Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 3


    రివ్వున వీస్తున్న గాలికి కిటికీ రెక్కలు కొట్టుకుంటున్నాయి.
    అప్పుడే బల్లమీద ఏదో బరువుగా పడింది. సమ్రాట్ తడిమి చూశాడు. చేతి వేళ్ళకు మెత్తగా తగిలింది.
    చీకట్లో ఒక ఆకారం ఏదో రెండు కళ్ళూ మిటకరిస్తూ కనిపించింది!
    ఊహకందని ఆ ఆకారాన్ని చూడగానే అతని వళ్ళు క్షణంపాటు గగుర్పొడిచింది.
    అంత చల్లని వాతావరణంలో కూడా అతని ముఖాన చిరు చెమట పట్టింది.
    చేతిలో వున్న రైటింగ్ పాడ్ తో టేబుల్ మీద ఉన్న ఆ ఆకారాన్ని కిందకు తోశాడు.
    ఆ ఆకారం శబ్దం చేస్తూ ముందుకు దూకింది. అతను క్షణం పక్కకి తప్పుకున్నాడు.
    ఆ ఆకారం నేలమీద పడింది. ఓ అరుపు అరిచింది.    
    అదీ నల్ల పిల్లి అని గ్రహించిన సమ్రాట్ భారంగా శ్వాస తీశాడు!
    బల్లమీద అగ్గిపెట్టె దొరుకుతుందేమోనని చేతితో అటూ ఇటూ తడిమాడు. ఎక్కడా అగ్గిపెట్టె తగల్లేదు.
    బయట ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపించింది.
    క్షణం నిశ్శబ్దం ఆవరించిందక్కడ.
    మరుక్షణంలో ఒక ఆడగొంతు వినిపించింది. కుర్చీలోంచి లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    అంతే. ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు కనిపించింది.
    ఎదురుగా తెల్లటి దుస్తులలో స్త్రీ ఆకారం కదిలినట్టనిపించింది.
    ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఆ స్త్రీ ఆకారాన్ని చూసి ఊరకుక్క మొరిగింది.
    ఆ స్త్రీ సమ్రాట్ ను తోసుకుని లోపలకు చొరబడింది.
    అతను తూలి పక్కకు పడబోయి నిలదొక్కుకున్నాడు.
    క్షణం అతని హృదయం లయతప్పి కొట్టుకుంది. అతనికి వెంటనే నోట మాట రాలేదు.
    టీపాయ్ మీద వున్న టీ కప్పులు ఎవరో కిందకు తోసేసినట్టు భళ్ళున నేలమీద పడి ముక్క చెక్కలయ్యాయి.
    "ఎవరది?"
    గొంతు పెగలదీసుకుని అడిగాడు.
    "నేనే!"
    సమాధానంగా ఆడగొంతు వినిపించింది.
    ఆ గొంతు తను ఎప్పుడూ, ఎక్కడా వినినట్టు గుర్తులేదు!
    చీకట్లో ఆ ఆకారాన్ని కూడా పోల్చుకోలేకపోయాడు.
    "ఎవరది?" మళ్ళీ అనుమానంగా అడిగాడు.
    పగలబడి నవ్వుతోందామె.
    రివ్వున గాలి వీచింది.
    గదిలో లైటు వెలిగింది.
    సమ్రాట్ ఉలిక్కిపడి చుట్టూ చూశాడు.
    టీపాయ్ మీద టీ కప్పులు యధావిధిగా ఉన్నాయి.
    గది తలుపులు తెరిచే ఉన్నాయి.
    గదిలో అతను తప్ప మరెవరూ లేరు.
    అంటే తను అప్పటివరకు కలలో జీవించాడు!
    గొంతు తడారిపోతుండగా కూజాలోని నీళ్ళు వంచుకుని గడగడ తాగాడు.
    తను ఈసారి తీసుకున్న సబ్జెక్ట్ మనిషి చనిపోయినా ఆత్మ బ్రతికే ఉంటుందా?
    బరువైనదే! పాపులారిటీ మాట అటుంచి, రకరకాల ఆలోచనలతో అటు గుండె, ఇటు మెదడు నీరసపడ్డాయి.
    ఈ పూటకు రాసింది చాలని తలుపు గడియ పెట్టి లైటార్పి పక్కమీద వాలాడు.
    రెండు నిమిషాలు గడిచాయి.
    బయట ఎవరో తలుపు కొడుతున్నారు!
    సమ్రాట్ విసుగ్గా పక్కమీద నుంచి లేచాడు. గది తలుపు తెరచి, ఎదురుగా నిలచిన వ్యక్తిని చూసి "నువ్వా?" అంటూ ఆశ్చర్యపోయాడు.
    'అవు'నన్నట్టు అనూష చిరునవ్వు నవ్వింది.
    అనూష అతని అభిమాన పాఠకురాలు.
    "ఈ వేళప్పుడు వచ్చావేం?" ఖంగారుగా ఓ చచ్చు ప్రశ్న వేశాడు.
    "నన్ను కాస్త లోనికి రానిస్తారా?"
    "సారీ!"
    తను గుమ్మానికి అడ్డుగా ఉన్నాడని అర్థం చేసుకుని తప్పుకున్నాడు.
    అనూష గదిలోకి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చుంది.
    ఆమె రావడం సంతోషమే అయినా, ఇంత అర్థరాత్రి ఒక ఆడపిల్ల సరాసరి తన గది వెతుక్కుని రావడమే ఏదోలా అనిపించింది.
    "నేను ఈ రాత్రి ఇక్కడ ఉండడం మీకు అభ్యంతరమా?" క్షణం ఆగి, అతని జవాబు కోసం చూసింది.
    లేదన్నట్టు మౌనంగా తల వూపాడు సమ్రాట్.
    "థాంక్స్! ఉదయాన్నే వెళ్ళిపోతాను."

 Previous Page Next Page