పుట్టన్న మూడో ఫోటో చూపిస్తూ రంగప్రసాద్ తో
"సిరేనోమెలన్ అవస్థలో అవయవాలు కుదించుకు
పోయిన బేబీ. ఈమె తల్లినే ఎవరో హత్యచేశారు. దాన్ని
మీరే పోస్ట్ మార్టమ్ చేశారు. తల్లిని ఎందుకు చంపారో తెలీదు".
"స్టిల్ బార్న్ ఫిటస్. పుట్టుకతోనే
కృష్ణాపురం ప్రజలు భయభ్రాంతులై తమ
ఊరికి ఏదో శని పుట్టిందని భావించటం
మొదలుపెట్టారు. జనంలో భయాందోళనలు
ప్రారంభమయ్యాయి. గ్రామ దేవతలకి
పూజలు, బలులు ఇవ్వటం మొదలుపెట్టారు.
"ఈ శిశువు జననంతో దేశం దృష్టి మొత్తం ఈ గ్రామం మీద
పడింది. సైన్సు ఇండియా మాగజైన్ ఈ ఫోటోని ప్రముఖంగా
ప్రచురించింది. ఫేర్సికల్ ఫిషర్స్. హెర్ విప్ ముక్కు రంధ్రాల్లోకి
వెళ్ళిపోయింది. పుట్టిన కొంచెం సేపు వరకూ శిశువు బ్రతికేవుందని,
మరణిస్తూ కూడా తన వైపు చూసి నవ్విందని మంత్రసాని ఒక
ఇంటర్వ్యూలో తెలిపింది. దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ మాక్రోస్టోమియా".
"ఈ శిశువు జననంతో మొత్తం ప్రపంచం దిగ్భ్రమ చెందింది.
అవతార్ బాబాని కాదన్న దంపతులకి కలిగిన శిశువు ఇది. డబుల్ రెటీనా,
ఐరిన్, ప్యూపిల్ దీ అంశాలు. ఈ శిశువుకి కళ్ళు లేవు. అక్కడ చర్మం
మూసుకు పోయింది. ముక్కు వుండవలసిన చోట చిన్న
రంద్రమయింది. నోట్లో పన్నెండు పళ్ళున్నాయి. శిశువు పుట్టిన రెండు
రోజులవరకూ బ్రతికే వుంది! జనం తండోప తండాలుగా వచ్చారు" అంటూ
కాగితం పక్కనపెట్టి, తిరిగి చెప్పటం ప్రారంభించాడు.
"ఈ పుట్టిన పిల్లలందరి తల్లులూ కూలీనాలీ చేసుకునే జనమే! వారి జీవితంలో ఒకసారైనా ఎక్స్-రే మిషిన్ ఎలా వుంటుందో కూడా చూసి వుండరీ జనం. భారతదేశపు బీద పల్లెటూళ్ళో కనీస వైద్యవసరాలే లభించవు. అటువంటిది ఎక్స్-రే వైద్యం వారికెక్కడ లభిస్తుంది... కానీ మిగతా గ్రామాలు వేరు, కృష్ణాపురం వేరు. ఇక్కడ ప్రజలకి ఉచితంగా వైద్యం చేసే కరుణామయుడైన డాక్టరు వున్నాడు. మామూలు జనాల దగ్గిరనుంచి పైసా కూడా తీసుకోకుండా డెలివరీ కేసు దగ్గిరనుంచి ఎక్స్-రే వరకూ చేస్తాడు...."
వింటూన్న రంగప్రసాద్ మొహం జేవురించింది. ప్రొఫెసర్ పుట్టన్న ఎటునుంచి ఎటు లింకు కలుపుతున్నాడో అర్ధమయి వళ్ళు జలదరించింది. అదేమీ పట్టనట్టు పుట్టన్న చెప్పుకుపోతున్నాడు.
"...తన దగ్గిరకు వచ్చిన గర్భిణీ స్త్రీల మీద డాక్టర్ రంగప్రసాద్ పొరపాటున ఎక్స్-రే మిషన్ ఉపయోగించి-"
"ఆపండీ!" గోడలు కదిలేలా అరిచాడు. "ఇది అన్యాయం!"
