"లే....దు...." నావృత్తిలో ప్రేమకు తావులేదని తెలుసుకున్నాను"
"చక్రీ....స్త్రీ తన హృదయంలో ఒక్కరికే చోటిస్తుంది.
"ప్రియా....నేనెలాంటి పరిస్థితిలో ఈ మాట అంటున్నానో నీకు తెలియదు"
"ఇంకా ఏం తెలియాలి చక్రీ....మీలో పిరికితనం తప్ప ధైర్యం లేదని తెలిసిపోయింది.
ప్రేమకు కావలసింది తెగింపు....అది నీలో పుష్కలంగా వుందని నాకు తెలుసు....అయినా మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్ధంకావడంలేదు...." శ్రీప్రియ ఆవేదనతో చెప్పింది.
"నువ్వు ఎలాగయినా అనుకో ప్రియా....నీతో వాదించే సమయం ఇదికాదు. నీకు నాకు ఇకనుంచి ఏ సంబంధమూ లేదు....వుండదు....అనవసర ప్రయత్నాలు చేసి కోరికోరి....ప్రాణాలతో చెలగాటమాడుకోవద్దు...." నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు చక్రవర్తి.
"చక్రీ....దయచేసి అంతమాట అనకు....నాకు మీరు కావాలి....మీమీద ప్రేమతోనే జీవించాలనుకుంటున్నదానిని....మీరే లేనప్పుడు ఇంకా నేనెందుకు బ్రతకాలి...." చావో బ్రతుకో మీతోనే పంచుకోవాలనుకుంటున్నాను....
"అది నీ ఖర్మ...."
"నిజమే చక్రీ....మీ నిర్ణయం వలన నా జీవితం ఏమవుతుందో తెలుసా?"
"నీ జీవితాన్ని నాశనం చేసుకోమని నేనుచెప్పలేదు. నాతో ప్రేమను పెంచుకోవద్దని ముందునుంచి నేను చెబుతూనే వున్నాను అయినా నువ్వే వినలేదు...."
"చక్రీ మీ నిర్ణయం అదే అయినప్పుడు బలవంతపెట్టి నేను సాధించేదేమీ వుండదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమిస్తున్నాను. మొదటినుంచి అమ్మానాన్నలు లేని నేను అనాధగా ఎన్నోకష్టాలు ఎదుర్కొంటూ బ్రతికాను. ఇప్పుడు నేను వంటరి దానిని మాత్రమే కాదు.
"రక్షణ కరువయిన అందమయిన ఆడపిల్లను కూడా! అందుకు ఉదాహరణ మొన్న జరిగిన సంఘటన ఏ ముల్లు ఏ క్షణంలో నా జీవితాన్ని నాశనం చేస్తుందో తెలియదు. మిమ్మల్ని చూశాక బ్రతుకుమీద కొండంత ఆశ కలిగింది. ఇప్పుడు ఆ ఆశను చంపుకుంటాను కాని నమ్మకం మాత్రం చావలేదు....
"చక్రీ....మీకోసం....మీ రాకకోసం....నా హృదయద్వారాలు ఎల్లప్పుడూ తెరిచివుంటాయి. ఉంటాను చక్రీ....ఉంటాను మీ మనిషిగానే బ్రతికినంతకాలం వుండిపోతాను. కాని ఒక్కమాట మాత్రం మరిచిపోవద్దు మీది మంచిమనసు. మీలాంటి మంచి మనిషి ఆ రౌడీలతో వుండకూడదు. అదే నా కోరిక....
"మీ జీవితం ఎంతో వుంది. నేను మీకు నచ్చకపోవచ్చు. నాపై మీకు ఇష్టం లేకపోవచ్చు కాని ఎప్పటికయినా ఆ విషసర్పాల మధ్యనుంచి బయటపడి మరో మంచి అమ్మాయితోనయినా మీ భవిష్యత్ పంచుకోండి. ఒక స్త్రీ, పురుషుడు కలిసి మెలిసి స్నేహాన్ని పంచుకోవడమే సంసారం అవుతుంది. ఆ సంసారమే ఒక జీవితం....
