పెనుగాలికి ఆకులన్నీ రాలిపోయినా, కొన్ని మిగిలినట్టు మేమూ కొంతమంది సాక్షులం మిగిలాం.
రామ్ లాల్ లాటి ఎత్తుపొడవున్న నలుగుర్ని పరమేశ్వరం బోన్ లో నిలబెట్టాడు.
రామ్ లాల్ ని నేను గుర్తుపట్టాను. కానీ కంగారులో అటూ ఇటూ పరుగెత్తిన అతిధులు- ఆ నలుగురిలో ఎవరు మిషన్ గన్ పెల్చారో సరీగ్గా చెప్పలేకపోయారు. లాయర్ పరమేశ్వరం వాగ్ధాటికి వాళ్ళ జ్ఞాపకశక్తిని ఛిన్నాభిన్నం చేసింది. అతి ప్రశ్నల బాణాలు వాళ్ళ నమ్మకాన్ని చీల్చి చెండాడాయి. ఆ అయోమయాన్ని ఆ క్రిమినల్ లాయర్ క్యాష్ చేసుకున్నాడు.
మిషన్ గన్ మీదవున్న వేలిముద్రలో కోర్టులో పరిశీలన కొచ్చాయి. 'పరమేశ్వరం తనలో తనే ఎందుకు నవ్వుకున్నాడో అప్పుడు నా కర్ధం కాలేదు.
మిషన్ గన్ మీదవున్న వేలిముద్రలో ఆ నలుగురిలో ఏ ఒక్కరివీకావు!!! అప్పుడు తెలిసింది దాని అర్ధం, ఇదంతా ప్రీ-ప్లాన్డ్! పరమేశ్వరం క్రిమినల్ లాయరేకాదు- మాస్టర్ బ్రెయిన్ ఆఫ్ ది క్రైమ్ అని.
అంతమందిని చంపి, రక్తాన్ని యేరులాగా పారించిన నరరూప రాక్షసుడు న్యాయస్థానంలో 'బెనిఫిట్ ఆఫ్ డవుట్' క్రింద వదిలివేయబడ్డాడు. రామ్ లాల్ భుజంమీద ఒక చెయ్యి, పరమేశ్వరం మీద ఒక చెయ్యి వేసి కోర్టు హాలునుంచి బయటకు నడుస్తూ అనంతానంతస్వామి మావైపు విజయగర్వంతో చూసిన చూపు చరిత్రలో ఏ తెర్రరిస్టూ వ్రాయని అదృశ్య రక్తాక్షరాల్ని నా గుండెలమీద వ్రాసింది.
నాన్న శాశ్వతంగా కుంటి వాడయ్యాడు. విదేశీయులతో యుద్ధంలో పరమవీరచక్ర సంపాదించిన నాన్న, దేశద్రోహులకి కాళ్ళు అర్పించుకోవలసి వచ్చింది. చదువు, ఆడుకోవటం, జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకోవడం- ఇలాంటి నా జీవితం, ఆ క్షణంనుంచి మారిపోయింది. నా జీవితంలో ఏకైక శత్రువులుగా అనంతానంతస్వామి, అతడి గ్రూపు మిగిలిపోయారు. అదే ఆఖరివరకూ నా పోరాటంగా మనసులోనే అనుకున్నాను. డిపార్టుమెంట్ లో ఆఫీసర్ నయ్యాను. కానీ స్వామి శక్తితో పోల్చుకుంటే నా అధికారం ఎంత చిన్నదో, డిపార్టుమెంటులో చేరిన తర్వాత తెలిసింది, నా ఆఫీసులోనే నాకు శత్రువులు. శత్రువులకి తొత్తులు. డబ్బుకి బానిసలు. సమాంతర ప్రభుత్వ నిర్వాహకులకి బానిసలు. 'నేనేం చెయ్యలేను అనుకునే టైమ్ లో మీరు పరిచయం అయ్యారు. మీ తండ్రెవరోగానీ, ఆయన తెలివితేటలు మీకున్నాయి. వాటికన్నా ముఖ్యంగా, ఒక సైనికుడికుండే తెగింపు, నిర్లక్ష్యం మీలో కనపడ్డాయి. అనంతానంతస్వామిని కనీసం ఈ మాత్రమైనా దెబ్బ తీయగలిగిన మొదటివ్యక్తి మీరే. కానీ...కానీ ఈ విధంగా మీరు బయటపడటం నాకు భయంగా వుంది, అతడూరుకోడు. ఏదో.. చేస్తాడు. ఏదో చేస్తాడు..."
