Previous Page Next Page 
అష్టావక్ర పేజి 26


    'రావే' ప్రోగ్రాం కోసం ఆ పల్లెకి వచ్చిన అమ్మాయిలు వాళ్ళు. కేదారగౌరి తరువాత బ్యాచ్ వాళ్ళు. కాలం ఎంత తొందరగా గడిచి పోతూందీ- అనుకుంది కేదారగౌరి వాళ్ళని చూసి, క్రితం సంవత్సరం తనూ ఇలాగే ఏ బాధ్యతా లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ వుండింది.

    గాలిలోంచి హఠాత్తుగా అతడి చేతిలో ప్రత్యక్షమయిన తెల్లకాగితాల్ని అమ్మాయిలూ విస్తుబోయి చూశారు. షాడో నవ్వుతూ మూడు కాగితాల్నీ ముగ్గురి చేతుల్లో పెట్టాడు. "మీ మనస్తత్వాన్ని కామరూపుడైన అదృశ్యప్రభువు నా ద్వారా చెప్పిస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యండి" అన్నాడు షాడో.

    మళ్ళీ ఏదో కొంప ముంచబోతున్నాడు అనుకుంది గౌరి అన్నయ్యను చూస్తూ. ఇదేమీ పట్టనట్టూ ముగ్గురమ్మాయిలూ చాలా హుషారుగా అతడివైపు చూశారు, ఏం చెయ్యాలన్నట్టు. ముగ్గురిలో ఎర్ర పరికిణీ కట్టుకున్న అమ్మాయికి మరీ ఆత్రంగా వుంది తన మనస్తత్వం ఏమిటో తెలుసుకోవాలన్నట్టు. ఆమెగాక మరో ఇద్దరు- తెల్లచీర అమ్మాయి, పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి.

    "మీకు స్పురించిన పక్షి గురించో ఒక జంతువు గురించో మీకు తోచిన మూడు విశేషణాలు వ్రాయండి" గంభీరంగా అన్నాడు షాడో. "విశేషణాలంటే ఆబ్జెక్టివ్స్" అని వివరించి చెప్పాడు.

    ముగ్గురమ్మాయిలూ క్షణం ఆలోచించి, తమ కాగితం మీద వ్రాశారు.

    షాడో తరువాత అన్నాడు- "ప్రస్తుత సాహిత్యం మీద మీ అభిప్రాయాలు మూడు వ్రాయండి".

    అమ్మాయిలు చకచకా వ్రాశారు.

    "ఇక ఆఖరు ప్రశ్న. చక్కటి కాఫీ మీద మీ అభిరుచి వ్రాయండి- మూడు వాక్యాల్లో".

    అదీ పూర్తిచేశారు. మిగతావాళ్ళంతా, వీళ్ళేం వ్రాశారా అని కుతూహలంతో తొంగిచూశారు.

    "ఫ్రెండ్స్! ఇప్పుడు అదృశ్య ప్రభువు మీ మనస్తత్వాన్ని గురించి చెపుతాడు" అంటూ గాలిలోకి చెయ్యి ఎత్తి "చెక్ షాడో" అన్నాడు- అతడి చేతిలో మరో మూడు కాగితాలు ప్రత్యక్షమయ్యాయి. అందులో సమాధానాలున్నాయి. వాటిని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఆత్రంగా చదివారు. 

    "మొదటిదాని గురించి మీరేం వ్రాశారో అది- మీ గురించి మీరేం అనుకుంటున్నారో- అది. రెండోది మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో- అది. మూడో దానికి మీరు వ్రాసింది- సెక్స్ మీద మీ అభిప్రాయం".

    తెల్లచీర అమ్మాయి సిగ్గుతో తను వ్రాసింది చదువుకుంది. అంతలో గదిలో మరో మూలనుంచి కెవ్వున కేకలూ, అల్లరీ వినిపించాయి. ఎర్రపరికిణీ కట్టుకున్న అమ్మాయి మొహం అంతకన్నా ఎర్రగా కందిపోయింది. ఆమె చేతిలోంచి కాగితం లాక్కోవటానికి స్నేహితురాండ్రు ప్రయత్నిస్తున్నారు. పంజాబీ డ్రస్సు వేసుకున్న అమ్మాయి అయితే ఎవరూ చదవకుండా కాగితం నలిపెయ్యటానికి ప్రయత్నిస్తూంది. కానీ ఆమె ప్రయత్నం నెరవేరలేదు.

    ఎప్పుడూ గాంభీర్యంగా వుండే కేదారగౌరి కూడా వాళ్ళు రాసింది చూసి నవ్వాపుకోలేకపోయింది.

    ఎర్ర పరికిణీ అమ్మాయి ఇలా వ్రాసింది.

    కాకి:

    1. ఎప్పుడూ కావుకావుమని అరుస్తుంది. 2. బొత్తిగా నిరర్ధకమైన జీవితం. 3. మున్సిపాలిటీ అంటే ఇష్టం.

    సాహిత్యం :

    1. శుద్ధ బేవార్సు 2. ఎందుకూ పనికిరాదు 3. కాలక్షేపానికి కూడా పనికిరాదు.

