Home » Yandamuri veerendranath » అతడే ఆమె సైన్యం


    "బహుశా అతడికి నీతో ఇలా ఆడుకుంటూ వుండటం ఒక సరాదాగా వుందనుకుంటాను. నువ్వు ఇబ్బంది పడేకొద్దీ అతడు సంబర పడతాడు."

    "ఎంతకాలం?"

    "ఇంకో రెండు రోజులు".

    "ఆ తరువాత?"

    "ఆ తరువాత మనం ఎవ్వరం ప్రాణాలతో మిగలమని నా ఉద్దేశ్యము. మనం ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇచ్చి వెళ్ళే ఈ రెండు రోజుల్లో ఏదో ఒక క్షణం మనకి ముప్పు తప్పదు. ఇదంతా అతడి సామ్రాజ్యం. పదిమంది మనుష్యుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేసినా ఇక్కడ అతడిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. కాబట్టి మనం వెళ్ళేలోపులోనే ముప్పు తప్పదంటున్నాను."

    "మరెందుకు ఇంత తెలివితక్కువ ప్లాన్ వేసి ఇలా చిక్కుకు పోయాం?" తప్పు అతడిది అన్నట్టుగా అంది ప్రనూష.

    "అతడిని నువ్వు చంపాలనుకున్నావు. ఏ ప్లాన్ వేసినా ఏదో ఒక టైమ్ లో అతడికి ఎదురు పడకపోవు. ఇక అందులో తెలివితక్కువతనం ఏముంది? నువ్వు కార్లో అతడితోపాటు వెళుతున్నప్పుడు ఏదో ఒక ఆయుధంతో అతడిని చంపేస్తే నీ పగ చల్లారేదిగా."

    "మీ గురించే ఆలోచించాను."

    "థాంక్స్!" అన్నాడు చైతన్య. "నా గురించి వదిలిపెట్టు. నీ శపథం నెరవేరటానికి ఇంకో ప్లాన్ ఏదైనా వుందా?"

    ఆమె జవాబు చెప్పలేదు. అతడు వివరిస్తున్నట్లు అన్నాడు. "మనిషి ఆలోచనా విధానం అతడు కష్టాల్లో వున్నప్పుడే బయటపడుతుంది. అప్పుడే బ్యాలెన్స్ డ్ గా వుండాలి! అతడి చక్రబంధంలో మనం ఇరుక్కుపోయాం అని తెలియగానే నువ్వు కంగారుపడ్డావు. మనం తప్పుచేశామేమో అని నిందించసాగావు. కానీ దీన్నే వేరే కోణంలోంచి ఆలోచించు, మనం ఇంత తొందరగా అతడిని కలుసుకుంటామని కలలో కూడా ఊహించామా? ఇంత తొందరగా ఆ జైలు దగ్గరికి వెళ్ళగలుగుతామని అనుకున్నామా? లేదే! అన్నీ ఇంత బాగా జరుగుతున్నాయంటే దానికి మన ప్లానే కారణం. నువ్వు అజ్మరాలీని చంపే వీలువుండే కేవలం నా గురించే ఆలోచించి వదిలేశానన్నావు! అసలీ ప్రోగ్రాంలో నువ్వే లేవనుకో! అజ్మరాలీ నా మీద ఏమీ అనుమానం వచ్చేది కాదుగా. అతడి క్యాంప్ కి నిరాఘాటంగా నేను నా తల్లితో సహా వచ్చేవాడిని కదా. కాబట్టి నేను చెప్పేదేమిటంటే కాస్త కష్టం రాగానే తప్పంతా అవతలివాళ్ళ మీదకు తోసేసే సాధారణ మనస్తత్వం నీది కాదనుకుంటున్నాను. నా నమ్మకం నిలబెట్టు" అన్నాడు.

    ఆమె అతడివైపే నిమిషం కన్నార్పకుండా చూసి "ఐయామ్ సారీ!" అంది మనస్పూర్తిగా.

    ఇద్దరూ తిరిగి భవంతివైపు నడవసాగారు. అతనన్నాడు. "రేపు సాయంత్రంవరకూ మనకి ఏ ప్రమాదమూ రాకపోవచ్చు. ఈ లోపులో ఒక రకంగా నువ్వు నీ ప్రాణాలు రక్షించుకోవచ్చు."

    "ఎలా?"

    "రాత్రికి రాత్రే కార్లో వెనక్కి వెళ్ళిపోయి తెల్లవారేసరికల్లా విమానాశ్రయం చేరుకోవటం ద్వారా! నువ్వేమయ్యావో మాకు తెలీదని చెపుతాం. తనని చూసి బెదిరిపోయావని అజ్మరాలీ అనుకుంటాడు."

