"డాడీ...." అనే అరుపుకు ఇద్దరూ అదిరిపడి తమ మైకంలోంచి తెప్పరిల్లి చూశారు.
సుధీర్ కూతురు ఎప్పుడు దిగిందో, కాలవలోకి దిగింది. ప్రవాహంలో పడి కొట్టుకుపోతోంది.....
సుధీర్ మతిపోయిన వాడిలా లేచి "అయ్యో! బేబీ! ఎవరక్కడ? అయ్యో! కొట్టుకుపోతోంది! బేబీ! బేబీ!" అని అరవటం మొదలుపెట్టాడు.
జైహింద్ బాబు వెంటనే పొంగి ప్రవహిస్తున్న కాలువలోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్ళి, సుధీర్ కూతుర్ని ఒక చేతితో భుజం మీద వేసుకుని, మరో చేతితో ఈదుకుంటూ గట్టుకి వచ్చాడు. వెంటనే కారులో ప్రక్కనున్న టౌన్ కి తీసికెళ్ళి ప్రధమ చికిత్స చేయించారు. ఒక్క అరగంటలోనే ఆ అమ్మాయి తేరుకుంది.
సుధీర్, సుధీర్ భార్య ఇద్దరూ జైహింద్ బాబుకి తమ కృతజ్ఞతలు చెప్పుకున్నారు.
జైహింద్ బాబు సిగ్గుపడి "నేనేం చేశానండీ! ఈత వచ్చు - రక్షించగలిగాను. నేను గజ ఈతగాణ్ని!" అన్నాడు.
ఆ తరువాత సుధీర్ తన పర్సులోంచి వంద రూపాయలు తీసి జైహింద్ బాబుకియ్యబోయాడు.
జైహింద్ బాబు దెబ్బ తిన్నట్లు చూసి "సుధీర్! నా జీవితంలో నాకెంతో అపురూపమైనది మన స్నేహం - విడవకుండా నా మెళ్ళో నేను వేసుకుంటున్న నీ ఆంజనేయస్వామి రక్షరేకు ఇందుకు సాక్ష్యం..... నా స్నేహితుడికి నేను ఒకచిన్నసహాయం చెయ్యగలిగానన్న సంతృప్తితో నామనసుకెంతో ఆనందంగా ఉంది. ఈమాత్రం సంతృప్తి నాకు దక్కనియ్యవా? నేను నీకు స్నేహితుణ్ని కాననీ, ఒకకూలి వాణ్నీ మాత్రమేనని చెప్పదలచుకున్నావా?" అన్నాడు.
సుధీర్ ఆ డబ్బు తన పర్సులో పెట్టేసుకుని జైహింద్ బాబు భుజంమీద చెయ్యి వేసి దగ్గిరగా లాక్కుని "అయామ్ సారీ!......" అన్నాడు.
తిరుగు ప్రయాణంలో జైహింద్ బాబుని అతని గుడిసె దగ్గిర డ్రాప్ చేస్తూ "నీకు సుధీర్ అనే స్నేహితుడున్నాడని మరిచిపోకు. ఏ సహాయం కావలసి వచ్చినా అడగటానికి సంకోచించకు....." అన్నాడు.
"థేంక్యూ!" అన్నాడు జైహింద్ బాబు.
జైహింద్ బాబు గుడిసెలోకి వచ్చేసరికి రాగాలుపెడుతూ ఎదురయింది సుందరీబాయి.
"ఆళ్ళు నన్ను యెల్లగొట్టేశారు. ఆడికి యేరే మనువు సూత్తన్నారు!" అని బావురుమంది అన్ననిచూసి.
