"పడవ, కాకి, షాడో, ఈగ, పెన్ను, నేను, అతడు, ఆమె, నిన్ను, కోపం, దాహం, గాఢంగా, అంటార్కిటికా, ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను".
"మైగాడ్...యూ ఆర్ బ్రిలియెంట్..."
రంజిత నవ్వి "థాంక్యూ" అంది.
"మీకు జ్ఞాపకశక్తి ఇంకా ఎక్కువుంటే మొదటి రెండు పదాలూ వదిలేసి మూడోది, ఆరోదీ, అలాగే తొమ్మిదోది చెప్పుకుంటూ పోగలరా?"
"ఎందుకు చెప్పలేను-" అంటూ ఆమె అదే స్పీడ్ గా చెప్పేసింది. చెప్పేసేక అర్ధమై "యూ...." అనబోయింది. ఈలోపులోనే షాడో సన్నగా విజిల్ వేసి "థాంక్యూ" అన్నాడు.
ఆమె మరింత కోపంగా, "ఇంకెవరైనా అయితే చెంప పగలకొట్టి వుండే దాన్ని" అంది.
"పోన్లేండి ఇంకెవరైనా అయితే కదా! నన్ను కాదుకదా!"
"మీరీ మాట తనతో అన్నారని ఇప్పటికి పదహారుమంది అమ్మాయిలు నాతో అన్నారు".
"మీకో సైకలాజికల్ పాయింట్ చెప్పనా... స్కోత్కర్ష అనుకోకూడదు సుమా! నేను నిజంగా అన్నది ఒకరిద్దరితోనే... మిగతా పధ్నాలుగురూ ఊరికే ప్రచారం చేస్తున్నారు. 'మనని కూడా షాడో అలా అడిగి వుంటాడు' అని చెప్పకపోతే తమమీద మిగతావాళ్ళకి ఎక్కడ అనుమానం వస్తుందో అని కొందరూ, 'నా వైపుకూడా అలానే చూశాడే' అని అహాన్ని సంతృప్తిపరచుకునే వాళ్లు కొందరూ ...ప్రముఖ హిప్నటిస్టు జయదేవ్ గారి మనవరాలు- మీకు సగటు ఆడవాళ్ళ మనస్తత్వ గురించి చెప్పేదేముంది" అన్నాడు.
రంజిత కాస్త చల్లారింది. "అయినా ఒకరిద్దరితో అన్నారు కదా" అంది అనుమానంగా.
"అది మీరు కనపడక ముందు-"
"నాన్సెన్స్, అయినా గంట కూడా కాలేదు మనం కలిసి. అప్పుడే ప్రేమేమిటి?"
"ప్రేమంటే అదే మరి. కాళిదాసు మొదటి చూపులోనే శకుంతలని ప్రేమించలేదూ? జూలియట్ మొదటి చూపులోనే షేక్ స్పియర్ని ప్రేమించలేదూ?"
"స్వామీ! మీ సాహితీ పరిజ్ఞానానికి జోహార్లు! మనమీ టాపిక్ వదిలిపెడదామా?"
"నిజంగా నన్ను ప్రేమించలేరా?"
"సారీ..."
షాడో బిక్కమొహం వేసి, "పోన్లెండి" అన్నాడు. "...పోనీ నాకో సాయం చేస్తారా?"
ఆమె అనుమానంగా "ఏమిటది?" అని అడిగింది.
"నా చిన్నారి చెల్లి...కేదారగౌరి...తనమీద మీ అభిప్రాయమేమిటి?"
"ఆమె మీద నా అభిప్రాయమేమిటి? ఆవిడ చాలా మంచిది. గౌరవనీయురాలు. మీకు చెల్లిగా తప్పబుట్టారు".
షాడో గతుక్కుమని "పోన్లెండి. దానికేం గానీ- జయదేవ్ మనవరాలిగా మీ మీదో బాధ్యత వుంది. నాతో కలిసి అవతార్ బాబా దగ్గిరికి రావాలి మీరు. ఆ బాబాగాడు నా చెల్లికి ఏదో శాపం ఇచ్చాడట. అందులో ఎంత నిజముందో చూడాలి" అన్నాడు.