    "నేనా పని చచ్చినా చేయను. అజ్మరాలీని చంపే ఇక్కడి నుంచి ప్రయాణం. ఆ ప్రయత్నంలో నేను మరణించినా సరే."

    చైతన్య నవ్వి, "ఊరికే అన్నాన్లే నీ పట్టుదల ఏమిటో తెలుసుకోవాలని" అన్నాడు.

    ఇద్దరూ మెట్లు ఎక్కుతూ ఆ సంభాషణ ఆపుచేశారు.


                        13


    ఆ రోజు ప్రోగ్రాం సైనికులకోసం, మరుసటిరోజు సైనికాధికారుల కోసం. మొత్తం రెండు ప్రోగ్రాంలు.

    ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. అది అయ్యాక అజ్మరాలీ కాక్ టైల్ పార్టీ యిచ్చాడు. చైతన్య తల్లి రాలేదు. మిగతా ట్రూప్ అంతా హాజరయ్యారు. చాలామంది సైనికాధికారులు కూడా వచ్చారు. అంతా కోలాహలంగా వుంది.

    చైతన్య ఒక విషయం గమనించాడు. అజ్మరాలీ క్రితంలోలా ప్రనూష చుట్టూ తిరగటంలేదు. ఆమె గురించి ఇక తెలుసుకోవలసిందేమీ లేనట్లు నిర్లక్ష్యంగా వున్నాడు.

    ప్రస్తుతం అతడు లక్ష్మితో సంభాషణలో పడ్డాడు. పచ్చటి దీపపుకాంతిలో లక్ష్మి మెరిసిపోతూంది. ఇంతవరకూ ఆ దృష్టితో చూడలేదు కాబట్టి చైతన్యకి ఆ విషయం తెలియలేదు. అతడికి తెలియని విషయం మరొకటి కూడా వున్నది. అంతవరకూ లక్ష్మికి జీవితంలో బాధలు మాత్రమే తెలుసు. చైతన్య తల్లి ఆ అమ్మాయిలో కొత్త ఆశలు రేపింది. ఆ ఆశలు ఆమెలో కొత్త అందాన్ని రేపాయి.

    అజ్మరాలీ ఆమెతో విడవకుండా మాట్లాడుతున్నాడు. అక్కడికి డాక్టర్ పాల్ కూడా చేరాడు. అజ్మరాలీ వేసిన జోక్ కి లక్ష్మి విరగబడి నవ్వుతూంది. చైతన్య మనసులో అస్పష్టమైన చిరాకు. అది కేవలం చిరాకేనా... కాస్త కోపం, మరికాస్త ఈరష్య.... తన మనిషి.... తన శత్రువుతో కలిసి నవ్వటం- అయినా ఆమెకి తెలీదుగా అజ్మరాలీ తన శత్రువని- కానీ ఎందుకు తనకిలాంటి ఈర్ష్యలాంటి ఫీలింగు?

    లక్ష్మి భుజం చుట్టూ చేయివేసి అజ్మరాలీ ఆమెని డిన్నర్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు.

    చైతన్యకి ఏదో తెలియని విసుగు!

    కాస్త డబ్బుకోసం ఆమె తన భార్యగా నటించినప్పుడే ఆమె మీద చులకన భావం కలిగింది. తన జాలికథ కమనీయంగా చెప్పుకుని తల్లిదగ్గర సానుభూతి సంపాదించింది. మరి ఇప్పుడీ సైనికాధికారితో చిరునవ్వులు చిందిస్తోంది.

    అతడు ఆలోచనల్లో వుండగానే డిన్నర్ పూర్తయింది. ఒక్కరొక్కరే వెళ్ళిపోతున్నారు. అజ్మరాలీ లక్ష్మితో కలిసి చైతన్య దగ్గరికి వచ్చాడు. "మీ లక్ష్మి మా ఆవరణ అంతా చూస్తానంటోంది. వెళదాం రండి" అన్నాడు.

    "నేనెందుకు?" అన్నాడు చైతన్య విసుగ్గా.

    మీర్రాకపోతే తను రానంటూంది. ఈ ట్రూప్ కి లీడర్ మీరు కదా! రండి వెన్నెల్లో ఆరుబయట ఆడపిల్లతో షికారు బావుంటుంది" అంటూ బయల్దేర తీశాడు.