    కాఫీ :

    1. తల్చుకుంటేనే నోట్లో నీరూరుతుంది 2. వేడిమీద బావుంటుంది 3. చాలా ఇష్టం.

    ఆ గదిలో కలకలం చల్లారటానికి అయిదు నిముషాలు పట్టింది. అమ్మాయిలు ఒకళ్ళమీద ఒకళ్ళు జోకులేసుకున్నారు. నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు. కొందరి మొహాలు కందగడ్డలా మారినాయి. మొత్తం మీద అంతా గొడవ.

    "మిస్టర్ షాడో".

    చప్పున ఆ గదిలో గొడవ మంత్రించినట్టు ఆగిపోయింది. కుర్తా వేసుకున్న ఒక అమ్మాయి అతడి దగ్గిరకొచ్చి "మీ కభ్యంతరం లేకపోతే నేనూ ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను" అంది. "నా పేరు రంజిత.."

    "మాజిక్కా" అన్నాడు షాడో నమ్మలేనట్టు. గుండ్రమైన మొహం. పోకచెక్కలాంటి కోణార్క శిల్పంలాగానూ వుందా అమ్మాయి.

    రంజిత తన చేతిలో ఒక అర్ధరూపాయి నాణేన్ని తీసుకుని అరచేతిలో పెట్టుకుంది. గుప్పెట మూయలేదు. తెరిచే వుంది. మధ్యలో నాణెం మెరుస్తూంది. 

    "మిస్టర్ వైట్ షాడో... దీన్నే చూడండి. ఇదిగో ఇది మాయమైపోతూంది. మీ కళ్ళముందే... చూస్తూ వుండండి".

    అరచేతిలో అర్ధరూపాయి క్రమక్రమంగా అదృశ్యమైపోయింది.

    షాడో అప్రతిభుడయ్యాడు. ఎంతో అనుభవం వున్న ఆ మెజీషియన్ కూడా వేళ్ళు కదపకుండా ఆమె చేసిన ఆ చర్యకి- తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇది ట్రిక్ కాదు. నిశ్చయంగా ట్రిక్ కాదు. నాణెం కొద్ది కొద్దిగా... కొద్దిగా కరిగిపోవటం కళ్ళారా చూశాడు. మానవాతీత శక్తా?.... నిజమా! ని...జ....మా?

    అంతలో రంహిత కంఠం ప్రతిధ్వనించింది... "దీన్లో డాల్టన్ థియరీ ఏమీలేదు. ఈ విశాల విశ్వంలో ఎక్కడ వెతికినా మీకీ నాణెం కనపడదు. క్షుద్రాత్మలు తమలో దీన్ని ఐక్యం చేసుకున్నాయి".

    ఆమె కళ్ళు మూసుకునే అంటూంది.

    "మిస్టర్ వైట్ షాడో! ఇప్పటివరకూ మీరు చాలామందిని ఏడిపించారు. ఇప్పుడు నా కళ్ళముందే నా మిత్రురాళ్ళని దారుణంగా అవమానం చేశారు. దానికి ప్రతిగా నేను మీ మీద దేవతల సాయంతో చర్య తీసుకోబోతున్నాను. మీరు చేసింది నిజంగా తప్పే అయితే దేవతలు నాకు సాయం చేయుదురు గాక..."

    ఆమె పెదవులు కదులుతున్నాయి.

    కళ్ళు తెరచి అతడి మొహంలోకి సూటిగా చూస్తూ వుంది. ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి.

    "మిస్టర్ రవీ... చూసుకోండి. మీ నుంచి ఒక ముఖ్యమైన అవయవం శాశ్వతంగా మాయమైపోయింది" అంది.

    షాడో తెల్లబోయి చూశాడు.

    అమ్మాయిలు ముసిముసిగా నవ్వుతున్నారు.

    రంజిత మాత్రం సీరియస్ గా వుంది.

    అప్రయత్నంగా అతడి దృష్టి ఎదుటి అద్దంమీద పడింది. కళ్ళు... ముక్కు... చెవి.... అన్నీ సరిగానే వున్నాయి. మామూలు పరిస్థితుల్లో అయితే అతడు నమ్మకపోవునేమోగానీ- కళ్ళముందే ఆమె అరచేతిలో నాణెం మాయమవటం చూసాడాయె...! అంగం మాయమైనా అవకపోయినా, ఇంతమంది ముందు కలిగిన- కలుగుతున్న ఇబ్బంది.

    తనింతకాలం అమ్మాయిలని చాలా ఇరుకున పెట్టే మ్యాజిక్ లు చేసేవాడు. అదే పరిస్థితి తనకి వస్తే ఇంత ఇబ్బందిగా వుంటుందన్నమాట!

    రంజిత చూపు తన చేతిమీద పడటం చూసి, చప్పున చేతిని ఎత్తి చూసుకున్నాడు.

    కుడిచేతి చూపుడువేలు లేదు!

    మెజీషియన్ కి ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైంది- కుడిచేతి చూపుడువేలే! అతడు కంగారుగా తడిమి చూసుకున్నాడు.

    లేదు.

