Previous Page Next Page 
రక్షరేకు పేజి 28


    నాదముని రొప్పుతూ సరళ దగ్గిరికి వచ్చి సరళచెయ్యి గట్టిగా పట్టుకుని "హమ్మ దొంగా? నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఎంత వెతికానో తెలుసా?" అన్నాడు.
    "వెతికారా? ఎక్కడ వెతికారు?"
    "అంతా వంటింట్లో, పడమటి గదిలో, దక్షిణపు గదిలో.... పెరట్లో.... గాదె వెనకాతల.... భోషాణం క్రింద..... అటకమీద..... ఎక్కడా కనపడలేదు నువ్వు"
    "ఎందుకు వెతికారు?"
    "ఎందుకేమిటి? నువ్వు లేకపోతే, నాకెలా?"
    పాపం. అంతకంటె చెప్పలేకపోయాడు నాదముని. ఎలా అయిపోయాడు. మాటల్లో చెప్పలేకపోయినా, అతడు అనుభవిస్తోన్న క్షోభ అంతా అతడి ముఖంలో కనిపిస్తోంది.
    సరళ చెయ్యి వదలకుండా మరింత గట్టిగా పట్టుకుని "రా! నాతో వచ్చెయ్యి. మళ్ళీ ఎక్కడికి, పోకు?" అన్నాడు. పసిపిల్లాడు మారం చేస్తున్నట్లు.
    ఈ వెర్రి బాగులవాడికి ఇప్పటికీ ఏం జరిగిందో తెలియటంలేదు. పరిస్థితి అర్థం కావటంలేదు. ఇంట్లో తను లేని వెలితి అనుభవిస్తున్నాడు. తనకోసం ఆరాట పడుతున్నాడు.
    "నేనక్కడికి రాను, మీరేనాతో వచ్చెయ్యండి.
    "పద!" అన్నాడు వెంటనే నాదముని, ఏ రకమైన ఆటంకం చెప్పకుండా.
    నాదమునిని తన క్వార్టర్స్ కి తీసుకొచ్చింది సరళ. పెద్ద ఇంట్లో ఉండటానికలవాటుపడిన నాదముని ఆ ఇంటిని వింతగా చూస్తూ "ఇదేం ఇల్లు? పనివాళ్ళ ఇల్లులా ఉంది" అన్నాడు.
    గతుక్కుమంది సరళ. తన భర్త ఎంతవరకు ఆలోచించగలడు?
    "నేను పని మనిషినే!"
    "ఛ!"
    "అవును. ఎప్పుడూ పనిమనిషినే! మీ ఇంటిలో ఉన్నప్పుడు జీతం తీసుకోని, స్వతంత్రంలేని పనిమనిషిని. ఇప్పుడు జీతం తీసుకుంటూ స్వతంత్రంగా బ్రతుకుతోన్న పనిమనిషిని."
    కనురెప్పలు టపటపలాడించి బాధగా చూశాడు నాదముని. లాభంలేదు, ఇతనికేమీ అర్థంకాదు.
    కిరణ్ ని చూపించి "మీకొడుకు!" అంది.
    నాదమునికి చిన్నపిల్లలంటే ఇష్టమే! "ఇహిహి! నా కొడుకు" అని ఎత్తుకోబోయాడు.
    గెడ్డం మీసాలతో గుబురు తలతో ఉన్న కొత్త మనిషిని చూసి కిరణ్ హడలిపోతూ ఏడుస్తూ తల్లిని వాటేసుకున్నాడు.
    నాదముని బిక్కముఖం వేసుకుని ఏడుస్తోన్న కొడుకుని చూస్తూ కూచున్నాడు లాలించి బుజ్జగించి మంచి చేసుకోవటం అతనికి చేతకాదు.
    తనను కౌగిలించుకున్న కొడుకుని గాఢంగా హృదయానికి హత్తుకుంది సరళ.
                                        14
         సుధీర్ కు పెళ్ళయింది. ఒక కూతురు కూడా పుట్టింది. అతని అత్తవారిది ఒక పల్లెటూరు. భార్యతోనూ, కూతురితోనూ కారులో అత్తవారి ఊరికి వెళ్తూ జైహింద్ బాబుని కూడా తనతో రమ్మన్నాడు సుధీర్.
