రంజిత పరిస్థితి మరీ ఘోరంగా వుంది. అప్పటివరకూ ఆమె తన నమ్మకాల మీదా, హేతువు మీదా చాలా బలంగా నిలబడి వుంది. కానీ ఆ బలహీనమైన క్షణం అవతార్ బాబానుంచి ఏదో శక్తి వచ్చి ఆమెని బలత్కారం చేసి ఆక్రమిస్తున్నట్టూ అనిపించింది. బాబా నాలుగు చేతులూ, రెండు తలల్తో వికటాట్టహాసం చేస్తున్నట్టు భ్రమ కలిగింది.
అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయింది.
ఒకవైపు రెచ్చిపోయిన ప్రజలు, మరొకవైపు పడిపోయిన అమ్మాయి... అక్కడ చాలా గొడవ జరిగేదే. కానీ అదృష్టవశాత్తు గవర్నర్ తాలూకు సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ వుండటంతో వారు జాగ్రత్తగా ఆ అమ్మాయిని బయటికి పంపించారు.
మందిరం బయటున్న ప్రజలకి లోపల జరిగిన విషయం పొక్కక ముందే రవి ఆమెని తీసుకువచ్చేశాడు. కానీ ఎంతకాలం ఆగుతుంది? గంట తిరిగేసరికల్లా ఆ ఊరంతా దావానలంలా ఈ వార్త పొక్కిపోయింది.
ప్రతివాళ్ళూ ఆ అమ్మాయిని ద్వేషంతో, భయంతో, అసహ్యంతో చూడసాగారు.
ఆ మరుసటిరోజు- శూన్యదృక్కులతో, మతిస్థిమితం తప్పినట్టున్న స్థితిలో వున్న తమ కూతుర్ని పట్నంనుంచి వచ్చిన ఆమె తల్లిదండ్రులు తమతో పాటు తీసుకు వెళ్ళిపోయారు.
రవి మనఃస్థితి వర్ణనాతీతం. చాలా మామూలుగా ప్రారంభించినది చూస్తూ వుండగానే చెయ్యిదాటిపోయి ప్రమాదకరం అయింది.
దీనంతటికీ తనే- తనే కారణం.
ఎలా దీనికి జవాబు చెపుతాడు?
నాశనం అయిపోయిన ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా సరిదిద్దుతాడు.
అవతార్ బాబాకి ఎలా సమాధానం చెపుతాడు?
ఇన్ని చిక్కు సమస్యల్ని ఎలా విప్పుతాడు?
...అతడో నిర్ణయానికి వచ్చాడు.
ఆ క్షణం అతడు కొండని ఢీకొనబోయే పొట్టేలులా వున్నాడు. నుదురు బ్రద్దలయినాసరే- ప్రయత్నం విరమించని పొట్టేలది.
* * * *
ఆ సాయంత్రం ఉస్సోక్ సమావేశం జరిగింది.
అష్టావక్రుడు పుట్టటానికి ముందు బహుశా అది ఆఖరి సమావేశం కావొచ్చు. అందువల్ల అందరూ మహాదష్ట ఏం చెపుతాడా అని ఉత్సుకతతో వున్నారు.
మహాదష్ట ఉపన్యాసం కొనసాగుతుంది. "....అష్టావక్రుడు పుట్టే వరకూ మనం ఈ రహస్యం దాస్తే చాలు. ఒక్కసారి అతడిని సురక్షిత ప్రాంతానికి చేర్చాక, ప్రపంచానికి ఈ విషయం వెల్లడి చేస్తాం. అప్పటికి ముప్పాతికమంది ప్రజలు మనవైపుకి వస్తారు. సాతానుని ప్రార్ధించటం మొదలుపెడతారు. మిగతా పాతిక వంతూ ప్రేతగణాల చేతిలో చస్తారు" అంటూ అవతార్ బాబావైపు తిరిగి, "బాబా! ఈ రోజు ప్రొద్దున్న నీ ఆవరణలో జరిగిన సంఘటనకి నీవేమి చెపుతావు?" అని అడిగాడు.
సభ ఒక్కసారి చైతన్యవంతమైంది.
బాబా లేచి నిలబడి, "చాలా చిన్న సంఘటన అది" అన్నాడు.
