ఉదయం ఆరు గంటలు దాటి నిద్రలేస్తే ఒకనాటి తన ఘనత వహించిన జీవితం గురించి గుర్తుచేసుకుంటూ ఆర్తిని సాధించడం నిత్యమూ జరిగేదే.
దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆరున్నరయిపోయింది.
అంటే అత్తగారికి ఇవ్వాల్సిన బెడ్ కాఫీకి అరగంట ఆలస్యమైంది.అదీ దుగ్ధంతా.
ఆర్తి భాస్వంత్ కోసం చుట్టూ చూసింది. వాకింగ్ కి వెళ్ళి ఇంకా తిరిగొచ్చినట్టులేడు.తిరిగొచ్చినా తల్లి మాటలకి అతడు పెద్దగా రియాక్ట్. కాడు. కోడలిని ఆమాత్రం కట్టడి చేయడం ప్రతి అత్తా చేసేదే అనుకుంటాడో లేక అలాంటి విషయాల్లో తలదూర్చడం మగాడిగా తనకు కూడనిదని సరిపెట్టుకుంటాడో- ఏ రోజూ తల్లి మాటల్లో అతడు జోక్యం చేసుకోలేదు.
ఉదయం వచ్చిన దినపత్రికని చేతితో ఉంచుకుని అందులోని ఏదో న్యూస్ చదువుతున్నట్లు క్రమంగా గొంతు స్థాయిని పెంచి మాట్లాడుతూంది సరస్వతమ్మా. " అసలు ఆడపిల్లలంటే ఎలా వుండాలి? పొద్దు పొడవకముందే పట్టు దిగాలి. ఇల్లు ఊడ్చి, కళ్ళాపి జల్లి , నీళ్ళూ తోడి మొగుడి సేవకి సిద్ధపడాలి. సిటీ కాబట్టి కాళ్ళాపి జల్లే గొడవలేదే , కనీసం పెద్దముండని ఇంట్లో పడున్నాననీ, వేళకి కాఫీ నీళ్ళయినా ఇవ్వాలనీ ధ్యాస ఉండొద్దూ. ఎంత చదువుకుంటేనేం ఇంగితం వుండాలి. ఆ రోజుల్లో అత్తా, మామలంటే ఎంత శ్రద్ధ తీసుకునేదాన్ని......"
ఆమె మాటలు పట్టించుకోకుండానే ఆదరబాదరాగా కిచెన్ లో దూరి కాఫీ చేసి అయిదు నిమిషాలలో అత్తగారి దగ్గరకు తీసుకొచ్చింది ఆర్తి.
" తీసుకోండత్తయ్యా" అంది టీపాయ్ మీద వుంచుతూ.
" ఏ గోడకో చెబుతున్నట్టు ఆ పొగరేమిటి కోడలా! చేతికందించవచ్చుగా?" మరికాస్త అడ్వాన్సయింది సరస్వతమ్మ.
ప్రొద్దుట లేవగానే ఇలాంటి రాద్ధాంతం ఆర్తిని చాలా కలవరపరిచినా నిభాయించుకుంది. వెంటనే కాఫీ కప్పుచేత్తో అందుకుని సరస్వతమ్మకి యివ్వబోయింది.
మళ్ళీ గయ్యి న లేచింది సరస్వతమ్మ . " ఈబుద్ది ముందుడాలే. అసలు ఏం చూసుకుని నువ్వింత రాజసం వెలగబెడుతున్నట్టు? నా పెద్ద కోడలు నీకన్నా గొప్ప కుటుంబం నుంచే వచ్చిందిగాని నా ముందు ఎంత బద్దికగా వుంటుందో ఎప్పుడయినా చూశావా?"
" చూశాను" అంది బాధని అదిమి పెట్టుకుంటూ.
ఆసలు ఆ పెద్ద కొడుకు ఇంటికి వెళితే పనిమనిషిలా అత్తగారే మొత్తం పనులు చేయటం ఆర్తికి తెలీనిది కాదు.
"అయినా నేనేదో పెద్ద నేరం చేసినట్టు చిన్న విషయానికి ఇంత గొడవ చేయాలా?"ఆర్తికి కళ్ళనీళ్ల పర్యంతమౌతుంటే వుద్విగ్నంగా వంటగది వైపు నడించింది.
"ఎంత నిర్లక్ష్యమో చూశావట్రా?"
భాస్వంత్ ఇంటిలో అడుగుపెటుతుండగానే గొంతు స్థాయిని పెంచింది సరస్వతమ్మ. "అయినా ఇది దాని తప్పు కాదు..... నువ్విచ్చిన అలుసే. లేకపోతే అది మాటకి జవాబు చెబుతుందా?"
" ఏమైంది?" అన్నాడు భాస్వంత్ చికాగ్గా చూస్తూ.
