అందుకే ఆమె ఆ క్షణం బేలగా అన్న మోకాలిమీద తల ఆన్చి కళ్ళు మూసుకుని అంది- "నాకెందుకో ఈ మధ్య భయంగా వుంటోందిరా అన్నయ్యా. ఏదో అవుతుంది అనికాదు. కానీ ఎందుకో..."
"ఛా. అటువంటిదేమీ లేదు" అన్నాడు రవి. "నువ్వు ఇలాటి అనవసరమైన ఆలోచన్లు ఏమీ పెట్టుకోకు".
"కానీ ఆ అవతార్ బాబా మహత్యం రోజురోజుకీ పాకిపోతూంది. ఒక మూగవాడికి మాటలు వచ్చినాయట. ఒక గూనివాడికి చెయ్యి విసరగానే గూని పోయిందట".
"అదేదో నేను చూస్తాను" అన్నాడు రవి. తన చెల్లికి జరిగినదానికి అతడు అంతకు అంతా తీర్చుకోవటానికి ఆ క్షణమే నిర్ణయించుకొన్నాడు.
అతడేదో అనబోతూవుంటే రాకేష్ గాలిలా అక్కడికి వచ్చాడు. అతడు వగరుస్తున్నాడు. ఆయాసంతో రొప్పుతూ "నా తాయెత్తు" అన్నాడు.
రవి అతడిని మరింత ఏడిపించబోయాడు కానీ, గౌరి వారించి ప్రక్కనున్న తాయెత్తు తీసి అందించింది.
రవి నవ్వుతూ, "అంత వగరుస్తూ వచ్చింది దానికోసమా బావా? లేక ఇది ఏమైపోయిందో అనా" అంటూ జేబులోంచి చెక్కుతీసి ఇచ్చాడు.
వికసించిన మొహంతో దాన్నికూడా అందుకుంటూ, "నిజంగా యూ ఆర్ గ్రేట్, షాడో" అన్నాడు. షాడో సమాధానం చెప్పలేదు.
"వెళ్ళొస్తాను" అని చెప్పి అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు రాకేష్. రవి అతడు వెళ్లినవైపే చూస్తూ వుండిపోయాడు. పోయిన రెండు లక్షల చెక్కు దొరికినప్పుడుకన్నా, తాయెత్తు తిరిగి వచ్చినప్పుడు అతడి మొహంలో ఎందుకు ఎక్కువ ఆనందం కనిపించింది?
రవికి తన పత్రికాఫీసు లైబ్రరీలో ఎప్పుడో చాలాకాలం క్రితం చదివిన పుస్తకం గుర్తొచ్చింది. "మాజిక్ ఆఫ్ ఆత్కల్ట్" అన్న పుస్తకం అది.
నిష్టలో వున్న మంత్రగాడు పున్నమినాడు రక్షాబంధనంలో వుండాలి- అన్నది. కానీ అంతలో తన ఆలోచనకి తానే నవ్వుకున్నాడు. రాకేష్ మంత్రగాడేమిటి! పెద్దవాడవుతున్నకొద్దీ తనకన్నీ వికృతమైన ఆలోచన లొస్తున్నాయి.
* * * *
ఇది జరిగిన ఆరుగంటల తరువాత..
శ్మశానంలో హోమం ప్రారంభమయింది.
హోమం ముందు రాకేష్ కూర్చొని వున్నాడు.
జరిగే తంతును మహాదష్ట ప్రేక్షకుడిలా ఏమీ కల్పించుకోకుండా చూస్తున్నాడు.
దూరంగా ఒక ఇరవై మంది ఉస్సోక్ సభ్యులు మౌనంగా దీన్నంతా గమనిస్తున్నారు.
అగ్నిలో ఆఖరి రక్తార్భం వేయగానే మంటలు పైకి లేచాయి. ఆ క్షణం మహాదష్ట మొహంకన్నా రాకేష్ మొహమే క్రూరంగా వుంది. వికృతంగా వుంది.