"అయితే మనం ఏం చేస్తాం?
"ముందసలు ఈ బాబా ఓటికుండో, సరుకున్నవాడో కనుక్కోవాలి".
"దానికేం చెయ్యాలి?"
"అయిదో నెల కడుపుతో మీరు అక్కడికి రావాలి".
"వ్వా...ట్"
"గర్భవతి అయినట్టు- నా భార్యగా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి... అయిదో నెల కడుపుతో..."
"చెంప పగిలిపోగలదు జాగ్రత్త.."
"మీరు అనవసరంగా కోపం తెచ్చుకోకండి రంజితగారూ. జాగ్రత్తగా వినండి. ఇదంతా నాటకం మాత్రమే" అంటూ తడి కళ్ళతో, "ఇదంతా నా చిన్నారి చెల్లెల్ని రక్షించటం కోసం...ఎంతో మంది కపట మంత్రగాళ్ళని ఎదుర్కొన్న ప్రొఫెసర్ జయదేవ్!! ఆయన మనవరాలిగా ఇది మీ కర్తవ్యం... అదీ గాక నా చెల్లెలు..."
"చాల్లెండి. సెంటిమెంట్ ప్లే చెయ్యకండి. ఎప్పుడు వెళ్ళాలి?"
"అయితే మీ రొప్పుకున్నట్లేనా? థాంక్యూ థాంక్యూ...రేపు మీరు చీరె కట్టుకోకండి".
"ఏమిటి?" కళ్ళు పెద్దవి చేసింది.
"ఐమీన్- కుర్తా వేసుకోండి. అందులోంచి కడుపు బాగా కనబడుతుంది".
"మీరిలా పిచ్చి పిచ్చి సలహా లిచ్చారంటే అసల్రాను".
"ఒద్దొద్దు ఆ మాట అనకండి. మనం రేపే వెళుతున్నాం".
* * * *
శివశంకరశాస్త్రి.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్.
రాష్ట్రం ఎంతో కల్లోల పరిస్థితుల్లో వుండగా గవర్నర్ గా నియమింపబడ్డాడు. రెక్కలు కట్టుకువచ్చి ఇక్కడ వాతావరణాన్ని సరిదిద్దవలసింది పోయి, అతడు రాష్ట్రానికి చేరుకోగానే చేసిన మొదటి పని ఏమిటంటే తిరుపతి వెళ్ళి ఒకరోజు పాటు అర్చనలు జరిపించటం! (ఈ దేశాన్ని కేవలం దేముడొక్కడే బాగు చెయ్యగలడని అతడి నమ్మకం కాబోలు) ఇతడి మూర్ఖత్వం అంతటితో ఆగలేదు. నెహ్రూలాగే తన వీలునామాలో తన శవపు బూడిదని దేశం అంతా చల్లాలని ఆదేశించాడు. (ఎవరి ఖర్చుతోనో చెప్పలేదు.)
ప్రతీ మనిషికీ తన ఇష్టం వచ్చినట్టూ జీవించే హక్కు వుంది. కానీ శివశంకరశాస్త్రి పగలు పదకొండింటివరకూ పూజలో గడుపుతాడు. ప్రతీ వారమూ రాష్ట్రంలో వున్న ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళతాడు. అమావాస్యకీ పౌర్ణమికీ ఇల్లంతా భజనలతో నిండిపోతూంది! ఒక రాష్ట్రాధికారికి తన సమయాన్నీ, ప్రజల ధనాన్నీ ఇలా వెచ్చించే హక్కు ఏమాత్రం లేదని ఆయనకి ఎవరు చెప్తారు? "నీకు మేము జీతమిస్తున్నది మీ భజన్లు నువ్వు చేసుకోవటానికి కాదు" అని ఎవరు హెచ్చరిస్తారు?
....
శివశంకరశాస్త్రి అవతార్ బాబా దగ్గిర కూర్చుని వున్నాడు.
