Previous Page Next Page 
తులసి పేజి 27

    దార్కా కళ్ళు విప్పేడు. గది చల్లగా వుంది. చుట్టూ చీకటి.
   
    వళ్ళంతా నొప్పులు, రక్తం పోవటంవల్ల నీరసంగా కూడా ఉంది.

    అయినా అతడు దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎంతకాలం తను ఇలా స్పృహ తప్పి వున్నాడో తెలుసుకోవాలి ముందు.

    అతడు పక్క మీదనుంచి లేచాడు.

    చాలా అందంగా అలంకరించబడి వుంది గది. చల్లటి గాలి ఒక మూలనుంచి రివ్వున వీస్తోంది.

    నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ గడియారం గంటలు కొట్టడం ప్రారంభించింది. దార్కా పెట్టసాగేడు, ఒకటి...రెండు......మూడు... పన్నెండు పూర్తయ్యేయి.

    ఎవరు తనని ఇక్కడ వుంచింది? స్మశానం నుంచి ఇక్కడికి తీసుకొచ్చింది ఎవరు?ఎందుకిలా బంధించి వుంచారు?

    దార్కా చేయి వెంటిలేటర్ గుండా జార్చి బయట గడియతీసి, ఆ గదిలోకి ప్రవేశించాడు.

    చాలా విశాలమైన గది అది.

    గదిలోకి అడుగుపెడుతూనే అతడు నిస్చేష్టుడై క్షణంపాటు నిలబడి పోయాడు. గదిలో బల్లమీద అతడినే నిశ్చలంగా చూస్తున్నట్టు వుంది.......

    ఒక పుర్రె.

    తన పూర్వ సహచరుణ్ని చూసినట్టు అతడు చప్పున దాని దగ్గరకు వెళ్ళాడు. చేతుల్లోకి తీసుకున్నాడు.

    క్షణంలో వెయ్యోవంతు కూడా పట్టలేదు అతడికి -ఆ పుర్రెకీ మామూలు పుర్రెకీ భేదం వున్నదని తెలుసుకోవడానికి.

    చిన్నతనం నుంచీ కపాలాల మధ్య పెరిగినవాడు. కపాలాన్ని సాధనాలుగా చేసుకుని విద్యల్ని సాధించినవాడు. అతడికి ఆ పుర్రెలో వున్న తేడాని కనుక్కోవటంలో పెద్ద కష్టం ఏముంది?

    అతడు చేతిలోని పుర్రెని పరీక్షగా చూసేడు. నుదుటిమీద నుంచి ఎడమ కంటి వరకూ చీలి వుంది. అందులో వింత ఏమీ లేదు. అతడికి బరువులో తేడా తెలుస్తూంది. కపాలాన్ని చూడగానే ఎంత కాలం క్రితందో అతడు సులబంగా చెప్పగలడు.అంత పురాతనమయిన కపాలం అంత బరువు వుండడానికి వీలులేదు. అతడు లోపల చెయ్యిపెట్టి చూసేడు. అంతా డొల్లగా వుంది కానీ-

    మెదడు వుండవలసిన చోట కొద్దిగా ఉబ్బెత్తుగా లోపలివైపు వున్నట్లు అనిపించింది.

    నుదురు దగ్గర చీలికని ఎడంచేసి లోపల ఏముందో చూడడం కోసం వేళ్ళతో కణతల దగ్గర నొక్కుతూంటే వెనుకనుంచి వినబడింది.

    "హల్లో!"

    అతడు చప్పున వెనుతిరిగేడు.

    గుమ్మం దగ్గర చక్రవర్తి నిలబడి వున్నాడు.

    "ఎలా వుంది ఆరోగ్యం?"

    దార్కా మాట్లాడలేదు. తలుపు వెంటిలేటర్ నుంచి బయటపడిన విషయం అతడు అడుగుతాడని అనుకున్నాడు. కానీ చక్రవర్తి ఆ ప్రసక్తి ఏమీ తీసుకురాకుండా "నాతో రా" అన్నాడు.

    దార్కా అతడిని అనుసరించేడు.

    ఇద్దరూ ఇంకో గదిలో ప్రవేశించారు.

    దార్కాకి ఆశ్చర్యంగా వుంది. ఇన్ని గదుల్లో ప్రవేశిస్తూన్నా బయటికి ద్వారం కనపడకపోవడం. చాలా ధనవంతులై వుండాలి వీళ్ళు ప్రతి గదీ అందంగా అలంకరింపబడివుంది.
 
    చక్రవర్తి లైటు వేసేడు.
   
    గది మధ్య లో కుర్చీలో కూర్చుని వుంది.

    సిద్ధేశ్వరి.

    లైటు వెలగ్గానే తల పైకెత్తి దార్కా కేసి చూసింది. దార్కా నిర్లిప్తంగా చూస్తున్నాడు. అతడికి భయంగా ఏమీ లేదు. ఇటువంటి వాళ్ళను వందమందినైనా అతడు కావాలంటే కట్రాటలు చెయ్యగలడు. కానీ అతడు ఆశించినట్టుగాక, సిద్దేశ్వరి మృదువైన కంఠంతో "కూర్చో" అన్నది.

    దార్కా కూర్చుంటు ఆమె వైపు చూసి ఉలిక్కిపడ్డాడు. మంత్రాలు చదివీ చదివీ అభ్యాసం చేసీ చేసీ తీక్షణత సంతరించుకున్న అతడి కళ్ళకి సిద్దేశ్వరిలో ఏదో అపశృతి కనిపించిది ఏమిటది.

    ఏదో వుంది, ఏదో

 Previous Page Next Page