    తల వొంచుకుని నడుస్తూన్న లక్ష్మి ఒకచోట ఆగి "అదేమిటి?" అంది.

    "యుద్ధఖైదీల జైలు ... " అని బిగ్గరగా నవ్వుతూ "మీ దేశం వాళ్ళే-" అన్నాడు.

    "అది చూపించరా?" గోముగా అడిగింది. చైతన్య విభ్రమంతో ఈ సంభాషణ వింటున్నాడు.

    "ఇంత రాత్రప్పుడా- రేపు వెళదాంలే."

    "ఊహూ. ఇప్పుడే చూడాలి" అంది అతడి మోచేతిని తన వేళ్ళతో సుతారంగా తాకుతూ. యుద్ధభూమిలోనైనా స్త్రీదే కదా విజయం.

    "సరే- " అన్నాడు అజ్మరాలీ.

    చైతన్య ఇంకా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేదు! ఏదో కలలో నడుస్తున్నవాడిలా వారివెంట నడిచాడు.

    "తలుపు తెరువు" అధికార యుక్త కంఠంతో అడిగాడు అజ్మరాలీ.

    సెంట్రీ తలుపు తెరవగానే ముగ్గురూ లోపల ప్రవేశించారు. లోపల విశాలమైన మైదానం వెన్నెలలో మెరుస్తూంది. దూరంగా పొడవాటి సెల్స్ వున్నాయి. వరండా చివర్లు చీకట్లో కలిసిపోయి మరింత పొడవుగా భయంకరంగా కనపడుతున్నాయి.

    దాదాపు పావుగంటసేపు ఆ ఆవరణ అంతా చూపించాడు. అర్ధరాత్రి కావొస్తూండడంతో ఖైదీలందరూ సెల్స్ లో నిద్ర పోతున్నారు అంతా. చీకట్లో అసలు ఆ జైలులోకి ప్రవేశం దొరకటం దుర్లభం. కానీ వచ్చింది సైనికాధికారి కావటంతో ఎవరూ ఎదురు చెప్పటం లేదు.

    అంతా తిరిగి వస్తూండగా ఒకచోట అజ్మరాలీ ఆగాడు. "మీతోపాటు ఇస్మాయిల్ అనే ఒక యుద్ధ ఖైదీ వచ్చాడే- అతను కూడా ఒకప్పుడు ఇక్కడే అదిగో ఆ సెల్ లోనే వుండేవాడు. మేము దయదల్చి తిరిగి మీ దేశానికి అప్పగించాం" గర్వంగా అన్నాడు.

    ఆ సెల్ వైపు చూస్తూ "ఆయనెవరు? ఇంత అర్ధరాత్రి ఇంకా మెలకువగా వుండి ప్రార్ధన చేస్తున్నాడు" అని అడిగింది.

    "అతని పేరు జగదీష్ ప్రసాద్"

    అజ్మరాలీ మాటలు పూర్తికాలేదు. అంతా తొందరగా వస్తుందని ఊహించని క్షణం- భావమై- అనుభవమై అంటార్కిటికా పవనం ఘనీభవించి గ్రీష్మ తాపంతో ఉడికిపోతున్న సహారాని చుట్టుముట్టినట్లు విరుద్ధభావ సంచలనంతో కదిలిపోయి చైతన్య అటు చూశాడు.

    సెల్ పైనున్న గవాక్షంగుండా ఏటవాలుగా పడే వెన్నెల కిరణం మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చుని వున్నాడు ఒక మునిలా వున్నాడు. రాలిపోయే ఎండుటాకులా వున్నాడు. ఈ ప్రపంచ లౌక్యానికీ, యుద్ధానికీ, విద్వేషానికీ అతీతమైన ప్రతీకలా వున్నాడు తన తండ్రి!

    పాతిక సంవత్సరాల ఒంటరితనాన్ని మెడిటేషన్ తో గెల్చే ప్రయత్నంలో ఋష్యత్వాన్ని సిద్ధించుకున్న తండ్రిని అతడు ఆర్ధ్రనయనాలతో చూశాడు. చేతులు సాచి ముందుకు పరుగెత్తి సెల్ తాళాలు బ్రద్ధలు కొట్టి తండ్రిని కౌగిలించుకున్న భావన. ఎవరి కోసమైతే ఇన్నివేల మైళ్ళు ప్రయాణించి వచ్చాడో- ఎవర్ని ఈ జైలు బంధాలనుంచి విముక్తి చేసి తన తల్లి నుదుట కుంకుమగా దిద్దాలనుకున్నాడో - ఆ వ్యక్తి అతికష్టంమీద నిగ్రహించుకున్నాడు.

