ఆరోజింక ఏమైనా నిగ్రహించుకోలేక రిక్షా చేయించుకుని రావుగారి ఇంటికి బయలుదేరింది శోభ. రిక్షా దిగుతూండగానే లోపలి నుండి పరుగునవచ్చి శోభను కౌగలించుకుంది ఆశ. ఆ ఆప్యాయతకు కరిగిపోయింది శోభ. లాలనగా తల నిమురుతూ "పిచ్చిపిల్లా!" అంది భావోద్వేగంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా. "మాఇంటి కిన్నాళ్ళనుంచీ ఎందుకు రాలేదూ?" అంది. బుంగమూతితో ఆశ. ఆ అభిమానానికి నివ్వెరపోయింది. ఆ లేత హృదయంలో తనకున్న స్థానానికి గర్వపడింది.
స్వచ్చమైన ఆ పసి మనసులో ఉన్న అభిమానం తనలో లేనందుకు తనను తాను నిందించుకొంది. ఇన్నాళ్ళుగా తను రావుగారిని గురించి ఆలోచించిందే గాని ఆశను తలుచుకోనేలేదు.
"లోపలకు రండి. నాకు డాడీ కొత్త బొమ్మలు కొన్నాడు. చూపిద్దామంటే మీరు లేరు." అంటూ లోపలకు తీసికెళ్ళింది. తన బొమ్మలు చూపించింది. ఏవేవో స్కూల్ సంగతులు చెప్పింది. మధ్యలో గబుక్కున "మీరింకమీద రోజూ వస్తారుగా!" అంది.
శోభ చిరునవ్వుతో "ఎందుకు?" అంది.
"ఇన్నాళ్ళనుంచీ మీరు రాకపోతే నాకు ఎంత బెంగగా ఉందో తెలుసా టీచర్! నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. డాడీ వద్దన్నారు."
ఆ పసిగుండెలో తనమీద ఇంత అభిమానమెలా కలిగిందో అర్థంకాలేదు శోభకు.
"నేనంటే నీకెందుకింత యిష్టం ఆశా!"
ఆశ కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"మా అమ్మని ఆరోజు అందరూ ఇంట్లోంచి తీసికెళ్ళిపోయారు. నాకు బాగా జ్ఞాపకం. అందరూ ఏడ్చారు కాని అమ్మను ఒక్కళ్ళూ మళ్ళీ తీసుకురాలేదు. నాకు అమ్మ కావాలి. వీళ్ళంతా రాదంటారు కాని అమ్మ మళ్ళీ వస్తుందని నాకు తెలుసు. మా అమ్మ నన్ను విడిచిపెట్టి ఉండలేదు. తనకోసం నేనేడుస్తానని తెలియదూ? ఎందుకు రాదేవిఁటీ?"
శోభ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. చప్పున ఆశను దగ్గిరగా లాక్కుని గుండెల కదుముకుంది. ఆశ ఆమె వక్షస్థలానికి హత్తుకుపోయింది.
"మీరు 'అమ్మ' అని ఆయా చెప్పింది..."
శోభ ఉలిక్కిపడింది. ఆశ చెప్పుకుపోతూంది. "టీచర్ అమ్మ ఎలా అవుతారూ?" అన్నాను. 'టీచర్ అంటే అమ్మతో సమానం. అందుకని నీకు అమ్మలాంటిది' అంది. నాకూ అలాగే అనిపించింది. మీరు నాకు మా అమ్మలాగే కనిపిస్తున్నారు. మా అమ్మలా మీరూ నన్ను వదిలిపెట్టెయ్యకండి టీచర్!"
శోభ కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి. ఆశ శిరసు లాలనగా నిమురుతూ "ఉహు! ఒక్కనాటికీ వదలను, నిన్ను వదులుకోలేను ఆశా!" అంది.
ఆదరణకు, ఆత్మీయతకు అల్లాడిపోతున్న ఆ హృదయాలు రెండూ మౌనంగా ఒకదానికొకటి ఎంతసేపు సమాశ్వాసించుకున్నాయో తెలియదు.
కళ్ళు తుడుచుకుని తలెత్తేసరికి ఎదురుగా రావు కనిపించాడు. రావు ముఖం కంటపడగానే తన చికాకులన్నీ మాయమైనట్లనిపించింది శోభకు. మృదువుగా "ఎప్పుడొచ్చారు?" అంది.
