"ఇంత జ్వరంలో ఎందుకొచ్చావు?" అన్నాడు సూర్యం చనువుగా కోప్పడుతూ.
అంత జ్వరంలోనూ, అంత నీరసంలోనూ, సూర్యం అలా చనువుగా కోప్పడటం ఎంతో హాయిగా తోచింది తులసికి. నీరసంగా నవ్వి, "నాకు సెలవు లేదు." అంది.
ఆ మాటలు వినగానే సూర్యం ముఖం ఎలాగో అయిపోయింది. క్షణాలలో తనను తాను నిగ్రహించుకుని ముఖ భావాలు మార్చుకుంటూ, "అదంతా నేను చూసుకుంటాను. ముందు మీరు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి!" అని తనే ఆటో మాట్లాడి స్వయంగా ఇంటి దగ్గర దింపాడు. అంతటి జ్వరంలోనూ అతడు వచ్చేసరికి తమ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో అనే సంకోచం తులసిని వదలలేదు. ఆ సమయంలో నీలకంఠం ఉండడు. అదొక్కటే నిశ్చింత.
ఆటో చప్పుడు వినగానే గుమ్మంలోకి వచ్చిన సుమతి గుమ్మం ముందు ఆగిన ఆటోనీ, ఆటోలోంచి తులసిని చెయ్యి పట్టుకుని దింపుతున్న సూర్యాన్నీ చూసి, "మా తులసి అదృష్టవంతురాలు!" అనేసింది.
మనసులోకి ఏ మాట వస్తే ఆమాట అనెయ్యక మానదు సుమతి. మంచి చెడ్డలు ఆలోచించి చూసుకోగలిగే శక్తి ఆ మనసుకెప్పుడో నశించి పోయింది.
గతుక్కుమని తులసి చెయ్యి వదిలేశాడు సూర్యం. వంచిన తల ఎత్తలేకపోయింది తులసి.
తూలుతూ లోపలకు వచ్చిన తులసినీ, తులసి వెంట ఉన్న సూర్యాన్ని చూసి, "ఏం జరిగిందే!" అంటూ ఏడ్చేసింది జానకి. సమాధానం చెప్పలేని స్థితిలో గోడవారగా ఉన్న చాపమీద కూలబడింది, సూర్యం విసుగ్గా ముఖం రుమాలుతూ తుడుచుకుని, "గాభరా పడకండి, జ్వరం వచ్చింది అంతే! అశ్రద్ధ చెయ్యకుండా వెంటనే మీరు డాక్టర్ కి చూపించండి. తులసీ! నేను వెళ్తున్నాను. సెలవులేదని వర్రీ అవకు. ఆ విషయం నేను చూసుకుంటానులే!" అని వెళ్ళిపోయాడు.
ఆ చుట్టుపక్కల అన్నీ మధ్యతరగతి కుటుంబాలే. ఉద్యోగం చేసేపాటి చదువు సంధ్యలు కూడా లేక ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. తులసి జ్వరము సంగతి విని వెంటనే వాళ్ళంతా చూడటానికి వచ్చారు. మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణంగా శృతిమించి రాగాన పడ్డాక కాని, డాక్టర్ దగ్గరకు వెళ్ళరు. తమకు తోచిన చిట్కా వైద్యాలన్నీ చేసుకుంటూ కూచుంటారు.
"ఇంతమాత్రం జ్వరానికి డాక్టరెందుకండీ! సొంటికొమ్ము మెత్తగా నూరి_అదీ, మిరియాల పొడుమూ, కాస్త తులసి ఆకూ నీళ్ళలో మరగకాచి, ఆ కషాయం ఇస్తే...." ఇలా ఎవరికి తోచిన చిట్కా వైద్యాలు వాళ్ళు చెప్పి, పరోపకారం చేసిన సంతృప్తితో వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన రకరకాల కషాయాలన్నీ తయారుచేసి చెల్లెలిచేత బలవంతాన త్రాగించి అక్కగా తన కర్తవ్యం పూర్తిచేసుకుంది సుమతి.
ఆ కషాయాలతో తులసి జ్వరము మాత్రము తగ్గలేదు సరికదా, కడుపులో వికారంపుట్టి వాంతులు కావటం మొదలయింది. తనను డాక్టర్ దగ్గరకు తీసికెళ్ళేవారు ఎవరూ లేరు. తన ఆరోగ్యం కోసం తనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. నీలకంఠం వచ్చినట్లు గుర్తుగా, భార్యా భర్తల అరుపులు వినిపిస్తున్నాయి. పిల్లలు కూడా శక్త్యానుసారం తల్లి దండ్రుల్ని అనుకరిస్తూ పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ ఏడుపులు కూడా వినిపిస్తున్నాయి.
