బ్రతికున్న రోజుల్లో భర్త ఆమెను తాకేది కేవలం సెక్స్ కావాలనుకున్నప్పుడే ఆ కొద్ది నిమిషాల సుఖం తప్ప తర్వాత దాని అనుభూతి కాసేపయినా మిగిలివుండేది కాహ్డు. అతడిచ్చిన సుఖానికి కృతజ్ఞతతోనైనా అతడిని ప్రేమించాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అది కేవలం రొటీన్.... ఒక అసంకల్పిత ప్రతీకార చర్య! అలాంటి జీవరహిత అనుభవం తర్వాత పరమహంస ఇచ్చే తృప్తి పొందుతున్న సుఖానికి అతడు చూపించే కృతజ్ఞతాభావం ఆమెను వివశురాలిగా చేస్తున్నాయి. అతడి మీద ప్రేమ రోజు రోజుకీ రెట్టింపవుతోంది.
ప్రేమకు పరాకాష్ట కామం అన్నారు. ప్రేమనేది లేకుండా రెండు శరీరాలు కలిస్తే అది కేవలం సెక్స్. కానీ గాఢంగా ప్రేమించుకొంటున్న ఇద్దరి కలయిక సెక్స్ లోని అసలయిన మధురిమని అందిస్తుంది. అది పొందడం కొత్త అనుభవం కావడంతో నిర్మల తనను తాను మర్చిపోతోంది. వినయచంద్ర ఆ కొద్దిసేపు అక్కడ గడిపి తన గదిలోకి వెళ్ళిపోయేవాడు. పరమహంస అలాకాదు ఆమెను దగ్గరగా తీసుకొనే పడుకుంటాడు. ఆమెకు కావలసింది అలాంటిరక్షణే.
ఆమె 'ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్' అతడి దగ్గర పటాపంచలవుతుంది. ఆమెకున్న ఒక్కటే దిగులు! రాజ్యలక్ష్మి కోసం పరమహంస విజయవాడలో ఆమె ఇంట్లో ఎక్కువ వుండాల్సి వస్తోంది. అతడు రానంతకాలం నిర్మల ఆలోచనలన్నీ అతడిమీదే వుంటాయి. మరో స్త్రీతో వున్నాడన్న అసూయ కాదు. ఆమె దృష్టిలో పరమహంస తనలాటి స్త్రీలను ఉద్దరించడానికి భగవంతుడు పంపిన దూత. కాని అతడు దగ్గరలో వుండి వుంటే బావుంటుందని ఆమె ఉద్దేశ్యం. కానీ అతడికీ విషయం ఎలా చెప్పాలో మాత్రం తెలియడం లేదు.
ఒకరోజు అతడే "నీతో ఓ విషయం మాట్లడాలనుకొంటున్నాను నిర్మలా!" పై అధికారిని జీతం పెంచమని అడిగేటంత నమ్రతగా అడిగాడు. "ఏమిటి చెప్పండి.....సందేహం దేనికి?" ఆమె అంతకంటే భక్తిగా అంది.
"ఏం లేదు. విజయవాడలో వున్నంత కాలం నా మనసు నీ దగ్గరే వుంటుంది. నీ దగ్గరకు వచ్చేయాలని ఎంతగానో అనిపిస్తుంది...... కాని అక్కడ రాజ్యలక్ష్మిని ఒంటరిగా వదిలేసి రావాలంటే భయం. వచ్చి ఇక్కడే సెటిలయితే ఎలా వుంటుందంటావ్? అదీగాక అక్కడయితే భాస్కర్ తరచు డబ్బుకోసం వేధిస్తున్నాడు" జాలిగా అన్నాడు.
తన మనసులో భావాన్ని అతడలా వ్యక్తం చేసినప్పుడల్లా అతడిలోని దైవాంశ గుర్తొస్తుంటుందామెకు. భాస్కర్ ఆయన మొదటి భార్య కొడుకు. అతని బారినుంచి తప్పించుకోవడం కోసం, రెండో భార్యని మూడో భార్య వున్న వూరికి తీసుకొచ్చేద్దామని అతడి ప్రతిపాదన. "తప్పకుండా.....గాంధీనగర్ లో మనిల్లుంది. వాళ్ళని ఖాళీ చేయమంటాను.....అక్కడే వుండవచ్చు."
"వద్దు నిర్మలా! నా కోసం యిప్పటికే చాలా ఖర్చు పెడుతున్నావు. వద్దంటుంటే వినకుండా కారు ఏసీ చేయించావు. అంత అద్దె నువ్వు నా కోసం వదులుకోవడం అస్సలు నాకిష్టం లేదు. మీ ఆస్థికి గార్డియన్ గా వుండి, అది పెంపొందించేలా చెయ్యాలిగాని, తరలించడం కాదు. ఎక్కడైనా చిన్న ఇల్లు అద్దెకు తీసుకొంటాను."