"తనను ఇష్టపడిన అమ్మాయితో జీవితాన్ని పంచుకోవడంతో వున్నంత ఆనందం....పదిమందిని కొట్టి బ్రతకడంలో లేదు. మీరు ఆ జీవితాన్ని వదిలేస్తే మీ మనిషిగా మొట్టమొదట సంతోషించేవాళ్ళలో నేనొకదాన్ని ఉన్నానని మరువకండి....ఉంటాను చక్రీ...."
ఆమె ఫోన్ పెట్టిన తరువాత రెండు నిముషాలకుగాని ఫోన్ రిసీవర్ పెట్టేయలేకపోయాడు చక్రవర్తి.
చుట్టూ చూశాడు....
ఎవరూ తనను గమనించలేదని నిర్ధారించుకున్నాక బెడ్ మీద వ్రాలాడు.
అతని కళ్ళలో శ్రీప్రియ జ్ఞాపకాలు.
చక్రవర్తి కళ్ళనుంచి ఒక నీటిబొట్టురాలి బెడ్ మీదపడింది.
అతని జీవితంలో ఒక మనిషికోసం కన్నీటిబొట్టు రాల్చడం అదే మొట్టమొదటిసారి కళ్ళనుంచి కణతల మీదుగా ఒకదానివెంట ఒకటి జారి బెడ్ ను తాకుతున్న కన్నీరు అతని జీవితాన్నే మరొక మలుపు తిప్పబోతుందన్న విషయం ఆ క్షణంలో అతను ఊహించలేకపోయాడు....
చక్రవర్తి హృదయం నిండా ఆ క్షణంలో శ్రీప్రియ రూపమే నిలిచి వున్నది....
* * * *
"అబ్బ....ఎంత బావుందండీ....గెస్ట్ హౌస్ కూడా ఇంత చక్కగా కట్టిస్తారనుకోలేదు.
జగపతి పొంగిపోయాడు శ్రీప్రియ అన్న మాటలకు.
"అవునవును....చాలా బాగుంది కదూ....నా భార్య కూడా ఈ మాట ఎప్పుడూ అనలేదు"
"మీ భార్యంటే గుర్తువచ్చింది....ఆమెకు నగలంటే వ్యామోహం ఎక్కువనుకుంటాను...."
"నిజమే శ్రీప్రియా....ఎలాకనుక్కున్నావు?"
"మొన్న మీ ఇంటికి డిన్నర్ కు వచ్చినప్పుడు చూశానుగా....ఆమె నగలమీద శ్రద్ద చూపినంతగా మనుషులను పట్టించుకున్నట్టులేదు.." తెలివిగా చెప్పింది శ్రీప్రియ.
"అవును....ఆ మాట నిజమే. రోజంతా నేను ఆఫీసులో కష్టపడి ఇంటికి వెళ్ళగానే భర్తకు చక్కటి అనురాగం చూపించాలి కానీ ప్రక్కింటి పిన్నిగారు నెక్లెస్ కొన్నదనో మార్కెట్లో ఫలానా హారం కొత్తగా వచ్చిందనో....లేకపోతే తనని పలకరించి పోవడానికి వచ్చిన మరెవరి మెడలోనో చూసిన మరేదో నగలను గూర్చో చెబుతూ కూర్చుంటుందే తప్ప, నన్ను గురించి అసలు పట్టించుకోదు....అందుకే ఈ జీవితంలో ఆమెను కట్టుకుని విసిగిపోయాననుకో...."
"అయ్యోపాపం....ఇంత ఆస్తి, ఐశ్వర్యం వుండి కూడా మీకు మనశ్శాంతి ఉండడం లేదన్నమాట...." సానుభూతిగా అన్నది శ్రీప్రియ.
"అవును....అందుకే ఎక్కువగా ఇంటికికూడా వెళ్ళబుద్ధిగాక....ఈ గెస్ట్ హౌస్ లోనే వుండిపోతుంటాను...." ఆ విధంగానయినా ఆమెను వలలోకి లాగ వచ్చన్న ఆలోచనతో నోటికి ఇష్టం వచ్చినట్లు తను ఒంటరిగా వుంటున్నాననే భావం వచ్చేలా చెప్పాడతను.