    ఇంకేం జరిగినా అతడు అంత కంగారు పడేవాడు కాదేమో కానీ, తన మెజీషియన్ జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేస్తూన్న ఈ పరిణామం అతడిని నిలువెల్లా కదిలించింది.

    అప్పటివరకూ అతడినే గమనిస్తూన్న కేదారగౌరి చప్పున అతడి దగ్గిరకొచ్చి "ఏమయిందిరా" అని అడిగింది. అతడు మాట్లాడకుండా చెయ్యి పైకెత్తాడు.

    "ఏం ఏమయింది?" తిరిగి అర్ధం కానట్టు అడిగింది.

    "నా..నా చూపుడువేలు".

    "దానికేం బాగానే వుందిగా?"

    అతడు రంజిత వైపు చూశాడు. అప్పటివరకూ సీరియస్ నెస్ నటిస్తూన్న ఆ అమ్మాయి సన్నగా నవ్వింది. అతడి దృష్టి తిరిగి చేతిమీద పడింది.

    చూపుడువేలు మళ్ళీ కనపడుతూంది.


                                             *    *    *    *


    "కానీ నా కళ్ళముందే నా చూపుడువేలు ఎలా మాయమైపోయిందో అర్ధంకావటం లేదు".

    "ఒకమ్మాయి నుదుట 'కాయిన్' కొట్టి మాయం చేసినప్పుడూ ఆ అమ్మాయి ఇలాగే కంగారుపడి వుంటుంది".

    "ఆ అమ్మాయి మీకు తెలుసా?"

    "మా పెద్దనాన్నగారి కూతురు. పాపం చాలాకాలం వరకూ ఆ అవమానం నుంచి తేరుకోలేకపోయింది".

    "సారీ. అంత హర్ట్ అవుతుందనుకోలేదా అమ్మాయి".

    "మ్యాజిక్ మంచిదే. కానీ అది వచ్చుగదా అని అవతలివాళ్ళని హర్ట్ చేయకూడదు. మనం చేసినదాన్ని అవతలివాళ్ళు తెల్లమొహం వేసుకుని చూస్తూంటే నవ్వకూడదు".

    "చెప్పండి. నా వేలు ఎలా మాయమైంది?"

    రంజిత నవ్వుతూ తన వాచీ చూపిస్తూ "ఇదీ కారణం" అంది. షాడో విస్తుబోయాడు. "ఏమిటిది?"

    "మామూలు వాచీయే కానీ కావలసినప్పుడు మోనోటోన్ లో ఆడియబుల్ వైబ్రేషన్స్ ఇస్తుంది. దాదాపు రెండు అడుగుల దూరంవరకూ ఆ పరిధిలో వున్న వాళ్ళని, మన కంఠపు భ్రాంతిలోకి దింపుతుంది.

    "మైగాడ్!"

    "తెలిసే వరకూ అద్భుతం. తెలిస్తే ట్రిక్కు".

    ఇంకా రాలేదు. మా తాతయ్యగారు కనుక్కున్నారు దీన్ని. ఆయనకి దాదాపు ఎనభై ఏళ్ళుంటాయి. ప్రముఖ హిప్నాటిస్టు".

    "ఎవరు- పేరు?"

    "జయదేవ్. ప్రొఫెసర్ జయదేవ్".

    "మైగాడ్! జయదేవ్ మనవరాలా మీరు?"

    "ఆయన అన్నయ్య కూతురు కూతుర్ని".

    "మీరు అగ్రికల్చర్ బియస్సీ చదవటం- ఇలా మా పల్లెకి రావటం మా అదృష్టం".

    "ఎందుకో".

    "ఎందుకంటే... అదే... ఐమీన్...ఇలా మనం కలిసే వీలు... అదే....మీరీ ఊరికి రాకపోయి వుంటే ఇలాటి పరికరం మ్యాజిక్ సర్కిల్ లోకి వస్తున్న సంగతి ముందుగా నాకు తెలిసే అవకాశం వుండేది కాదు కదా".

    "దీన్ని మార్కెట్ లోకి విడుదల చేసి డబ్బు చేసుకోవాలన్న కోర్కె ఆయనకెప్పుడూ లేదు. మనిషి మంచి మనుగడకే తన ఎనభైఏళ్ళ జీవితాన్ని పరిశోధనల్లో వెచ్చించాడు".

    "అవును. ఆయన గురించి చదివాను".

    ఆమె కొనసాగించింది. "చిన్నప్పుడు నేను చాలా డల్ గా వుండేదాన్నట. నన్ను దాదాపు ఏకసంధాగ్రాహిని చేశాడు ఆయన".

    "మైగాడ్! మీరు ఏకసంధాగ్రాహా?"

    "అనుకుంటున్నాను. ఏం?"

    "పడవ, కాకి, షాడో, ఈగ, పెన్ను, నేను, అతడు, ఆమె, నిన్ను, కోపం, దాహం, గాఢంగా, అంటార్కిటికా, ఇస్తున్నాను, ప్రేమిస్తున్నాను. ఇదే వరుసలో చెప్పండి చూద్దాం".

 Previous Page Next Page