నిజానికి ఆమె ప్రవర్తనే అంతని భాస్వంత్ ఆలోచించినా భార్యముందు అంగీకరించడు. ఆగి నామోషీ. అందుకే కథలా చెబుతున్న తల్లి మాటలు వింటూ" ఒళ్ళు దగ్గరపెట్టుకుని ప్రవర్తించమని నీకు లక్షసార్లు చెప్పాను" అన్నాడు బాత్ రూంలోకి వెళుతూ.
ఆ కొద్ది సపోర్ట్ సరస్వతమ్మని మరింత ఉత్సాహపరిచిందేమో ఇంకా రెచ్చిపోయింది.
" అసలు నేనేమన్నానని?" బాత్ రూంలో టవల్ వుంచుతూ తను ఏ తుప్ప్పూ చేయలేదని చెప్పటానికి ప్రయత్నించింది ఆర్తిల అలవాటుగా.
"నోర్ముయ్!" ఆఫీసులోని సబార్డినేట్ మీద విరుచుకుపడినట్టుగా అన్నాడు " అసలు నువ్వెంత- నీ బ్రతుకెంత? కుక్కిన పేనలా పడుండకపోతే మర్యాదగా వుండదు."
బాత్ రూంలో గీజర్ లో నీళ్ళూ వేడి మొదలుకుని సోప్ దాకా అన్నీ చెక్ చేసిన ఆర్తి కళ్ళనీళ్ళ పర్యంతమవుతుంటే మౌనంగా బయటికి నడిచింది.
నిజమే!కొన్ని సకాలంలో అమర్చలేక తన ఇబ్బింది పడుతూంది. అయితే ఉన్న పనిమనిషినీ అత్తయ్య మాన్పించింది. అప్పటికీ అనుకూలముగా అంతా చేసుకుపోగలదుకాని అసలు సాధించడమే ఒక ధ్యేయంగా ప్రవర్తించే వ్యక్తుల్ని ఎలా సంతృప్తి పరచగలదని.
పది నిమిషాలలో బయటకొచ్చిన భాస్వంత్ కి భయం భయంగానే డైనింగ్ టేబుల్ మీద భ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది.టిఫిన్ తింటూ పేపర్ చదవడం అలవాటయిన భాస్వంత్ పక్కన కంపిస్తూ నిలబడటం ఆర్తికి అలవాటు. పేపర్ చదివే ఏకగ్రతలోఒకవేళ కరివేపాకు నోటిలోకి వెళితే 'ఏమిటీ చెత్తంతా?' అని విరుచుకుపడుతుంటాడు. అప్పటికీ సాధ్యమైనంత వరకూ కరివేపాకుని ముందే ఏరేస్తుంది. కానీ ఒక్కోసారి అతడు రియాక్టవటానికి మిరపకాయలాంటిది కారణమవుతుంది. భార్యని అదుపుచేయానికి కారణాలు వెతుకుతూ అదేపనిగా హింసించడం అలవాటయిన భర్తల్లో ఒకడిగా ప్రవర్తించే భాస్వంత్ లో ఇంతవరకూ చూడగలిగిన ఒకే ఒక్క సద్గుణము చేయి చేసుకోకపోడం.అలాంటిది జరక్కపోవటానికి కారణం ఆర్తి తనను నిగ్రహించుకోడంగాక అదీ తన గొప్పతనంగా భావిస్తుంటాడు. ఒక్కోమారు ఆభావాన్ని మాటల్లో ప్రకటిస్తుంటాడు కూడా.
ఇది స్వతహాగా అతడికి అబ్బిన స్వభావం కూడా కాదు. తల్లి విషయంలో అతడి తండ్రి ఇలాగే వుండేవాడు.అంతకుమించి పొరపాటున ఆమె ఏ సలహాకయినా సిద్ధపడితే "ఏడిశావ్ లే! ఆడదానివి నీకేం తెలుసు" అంటూ మందలించేవాడు.
ఒక్క భాస్వంత్ కాదు- అతడి అన్నల్లోనూ 'ఆడది' అంటే ఇలాంటి అభిప్రాయమే వున్నా ఇద్దరు వదినలూ కాస్త పెద్ద కుటుంబాల్లో నుంచి రావడంతో అన్నలు కాస్త కంట్రోలయిపోయారు. ఆ విషయంలో అన్నలకన్నా తాను సుపీరియర్ అన్న భావం భాస్వంత్ లో చాలా బలంగా పేరుకుపోయింది.
ఆఫీసుకు వెళుతూ ఇంట్లో చేయాల్సిన పనులు(బట్టలు ఉతకడం, ఇస్త్ర్రీ చేయటం) గురించి ఆదేశాలు జారీ చేసిన భాస్వంత్ ద్వారం వైపు నడుస్తుంటే ఎదురయింది ఓ యువతి లోనికొస్తూ.