అప్పటివరకూ ఆవేదనతో, ఉద్వేగంతో వింటూన్న విహారి ఈ చివరి మాటలకి సన్నగా నవ్వేడు. అతడి మనసంతా ఆమెపట్ల జాలితో నిండిపోయింది, అయినా చివరి మాటలకి నవ్వొచ్చింది.
"ఇదంతా కాస్త ముందుగా నాకు చెప్పి వుండవలసింది ప్రవల్లికా" అన్నాడు.
ఆమె కాస్త విస్మయంతో "చెప్తే ఏం జరిగి వుండేది?" అంది.
"ఊబిలోకి కాకుండా లోయలోకి తోసి వుండేవాడిని."
* * *
ఐ.సి. 539 ఎయిర్ బస్ మద్రాసు నుంచి దూసుకు వస్తోంది. ఎడమవైపు కిటికీ దగ్గర కూర్చుని వున్నాడు లాయర్ పరమేశ్వరం. అతడి చేతిలో పెద్ద బౌండ్ బుక్ వుంది. తల పై నుంచి తగులుతూన్న చల్లటిగాలికి అతడి వెంట్రుకలు వూగుతున్నాయి. అతడి చేతివేళ్ళు పుస్తకంలోని కాగితాల్ని తిప్పుతున్నాయి.
అతడి కళ్ళజోడు వెనుక గూడు కట్టుకున్న తెలివితేటలు, అతడి నుదుటి గీతల వెనుక ఎంతోమంది క్రిమినల్స్ ని రక్షించిన అనుభవం, అతడి బిగించిన పెదవుల వెనుక లౌక్యం, అతడి ముఖంలో గెలుపు తెచ్చిన తేజస్సు-
ఢిల్లీ నుంచి తనని అంత అర్జెంట్ గా స్వామి ఎందుకు పిలిపించాడో అతడికి అర్ధంకాలేదు. డైరెక్ట్ ఫ్లయిట్ దొరక్క మద్రాసు వరకూ వెళ్ళి వెనక్కి వస్తున్నాడతను.
అతడి కోసం విమానాశ్రయంలో కారు రెడీగా వుంది. వెళ్ళేసరికి స్వామి ఎదురు చూస్తున్నాడు. అది భక్తులకు దర్శనం ఇచ్చే సమయం. అయినా పరమేశ్వరంతో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో అంతఃపురంలోనే వుండిపోయాడు. పరమేశ్వరాన్ని చూసి "రా, కూర్చో" అన్నాడు.
* * *
"నా నలభై ఏళ్ళ క్రిమినల్ జీవితంలో ఎందరో గాంగ్ లీడర్లు, ఆయుధాల వ్యాపారస్తులు, సైనికాధికారులు, పోలీసులు నా మీద ఎలాగో ఒకలా కక్ష తీర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించారు. యుద్ధాలు చేశారు. చంపాలని ప్రయత్నించారు. జైల్లో పెట్టాలని ప్రయత్నించారు. అందర్నీ ఓడిస్తున్నాను."
స్వామి చెబుతూవుంటే పరమేశ్వరం మౌనంగా వింటున్నాడు.
