Home » Yandamuri veerendranath » సంపూర్ణ ప్రేమాయణం


    ఈ లోపులో ప్రసాదు కోపంగా, "వాట్ డూ యూ మీన్ బై దట్?" అని అరిచాడు.

    వేణు ప్రేమనే చూస్తూ వున్నాడు. తన మాటలకి ఆమె మొహంలో వెంటవెంటనే మారే రంగులు గమనిస్తూ ఉంటే ఆమెకీ విషయాలేవీ తెలిసినట్టు అనిపించటం లేదు.

    ఆ ప్రశ్నకి సమాధానంగా, "రాత్రంతా ఒకే కాటేజీలో ఇద్దరూ వుండటం మంచిది కాదు. ఐ మీన్ దట్" అన్నాడు. ఇంతవరకూ వచ్చాక వేణు వెనక్కి తగ్గదలచుకోలేదు.

    ప్రేమ మొహం కోపంతో జేవురించింది. మిస్టర్ వేణూ! మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్ధం అవుతుందా?" అంది ఇంగ్లీషులో. "ఏది మంచో, ఏది చెడో తెలియని చిన్నపిల్లని కాదు నేను."

    "అది తెలిస్తే మీరీ ప్రోగ్రాంకి ఒప్పుకోరు."

    "అది చెప్పటానికి మీరెవరు?" ఆమె కూడా స్వరం హెచ్చించింది.

    సంభాషణ శృతిమించుతోందని, తను అవసరమైన దానికన్నా దూరం వెళుతున్నాననీ, ఈ వాదనలవల్ల తనకీ, ఆమెకీ పూర్తిగా చెడిపోబోతుందని అతడికి తెలుస్తూంది. కాని అతడు మనసులో భావాల్ని ఆపుకోలేకపోయాడు. సమస్యను దాటవెయ్యలేకపోయాడు. కోపాన్ని అణుచుకుంటూ_ "ఒక పెళ్ళికాని యువతి, ఒక మగవాడితో ఒక రాత్రంతా వుంటానంటే వద్దని సలహా చెప్పటానికి ఒకరు ఒకరికి ఏమీ కానక్కరలేదు ప్రేమా!" అన్నాడు.

    ప్రసాదు కల్పించుకుని, "పరాయి వ్యక్తేం కాదు- మేమిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నాం" అన్నాడు చప్పున.

    వేణు అతనివైపు తల తిప్పలేదు. ప్రేమనే చూస్తున్నాడు. ఆమె కోపంతో సన్నగా వణకడం స్పష్టంగా తెలుస్తోంది.

    "నీ స్థాయికి మించి గౌరవం ఇచ్చినందుకు నువ్వు తీసుకున్న చొరవకి ఫలితం వెళ్ళిన వెంటనే అనుభవిస్తావు. వేరే ఉద్యోగం చూసుకోవడానికి రడీగా వుండు" అంది ఏకవచనంతో.

    "మనం బైలుదేరుతున్నప్పుడు మీ నాన్నగారు చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకోండి మేడమ్! మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి తీసుకువచ్చే బాధ్యత నాకప్పచెప్పారు."

    "కొత్తగా చేరిన అసిస్టెంటుకి నా బాధ్యత ఎందుకు అప్పగించవలసి వచ్చిందో వెళ్ళాక నాన్నని కనుక్కుంటాను" అంది విసురుగా.

    అతడు వెంటనే జవాబు చెప్పలేదు.

    "మిమ్మల్ని చూస్తూంటే నాకు జాలేస్తూంది" అన్నాడు నెమ్మదిగా.

    రోషంతో ఆమె ముక్కుపుటాలు అదరసాగేయి. పిడికిలి అప్రయత్నంగా బిగుసుకుంది. చివుక్కున ప్రసాద్ వైపు తిరిగి "పద" అంది.

    పళ్ళ బేగ్, బ్రీఫ్ కేసూ పట్టుకుని ప్రసాదు ముందు నడిచాడు.

    ఆమె గుమ్మం వరకూ వెళ్ళి వెనక్కి తిరిగింది.

    వేణు ఆమెవైపే చూస్తున్నాడు. ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి. ఆమె తాపీగా అంది-

    "ప్రసాదు ఒకే కాటేజీ బుక్ చేశాడని నాకు తెలీదు. మామూలుగా అయితే అసలు ఒప్పుకోకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు నా అభిమానాన్ని దారుణంగా దెబ్బతీశావు. అందుకోసమే- కేవలం అందుకోసమే" అని తలుపు దఢేలున వేసి వెళ్ళిపోయింది.