చలమయ్య కుటుంబంలో అందరూ పొలంలో పాటుపడే సమస్యలు.... ఏదో బల్లదుకాణం మీద కూచుని అవీ-ఇవీ అమ్మిడబ్బు సంపాదించే సుందరీబాయి అత్తతో, ఆడబిడ్డలతో సమంగా పొలం పనులు చెయ్యలేకపోయింది. పోనీ, ఇంట్లో ఉండి వంటపనీ, ఇంటిపనీ చూచుకోమన్నారు. అత్తా-ఆడబిడ్డలు. సుందరీబాయికి అదీ చేతకాలేదు. పొద్దున్నే లేచి. అంతమందికి పొలం వెళ్ళటానికి ముందే, వంటంతా చెయ్యాలంటే దానివల్ల కాలేదు. ఆ ఇల్లూ, ఆ దొడ్లూ ఊడ్చి శుభ్రం చెయ్యటానికి కూడా దానికి విసుకొచ్చింది. ఏపనీ చెయ్యకుండా మొండికేసి కూచునేసరికి, అత్తగారు నాలుగు వాయించింది. సుందరీబాయి రాగాలు పెట్టేసి "నేను మా ఇంటికి పోతా!" అని సంచీ సర్దుకుంది.
అత్తకి మండిపోయి "పోతే పో, ముదనష్టపు దానా! మా వోడికి మరో మంచి సంబంధం సేసుకుంటా!" అని విదిలించింది. సుందరీబాయి అక్కడుండలేక వచ్చేసింది.
అంతా విని జైహింద్ బాబు నిట్టూర్పు విడుస్తూ "కోరి చేసుకున్న దానివి. సర్దుకుపోవద్దటే! సరే ఉండు! సంగతేమిటో, నేను కనుక్కొస్తా! అన్నాడు.
సుందరీబాయి అత్తవారింటి నుండి వచ్చేసిందే కాని. రెండు రోజులు కూడా స్థిమితంగా ఉండలేకపోయింది! "ఆడికి ఆళ్ళు మరో పెళ్ళి సేసేస్తారు" అని ఏడుపు మొదలు పెట్టింది.
ఇదంతా పడలేక జైహింద్ బాబు సంగతి సందర్భాలు విచారించటానికి చలమయ్య ఊరికి వెళ్ళాడు. సుందరీబాయి అత్త కుండ పగలగొట్టినట్లు చెప్పేసింది. "దాన్ని కూసోబెట్టి నేను మేపలేను! పని పాటలు సేతకానిది మా ఇంట్లో ఉండక్కర్లేదు!"
జైహింద్ బాబు చలమయ్యని అడిగాడు!
"నన్నేం సెయ్యమంటావు? మా అమ్మ ఇష్టం!" అన్నాడు చలమయ్య!
"బుల్లి పాపాయివా? అమ్మ ఎంతచెబితే అంతేనా?"
"అమ్మ మాట కాదంటే తిండెట్లా వస్తది?..... మా పొలం అమ్మే సూస్తాంది!"
"అయితే మీ అమ్మ మాట విని మరో పెళ్ళి కూడా చేసుకుంటావా?"
"మీ సెల్లి లేసిపోతే ఏం సెయ్యమంటావు మరి? కాపురం లేకుండ ఉండనా?"
"పొలం కాకపోతే. మరో పని చేసుకుని పెళ్ళాన్ని పోషించుకోలేవా?"
"పనిచూపించు, చేస్తా!"
"నాతో రా!"
జైహింద్ బాబు ఆహ్వానాన్ని సంతోషంతో స్వీకరించాడు చలమయ్య. హాయిగా నాలుగైదు నెలలు చీకూ చింతా లేకుండా బావమరిది సంపాదన తింటూ రికామిగా పెళ్ళాంతో షికార్లు కొడుతూ తిరిగాడు!
ఇదొక కొత్త సమస్య అయిపోయింది జైహింద్ బాబుకి. వ్యాసమూర్తితోనే చెప్పుకున్నాడు! "అన్ని సమస్యలూ నీకేనయ్యా!" అన్నాడు వ్యాసమూర్తి జాలిగా!
చివరకు వ్యాసమూర్తి అండతోనే ఒక ప్రైవేటు కంపెనీలో ప్యూన్ గా కుదిర్చాడు చలమయ్యని! సుందరీబాయినీ, చలమయ్యనీ వేరుగా కాపురం పెట్టించాడు!