ప్రశ్నోత్తర కార్యక్రమాల సమయమూ, భక్తుల కోర్కెలు తీర్చే కాలమూ అది!
చాలా పొడవుగా వుంది క్యూ.
కొన్ని ఎకరాల విస్తీర్ణం వరకూ అది ఒక తీర్ధంలా వుంది. పల్లె ప్రజలయితే బండ్లలో కొన్ని రోజుల క్రితమే వచ్చి అక్కడ వంట వండుకుని బాబా దర్శనం కోసం వుండిపోతున్నారు. విదేశీయులు కూడా రావటం ప్రారంభించటంతో ఒక కాపిటలిస్టు కంపెనీ అప్పుడే అక్కడ స్టార్ హోటల్ కట్టే యోచన మొదలుపెట్టింది.
క్యూలో ఒక తాతా మనవరాలూ వున్నారు. మనవరాలికి చిన్నప్పటినుంచీ గూని. ఎంతోమంది డాక్టర్ల దగ్గిరకి వెళ్ళి నయంగాక చివరికి బాబా దగ్గిరకి వచ్చాడు. ఆ పాపకి పన్నెండేళ్ళుంటాయి.
ఆ తరువాత వున్నది ప్రొఫెసర్ పుట్టన్న. తన అమెరికా ప్రయాణం గురించీ, డాక్టర్ రంగప్రసాద్ ని నాశనం చేయడం గురించీ బాబా సాయం కోరటం కోసం వచ్చాడు ఆయన.
పుట్టన్న తరువాత వున్నది ఒక ఆస్తమా రోగి! దాదాపు పాతిక సంవత్సరాలనుంచీ ఉబ్బసంతో బాధపడుతున్నాడు. సుమారు పదివేలు ఖర్చుపెట్టి ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు చేయించుకునీ, రెండు చేతులూ తూట్లుబడ్డాయి కానీ ఉబ్బసం తగ్గలేదు. తరువాత ఒక హిప్నోథెరపిస్టు నాశ్రయించాడు. హిప్నటైజ్ చేసి ఆస్తమా తగ్గించటం మాట దేవుడెరుగుగానీ, మరో రెండు వేలు వదిలినయ్- ఇప్పుడు బాబా దగ్గిరకి వచ్చాడు.
ఆ తరువాత వున్నది షాడో, రంజిత.
తాతా మనవరాలు బాబా దగ్గిరికి చేరుకున్నారు. ఆ గూని అమ్మాయిని చూడగానే బాబా నవ్వేడు.
"సకల చరాచరాల్ని రక్షించేది భగవంతుడొక్కడే! నేనే భగవత్ స్వరూపాన్ని! మీ కష్టాలు తీర్చటానికి వచ్చిన వాణ్ణి!! మనస్పూర్తిగా నన్ను నమ్మండి. మీ కష్టాలు తీరతాయి" అంటూ ఆ పాప వెన్నుమీద చెయ్యివేసి నిమిరి, "ఏదీ తలెత్తమ్మా" అన్నాడు.
పాప తలెత్తింది.
ఇంకా...
చి....త్రం....!
ఆమె తల పైకి వస్తూనే వుంది.
ఆమె నిటారుగా అయింది.
అక్కడవున్న జనం మొత్తం ఒక మహత్ స్వరూపాన్ని చూస్తున్నట్లు విభ్రాంతులయ్యారు. వీటన్నిటినీ నమ్మని రవికూడా క్షణంసేపు తన కళ్ళని తాను నమ్మలేనట్టు అచేతనుడయ్యాడు.
విదేశీ ఫోటోగ్రాఫర్లు చకచకా ఫోటోలు తీసుకుంటున్నారు.
ప్రొఫెసర్ పుట్టన్న వెళ్ళి బాబా కాళ్ళమీదకు వంగాడు! అతడింకా తన సమస్య చెప్పకముందే బాబా అతడి శిరస్సు మీద చేయివేసి, గవర్నర్ వైపు తిరిగి ఏదో చెప్పాడు. తరువాత పుట్టన్నవైపు చూసి, "నీ మొదటి కోరిక వెంటనే నెరవేరుతుంది నాయనా! విదేశాలకి వెళ్తావు....