"నాకెదురు తిరిగిన వారు నిశ్శబ్దంగా ప్రాణాలు వదిలారు. నా దారికడ్డువచ్చినవారు 'నా' అనే వారు లేక మలమలా మాడిపోయారు. కానీ....కానీ ఇన్నాళ్ళకు కుర్రవాడు నాతో సరదాగా ఒక జోకు వేశాడు. కార్లో కూర్చోబెట్టి చిటికెనవేలితో దాన్ని లోయలోకి తోశాడు. నేను చావనని అతనికి తెలుసు. రాళ్ళమధ్య నలిగిపోయిన కారులోంచి.... అతికష్టంమీద నేను బయటకు వస్తుంటే, రెండు చేతులూ జేబులో పెట్టుకుని లక్ష్యం లేనట్టు నడిచిపోయాడు. ఐ లైక్ హిమ్! మొట్టమొదటిసారి నా మీద ఒకడు దెబ్బ తీశాడు. అతనిని చంపడం- అతడిని బెదిరించడం- ఇలాంటివి నా కిష్టంలేదు. అలాంటి వాడికి రామ్ లాల్ వున్నాడు. పరమేశ్వరం! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అతడు గిలగిలలాడిపోవాలి. మానసికంగా చిత్రవధలు అనుభవించాలి. నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి ఆలోచించు. ఒక అనామకుడిగా వున్న నిన్ను దేశంలోకెల్లా పెద్ద లాయర్ని చేశాను. నువ్వు నాకు చేసిన ప్రతి సహాయానికి అకౌంట్లో లక్షలు జమ చేశాను. ఇన్నాళ్ళకి నువ్వు నా మీద నిజమైన కృతజ్ఞత చూపించవలసిన రోజు వచ్చింది. ఇదంతా నీకు ఆశ్చర్యం కలిగిస్తూ వుండవచ్చు పరమేశ్వరం! ఇదేమిటి ఎంతో గంభీరంగా వుండే అనంతానంతస్వామి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడేమిటా అని! నిజమే... కోటి రూపాయల ప్లానుని ఆ కుర్రవాడు విఫలం చేసినప్పుడు కూడా అతడి మీద నాకింత కోపం రాలేదు. కానీ, నా అహాన్ని దెబ్బతీశాడతడు. ఇంతకాలం ఎవ్వరూ చెయ్యలేని పనిని అతడు చేశాడు. అంతకి అంతా అతడికి బుద్ధి చెప్పాలి. అందుకే ఢిల్లీ నుంచి పిలిపించాను. నీ కిదంతా నవ్వుగా వుందా?"
"లేదు" అన్నాడు పరమేశ్వరం... "నేను అర్ధం చేసుకోగలను".
"గుడ్. నీ పని ఈ రోజు నుంచే ప్రారంభించు. ఏం చేస్తావో. ఎలా చేస్తావో నీకే వదిలిపెడుతున్నాను. ఎన్ని రోజులు కావాలి?"
పరమేశ్వరం నవ్వేడు. "ఒక వారం చాలనుకుంటాను. ముందు నేను కుర్రవాణ్ని చూడాలి."
"అదెంతపని? అతడు ఎక్కడో ఒకచోట నాటకాలేస్తూ వుంటాడు" అని ఇంటర్ కమ్ లో అడిగాడు.
"ఇంత చిన్న పనికి అంత దూరంనుంచి నిన్ను పిలిపించానంటే ఆ కుర్రవాడు ఎలా విలవిలలాడాలని నేను అనుకుంటున్నానో ఊహించగలవు కదా నువ్వు."
"ఈ చెయ్యి వుంది చూశారా? దీనికో గొప్ప గుణం వుంది. ఒక్కసారి షేక్ హాండిస్తే చాలు- అవతలి మనిషి ఎటువంటి వాడో కనిపెట్టేస్తుంది."
ఈ లోపులో ఇంటర్ కమ్ లో వార్త వచ్చింది. "ఈ సాయంత్రం రవీంద్ర కళాక్షేత్రంలో అతని ప్రోగ్రాం వుందట" స్వామి చెప్పాడు.
"గుడ్, ముందు వరుసలోనే నాకూ ఒక సీటు ఏర్పాటు చేయించండి" పరమేశ్వరం లేస్తూ అన్నాడు.
"అలాగే".
పరమేశ్వరం చేయి సాచాడు. స్వామి నవ్వుతూ, "వద్దు, నీకు షేక్ హాండివ్వడ మంత ప్రమాదం మరొకటి లేదని నాకు తెలుసు" అన్నాడు.
పరమేశ్వరంకూడా నవ్వుతూ "వెళ్ళొస్తాను" అన్నాడు.
అతడు వెళ్ళిపోయాక స్వామి బల్లమీదవున్న ఫైల్ తీసుకున్నాడు. దాని అట్టమీద చిన్న అక్షరాలతో 'విహారి' అని వ్రాసి వుంది. అతని జీవిత చరిత్ర అంతా ఆ ఫైలులో వుంది.
* * *
"ఏమిటి, మా అబ్బాయి నాటకానికి మీరు కూడా వచ్చారే" అంది వర్ధనమ్మ- సునాదమాలనీ, బామ్మనీ చూస్తూ.
అది విహారి నాటకమని తెలియగానే సునాదమాల గుండె ఆగినంత పనయింది. 'లవకుశ' ...ఆధునిక యక్షగానం అనగానే పట్టుబట్టి బామ్మని తీసుకువచ్చింది. విహారి ట్రూపుది అనుకోలేదు.
"మా అబ్బాయి నాటకాలు నేను చూడను. ఇదిగో 'లవకుశ' అన్నాడని వచ్చాను" అంది వర్ధనమ్మ.
"నేనూ అంతేనమ్మా! మీ అబ్బాయని తెలీదు. 'లవకుశ' అని మా మనవరాల్ని బ్రతిమాలి తోడుగా తీసుకువచ్చాను."
సునాదమాల బామ్మని నమిలి మింగేసేలా చూసింది. "ఛాలెంజి రాముడు' సినిమాకు వెళదామంటే, వద్దని ఇటు తీసుకువచ్చింది తను. తననో మోడరన్ గర్ల్ గా చూపించడానికి బామ్మ పడే తాపత్రయం చూస్తుంటే బామ్మమీద కోపమూ, ఇష్టమూ కలుగుతున్నాయి ఆ అమ్మాయికి.
తెర వెనుకనుంచి వీళ్ళని చూసిన పద్మాకర్ విహారితో "కాబోయే అత్తాకోడళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నారు గురూ" అని గుసగుసలాడాడు. విహారి నవ్వాడు. "ఇంకా ద్వాదశివరకూ టైముందిగా?"
అదే సమయానికి-హాలు బయట రేమ్డుకార్లు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి ఆగాయి. ఒక దానిలోంచి పరమేశ్వరం, మరొక దాన్లోంచి ప్రవల్లిక దిగారు. ఒకర్నొకరు చూసుకుంటూ లోపలి ద్వారం దగ్గరకు ప్రవేశించారు. పరమేశ్వరం వ్యంగ్యపు మర్యాద నిండిన కంఠంతో- "వెళ్ళమ్మా! లేడీస్ ఫస్ట్" అన్నాడు.
"ముందు క్రిమినల్స్ నడుస్తూండగా వెనుక పోలీసులు రావడం మర్యాద" అందామె.
పరమేశ్వరం బిగ్గరగా నవ్వి- "ఈ ఒక్కమాటకే నీ మీద పది లక్షలకి పైగా పరువునష్టం దావా వెయొచ్చు" అన్నాడు. ఆమె ముఖం తిప్పుకుని వడిగా లోపలికి వెళ్ళింది.
గ్రీన్ రూమ్ లో విహారిని కలుసుకుని "సారీ అర్జెంట్ పని తగిలింది. వెళ్ళాలి" అంది.
"అది చెప్పడానికి ఇంతదూరం వచ్చారా?" అన్నాడు ఆశ్చర్యంగా.
"ప్రోగ్రామ్ కి మీరు రమ్మన్నారు. చూడలేకపోతున్నానని చెప్పాలిగా."
"ఏమిటంత అర్జెంటు పని?"
ఆమె నవ్వి - "సి.బి.ఐ. పనులు చెప్పకూడదు" అంది.
పక్కనే వున్న పద్మాకర్- "సి.బి.ఐ. అంటే గుర్తుకొచ్చింది. మీవన్నీ గవర్నమెంట్ పనులేనా? మాకూ కాస్త ప్రైవేట్ డిటెక్టివ్ పని చేసి పెడతారా?" అని అడిగాడు.
"మీకేం పని కావాలి?" నవ్వుతూనే అడిగింది.
"మాకో అమ్మాయి ఫోన్ చేస్తోంది. ఎదురుగ్గా ఉన్నప్పుడు ఏమీ ఎరగనట్లు ప్రవర్తిస్తుంది. ఆ అమ్మాయిని పట్టుకోవాలి."
"ఎవరా అమ్మాయి? ప్రస్తుతం ఎక్కడుంది?" వాలుగా చూస్తూ అడిగింది.
"ప్రస్తుతం ఈ ఆడిటోరియంలోనే వుంది."
ప్రవల్లిక నవ్వాపుకుని టైమ్ చూసుకుని- "మైగాడ్! టైమయింది వెళ్ళాలి. రేపు కలుస్తాను" అని వెళ్ళిపోయింది.
"ఆ అమ్మాయితో సునాదమాల సంగతి ఎందుకు చెప్పా..." అని విహారి అంటూండగా, ఇంతలో బెల్ మ్రోగింది. నాటకం తెర లేచింది.
లవకుశ ఆధునిక యక్షగానం ప్రారంభమైంది.
అందులో విహారిది సూత్రధారుడి పాత్ర. పైనుంచి స్పాట్ పడింది. పాత్రధారులందరూ లీనమై నటిస్తున్నారు. సూత్రధారి అంటున్నాడు- "ఆ విధంగా లవకుశ తండ్రితో యుద్ధంచేసి తల్లి గౌరవం నిలబెట్టిన సందర్భంలో...