చెప్పలేక చెప్పలేక చెప్పింది శోభ.
మూర్తికి కొండెక్కినట్లయింది.
"ఓయస్! దేనిదేముందీ? దానికింతగా సంకోచించాలా? ప్రస్తుతం నా దగ్గిర పాతికుంది. తీసుకోండి. మిగిలిన డెబ్బయ్యయిదూ రేపు తెస్తాను. ఈ ఫస్టుకి కాకపోతే, పై ఫస్టుకి తీర్చవచ్చులెండి."
మూర్తి అందిస్తున్న పాతికా అందుకుంటూంటే శోభకు చేతులు వణికాయి. "అప్పేగా" అని తనను తను ఓదార్చుకుంది.
హృదయమంతా అన్న అనారోగ్యం నిండిపోగా ఆఫీస్ నుంచి వడివడిగా అడుగులేస్తూ ఇంటికి బయలుదేరింది. ఉమ పెళ్ళయినప్పటినుండీ ప్రభాకరం ఏలూరులోనే అద్దెఇంట్లో ఉంటున్నాడు. అంచేత శోభ నడుచుకుంటూనే వెళ్తూంది. దారిలో తనకు డాక్టర్ రావు కారు ఎదురవటం ఆమెకు తెలియనే తెలియదు. ఎంతో అలసటతో వడిలిపోయిన్న శోభ ముఖం చూడగానే రావు హృదయం జాలితో నిండిపోయింది. అతని హృదయంలో అంతకుముందు ఆవరించుకున్న మబ్బులన్నీ మాయమయి వారంరోజులుగా తనకు శోభ కనపడలేదన్న విషయం మాత్రమే మనసంతా ఆక్రమించుకొంది. అప్పటి శోభ మూర్తి అతనిలో ఆమె పట్ల నిండిన ప్రేమను ద్విగుణీకృతం చేసింది. కారు వెనక్కుతిప్పి వేగంగా శోభను సమీపించి బ్రేక్ వేశాడు. ఉలిక్కిపడిన శోభముఖం రావును చూడగానే వికసించింది. ఆ వికాసం రావు హృదయంలో ప్రతిఫలించింది.
"మనసు ఆందోళనగా ఉన్నప్పుడు ఆత్మీయులెవరైనా కనిపిస్తే ఎంతో శాంతిగా ఉంటుంది. మనసువిప్పి అన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది."
"రావుగారూ!" ఎంతో ఆప్యాయంగా పిలిచిన శోభ అంతటితో ఆగిపోయింది. ఏం చెప్పాలో తోచలేదు.
ఆమె స్వరంలో ఆప్యాయానికి కరిగిపోయాడు రావు.
"ఏం శోభా!"
"ఎంత మంచివారండీ! దేవుడిలాగా కనిపించారు. మీ చిరునవ్వుతో నా అశాంతి మంచులా విడిపోయింది."
రావు నవ్వాడు.
"అదృష్టవంతుణ్ని. కాని అసలు నీకు అశాంతి దేనికి?"
"మా అన్నయ్య...తరువాత చెప్తానండీ! ఇప్పుడు త్వరగా ఇంటికెళ్ళాలి."
"ఒక్కసారి మా ఇంటికిరావూ?"
"ఇప్పుడు రాలేను. వీలైనంత త్వరలో వస్తాను. క్షమించరూ!"
"క్షమించను."
"క్షమిస్తారు. వచ్చినా రాకపోయినా నా ప్రాణాలన్నీ మీ దగ్గరే ఉంటాయని మీకు తెలుసుగా?"
"అబద్ధాలు!"
"పోండి! నా మాటలు నమ్మకపోతే మీ జట్టు కచ్చి."
"ఆ! ఆ! నమ్ముతాను నా జట్టుండు." నవ్వుతూ చెయ్యందించాడు రావు.
"నడిరోడ్డుమీద ఏవిఁటిది?" అంటూనే అటు ఇటు చూసి మృదువుగా చెయ్యినొక్కి చిరునవ్వుతో వెళ్ళిపోయింది.
సంతోష మేఘాలమీద తేలిపోతూ రావు ఇంటికి చేరుకునేసరికి అతనికోసం ఎదురుచూస్తూ మూర్తి కాచుకుని ఉన్నాడు.
"హలో మూర్తీ! ఏం పనిమీదొచ్చావ్?"
"డబ్బుకోసం వచ్చానయ్యా! డెబ్భైఅయిదు రూపాయలు కావాలి. మళ్ళీ తీర్చే అప్పేలే!"
రావు చిరునవ్వుతో మూర్తికి డబ్బిచ్చి "ఎందుకీ డబ్బు? మీ ఆవిడకు మళ్ళీ వేవిళ్ళా?" అన్నాడు హాస్యంగా.
