"అన్నింటికీ ఇలా పెడర్థాలు తీస్తే నేనేం చెప్పగలను? చంద్ర పట్ల నీ మనసులో ఉన్న దురభిప్రాయం పోగొట్టాలని.."
"ఆవిడ చాలా గొప్ప వ్యక్తి అని నేను నిరభ్యంతరముగా ఒప్పుకొంటున్నాను. నాలాంటి అల్పులు ఒకరిద్దరు ఏమనుకొంటే మాత్రం నష్టం ఏమిటి?"
తులసి మాటలలో వ్యంగ్యం సూర్యానికి అర్థమైంది. అయినా సహనంగా, "చంద్రకు నీమీద ఎంత అభిమానమో నువ్వు అర్థంచేసుకోలేక పోతున్నావు. చంద్రను అర్థంచేసుకోగలిగితే ఇలా లోక సామాన్యంగా అసహ్యించుకోవు" అన్నాడు.
మనసులో ఉవ్వెత్తున లేచిన జ్వాలలను అతి నిగ్రహం మీద అణచుకొంటూ తెచ్చిపెట్టుకున్న శాంతముతో సూర్యానికి నమస్కారం చేసి, "నా మనవి కాస్త చిత్తగించండి. చంద్రగారి మీద మీకు అభిమానము ఉంటే ఆవిడకు చీరలు కొనిపెట్టండి, నగలు బహూకరించండి. అంతేకాని నా దగ్గరకు వచ్చి, నా మనసు చికాకు పెట్టే అధికారము ఆవిడకిస్తాననటం అన్యాయము కదూ?" అంది ప్రతి అక్షరములో వ్యంగ్యాన్ని ధ్వనింపజేస్తూ.
ఈ దెబ్బకు తట్టుకోలేకపోయాడు సూర్యం. తన భావ సంచలనం నిగ్రహించుకుంటూ, కొంతసేపు ఏం మాట్లాడలేదు. ఆ మౌనానికి తులసి కొద్దిగా భయపడింది. కొంతసేపటికి శాంతంగా, "ఇంతకూ ఏమన్నాడు డాక్టర్?" అన్నాడు అతి మామూలుగా.
అతడలా ఫార్మల్ గా అడగటం తులసికి చాలా ఆశాభంగం కలిగించింది. మరికొంచెం సేపు వాదిస్తేనే బాగుండును అనిపించింది.
"నేను కన్సల్ట్ చేసిన డాక్టర్ నా జబ్బు డయాగ్నైజ్ చెయ్యలేకపోయాడు. రాయవెల్లూరు వెళ్ళమంటున్నాడు."
"అయితే ఆలస్యం చెయ్యకుండా వెంటనే వెళ్ళండి. ఇప్పటికే చాలా నెగ్లెట్ చేశారు."
"ఆ! ఇంత మాత్రము దానికి ఎక్కడికో రాయ వెల్లూరు వెళ్ళి వేలకొద్దీ డబ్బు తగలేసుకోవటం దేనికి? ఈ డాక్టర్ కి డయాగ్నైజ్ చెయ్యటం చేతకాదు. మరో మంచి డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే నయమవుతుందేమో!"
"వద్దు! వద్దు! అలా చెయ్యకండి. రాయవెల్లూరు వెళ్ళటానికి డబ్బు కావాలంటే నేనిస్తాను."
సూర్యం కంఠంలో ఆందోళన తులసికెంత బాగున్నా అతడు తను డబ్బు లేకనే రాయవెల్లూరు వెళ్ళలేకపోతున్నానని అర్థం చేసుకోవటం, ఏదో దానమిస్తున్నట్లుగా డబ్బు ఇస్తానని అనటం. అభిమానాన్ని గాయపరచింది. చంద్ర ప్రస్తావనతో ఉడికిపోతున్న మనసు ఎదురుదెబ్బ తీయటానికే సిద్ధపడింది. "థాంక్స్! కానీ, వాళ్ళ దగ్గరా, వీళ్ళ దగ్గరా బహుమానాలూ, దానాలూ పుచ్చుకునే జాతికాదు నాది."
నివ్వెరపోయి చూశాడు సూర్యం. అప్రయత్నంగా అతని చూపులు తులసి చేతివేలికున్న ఉంగరం మీద పడ్డాయి. అతని చూపుల ననుసరించి, తులసి కూడా ఉంగరాన్ని చూసుకుని గతుక్కుమంది.