"ఇప్పుడే! రెండు నిముషాలవుతుంది. ఏం పనిమీదొచ్చావ్?"
ముక్తసరిగా ఉన్న ఈ పలకరింపు పొంగిపొరలే శోభ ప్రేమ ప్రవాహాన్ని హఠాత్తుగా అరికట్టినట్టు బేలగా రావువంక చూస్తూ "పనా? పనేం లేదు. మీ దగ్గరకు పనిమీద వస్తానా?" అంది.
"అవునులే! పనిమీద నాదగ్గిరకు రావలసిన అవసరమేముంటుందీ? నీకు సహాయం చెయ్యటానికి మూర్తి ఉన్నాడు గదూ!"
తృళ్ళిపడింది శోభ. తనతో ఎవరైనా దెప్పిపొడుపుగా మాట్లాడినప్పుడు పెంకెతనంగా మరింత రెచ్చిపోవటం శోభ స్వభావం. దానికితోడు "రావుకు చాలా అనుమానం. అతని మొదటిభార్య అతని అనుమానం కారణంగా ఆత్మహత్య చేసుకుంది." అన్న మూర్తి మాటలు గుర్తొచ్చాయి. రోషంతో భగ్గునమండే మనసును అణచుకుంటూ శాంతస్వరాన "మూర్తి ఒక్కడే కాదు. ఇంకా చాలామంది ఉన్నారు" అంది.
"అలాగా!" అన్నాడు రావు అంతకంటే శాంతంగా.
కొన్ని క్షణాలు భయంకర నిశ్శబ్దం వాళ్ళిద్దరిమధ్య రాజ్యం చేసింది. గుండెల నిండా లావానింపుకున్న అగ్నిపర్వతాలలా ఇద్దరూ స్థిరంగా కూర్చున్నారు.
"మీ అన్నయ్యకెలా ఉందీ?" సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు రావు.
"పరిస్థితి నానాటికీ విషమిస్తోంది. ఎవ్వరికీ ధైర్యంగా లేదు." తన నిగ్రహాన్ని మరిచిపోయి, మళ్ళీ బేలగా అంది శోభ.
"ఆశ్చర్యంగా ఉందే! డాక్టర్ శేఖర్ నాలా చేతకానివాడు కాదే! ఈపాటికి తగ్గిపోయి ఉంటుందనుకున్నాను." సాధ్యమైనంత ఆశ్చర్యాన్ని ప్రదర్శించాడు రావు. శోభ మనసు గిలగిల కొట్టుకుపోయింది.
తనను తను నిగ్రహించుకునే ప్రయత్నంలో క్రిందిపెదవి రక్తం చిమ్మేలా కరచుకొంది. అయినా నిగ్రహించుకోలేక కళ్ళలో నీళ్ళు సుడులు తిరుగుతుండగా అంది. "నన్ను క్షమించండి. నేను డాక్టర్ శేఖర్ ను పిలిపించటానికి కారణం..."
శోభ మాటలు పూర్తికాకుండానే అడ్డు తగిలాడు రావు. "దానికేముందిలే! నేను కొంచెం లిబరల్ గా ఉంటాను గనుక బీదా, బిక్కీ నాదగ్గిరకొస్తారు కాని, డబ్బున్నవాళ్ళంతా శేఖర్ దగ్గరకే వెళతారు."
మరొక కొరడా దెబ్బ!
శోభ తట్టుకోలేక కుర్చీలో వెనక్కు వాలి తల రెండు చేతులతో పట్టుకొంది.
"తలనొప్పిగా ఉందా? డాక్టర్ శేఖర్ కు ఫోన్ చెయ్యనా?"
చివ్వున లేచింది శోభ.
"థాంక్స్! మీరు పిలిపించక్కర్లేదు. నేనే వెళ్ళగలను."
"టాక్సీమీద వెళ్ళు. ఖర్చవుతుందని సంకోచించకు. నీలాంటి అందమైన దానికి ఎవరో ఒకరు అప్పిస్తారులే."
విసురుగా రావు వంక తిరిగిన శోభ కళ్ళలో నిప్పులు కురిశాయి. రావు నిర్లక్ష్యంగా నవ్వాడు.