"బాబా! నువ్వెన్నో అద్భుతాలు చేస్తున్నావు. ప్రజల్లో నమ్మకం కల్గించటంకోసం సైతాను నీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయిస్తున్నాడు. ఎన్నో దేవతా విగ్రహాల్ని పూజించినా నయంకాని వ్యాధులు కేవలం నీ చేతిస్పర్శతో నయం చేయిస్తున్నాడు. తనని నమ్మినవారికి మాత్రమే ఈ ప్రపంచంలో ఇక ముందు ముందు సుఖ సంతోషాలుంటాయన్న విషయాన్ని ప్రజలు గుర్తించటానికి వీలుగా నీకు అద్భుతశక్తులు ప్రసాదించాడు. దక్షిణ భారతదేశ ప్రజలందరూ నిన్ను దేముడి రూపంలో కొలుస్తున్నారు. ఇంకో నెల తిరిగేసరికి దేశం అంతా నీకు దాసోహం అంటుంది".
అవతార్ బాబా మొహంలో నవ్వు చెదరలేదు. మామూలుగానే వున్నాడు. తిరిగి మహాదష్ట అన్నాడు-
"అష్టావక్రుడు పుట్టి తల్లిదండ్రులని చంపగానే, సురక్షిత స్థానానికి చేర్చి, ఉస్సోక్ అతడిని పెంచి పెద్ద చేయటం ప్రారంభిస్తుంది. అదేరోజు, అతడు సురక్షిత స్థానానికి చేరాడు అన్న నమ్మకం కలిగిన మరుక్షణాన, నువ్వు సాతాను దూతగా ముందు ఈ లోకానికి వచ్చావు అన్న వార్త వెల్లడి చేస్తాం. నేను ముందు చెప్పినట్టు, అప్పటికే సగం ప్రపంచం నీ పట్ల విధేయతతో వుంటుంది. నువ్వేం చెప్తే అది వింటుంది. అష్టావక్రుడి భవిష్యత్ పాలన గురించి నువ్వు ప్రచారం చేస్తావు. వ్యతిరేక శక్తుల్ని ఉస్సోక్ చంపుతుంది. అష్టావక్రుడికి ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఆ సాతాను రాజు పాలనకి ప్రపంచం యావత్తూ సిద్ధంగా వుంటుంది. అలా వుండేలా చేయవలసిన బాధ్యత మనమీద వుంది!! ఈ పరిస్థితుల్లో నువ్వు చెప్పిన విషయం ఏదైనా జరగకపోతే ప్రజలకి నీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది. అవునా! మరి ఆమెకి సద్యోగర్భం వస్తుందని ఎందుకు శపించావు? అది సాధ్యమేనా?"
బాబా ఏదో చెప్పబోతూ వుంటే రాకేష్ లేచి, "నేను చెప్తాను" అన్నాడు.
సభ అదిరిపడ్డది.
మహాదష్ట ప్రశ్నకి ఒకరి బదులు మరొకరు సమాధానం చెప్పటం అన్నది ఉస్సోక్ చరిత్రలో ఇంతవరకూ లేదు.
రాకేష్ అన్నాడు- "వచ్చినది పెళ్ళికాని అమ్మాయనీ, ఆడుతున్నది నాటకమనీ బాబాకి తెలియజెప్పింది నేనే! పక్కనున్న కుర్రవాడిని కూడా ఎక్కడో చూశాను. కానీ, బహుశా వేషం మార్చుకుని వుంటాడు. ఏది ఏమైనా వాళ్ళ నిజస్వరూపాన్ని పట్టుకోవటం ద్వారా ప్రజల్లో బాబా మీద నమ్మకం ఎక్కువైంది".
"కానీ రేపా అమ్మాయికి గర్భం రాకపోతే-"
"వస్తుంది...." అన్నాడు బాబా.
అప్పటివరకూ నిశ్శబ్దంగావున్న సభలో కలకలం రేగింది! అవతార్ బాబా తాపీగా, అంత దృడనిశ్చయంతో అనేసరికి సభ్యులందరూ ఆశ్చర్యపోయారు. బాబా మహాదష్టవైపు తిరిగి, "దష్టా! అసలు విషయం వెల్లడించవలసిన సమయం ఆసన్నమైనదనుకుంటాను" అన్నాడు.
మహాదష్ట మాట్లాడలేదు, మౌనంగా తలూపాడు.
"సభ్యులారా!" అన్నాడు అవతార్ బాబా అందరివైపు చూస్తూ. "....నేను అవతార్ బాబాని కాను".
అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి విస్మయంతో అతడివైపు చూశారు.
బాబా చెప్పసాగాడు.