"మనుష్యుల్ని 'జాతులు'గా పేర్చి భేధాలు చూపిస్తూ మాట్లాడటం నాకు చేతకాదు. ఒక స్నేహితుడిగా కష్టంలో ఉన్న మీకు సహాయం చేద్దామనుకున్నాను. అంతే! అంతగా అయితే అయితే మీరు నా దగ్గర అప్పుగానే తీసుకోవచ్చును. సరే మీ యిష్టం! మీ ఆరోగ్యం విషయం మీరు చూసుకోవాలి! వస్తాను."
సూర్యం వెళ్ళిపోయాడు. తులసి మనసు చాలా చికాకు పడింది. సూర్యం చూపించే అభిమానమూ, ఆప్యాయతలూ చాలా బాగున్నాయి కాని, చంద్ర చాలా మంచిదని తనను ఒప్పుకోమంటాడేమిటి? ఎప్పటికప్పుడు అన్ని విషయాలూ, ఒకరితో ఒకరు చెప్పుకొనేటంత ఆత్మీయులా వాళ్ళిద్దరూ? చంద్ర ఎంతో మంచిదని అంగీకరిస్తేకాని తన స్నేహం అక్కర్లేదా సూర్యానికి? చంద్రను పొగుడుతూ చంద్రతో సూర్యం సాన్నిహిత్యాన్ని హర్షిస్తూ, తాను సూర్యం స్నేహాన్ని అందుకోవాలా? ఛీ! ఛీ! తనను తను అంత హీనపరచుకోలేదు.
ఆ తరువాత తులసి మరొక 'మంచి' డాక్టర్ కి చూపించుకుంది. అలా చాలా చాలా మంచి మంచి డాక్టర్లకి చూపించుకుంది. అందరూ తలొక పదిరోజులూ తమకు తోచిన వైద్యాలన్నీ చేసి, ఆ తరువాత పెదవి విరిచారు. అప్పటికి తులసికి జ్వరము తగ్గింది కాని, కుడిచెయ్యి పూర్తిగా చచ్చుబడిపోయి, ఏ పని చెయ్యటానికి స్వాధీనం కాకుండా పోయింది. దగ్గర దగ్గర రెండు నెలలు సెలవులో గడిపింది. తనకు ఇంక ఏ విధమయిన సెలవూ లేదని తెలిసినా అప్పటికీ నెల రోజులు సెలవు ఇప్పించగలిగిన సూర్యాన్నే మరికాస్త సెలవు ఇప్పించమని అడగాలనుకొంది తులసి. చివరి క్షణం వరకూ సూర్యం తప్పక తనకు సహాయం చేస్తాడనే నమ్మింది... కానీ, సూర్యం తనను ఉద్యోగంలోంచి తీసేశాడు. అంతేకాదు, తన స్థానంలో చంద్రను వేసుకున్నాడు. తన కళ్ళముందే చంద్ర ఇంటిదగ్గర కారు దిగి చంద్ర ఇంట్లోకి వెళ్ళాడు. ఎలా ఈ అగ్నిని భరించటం?
14
తులసికి ఉద్యోగం పోయిన తరువాత తులసి పరిస్థితి ఇంట్లో అందరికీ చాలా ఆందోళన కలిగించింది.
"నీ దగ్గర పదిరూపాయలుంటే ఇయ్యి. ఈసారి బ్రాకెట్ లో నేను కట్టిన నంబర్లు వచ్చాయంటే, నిన్ను రాయవెల్లూరు తీసికెళ్ళి వైద్యం చేయిస్తాను. నీకు మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాను." అన్నాడు జగన్నాథం పంతులు చిరిగిపోయిన చెప్పులో మేకు కొట్టుకుంటూ.
"నువ్వు రాయవెల్లూరు వెళ్తే నేనూ వస్తానే! నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది. నేనూ నా గుండెనొప్పి చూపించుకోవచ్చును" అంది జానకి ఆశగా.
"ఆఁ! రాయవెల్లూరు వెళ్తేమాత్రం నయమవుతుందని ఏముంది? నిష్కారణంగా డబ్బు దండుగ!" అన్నాడు నెమ్మదిగా నీలకంఠం.