అతడు క్షుదక్ష చేస్తున్నంతసేపూ స్థబ్దంగా వున్న వాతావరణం మొదటిరోజు పూజ పూర్తి అయినట్టు అతడు లేచి నించోగానే విజృంభించింది. గాలి రివ్వున వీచింది. ఆకులు కదిలాయి. ప్రకృతి క్షణాల్లో మారిపోయింది.
సరీగ్గా అదే సమయానికీ కేదారగౌరికి ఏదో కదిలినట్టయి మెలకువ వచ్చి చుట్టూ చూసింది. ఆమెకి నవ్వొచ్చింది. కదిలింది తన కడుపులో శిశువే. మొట్టమొదటి సారి జరిగిన ఈ అనుభవం ఆమెకి చాలా గమ్మత్తుగా అనిపించింది. తల తిప్పి భర్తవంక చూసింది. గాఢనిద్రలో వున్నాడతడు. ముక్కు వింధ్య, ఛాతీ హిమాలయం, గంగ నడుములా అనిపించింది. పక్కకి జరిగి, అతడికి మెలకువ రాకుండా ముద్దు పెట్టుకుంది.
లోపల మళ్ళీ కదలిక. ఈసారి కాస్త బలంగా.
అదే సమయానికి అక్కడ ఉస్సోక్ సభ్యులు ఒక్కొక్కరే హోమంలో స్వరక్త తర్పణం చేస్తున్నారు.
ఇక్కడ కడుపులో శిశువు జీవం పుంజుకుంటున్నట్టు కొద్దికొద్దిగా కదులుతున్నాడు.
కేదారగౌరి మాత్రం అనుకున్నది- "ఎందుకురా కన్నా అప్పుడే నీకింత అసూయ? బయటకొచ్చాక మా ఇద్దరి ప్రేమా నీకేగా!"
లోపల శిశువు వినకుండా అల్లరి చేస్తున్నాడు.
ఆమె భర్తవైపు చూసింది. తను సగం- అతడు సగం- సగం కలిసిన నిండుతనం.
శాస్త్రీయంగా ఆలోచిస్తే ఇరవై మూడు తను- ఇరవై మూడు అతను కలిసిన పూర్ణత్వం.
ఎవరి పోలికలు వస్తాయి? తనవా?ఆయనవా? ఆయనలాగే దేముణ్ణి నమ్ముతాడా? తనలాగే కారణం అన్వేషిస్తాడా?
అక్కడ చివర రక్త బిందువుని మహాదష్ట హోమంలో వదిలి రాకేష్ యజ్ఞ పురుషుడు అయినట్టు ప్రకటించాడు.
ఇక్కడ లోపల బలమైన కదలిక. పిల్లవాడి అల్లరి నిద్ర పట్టనీయటంలేదు. తండ్రి పోలికలు వస్తున్నాయేమో- దేముడి పేరు చెబితే వూరుకుంటాడేమో అనుకుంది. మరీ ఏమిటి చిన్నపిల్లలా అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకుంటూ, కడుపు మీద చెయ్యి తీసివెయ్యబోయింది.
అంతలో, ప్రపంచంలో శక్తినంతా పుంజుకుని తిరగబడినట్టు లోపల ఏదో కదలిక. నొప్పికి ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగినాయ్. "ఊరు కోరా బాబూ. ఊరుకో" అన్నట్టుగా లాలించి జోకొడ్తూ తనలో తనే అనుకుంది.
"రామాలాలీ....మేఘశ్యామాలాలీ...
తామరస న...య....న....
దశరథ తనయ... లాలీ"
ఆ దేవ స్మరణాన్నే వినటం ఇష్టం లేనట్టు లోపల ఒక్కసారిగా శిశువు విపరీతంగా గింజుకున్నాడు. ఆమె విలవిల లాడిపోయింది. నరాలు తోడేస్తూన్న బాధ పళ్ళ మధ్య బాధని అదిమిపట్టి ఆమె పాడుకుంటూంది.
"రా....మా....లా...లీ...
మేఘ....శ్యామా....లాలీ"
ఆమెకి స్పృహ తప్పింది.