"ఉహు.....నేనొప్పుకోను. మా కోసం ఎంతో చేస్తున్నారు. ఎందుకని? మేము మీ స్వంతవాళ్ళమనేగా. ఇంత జరిగాక యింకా మనం వేరని ఎలా అనుకోగలుగుతున్నారు? సాహితి కూడా బాధపడుతుంది ఈ విషయం తెలిస్తే" ఆవిడ కంఠం రుద్దమైంది. రెండు నెలల తరువాత అతడు (రెండో) భార్యతోసహా ఆ వూరు వచ్చి శాశ్వతంగా సెటిల్ అయ్యాడు.
7
సాహితి ఒకరోజు కాలేజీ నుంచి యింటికి వచ్చేసరికి పరమహంస కారు కనిపించింది. అది అలవాటు అయినందువల్ల ఆమె మామూలుగా లోపలకు వెళ్ళగానే......హాల్లోనే పెద్దమావయ్య కనిపించాడు. ఆమె మొహం వికసించింది.
"ఎప్పుడొచ్చారు మావయ్యా" వెళ్ళి పక్కన కూర్చుంటూ అడిగింది.
"ప్రొద్దుటే వచ్చానమ్మా! కోర్టు పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం ఇక్కడకు వచ్చా. ఇక కోర్టుల చుట్టూ తిరిగే పనుంది."
"మమ్మీ ఏదీ?"
"పరమహంస గారు, మమ్మీ పూజలో వున్నారట."
"అయితే మీరు వచ్చాక మమ్మీనే కనిపించనేలేదా! భోజనం చేశారా?"
"భోజనం హోటల్లో చేసే వచ్చాను. నౌఖరు టిఫిన్, కాఫీ యిచ్చాడు."
తన మొహంలో బాధ ఆయనకు కనిపించకుండా తల దించుకొని, "వెళ్ళి మమ్మీని పిలుస్తాను మావయ్యా" అంది.
"వద్దమ్మా! పరమహంసగారి పూజ అంటే తపస్సుతో సమానం అంటారు. డిస్టర్బ్ చేయకు..... నేను రాత్రివరకు వుంటాగా. ఫర్వాలేదు"
సాహితి మాట్లాడలేదు. మరో గంట గడిచినా వాళ్ళు బైటకు రాలేదు. ఇక ఆగలేక సాహితి లేచి....."నేను వెళ్ళి చూసొస్తాను మావయ్యా! ఏమీ అనరులే" అని వెళ్ళి తలుపుమీద దడదడా శబ్దం చేసింది. రెండు నిమిషాలు తర్వాత నిర్మల తలుపు తీసింది. ఆదరాబాదరాగా కట్టుకున్నట్లు చీర అపసవ్యంగా వుంది. జుట్టు చెదిరిపోయి వుంది.
"ఏమిటీ?" అంది కాస్త గాభరాగా.....కోపం అణుచుకుంటూ అంది.
"పెద్దమావయ్య వచ్చి చాలా సేపయింది. రాత్రికి వెళ్ళిపోతాడట" చెప్పింది క్లుప్తంగా.
"అలాగా! ఇప్పుడే వచ్చేస్తున్నా..... కాసేపు కబుర్లు చెపుతుండమ్మా" లోపలకు వెళ్ళి తలుపు వేసేసుకుంది.
"అయిపోవచ్చిందట మావయ్యా! వచ్చేస్తోంది" తన ముఖంలో భావాలు ఆయన గమనించకుండా ఉండేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది ఆ అమ్మాయికి.
అయిదు నిమిషాల్లో నిర్మల బయటకు వచ్చింది.
రావడమే అన్నగారిని కుశల ప్రశ్నలు వేసింది. అంత వరకూ కనిపించనందుకు క్షమాపణ చెప్పుకుంది. పది నిముషాలు కాకుండానే లోపల గదిలో గంట కొట్టిన శబ్దం వినిపించింది.
"పూజ అవుతోందన్నయ్యా.... ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను" అంటూ గదిలోకి వెళ్ళింది.
"హమ్మయ్యా! ఇన్నాళ్ళకు మీ మమ్మీని సంతోషంగా చూస్తున్నాను. పరమహంసగారు మీకు పరిచయం కావడం మీ అదృష్టం...."