...పోతే రెండో కోరిక-శత్రువు.... అతడి పాపం పండటానికి ఇంకొంతకాలం పడుతుంది. ఒక నెలరోజులు ఆగు నాయనా! కృష్ణాపురం ప్రజలే నీ కోరిక నెరవేరుస్తారు. నీ శత్రువుని నిలువెల్లా చీలుస్తారు".
పుట్టన్న కళ్ళనుంచి నీళ్ళు జలజలా రాలినయ్. కోరిక తీరుతున్నందుకు కలిగిన ఆనందమో- మనసులో మాట చెప్పకముందే బాబా గ్రహించినందువల్ల కలిగిన సంభ్రమమో తెలీదు. అతడి మొహంలో అదోలాంటి దివ్య చైతన్యం కనపడుతూంది!
గూనిపోయిన పాపనీ, ఆ పిల్ల తాతనీ విదేశీ విలేఖర్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
ఆస్తమా పేషెంటు బాబా దగ్గిరకి వెళ్ళాడు. బాబా అతడితో రెండు నిముషాలు మాట్లాడాడు. నుదుటిమీదా, గొంతుమీదా వేళ్ళతో రాశాడు.
రవి అతడినే చూస్తున్నాడు. ఎన్నో రకాల విరుద్ధమైన భావాలు అతడిలో కదలాడుతున్నాయి. రంజిత మనఃస్థితి కూడా అలాగే వుంది. ఎదుటి రోగి ఆయాసం తగ్గిపోయినట్టు కనులముందు కనబడుతూనే వుంది.
మరి ఈ జరుగుతూంది?
మి....ర....కి....ల్....ట....చ్?
పేపర్లు వ్రాస్తున్నట్టు- ప్రజలు అనుకుంటున్నట్టు ఈ మనిషికి దివ్య శక్తులున్నాయా? అతడు తాము అనుకుంటున్న కపట బాబా కాదా?? తాము తొందరపడ్డారా?? ఇది అనాలోచిత చర్యా??
ఇద్దరూ వారి ఆలోచన్లలో వుండగానే వారివంతు వచ్చింది.
రవి తేరుకున్నాడు. బాబాముందు వాలి, అతడేదో అనబోయే లోపులోనే బాబా, "మూర్ఖుడా" అన్నాడు. అతడు చప్పున తలెత్తాడు.
ఆ లోపులోనే బాబా రంజితవైపు తిరిగాడు. "ఆడపిల్లవై యుండీ పెద్ద సాహసానికి పూనుకున్నావు. పెళ్ళి కాకుండా కడుపు పేరుతో వచ్చి పుట్టబోయే బిడ్డకోసం ప్రశ్నలు అడగబోయేవు. ఫలితం అనుభవించు! సద్యోగర్భం ధరించు. వివాహం కాకుండానే గర్భం దాల్చిన నువ్వు- దానికి కారణం తెలియకుండా ఒకవైపు, వేలెత్తి చూపే ప్రపంచానికి సమాధానం చెప్పలేక మరొకవైపూ కృంగి కృశించి పోతావు. మానవతీత శక్తుల ఉనికినే ప్రశ్నించిన నువ్వు- ఏ శారీరక సంబంధమూ లేకుండానే వచ్చిన నీ గర్భానికి, హేతువుని చెప్పలేక పిచ్చెక్కిపోతావు. అదే నీ భవిష్యత్తు. ఇక నువ్వెళ్ళొచ్చు".
అక్కడ హాహాకారాలు చెలరేగాయి.
రవి నిశ్చేష్టుడయ్యాడు. తను సరదాగా చేసింది ఈ విధంగా మారుతుందని అతడు కలలో కూడా అనుకోలేదు. అక్కడున్న భక్తులు వారిద్దరిమీదా విరుచుకుపడి అక్కడికక్కడే చంపేసేలా వున్నారు.