ఉన్నట్లుండి ఒక్కసారిగా అన్ని కంఠాలు ఆగిపోయాయి. "తులసిగారు ఉండేది ఇక్కడేనా?" అన్న కోమలమైన స్త్రీ కంఠం వినిపించింది.
తులసికి గుండె వేగంగా కొట్టుకుంది. ఆ కంఠం తులసి గుర్తుపట్టింది. అంతలోనే చంద్ర లోపలిగదిలోకి వచ్చి తులసిని చూసి నవ్వుతూ, "ఎలా ఉన్నారు? మీ ఇంటికి రావటానికి నేను చాలా అవస్థ పడవలసి వచ్చింది. ఈ సిటీలో ఇల్లు కనుక్కోవటం చాలా కష్టం" అంది. తులసి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ పొడిగా, "కూర్చోండి!" అంది.
చంద్ర తెలివి తక్కువది కాదు. తులసి ధోరణిలో ముభావం వెంటనే అర్థం చేసుకుంది. కొద్దిగా చిన్నబుచ్చుకుంది కూడా. అయినా తొణకకుండా కూచుంది.
"సూర్యం చెప్పారు మీకు జ్వరముగా ఉందని. ఆ సంగతి విన్న దగ్గరనుంచీ మనసుకెలానో ఉంది. సూర్యం మధ్యాహ్నమే వెళ్ళమన్నారు నన్ను, కానీ నేనే వెంటనే రాలేకపోయాను. చివరికి...."
చంద్ర మాట్లాడుతూ ఉండగానే పిల్లలు చంద్ర మీదకి ఎగబడి చంద్ర తులసి కోసము తెచ్చిన పళ్ళు లాక్కుని, కొరుక్కుతినేస్తూ వాటాలు తెగక దెబ్బలాడుకోవటం మొదలుపెట్టారు.
చంద్ర సిగ్గుపడుతున్నట్లు, మీకు జ్వరముగా ఉందని మీ కోసం పళ్ళు మాత్రమే తెచ్చాను. ఇక్కడ పిల్లలుంటారని తెలియదు. వాళ్ళకోసం వేరుగా స్వీట్స్ తేవలసింది....." అంది నొచ్చుకుంటున్నట్లు.
తులసికి శరీరము కాలిపోతోంది, మనసు ఉడికిపోతోంది....తను ఏ విధంగానూ చక్కదిద్దలేని పరిస్థితులలో రాజీపడలేని అహం బుసలుకొడుతూ ఎవరిమీద విరుచుకుపడాలో తెలియని అసహాయ స్థితిలో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది.
"అసలు మీరు ఆ పళ్ళు మాత్రము ఎందుకు తెచ్చారు? అనవసరపు శ్రమ...." అంది కొంత నిరసనగా. 'నువ్వు తెచ్చిన పళ్ళు నేను తింటాననే అనుకున్నావా?' అనే ధోరణిలో.
సుమతి అక్కడకువచ్చి చంద్రను పరిశీలనగా చూస్తూ "ఎవరే, ఈ అమ్మాయి?" అంది. దెబ్బలాడుకుంటున్న పిల్లల్ని ఏ మాత్రము పట్టించుకోకుండా.
"ఈవిడ....నాకూ సరిగా తెలియదు. కృష్ణారావు తాలూకు మనిషి!" అనేసింది తులసి.
"ఆ మాటలు వినగానే చంద్రముఖం నల్లబడటం, అంతలో అపారమైన ద్వేషంతో రగిలిపోవటం తులసి గమనించింది. తన ఎదుట ఉన్న సాటి ఆడదాన్ని అతి దారుణంగా చిత్రవధ చేస్తున్నానని తులసి అనుకోకపోలేదు. అందుకు ఆవిడ అంతరాత్మ సన్నగా సలపటమూ మానలేదు. కానీ, చంద్ర నోటినుండి, 'సూర్యం మీ గురించి చెప్పారు.....' వగైరా మాటలు విన్నప్పటినుంచీ ఏదో ఒకరకంగా చంద్రను హింసిస్తేనేగాని మనసు చల్లబడలేదు తులసికి.
తులసి మాటలు విని, "ఆ!" అని ఒక గావుకేక పెట్టింది సుమతి.