"అబ్బెబ్బె, ఇందులో మీ తప్పుందని నేను అనటం లేదు. ఒక డాక్టరుగా మీరు మీ బాధ్యతనిర్వర్తించారు. కానీ తెలిసీ తెలియనితనం వల్ల-"
"ఇడియాటిక్..." అన్నాడు మళ్లీ అదే గొంతుతో రంగప్రసాద్. "...తెలిసీ తెలియనితనం నాది కాదు. మీది! గర్భిణీ స్త్రీల మీద ప్రయోగించే ఎక్స్-రేకీ అంతకు ముందెప్పుడో ఆమెలో చేరిన వీర్య కణాల్లో మ్యుటేషన్స్ కీ సంబంధం ఏమిటి? మీ మీద పరువు నష్టం దావావేస్తాను" ఆవేశంతో అతడి కంఠం వణికింది.
పుట్టన్నలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. "మీరు నన్ను అర్ధం చేసుకోవటం లేదు డాక్టర్ రంగప్రసాద్!" అన్నాడు. "...అమెరికాలో ఎవరికీ మీ గురించి గానీ, మీ పేరు గానీ తెలియదు. కేవలం మీ పేరు వాడుకుంటున్నానంతే" ప్రొఫెసర్ మాటల్లో నేను మంచివాణ్ని కాబట్టి మీకీ విషయం ముందు చెప్పాను. లేకపోతే మీకు ఎలా తెలిసి వుండేది? అన్న అర్ధం ధ్వనించింది. అతని మాటలు పట్టించుకోకుండా రంగప్రసాద్- అతడు పడేసిన రిసెర్చి కాగితాలను తీసుకుని అందులోని ఫోటోల్ని తేరిపార చూస్తూ, "ఈ ఆరు ఫోటోలూ మీ కెక్కడివి?" అని అడిగాడు. "ఎందుకంటే మొదటి మూడు మృత శిశువుల ఫోటోలు మాకే దొరకలేదు".
రంగప్రసాద్ అంత తాపీగా మాట్లాడటంతో పుట్టన్నకి ధైర్యం వచ్చింది. ముందుకు వంగి రహస్యం చెబుతున్నట్టు అన్నాడు. అసలు శిశువులకీ- ఈ ఫోటోలకీ సంబంధం లేదు. కేవలం అమెరికాలో, వాళ్ళకి చూపించడానికే వీటిని తీసుకువెళుతున్నాను" అంటూ నవ్వి, కుర్చీ దగ్గిరకి లాక్కొని- నచ్చచెపుతున్నట్టు అన్నాడు. "మీరీ విషయాన్ని వప్పుకోండి. మీకు వచ్చిన నష్టం ఏముంది? అమెరికాలో ఎక్కడో నేనేదోచెప్తే- ఇక్కడ మీకేమీ అవదుకదా. పోతే మీ ఋణంకూడా వుంచుకోను".
రంగప్రసాద్ కూడా అంత తాపీగానే, "ఇప్పటికే మనమీద విదేశీయులకి చాలా తేలికైన అభిప్రాయం వుంది మిస్టర్ పుట్టన్నా. మీలాటి వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేస్తున్నారు. మీరు చెప్పిందంతా వాళ్ళు గుడ్డిగా నమ్ముతారని ఎందుకు అనుకుంటున్నారు?" అన్నాడు.
"ఎందుకు నమ్మరు?"
"మీరు జెనెటిక్స్ ప్రొఫెసర్ ఎలా అయ్యారో నాకు అర్ధం కావటంలేదు. మీరు చూపించిన ఫోటోలూ, మీరు చెప్పిన థియరీ, అంతా ఎకన్ డ్రోప్లాస్టిక్ డ్వార్ఫ్స్ కి సంబంధించింది. ఇటువంటి కేసుల్లో 4x10 టు ది పవర్ ఆఫ్ మైనస్ 5 అని, జెనెటిక్స్ లో 'అ ఆ'లు చదువుకున్న వాడెవడైనా చెపుతాడు. కృష్ణాపురంలో అటువంటి జననాలు 6 అయ్యాయీ అంటే దాదాపు 1,50,000 మంది గర్భవతులు కావాలన్న మాట. మీరు అమెరికాలో ఏం చెబుతారు? డాక్టర్ రంగప్రసాద్ ఇంతమంది స్త్రీలమీద ఎక్స్-రే మిషిన్ ఉపయోగించారని చెపుతారా? భారతదేశపు ప్రతీ పల్లెలోనూ కోటిమంది జనాభా వుంటారనీ, అందులో ప్రతీ ఏడూ 1,50,000 మంది గర్భవతులవుతారనీ, అందరికీ డాక్టర్ రంగప్రసాద్ ఒకడే డాక్టరనీ చెబుతారా?"