"సంవత్సరం క్రితంవరకూ నేను దేముణ్ణి నమ్మినవాణ్ణి కాను. దెయ్యాన్ని అసలు నమ్మను....ఒకరోజు నిద్రపోతూ వుండగా దూరంనుంచి 'రా...రా' అన్న పిలుపు ఆహ్వానంలా వినబడింది. నిద్రలేచానో, నిద్రలో అలాగే నడిచానో గుర్తులేదు. స్పృహ వచ్చేసరికి అర్దరాత్రి దాటింది. శ్మశానంలో వున్నాను. అక్కడికెలా వచ్చానా అని ఆశ్చర్యపోతూ వెనుదిరగబోతూ వుండగా గాలి మాట్లాడసాగింది!!! అప్పుడే ఉస్సోక్ సంస్థ గురించి నాకు తెలిసింది. సైతాను భూమ్మీదకు దిగబోయే ముందు దానికి అనువైన పరిస్థితులు కల్పించవలసిందిగా 'గాలి' నన్ను ఆదేశించింది. ఇదెలా సాధ్యమని ప్రశ్నించాను. ప్రేతగణాలు అప్పుడే తన శక్తి నాకు ప్రసాదించినట్లున్నాయి. నాలో తెలియని ఉత్తేజం కలిగింది. అమావాస్య రోజున అవతార్ బాబాని కసులుకొమ్మని నాకు ప్రమధగణాలు చెప్పాయి. అప్పటికి అమావాస్య ఇరవై రెండు రోజులున్నది.
"మిత్రులారా! ఆ ఇరవై రెండు రోజుల్లోనూ నాలో విపరీతమైన మార్పులు వచ్చాయి. శరీరం పెరగసాగింది. నిలువు మొహం గుండ్రంగా అవసాగింది. పదిహేను రోజులు గడిచేసరికల్లా మిత్రులు కూడా గుర్తుపట్టలేని స్థితి ఏర్పడింది. సరే! ఇరవై రెండో రోజు అవతార్ బాబా ఆశ్రమానికి వెళ్ళాను. ఎప్పుడూ జనంతో కిటకిట లాడుతూ వుండే ఆ ప్రదేశంలో చిత్రంగా, ఏదో మాయ జరిగినట్టు- ఆ రోజు ఎవరూ లేరు. లోపలికి వెళ్ళాను. ఆశ్రమ నడి గర్భంలో అవతార్ బాబా విరుచుకు పడి వున్నాడు. ప్రేతాత్మ రక్తం తాగేసినట్టు అతడి శరీరం తెల్లగా, నిర్జీవంగా పడివుంది. అప్పుడే గాలి తిరిగి నాతో మాట్లాడింది. 'ఈ రోజు నుంచీ నువ్వే అవతార్ బాబావి? అష్టావక్రుడి పట్ల ప్రజలకు భక్తి పెంపొందించు. ఉస్సోక్ లో ఒక వ్యక్తికి విధేయుడివై అతడిచ్చిన ఆజ్ఞలు నిర్వర్తించు. అతడే అష్టావక్రుడి రాజ్యంలో సర్వసేనాని. అతడు చెప్పినట్లు చెయ్యి' అని ధ్వని అదృశ్యమయింది. అప్రయత్నంగా అద్దంలో చూసుకుని ఉలిక్కిపడ్డాను. జుట్టు తప్ప, మిగతా ఆకృతి అంతా అచ్చు అవతార్ బాబా లాగానే వుంది. గత ఇరవై రెండు రోజులుగా నాలో వచ్చిన మార్పులకి అర్ధం బోధపడింది.
ఆ క్షణం నుంచే నేను అవతార్ బాబా నయ్యాను. దీర్ఘకాలం జబ్బులు కూడా నేను చేయి తాకిస్తే నయం అవసాగినయ్. నేను చెప్పినదంతా విజమయింది. అచిరకాలంలోనే కృష్ణాపురం దాటి నా పేరు దేశమంతా వ్యాపించసాగింది" అంటూ తన జుట్టుని సరిచేసాడు.
రాకేష్ నిశ్చేష్టుడై విన్నాడు.
ఏ గాలి అయితే తనతో మాట్లాడిందో- అదే గాలి అతడితోనూ మాట్లాడింది! దంపతుల రూపంలో నా వద్దకు వచ్చేసరికి కోపం పట్టలేక పోయాను. మాట అనేశాను. ఇంతకాలం చేసిన క్షుద్రశక్తులే ఈనాడూ సాయం చేస్తాయని అనుకుంటున్నాను చూద్దాం".