18
"కృష్ణాపురంలో వికృత శిశువుల పుట్టుకకి వెనుక వున్న జెనెటిక్ కారణాన్ని నేను కనుక్కున్నాను" అన్నాడు ప్రొఫెసర్ పుట్టన్న. రంగప్రసాద్ మాట్లాడకుండా అతనివైపు చూశాడు. ఆ ఊళ్ళో చదువుకున్నవాళ్ళు అతి కొద్దిమంది అవటంవల్ల పుట్టన్నకి తన రిసెర్చి గురించి మాట్లాడటానికి రంగప్రసాద్ లాంటి నమ్మకస్తుడు ఒక్కడే దొరికాడు.
"ఈ వింత జననానికి కారణం 'మ్యుటేషన్స్'. ఇది రెండు రకాలు. పాయింట్ మ్యుటేషన్స్, క్రోమోజోమల్ మార్పులు".
"నాకు సరీగ్గా అర్ధంకావటం లేదు".
ప్రొఫెసర్ పుట్టన్న, రంగప్రసాద్ ని చిన్నపిల్లాడిని చూసినట్టు చూశాడు. అసలింత చిన్నవాడి దగ్గిర తన రిసెర్చి చెప్పవలసి రావటం తన దురదృష్టమన్నట్టుగా చూపు సారిస్తూ చెప్పసాగాడు.
"కృష్ణాపురానికి పదిహేను మైళ్ళ దూరంలోనున్న ఫ్యాక్టరీనుంచి వచ్చే చెడునీరు వాగులో కలిసి ఇటువైపు ప్రవహిస్తూంది. ఈ నీటిలో వున్న ట్రిమెధిల్ క్సానధైన్ ఈ విపరీతాలకి కారణం".
"మీరు చెప్పిన వాగు కేవలం కృష్ణాపురానికే పారటంలేదు. దాదాపు రెండు వందల మైళ్లు ప్రవహిస్తూంది. మరి ఆ నీళ్ళు తాగిన వాళ్ళందరికీ మీరు చెప్పినట్టు వికృత శిశువులు జన్మించాలి కదా?"
చాలా మామూలుగా వింటున్నట్టు విని, అతడా ప్రశ్న వేసేసరికి పుట్టన్న ఖంగుతిన్నాడు. అయినా వెంటనే సర్దుకుంటూ "అందుకే అన్నాను- జీన్ ఫ్లో కూడా తీసుకోవాలని. ఉదాహరణకి ఒక చోటునుంచి రేడియో ఆక్టివ్ కిరణాలు వెదజల్లబడుతున్నాయని అనుకోండి. దాని ప్రభావం అందరిమీదా వుండదు. బలహీనులు ముందు నష్టపోతారు".
"అయితే అటువంటి బలహీనులందరూ కేవలం కృష్ణాపురంలోనే వున్నారంటారు!"
ప్రొఫెసర్ పుట్టన్న ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఎదుటి మనిషిని తనకున్న పరిజ్ఞానంతో చిత్తు చేయటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. "మీకు సరీగ్గా అర్ధం అవదని మామూలు భాషలో చెప్పాను. నేను అమెరికాలో చదవబోయే ఉపన్యాసం తాలూకు అసలు విషయాన్ని వివరిస్తాను వినండి. పదాలు కష్టమైనా అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించండి" అంటూ పేపర్లు తీసేడు.
కృష్ణాపురంలో ఇప్పటివరకూ పుట్టిన ఆరుగురు మృతశిశువుల ఫోటోలు...
"కృష్ణాపురంలో పుట్టిన
మొట్టమొదటి వింత శిశువు.
సైక్లోప్స్- కళ్ళు లేకపోవటం.
ముక్కు వుండవలసిన చోట
ముధ్ర ముండటం. మృత శిశువు-"
"రెండో శిశువు- సైక్లోప్స్
హైపోగ్నాతస్. నోరు గెడ్డం క్రింద
చిన్న రంధ్రంగా వుంటుంది".