్యి విదిలించమ్మా".

    కేదారగౌరి పక్కమీద నుంచి లేవకుండానే బద్ధకంగా 'వెళ్ళిరా' అంది. ఆమెకు నీరసంగా వుంటూంది. మధ్యాహ్నం పూట అయితే మరీ ఎక్కువ.

    "అమ్మా! రోజుకి మూడిళ్ళకు పైగా అడగటం అలవాటు లేదు. అడిగిన ఊళ్ళో రాత్రి గడపటం ఆనవాయితీ కాదు. ఇద్దరు లేదన్నారు. నీది మూడో ఇల్లు. ఆకలితో ఊరు దాటిస్తావా తల్లీ?"

    ఆ మాటల్లో వున్న స్వచ్చతకి అబ్బురపడుతూ ఆమె పక్క మీద నుంచే కాస్త తలెత్తి కిటికీలోంచి బయటకు చూసింది.

    యోగిలా వున్నాడు!!

    ఆమె లోపలికి వెళ్ళి, వున్నదేదో తీసుకువచ్చి అతడి జోలెలో వేసింది.

    ఆమె వంగుతుంటే నిండు గెల భారానికి అరటి చెట్టు వంగినట్టుంది.     

    ఆమె వైపు అతడు ఆర్ధ్రత నిండిన కళ్ళతో ఆప్యాయంగా చూస్తూ "పండంటి కొడుకుని కను తల్లీ" అని దీవించినట్టు అన్నాడు. అంతలో ఆమె ఖాళీ గిన్నెతో నిటారుగా నిల్చుని, లోపలికి వెళ్ళటానికి ఆయత్తమయింది. అతడి దృష్టి ఆమె కడుపుమీద పడింది. వింటి దెబ్బ తగిలిన లేడిలా విలవిల లాడిపోయాడు.

    "ఇక్కడా! ఇక్కడేనా?" అని గొణుక్కున్నాడు. అతడి మొహం తెల్లబడింది. నుదుటిమీద నుంచి బూడిద రాలింది. కళ్ళల్లో ఆందోళనా అలజడి కొట్టిచ్చినట్టు కనపడుతున్నాయి.

    అతడు అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు.

    "గర్భ విచ్చిత్తి కావాలి... పెద్ద ప్రాణానికి ప్రమాదమైనా సరే... గర్భ విచ్చిత్తి కావాలి. శిశువు భూమ్మీదకు రావటానికి వీల్లేదు".

    అతడు గొణుగుతున్నాడు.

    ఆమెకి అతడు అంటున్నది అర్ధం కాలేదు.

    "ఏమిటే" అంది.

    ఎవరో తరుముతున్నట్టు అతడు తొందర తొందరగా అన్నాడు-

    "కుట్టిసైతాన్ కాష్మోరా రూపంలో భూమ్మీదకు రాకుండా చేయాలంటే మంత్రజాలం కావాలి. పంచమహాయజ్ఞములైన దేవ, మనుష్య, పితృదేవతా, భూత, బ్రహ్మ యజ్ఞములలో నొకదానిని చేసి, కాష్మోరా భూమ్మీదకు రాకుండా నిరోధించే విధానం తెలుసుకొమ్మను. సమయం లేదు. తన ప్రాణాన్నీ, తన భార్య ప్రాణాన్నీ రక్షించుకొమ్మను. సమయం లేదు. ఎంతో సమయం లేదు..." అంటూ అక్కడినుంచి వడివడిగా వెళ్లిపోయాడు.

    గౌరీ అలాగే ఆ మెట్ల దగ్గిరే చాలా సేపు నిలబడి వుండిపోయింది. ఆమెకి నవ్వొచ్చింది. ఈసారి మరోకొత్త పేరు వినపడింది. అష్టావక్రకాదు. ఏమిటిది? ...మోరా...ఏదో మోరా.... ఆఁ అవును, కాష్మోరా.

    అన్నీ కొత్త కొత్త పేర్లు.

    ఆమె నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.

    ఆ తరువాత భర్త వచ్చేసరికి దాని సంగతే మర్చిపోయింది.


                                          *    *    *    *


    కిటికీలోంచి చప్పుడు చేయకుండా లోపలికి చూసేడు రాకేష్.

    అప్పటికి పావుగంట అయింది. డాక్టరు బ్యాండేజీ కట్టి ఇంజక్షన్ ఇచ్చాడు. "అదృష్టం బావుంది. జుట్టు వత్తుగా వుండి సేవ్ చేసింది. భయం వల్ల స్పృహ తప్పిందంతే..." అని అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు- మరి కొద్దిసేపట్లో అంతా సర్దుకుంటుందని చెప్పి.

    రాకేష్ కిటికీ దగ్గిరే వున్నాడు. అంతలో షాడో గొంతు ఆదుర్దాగా వినపడింది- "ఎలా వుంది రంజితా" అని.

    "ఇట్సాల్ రైట్. నేను బాగానే వున్నాను!"

    "అసలేం జరిగింది?"

    "మామయ్యగారి సామాన్లు ఒకటొకటే సర్దుతున్నాను. టేప్ రికార్డర్ కనపడింది. ఆఖరిమాటలు ఏమైనా వుంటాయికదా తీసిద్దామని క్యాసెట్ విన్నాను. అందులో... అందులో..." భయం వల్ల ఆమెకి మాటలు సరిగ్గా రాలేదు.

    కిటికీ బయటనుంచి వింటూన్న రాకేష్ పిడికిళ్ళు బిగించాడు. చుట్టూ చూశాడు. అంతా నిర్మానుష్యంగా వుంది. అక్కణ్ణుంచి కాల్చటం రిస్కు. కానీ తప్పదు.

    అంతలో లోపల్నుంచి షాడో అడగటం వినిపించింది- "అందులో...అందులో ఏముంది రంజితా?" అని.

    "అందులో కుట్టిసైతాన్ అని వుంది".

    "కుట్టిసైతానా...ఇంక?" అంటూ షాడో రెట్టించాడు. ఆమె గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తూంటే విపరీతమైన తలనొప్పి వచ్చింది.

    "నాకు జ్ఞాపకంలేదు" అంది తల విదిలిస్తూ.

    రాకేష్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. రంజిత తన గొంతు టేప్ రికార్డర్ లో గుర్తుపట్టలేదు! అదీ కావల్సింది!!

    అంతలో షాడో "...సర్లే- జ్ఞాపకం లేకపోతే పోనీలే" అనటం వినిపించింది.

    రాకేష్ మొహం తేలిక పడింది. ఇక అక్కడ తన పనేమీ లేనట్టు తప్పుకున్నాడు.

    అతడు జీవితంలో చేసిన పెద్ద తప్పు- ఉస్సోక్ సభ్యుడిగా మొట్టమొదటి తప్పు అదే... షాడోని తక్కువ అంచనా వేయటం...

    "సర్లే జ్ఞాపకం లేకపోతే పోనీలే...." అని అప్పటికి ఆ టాపిక్ ఆపుచేశాడు కానీ, షాడో ఆలోచిస్తూనే వున్నాడు.

    "కుట్టిసైతాన్" అన్న పదం తండ్రి టేప్ రికార్డర్ లోకి ఎందుకు వచ్చింది?

 Previous Page Next Page