"మా ఆవిడకు వేవిళ్ళయితే కచ్చికలు తినమంటాను. అప్పులకెందుకు బయల్దేరతానూ? శోభ కోసం.."
మూర్తివంక తీక్షణంగా చూశాడు రావు.
"శోభ కోసమా?"
"అవును. వాళ్ళన్నయ్యకు జబ్బుగా ఉంది. డాక్టర్ శేఖర్ ను పిలిపించమంది. డాక్టర్ ఫీజులకూ, మందులకూ డబ్బులు లేవని వంద రూపాయలు అడిగింది. శోభ అడిగితే కాదనగలనా? ఉన్న పాతికా ఇచ్చి మిగిలింది అప్పు తీసికెళ్తున్నాను."
రావు ముఖం కఠినంగా మారిపోయింది. చేతిలో మనీపర్స్ కసిగా నలుపుతూ కూర్చున్నాడు. 'వెళ్ళొస్తా'నని మూర్తి చెప్పింది అతనికి వినిపించలేదు.
17
ప్రభాకరం జ్వరం రోజు రోజుకీ తీవ్రమౌతుందే కాని తగ్గటంలేదు. ఉమ వివాహ సందర్భంలో జరిగిన వంచన అతనికి వెన్నుపోటయింది. ఆ దెబ్బనుండి కోలుకోలేకపోతున్నాడు. మొత్తం ఇంటి బాధ్యతంతా శోభమీద పడింది. తలుచుకుంటే క్షణంలో ఆ బాధ్యత నుండి విముక్తురాలు కాగలదు శోభ. కాని అంత స్వార్ధపరురాలు కాలేకపోతూంది. అలవికాని బరువును మొయ్యలేక మోస్తుంది. అయినా ఆమెకు ఇంట్లోని వ్యక్తుల సానుభూతి లభించదు. ప్రభాకరం శోభను చూస్తూనే ముఖం తిప్పుకుంటాడు. ఎవరి ఆరోగ్యం కోసం తానింత శ్రమపడుతుందో ఆ అన్న తిరస్కారానికి శోభ హృదయం భగ్గుమంటుంది. కాని అన్న ధోరణి తనకు తెలుసు. "నీ సహాయం నాకక్కర్లేదు. నా ప్రాణాలు పోతే నాకు బాధలేదు." అన్నట్లుగా ఉంటుంది అన్నయ్య ధోరణి. కాని అన్నయ్య ప్రాణాలు తనకు కావాలి. తన అన్న మరణించడానికి వీల్లేదు. ఆర్థికంగా శోభ సహాయం పార్వతికి తెలుసు. కాని శోభ పట్ల పార్వతి హృదయంలో ఆత్మీయతాభావం లేదు. రాదు. శోభతో సవ్యంగానే మాట్లాడుతుంది. కాని అది తమకు మేలుచేస్తున్నవారికి కృతజ్ఞత చెప్పుకొంటున్నట్లుగా ఉంటుందేగాని ఆత్మీయులతో వ్యవహరిస్తున్నట్లు ఉండదు. కామాక్షమ్మ ఇటీవల ఎవరితోనూ మాట్లాడటం లేదు. శోభతో అసలు మాట్లాడదు. పలకరిస్తే ముక్తసరిగా సమాధానం చెపుతుంది.
పిల్లలందరిని శోభ క్రమశిక్షణలో ఉంచేది! అందుకని పిల్లలందరికీ శోభంటే భయమే! తమంత తాము శోభను సమీపించి మాట్లాడటానికెవరూ సాహసించరు. పదిమంది మధ్యా ఉంటూ కూడా ఒంటరిగా ఉన్నదానిలా అనుభూతి చెందసాగింది శోభ. ఆదరణ కోసం, ఆత్మీయత కోసం ఆమె మనసు అల్లాడిపోసాగింది. అన్నయ్య జబ్బుతో ఆర్థికమైన ఇబ్బందులతో వేగిపోతున్న ఈ సమయంలో ఆ అవసరం మరింత కనిపించింది. ప్రభాకరం జబ్బుతో పార్వతి ఎక్కువకాలం ప్రభాకరాన్ని కనిపెట్టుకుని ఉంటోంది. ఆఫీసు పనికి సాయం ఇంటిపనికూడా పైనబడింది శోభకు. రావుగారి నొక్కసారి చూడాలని మనసెంత తపించిపోతున్నా వీలు చిక్కటంలేదు. ఆ రోజులా రోడ్డుమీద కనిపిస్తారేమోనని వేయికళ్ళతో ఎదురుచూసేది. ఫలితం ఉండేదికాదు.