మహాదష్ట లేచి, బాబాని కూర్చోమన్నట్టు సైగచేసి, చెప్పటం ప్రారంభించాడు. "-ఒక్క బాబాయే కాదు. ఈ విధంగా తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది ఉస్సోక్ లో వున్నారు. ఇంకో నెలలో ఇంకొంతమంది ప్రముఖులు చేరతారు. భగవంతుడిని నమ్మి భంగపోయినవారు, తమ కోర్కెలు వెంట వెంటనే తీర్చిన సైతాన్ ని నమ్ముతారు. అందుకే ప్రేతగణాలు ఉస్సోక్ సభ్యులకు తమ 'అంశ'లో కొంతని ప్రసాదిస్తున్నాయి. ఇంక నెలే... నెల రోజులే...మన మందారం సమిష్టిగా పని చెయ్యాలి".
అంతలో బ్లాక్ స్కెలిటన్ ఒకడు లేచాడు. ఒకప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టరు అతడు- ప్రస్తుతం కర్నూలులో వుంటున్నాడు. "మా జిల్లాలో వర్షాలు లేవు. జనం వేల సంఖ్యలో చేరి ప్రార్థనలు చేశారు. అయినా లాభం లేకపోయింది. నేను చెప్పీ చెప్పనట్టు చూచాయగా సూచించాను, దేవతలకు బలులిమ్మని... అదివ్వగానే వర్షాలు కురిసినయ్. ప్రస్తుతం ప్రమధ గణాధిపతి పేర్న గుడి కట్టుకున్నాం- దాదాపు అయిదు లక్షలదాకా వసూలు చేసి...."
మహాదష్ట తలూపాడు. అతడి మొహంలో సంతోషం కనిపించింది. "యజ్ఞాలు చేస్తేనూ, ప్రార్ధనలు ఆలపిస్తేనూ వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో వున్న ప్రజల్ని- దేముడి భావం నుంచి దెయ్యంవైపు తిప్పటం చాలా సులభం. దేముడికన్నా దెయ్యమే తొందరగా 'హెల్ప్' చేస్తుందన్న భావం కలిగిస్తే చాలు, మనుషులు మారిపోతారు. వారికి కావాల్సింది తమ సమస్యలు తొందరగా తీరటం- అంతే! దానికి సైతాన్ ఎలానో సాయం చేస్తుంది".
ఆ భావాల్ని నిరూపిస్తూ అక్కడో సంఘటన జరిగింది. ఒక వార్తావహుడొచ్చి మహాదష్టకి ఒక చీటీ ఇచ్చాడు. అది చదువుతూ వుండగానే మహాదష్ట మొహం విప్పారింది. అవతార్ బాబా వైపు చూస్తూ "బాబా! నువ్వు రాష్ట్రపు ఆస్థాన యోగిగా నియమింపబడ్డావు!" అని వెల్లడించాడు. "అంతేకాదు. ముఖ్యమంత్రికి సలహాదారుడుగా కూడా".
రాకేష్ మహాదష్టవైపే చూస్తున్నాడు. సాతాను తనకి అప్పజెప్పిన పనిని మహాదష్ట చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నాడు. అప్పటికే చాలా మంది ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఉస్సోక్ లో చేరారు, చేరుతున్నారు. గవర్నరే బహుశా ముఖ్యమంత్రికీ సలహా ఇచ్చి వుంటాడు. తన కళ్ళముందే గవర్నర్ బాబాకి సాష్టాంగపడి నమస్కరించటాన్ని చూశాడు. అన్నిటికన్నా ముఖ్యమైనది-
సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ తొందర్లో కృష్ణాపురం రాబోతున్నాడు. అతడికి ఎప్పటినుంచో కడుపులో అల్సర్. విదేశాల్లో కూడా తగ్గలేదు. బాబా అప్పుడే సాతాన్ కి ఈ విషయం నివేదించాడు.
ఉస్సోక్ లో మరో సభ్యుడున్నాడు. గ్రీన్ స్కెలిటన్ అతడు. గుజరాత్ ప్రభుత్వ డిపార్టుమెంట్ లో ఇంజనీరు. ఇక్కడే ఒక గ్రామంలో పనిచేస్తున్నాడు. ఒక ముఖ్యమైన ఆనకట్ట పగుళ్ళుదీసి- పగిలిపోవటానికి సిద్ధంగా వుందని అతడికి సాతాను కలలో చెప్పాడు. కేంద్రం నుంచి అధికారులని హుటాహుటిన తెప్పించాడు ఆ ఇంజనీరు. పెద్ద ప్రమాదం నివారించబడింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆ ఇంజనీరు ఆరాధ్యదైవం అయ్యాడు.