    సుధీర్ భార్య కూడా చదువుకొన్నది. తను చిన్నతనంలో జైహింద్ బాబు తనను తోటిపిల్లలు కొడుతోంటే ఎలా అనుకున్నదీ, ఆరోజు నుంచీ అతని స్నేహం కోసంతనెలా పాకులాడిందీ, చదువులో అతనెంత చురుగ్గా ఉండేదీ, విధిలేక ఎలా చదువు మానెయ్యవలసి వచ్చిందీ, అవన్నీ కధలుగా భార్యతో చెప్పేవాడు సుధీర్. అతని భార్య కూడా జైహింద్ బాబంటే ఒక ఆదరణ భావం ఏర్పడింది.
    మొదట జైహింద్ బాబు వాళ్ళతో రానన్నాడు. సుధీర్ భార్యతోనూ, కూతురితోనూ కారులో జైహింద్ బాబు గుడిసె దగ్గిరగా వున్న రోడ్డు మీదకు వచ్చి. కారాపి తను ప్రత్యేకం జైహింద్ బాబు గుడిసె ముందుకు వచ్చి "వెళదాం రా!" అన్నాడు. అప్పుడిక రాననలేకపోయాడు జైహింద్ బాబు.
    తనకు వున్న వాటిల్లో మంచి బట్ట తీసుకొని బయలుదేరాడు. సుధీర్ భార్య కూడా "రండి!" అని మర్యాదగా ఆహ్వానించింది. ఆ బహువచన ప్రయోగానికి తలక్రిందులయిపోయాడు. విస్మయంతో ఆవిడని దేవతని చూస్తున్నట్లు చూస్తూ మనసారా చేతులు జోడించాడు.....
    కారులో వెళ్ళుతున్న జైహింద్ బాబుని గుడిసెబయటకొచ్చి సంబరంగా చూసింది అన్నమ్మ.
    "మా జయన్న దొరబాబు. కార్లల్లో తిరుగుతాడు - " అని మురిసిపోయింది. తల్లి అమాయకత్వానికి జాలిపడిన రత్నమ్మ తల్లిని చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకుపోయింది.
    సుధీర్ తనప్రక్కన కూర్చొని తనతోకలిసి భోజనం చేస్తోంటే మతే పోయింది జైహింద్ బాబుకి.
    అలా జైహింద్ బాబుతో కలిసి కూచొని భోజనం చేసి చిన్నతనంలో ఏదైనా రుజువు చేసుకోలేకపోయిన తన స్నేహ శీలతని రుజువు చేసుకోవాలని ఎప్పటినుంచో తహతహలాడుతున్నాడు సుధీర్.
    ఉన్న ఊళ్ళో తన ఇంట్లో ఆ పని చెయ్యగలిగే సాహసం అతనికి లేకపోయింది. ఉద్యోగరీత్యా తనకున్న హోదాని బట్టి బయట సంఘంలో జైహింగ్ బాబుతోకలిసి మెలిసి తిరగగలిగే శక్తి కూడా అతనికి లేదు.
    భార్య అర్థం చేసుకోగలిగిన వ్యక్తి కావటం వల్ల ఆ మారుమూల పల్లెటూళ్ళో సంఘ భయం లేకుండా తాను కోరినది చెయ్యగలిగాడు సుధీర్. అందుకే పొంగిపోయాడు జైహింద్ బాబు-
    అక్కడ మూడు రోజులు మాత్రమే ఉండటానికి వచ్చాడు సుధీర్. తన భార్య పేర ఉన్న కొద్దిపాటి పొలం కవులుదార్లనుండి స్వాధీనం చేసుకోవాలని వచ్చాడు.
    సాయంత్రం జైహింద్ బాబుతో కలిసి కాలువగట్టుకి షికారుగా బయలుదేరాడు సుధీర్. అతని కూతురు కూడా అతనితో బయలుదేరతానని పేచీ పెట్టింది. తల్లి మొదట వద్దని మందలించింది. కానీ సుధీర్ బాబు "పోనీ.రానియ్యి- సరదాగా తిరుగుతుంది." అనటంతో వాళ్ళ వెంట పంపించింది.
    సుధీర్ బాబూ, జైహింద్ బాబూ కబుర్లలో పడిపోయారు.... కవులుదార్ల గురించీ, సొంత వ్యవసాయాల గురించీ, ఆస్తిపాస్తుల గురించీ, కాలేజీ చదువుల గురించీ ఇలా ఒక దానిలోంచి మరొక దానిలోకి సంభాషణ దొర్లిపోయింది.    

 Previous Page Next Page