ఆయన మాటలు పూర్తిగాకుండానే నిర్మల బైటకు వచ్చింది. వస్తున్న నవ్వుని బిగపట్టుకోవడానికి తల్లిచేసే ప్రయత్నం గమనించి, సాహితి భయంగా మావయ్య మొహంలోకి చూసింది. ఆయనేదో పుస్తకం చూడటంలో మునిగిపోయాడు. అయితే అది అంతటితో ఆగలేదు. పదిహేను నిమిషాలకోసారి అదేదో ఆటలాగా లోపల గంట మోగడం.....ఆవిడ పరుగెత్తుకు వెళ్ళడం.....అయిదు నిమిషాలకి ముఖం ఎర్రబరుచుకొని ముసిముసి నవ్వులతో రావడం.....ఆ ముసలయన గమనించలేదు గాని, గమనించిన సాహితి సిగ్గుతో చచ్చిపోయింది.
భోజనాలు వడ్డించారు. అయినా పరమహంస బయటకు రాలేదు. పిలవడానికి వెళ్ళిన నిర్మల కాస్సేపట్లో ఒక్కతే బయటికి వచ్చింది.
"అయిపోవస్తుందన్నయ్యా! మిమ్మల్ని కానివ్వమన్నారు" గబగబా వడ్డించసాగింది. "అదేంటమ్మా.. బుగ్గమీద రక్తం ఏమిటీ?" గాబరాగా అడిగాడు.
"అబ్బే, ఏమీ లేదు అన్నయ్యా! గోటితో గీసుకునట్లున్నాను. ఏమిటో మండుతోందనుకున్నాను" అంటూ గబగబా తుడుచుకుంది. ఆయనంతగా పట్టించుకోలేదు గాని, పక్కనే కూర్చున్న సాహితి స్పష్టంగా చూసింది.....ఆవిడ బుగ్గల మీద పంటిగాట్లు! ఆ కంచంలో అన్నం కాకుండా, రాళ్ళు వున్నా.....ఆ అమ్మాయి పట్టుకున్న బలానికి పిండి అయిపోయి వుండేవి.
అన్నగారు వెళ్ళిపోతానంటే నిర్మల గట్టిగా ప్రతిఘటించలేదు. సాహితి కూడా ఆయన వెళ్ళిపోవడమే మంచిదన్నట్లుగా వూరుకుంది. ఆయన బయలు దేరుతుండగా పరమహంస గదిలోంచి బయటకు వచ్చాడు. పట్టు ధోవతి, నుదుటి బొట్టూ, వంటినిండా గంధం దైవానికి ప్రతిరూపంలా వున్నాడు. మావయ్య ఆయనకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
ఆయన వెళ్ళగానే ఒక్కసారిగా సాహితిలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
"మమ్మీ! మావయ్య వచ్చి అన్ని గంటలైనా నువ్వు వచ్చి పలకరించకపోవడం ఏమీ బాగోలేదు" అంది నిర్మలవైపు తిరిగి.
"సాహితీ! ఏమిటమ్మా ఆవేశం?" పరమహంస దగ్గరగా వచ్చి బుజ్జగింపుగా భుజంమీద చెయ్యివేసి అడిగాడు. అతని చేతిని విసురుగా తీసికొడ్తూ......
"మమ్మీ.... నేను నీతో మాట్లాడుతున్నాను ఇంకెప్పుడూ ఇలా చేయకు. ఉన్న కొద్దిమంది బంధువులను కూడా దూరం చేసుకుంటాం" అని విసురుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంది. ఆ రాత్రి సాహితికి బాగా జ్వరం వచ్చింది. అయినా ఎవర్నీ లేపలేదు. తనమీద తనే శిక్ష విధించుకున్నట్లు అలాగే వణుకుతూ పడుకుంది. పూర్తిగా తెల్లవారలేదు. ఆ చలిలోనే తలుపు తీసి బయటకు వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. పరమహంస పెర్సనల్ గది తలుపులు బయట గొళ్ళెం పెట్టి వున్నాయి. అంటే రాత్రే వెళ్ళిపోయాడన్నమాట. ఆమె నిర్మల గదిలోకి వెళ్ళింది.
మంచం మీద నిర్మల పడుకుంది. రాత్రంతా ఆమెకూడా నిద్రపోకుండా ఏడ్చినట్లు కళ్ళు ఎర్రబడి వుబ్బి పోయాయి. సాహితిని చూడగానే ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ "ఎందుకు సాహితీ! ఎందుకిలాంటి శిక్ష నాకు? ఆయన మనసు కష్టపెట్టుకుని భోజనం చెయ్యకుండా రాత్రే వెళ్ళిపోయారు నన్ను ఎన్నయినా అను నీ ఇష్టం వచ్చినట్లు తిట్టు. కానీ దేవుడిలాంటి ఆయన్ని మాత్రం ఏమీ అనకు."