"దీన్ని చంపి పారేస్తే:" అనుకున్నాడు.
ఆ ఆలోచన అతని కెంతో రిలీఫ్ నిచ్చింది.
చాలా సమస్యలకు పరిష్కారం చావే అని దృఢంగా నమ్ముతాడు జెనరల్ భోజా.
రుసరుసలాడుతూ బాత్ రూంలో కెళ్ళింది జెన్నీ.
జనరల్ భోజా లేచి ప్యారిస్ నుంచి నిన్ననే వచ్చిన సరికొత్త యూనిఫారం వేసుకున్నాడు. ఇరవై మెడల్సు తగిలించుకున్నాడు క్యాప్ పెట్టుకొని పాలెస్ పోర్టికోలో ఆగి ఉన్న సిక్స్ డోర్ మెర్సిడెస్ బెంజ్ కారులో కూర్చున్నాడు.
ముందు పైలట్ కారూ, ఆరు మోటారు సైకిళ్ళమీద సోల్జర్సూ.
వెనుక పదిహేను కార్లలో మందీ మార్బలంతో బయలుదేరి ఎయిర్ పోర్టు చేరుకున్నాడు జనరల్ భోజా... తమని ఏదో ఉద్ధరిస్తాడని ప్రజలు ఎన్నుకుని నెత్తికెక్కించుకున్న ఒకప్పటి వంటవాడు.
ఆ రోజున ఎయిర్ పోర్టులో ఏదో అసాధారణమైన సంఘటన జరగబోతుందని జనరల్ భోజాకి తప్ప మరెవరికీ తెలిసినట్లు లేదు. బ్రా కూడా లేకుండా ఉత్త బనీను వేసుకున్న ఒక ఇంగ్లీషు టూరిస్టు అమ్మాయీ, బనీను కూడా లేకుండా, ఉత్తచారల డ్రాయరు లాంటిది మాత్రం వేసుకున్న ఒక టూరిస్టు అబ్బాయీ అతన్ని చూసి, "అతనే భోజా: అతనే భోజా" అని మెల్లగా చెప్పుకున్నారు. అదే గోరిల్లా - అదే గోరిల్లా" అని చెప్పుకున్నట్లు
జనరల్ భోజా ఆగి, పలకరింపుగా నవ్వి, వాళ్ళు ఫోటో తీసుకుంటామంటే నడుం మీద చెయ్యి పెట్టుకు నిలబడి ఫోజు ఇచ్చి తర్వాత వంగి అభివాదం చేసి, తర్వాత కులాసాగా VIP లాంజ్ లోకి వెళ్ళాడు.
అతను ఇవాళ చాలా మంచి మూడ్ లో ఉన్నాడు - నిజం:
ఎందుకంటే, సరిగ్గా మరి పది నిముషాల్లో ఇండియాకు తీవ్రమైన అఘాతం లాంటి ఒక సంఘటన జరగబోతోంది.
సరిగ్గా పది నిముషాల్లో:
తన కళ్ళ ఎదురుగానే:
అతని శరీరం ఎగ్జయింట్ మెంటుతో గగుర్పొడిచింది.
ఆ లాంజ్ లోంచి ఆకాశం క్లియర్ గా కనబడుతోంది.
"ఇంక అయిదు నిమిషాలు సార్:" అన్నాడు అతనితోబాటే ఎప్పుడూ ఉండే అనుచరుడూ, బాడీగార్డూ, సెక్రటరీ అయిన తోకాన్... కేప్టెన్ తోకాస్
"అవును:" అన్నాడు భోజా సంతోషంగా "తోకాన్: ఒక షాంపేన్ బాటిల్ తెప్పించు: సెలబ్రేట్ చేసుకోవాలి."
వెళ్ళి షాంపేన్ బాటిల్ తెస్తూ, "ఇంక ముప్ఫయ్ సెకండ్లు:" అన్నాడు తోకాస్
అతని మాట పూర్తికాకముందే ఆకాశం ఉరుముతున్నట్లు శబ్దం వినబడింది. మరికొద్ది క్షణాలలో దూరంగా చుక్కలా కనబడింది ఒక విమానం.
అది ఇండియా నుంచి వస్తున్న బోయింగ్ 737 ప్లయిట్ అని తెలుసు జెనరల్ భోజాకి.
ఇంక పది సెకండ్లలో అది ఆకాశంలోనే బ్రహ్మాండమైన టపాకాయలా పేలిపోతుందని తెలుసు అతనికి.
అలా ఒక విమానం, పూర్తిగా ప్రయాణీకులతో నిండి, ఫుల్ కెపాసిటీతో ఉన్న విమానం, గాల్లోనే పేలిపోవడం కళ్ళారా చూడాలని కోరిక తనకి.
అందులోనూ అది ఒక ఇండియన్ విమానమయితే...
ఆ థ్రిల్ మరీ ఎక్కువగా ఉంటుంది.
దానికోసం "ఏర్పాట్లు" చేశాడతను. కొన్నిచోట్ల కొంతమంది "ఫ్రెండ్స్" ఉన్నారు తనకి వాళ్ళకి కావాలసినవి తను చేస్తాడు. తనకి కావలసినవి వాళ్ళు చేస్తారు.
ఇంక అయిదు సెకండ్లలో...
కాదు: నాలుగే
మూడు...
రెండు...
ఒకటి...
బ్రహ్మాండమైన రొదతో క్రిందికి దిగింది బోయింగ్ 737 జెట్ విమానం. దాని అండర్ కేరేజ్ తాలూకు చక్రాలు బలంగా భూమిని ఒరుసుకున్నాయి. ప్రచండమైన శక్తినీ, వేగాన్నీ అదుపులోకి తెచ్చుకుంటూ ముందుకు పరిగెత్తి రన్ వే చివర ఆగింది విమానం. తర్వాత మెల్లిగా తిరిగి, బస్సులా నేలమీదే దొర్లుతూ వచ్చి, టార్మాక్ మీద నిలిచింది.
దవడ ఎముకకి దెబ్బ తగిలి లూజయిపోయినట్లు తెరుచుకునే ఉండిపోయింది జనరల్ భోజా నోరు.
"బ్లడీ..." అని. నాలుగక్షరాల పదం ఒకటి ఉచ్ఛరించి, "ఏమిటిది?" అన్నాడు.
కేప్టెన్ తోకాస్ కూడా తెల్లబోయి చూస్తున్నాడు.
ఈలోగా...
జరగవలసినవన్నీ యధావిధిగా జరిగిపోతున్నాయి ఎయిర్ పోర్టులో. లేడర్ తో ఉన్న వెహికల్ వెళ్ళి విమానం తలుపు దగ్గరికి వెళ్ళి నిలబడింది. విమానం తలుపు తెరుచుకుని ప్యాసింజర్స్ ఆ మెట్లమీదుగా కిందికి దిగడం మొదలెట్టారు. సామాన్లని చేరవేసే మరో వాహనం గొంగళిపురుగులా పాకుతూ విమానం వైపు వెళుతోంది.
పాసెంజర్స్ అంతా దిగిపోయారు కిందికి.
ఉన్నట్లుండి బి.పి. వచ్చినట్లయింది జనరల్ భోజాకి. ఆగ్రహం పట్టలేక, చేతిలోని షాంపేన్ బాటిల్ నీ బలంగా నేలకేసి కొట్టాడు.