    "ఇక వెళదామా" అజ్మరాలీ మాటలకు తెప్పరిల్లి చైతన్య కదిలాడు. ముగ్గురూ వెనక్కి బయల్దేరారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఇంకా ఆ భావోద్వేగం చైతన్యని వదల్లేదు. నిద్రలో నడుస్తున్నట్టే కదుల్తున్నాడు.

    "గుడ్ నైట్" అని చెప్పి అజ్మరాలీ వెళ్ళిపోయాడు.

    అతడు లక్ష్మితో కలిసి తమ విడిదివైపు నడుస్తూ వుండగా లక్ష్మి అడిగింది- "ఎలా వున్నారు మీ నాన్నగారు?"

    పక్కలో విస్ఫోటనం చెందినట్లు అదిరిపడ్డాడు కళ్ళముందు నక్షత్రాలు కదులుతూ వుండగా "నీకు... నీకు నా తండ్రి గురించి ఎలా తెలుసు?" అన్నాడు తడబడుతూ.

    "మిమ్మల్ని మీ తండ్రిగారితో కలవటం కోసమే నేను ఇదంతా చేశాను చైతన్యబాబూ" అంది తలవంచుకుని.

    అతడింకా అయోమయావస్థ నుంచి తేరుకోలేదు. విశ్వమంతా తనచుట్టూ గిర్రున తిరుగుతున్నట్టు అనిపించసాగింది.

    "నా తండ్రి గురించి నీ కెవరు చెప్పారు?"

    "మీ అమ్మగారు చెప్పారు."

    "మైగాడ్" గొణుక్కున్నాడు. కసి, కోపం, నిస్సహాయత.

    మీరెంతో రహస్యంగా వుంచుదామనుకున్నది నాకు తెలిసిందని బాధపడుతున్నారా?"

    "నీతోపాటు ఎందరికి తెలిసిందా అని."

    "నా ఒక్కదానికే... " అన్నదామె. "మీరు ఇస్మాయిల్ ని నమ్మినట్టే మీ అమ్మగారు నన్ను నమ్మారు. మనిషిని మనిషి నమ్మటానికి అంతర్జాతీయ నిబంధనలు ఏమీ లేవుగా." అతడు అప్రతిభుడై ఆమెవైపు చూశాడు. ఆమె ఇంకా తలదించుకునే వుంది.

    "రాముడికి ఒక చిన్న ఉడుత సాయం చేసినట్టు నేను మీకేమీ చేయగలనా అని ఇంతకాలం ఆలోచించాను. మన ట్రూప్ లో నేను ఏకాకిగా వుండటం చూసి డాక్టర్ పాల్ చొరవ తీసుకున్నా సహించాను. అజ్మరాలీ నా మీద చెయ్యివేసినా సహించాను. అంతేకాదు. సంతోషించాను కూడా. డబ్బుకోసం కెమెరా ముందు నటించే ఎగస్ట్రా ఆర్టిస్టుని! కాస్త బెదిరిస్తే మీ భార్యగా కూడా నటించటానికి సిద్ధపడ్డ జూనియర్ నటిని!!! అజ్మరాలీతో స్నేహం నటిస్తే నేను కొత్తగా కోల్పోయేదేమీ లేదుకదా. ఈ రోజు పార్టీలో అజ్మరాలీతో నా ప్రవర్తన చూసి మీరు నన్ను అసహ్యించుకుంటారని నాకు తెలుసు. "ఒకప్పుడు ఈమెనేనా నా హీరోయిన్ ని చెయ్యాలనుకున్నది" అని ఏవగించుకుంటారని కూడా తెలుసు. కానీ నా ఉద్దేశ్యం ఒకటే. మీరూ, మీ అమ్మగారూ అంత అభిమానం నా మీద చూపించినందుకు- నేను మీకు కొద్దిగానైనా సాయపడాలని. మీ తండ్రిగారు ఎవరో, ఎక్కడున్నారో మీరు స్వయంగా చూస్తే మంచిదని! అందుకే అజ్మరాలీని ఆ యుద్ధఖైదీల సెల్స్ చూపించమని కోరాను. అతడి చేతల్నే, చేతుల్నీ సహించాను. నాకు చాలా సంతోషంగా వుంది చైతన్యగారూ! స్నేహం, ప్రేమ, ఆప్యాయత అన్న మూడు గీతలు రాముడి చేతివేళ్ళలా మనసుని స్పృశించినంత సంతృప్తి."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra