"వాళ్ళని నాలుగు తన్నలేవూ?"
"తన్నగలను-కానీ, దెబ్బలాటలు, అల్లరి, గొడవలు-"
"పిరికిమనిషి! ఎవరేమన్నా నోరు మూసుకుని పడిఉంటాడు!"
"పిచ్చిదానా! పిరికివాళ్లే చీటికీ మాటికీ ఉద్రేకం తెచ్చుకుని గొడవలు ప్రారంభిస్తారు-ఏ పరిస్థితుల్లో అయినా నిబ్బరంతో, నిగ్రహంగా ఉండటానికే చాలా ధైర్యం కావాలి!"
"ఏమో! నేనయితే అలా చచ్చినా ఊరుకోను! ఆ తరువాత ఏదెలా జరిగినా ముందు వాళ్ళ లెంపలు టపటప వాయించేస్తాను."
"అబ్బ! ఎంత రోషం!"
"రోషం కాదు బావా! నిన్నెవరైనా చిన్నబుచ్చితే నేను సహించలేను-మరేవిధంగానూ నిన్ను చిన్నబుచ్చలేక నువ్వు పుట్టిన కులం ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని చూస్తే ఆ అల్పత్వాన్ని అసలు సహించలేను."
సరోజ కళ్ళు చెమ్మగిల్లాయి-ఆ అమ్మాయి మనసులో తన మీద ఉన్న అభిమానం చూసి కుమార్ ముగ్ధుడయిపోయాడు__ ఆప్యాయంగా సరోజ చెయ్యి తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కాడు. ఆ అనునయంతో తన రోషమంతా మరిచిపోయింది సరోజ.
సరోజ, మంజుకంటే కొంచెం పెద్దది__అయినా వాళ్ళిద్దరి మధ్యా బంధుత్వంతోపాటు స్నేహంకూడా పెనవేసుకుంది__ఇద్దరికీ సబ్జెక్ట్స్ వేరు కావటంవల్ల ఒక కాలేజిలో చదవకపోయినా, ఇద్దరూ ఒక మూలచెరి గంటలు గంటలు కబుర్లు చెప్పుకునేవారు-ఈ 'ప్రేమ'లో ఏం గమ్మత్తు ఉందో కాని, తమ ప్రేమ కబుర్లన్నీ మరొకళ్ళకి చెప్పుకోకుండా తోచదు-సరోజ ఎప్పటికప్పుడు మంజుతో తన ప్రేమ వ్యవహారమంతా చెప్పేది. తను కుమార్ ని ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నదీ, అప్పుడు ఇద్దరూ, ఏ పార్కులో కూచున్నదీ, ఆ సందర్భంలో కుమార్ ఏం మాట్లాడిందీ అన్నీ చెప్పేది.
"నేను పచ్చగడ్డిమీద చెయ్యివేసి ఆ చేతిమీద ఆనుకుని ఏదో మాట్లాడుతున్నాను. మీ కుమార్ అన్నయ్య ఏమీ ఎరగని వాడి లాగ ఆ చేతిమీద చెయ్యివేసి నొక్కాడు__ఉలిక్కిపడ్డాను__"భయపడకు__భయపడకు-" అంటూ నన్ను ఓదారుస్తున్న వాడిలా గట్టిగా కౌగిలించుకున్నాడు. అబ్బ! ఎంత భయం వేసిందనుకున్నావ్! నేను అంత సిగ్గు పడతానని నాకే తెలియదు. నన్ను చుట్టిన బావచేతులు తొలగించటానికి కూడా శక్తి చాలలేదు__సిగ్గు పడుతున్నప్పుడు నువ్వు చాలా బాగుంటావు సరూ! అన్నాడు బావ_ అవునా? ఏమో మరి?-"
"నిజమే! సిగ్గుపడుతున్నప్పుడు నువ్వు చాలా బాగుంటావు." సరోజ కబుర్లన్నీ విని నవ్వుతూ అనేది మంజు.
"పో! కొంటెపిల్లా! అప్పుడు నేనెలా ఉన్నానో, నువ్వెలా చెప్పగలవు?"
"ఆ మాటలన్నీ చెపుతూ మా అన్నయ్య ఎదురుగా ఉన్నట్లే అదంతా ఇప్పుడు జరుగుతున్నట్లే సిగ్గుపడి పోతున్నావుగా!"
పక పక నవ్వేది మంజు-సరోజ మరింత సిగ్గుపడి మంజు బుగ్గలు మెలిపెట్టేది.
"అమ్మ బాబోయ్? నేను-నేను-మా అన్నయ్యను కాను." అనేది మంజు.
ఇంత అల్లరీ సుమతి అలికిడి వినగానే మాయమయి పోయేది- సుమతి తమ దగ్గిరకు రాగానే ఇద్దరూ చెరో పుస్తకం పట్టుకునేవారు. లేదా, ప్రేమకు సంబంధించిన తమ కబుర్లను పాఠాలకు సంబంధించిన కబుర్లుగా మార్చేసుకునేవారు.
అప్పుడప్పుడు ఇంట్లో కూడా సరోజ అల్లరిచేసి అదంతా మంజుకి చెప్పేది.
"అబ్బాయిగారు, పాపం, బుద్దిగా చదువుకుంటున్నారు__ నేను వెనకాతలనుంచి వెళ్ళి నెమ్మదిగా గిల్లాను. గట్టిగా అరవబోయాడు నోరు నొక్కేశాను. నా చెయ్యి విడిపించుకుని "అమ్మ దొంగా! నానోరు మూస్తావు కదూ?" నేనూ నీ నోరు మూస్తాను చూడు, అని నా నోట్లో నోరుపెట్టేశాడు-అబ్బబ్బ! ఉక్కిరి బిక్కిరయి పోయాననుకో!" అనేది. మరొకసారి "అత్తయ్య నా చేహ్తిలో స్వీట్ పెడితే తింటున్నాను. దొంగ? ఎక్కడినుంచి వచ్చాడో, నా చేతిలోది నోరుపెట్టి తినేసి పైగా అరచెయ్యి కొరికేశాడు__ చూడు! ఎంత ఎర్రగా అయిందో?" అని చూపించేది.
ఇలాంటి కబుర్లన్నీ విని విని మంజు మనసులోనూ ఒక విచిత్రమయిన సంచలనం బయలుదేరింది__మంజుకి తెలియకుండానే మురళి తరచుగా గుర్తురావటం మొదలు పెట్టాడు. అతనితో తను మాట్లాడిన మామూలు మాటలే మళ్ళీ మళ్ళీ తలచుకునేది. తను చదివిన మిల్స్ అండ్ బూన్ కంపెనీ నవలల్లోని ప్రణయ సన్నివేశాలన్నీ తను కథానాయికగా, మురళి కథానాయకుడుగా మనసులో ఊహించుకునేది. పుస్తకం చేతుల్లో పెట్టుకుని అరమోడ్పు కనులతో ఎటో చూస్తున్న మంజుని చూసి సుమతి "ఏమిటి? ఏ ఆలోచనలో పడ్డావ్?" అని అదలించింది, మంజు ఉలికిపడి "అబ్బే! చదివింది ఆలోచించు కుంటున్నాను-" అని పుస్తకంలో తలదూర్చి తల్లి పనిమీద వెళ్ళిపోగానే మళ్ళీ కలలలోకి జారిపోయేది.
12
ఇంగ్లీష్ లెక్చరర్ని విద్యార్ధులందరూ దూర్వాసముని అంటారు__
ఆయనకు కోప మెక్కువ-అతి తేలికగా ఉద్రేకం తెచ్చుకుంటారు__క్లాసులో పాఠం చెపుతున్నప్పుడు పిల్లలు అల్లరిచేస్తే కోపం తెచ్చుకుని అందరినీ తిట్టేసి క్లాస్ కేన్సిల్ చేసేసి వెళ్ళిపోతారు. ఎలాగో ఒకలాగ ఆయనకు కోపం తెప్పించి క్లాస్ కేన్సిల్ చేయించుకోవటం విద్యార్ధుల కొక ఆట అయిపోయింది. ఇలా చీటికీ మాటికీ క్లాసులు కేన్సిల్ అవుతున్నందుకు బాధపడుతున్న విద్యార్ధులు లేకపోలేదు. కానీ, వాళ్ళగోడు వినిపించుకునే వాళ్లెవరు?