ప్రొఫెసర్ పుట్టన్న అప్రతిభుడయ్యాడు. చాలా సామాన్యంగా కనిపించే ఈ డాక్టర్ తనకు తెలియని జన్యుశాస్త్రం గురించి కూడా ఇంత 'మామూలు' గా చెప్పటం!!
"డాక్టర్ రంగప్రసాద్!" అన్నాడు. "మీరు నిజంగా ఎంతో తెలివైనవారు. మామూలు డాక్టరై వుండీ మీకు జెనెటిక్స్ ఇంత తెలిసి వుండటం మీకే గర్వకారణం. మీకు గౌరవపట్టా ఇప్పిస్తాను".
"దానికి ప్రతిఫలంగా, ఈ ఆరుగురు తల్లులకీ నేను రేడియేషన్ ఇచ్చినట్టు వప్పుకోవాలి. అంతేగా?"
పుట్టన్న మాట్లాడలేదు.
రంగప్రసాద్ లేస్తూ అన్నాడు- "మీరు అమెరికా బయల్దేరిన మరుక్షణం మన రాయబారితో మాట్లాడతాను. మీ ఉపన్యాసం రికార్డు అయ్యేలా చూస్తాను. ఒక అబద్ధాన్ని ఎంత అందంగా, సత్యంగా మీరు చూపించి, మన దేశీయుల పరువు ప్రతిష్టల్ని విదేశీయుల దగ్గర మంటగలుపు తున్నారో నిరూపిస్తాను. మీరు తిరిగి వచ్చేసరికి సెక్షన్ 420 క్రింద మిమ్మల్ని అరెస్టు చేయడానికి వారెంటు సిద్ధం చేయించి వుంచుతా" అతడి గొంతు గంభీరంగా పలికింది.
పుట్టన్న కాలితో కుర్చీని బలంగా ముందుకు తోస్తూ "అంతేనా?" అన్నాడు.
"నిశ్చయంగా అంతే".
"చూస్తాను! ఈ పుట్టుకలన్నిటికీ మూలకారణం మీరేనని నిరూపించకపోతే నా పేరు పుట్టన్నే కాదు" అంటూ ఆ ముసలి ప్రొఫెసరు వడివడిగా అక్కడినుంచి బయటకు వచ్చేశాడు. మెట్లు దిగి కౄరంగా, అసహ్యమైన దృక్కులతో ఆ ఇంటివైపు తిరిగి చూశాడు.
అతడి మనోపథం ముందు ఒక దృశ్యం కదలాడింది.
వేల వేల మంది- వెల్లువలా ఆ ఇంటిమీద విరుచుకుపడుతున్నారు. రంగప్రసాద్ ని బయటకు ఈడ్చుకొచ్చారు. అతడి బట్టలు పేలికల్లా వేలాడుతున్నాయి. శరీరం రక్తం కారుతూంది. రెచ్చిపోయిన ప్రజలు అతడిని ఖండ ఖండాలుగా నరికి పోగులు పెడుతున్నారు.
పుట్టన్న పెదాలమీద శాడిస్టిక్ గా నవ్వు కదలాడింది.
తల వూపుకుంటూ అక్కడినుంచి కదిలేడు.
ప్రజలని ఉసిగొల్పి రెచ్చగొట్టగలిగేవాడు ఆ ఊరిలో ఒక్కడే వున్నాడు!
అవును. అతడి సాయం తీసుకోవాలి! తాను సమర్పించే "పూజా ద్రవ్యాల" కి అతడు తప్పక ఈ పని చేసి పెడతాడు. ఆ తర్వాత అమెరికాలో తన 'థియరీ' ని కాదనే వాడు ఎవడూ వుండడు. మరోవైపు తన పగా చల్లారుతుంది. ప్రజలచేత ఈ పని చేయించగలిగేవాడూ... ప్రజల్ని రెచ్చగొట్టగలిగేవాడూ- ఒకడే-
అవతార్ బాబా!!!!
* * * *
"చెక్... షాడో".
అతడి చేతిలో మూడు తెల్లకాగితాలు ప్రత్యక్షమయినయ్. అమ్మాయిలు అతడివైపు ఆసక్తిగా చూస్తున్నారు.