    'అయిపోయింది' అనుకున్నాడు అతను. ఇన్నాళ్ళూ కష్టపడి వేసిన ప్లానంతా మట్టికొట్టుకుపోయింది. అదికాదు అతడిని బాధ పెడుతున్నది. అంతకన్నా సున్నితమైన మరేదో భావం! తన ఆరోగ్యం గురించి ఆమె కనుక్కోవటం.... ప్రక్క గదిలోంచి ఫోన్ చెయ్యటం....

    ప్రేమ ఉద్భవించటానికి పెద్ద పెద్ద కారణాలు కావాలేమోగానీ అభిమానం, ఆత్మీయత పెంపొందటానికి చిన్న చిన్న విషయాలే చాలు. ఒక అందమైన చిత్రాన్ని ఎవరో పాడుచేస్తున్న అనుభూతి కలిగింది. అక్కడ ప్రేమవున్నా, ఇంకో అమ్మాయి ఉన్నా అదే బాధ కలిగేదేమో!

    ఈ విపత్కర పరిస్థితిని ఎలా తప్పించాలో అతడికి అర్ధంకాలేదు. అదే సమయానికి అతడికి అకస్మాత్తుగా ప్రసాదరావు గుర్తొచ్చాడు. క్రింది గదిలో ప్రయాణానికి సిద్ధమౌతున్న ప్రసాదరావుని కలుసుకోవటానికి గది తలుపులు కూడా వెయ్యకుండా పరిగెత్తాడు.
   
    రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రొప్పుతూ అతడి గురించి ఎంక్వైరీ చేశాడు.

    "ఏ ప్రసాదరావు?" క్లర్కు అడిగాడు.

    అతని వివరాలు చెప్పాడు. క్లర్కు రిజిష్టర్ చూస్తూ, "ఓ! ఆయనా ఇప్పుడే పది నిమిషాల క్రితమే ఖాళీచేసి వెళ్ళిపోయారు" అన్నాడు.

    వేణు హతాశుడయ్యాడు. పరిస్థితులన్నీ ఒక్కసారిగా తనకి వ్యతిరేకమయినట్టు అనిపించసాగింది.

    తన గదికి వచ్చేశాడు. ఆ రాత్రి ఏ పనీ చేయ్యబుద్దికాలేదు. అనుక్షణమూ ఒకటే ఆలోచన. అక్కడ ప్రేమ ఏమయిందా-అని. మరికొంచెంసేపు గడిచేసరికి ఇక ఆగలేకపోయాడు. టాక్సీని మాట్లాడుకుని బీచ్ రిసార్టుకి బయల్దేరాడు. తను చేసేది ఎంత తెలివితక్కువ పనో అతడు అప్పుడు ఆలోచించలేదు.

    ఈ అర్దరాత్రి తను అక్కడికి వెళ్ళి చేసేదేమీ వుండదని కూడా అతడు భావించలేదు. వెళ్ళాలనిపించింది, బయలుదేరాడంతే! అతడక్కడికి చేరుకునేసరికి పదకొండయింది. అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి కాటేజ్ లు.

    అతడు ఆఫీసు దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి వాకబు చేశాడు.

    ఆ క్లర్కు అతడివైపు అనుమానంగా చూస్తూ, "మీరెవరు?" అని అడిగాడు. అటువంటి హోటల్స్ లో రాత్రిపూట కస్టమర్స్ ని డిస్టర్బ్ చెయ్యటానికి ఎంతో అవసరం వుంటే తప్ప సాహసించరు.

    "చాలా ముఖ్యమైన పని. నేనతడి గురించే చాలాదూరం నుంచి వచ్చాను" అన్నాడు.

    క్లర్కు కాటేజీ నెంబర్ చెప్పాడు.

    ఇసుకలో వేసిన రోడ్ అది. రోడ్డుకి అటూ ఇటూ వరసగా వున్నాయి కాటేజ్ లు. అతడు నెంబర్ వెతుక్కుంటూ తనకి కావలసి కాటేజ్ ముందు నిలబడ్డాడు.

    అక్కడివరకూ వచ్చి అలా నిలబడ్డాక అప్పుడర్ధమైందతనికి- తను చేసింది ఎంత బుద్ధి తక్కువ పనో!

    'అసలు తనకీ, ఆమెకీ సంబంధం ఏమిటి? ఆమె ఎలాపోతే తనకేమిటి? కాదు-కాదు. ఈ పందెం నెగ్గాలంటే ఆమెకీ ప్రసాద్ కీ స్నేహం కూడదు....' అని అనుకున్నాడు. మళ్ళీ అంతలో మరో అనుమానం- నిజంగా తను వచ్చింది అందుకేనా? కేవలం ఈ పందెం కోసమే టాక్సీ వేసుకుని ఇంతదూరం వచ్చాడా? కాదు కాదని మనస్సు చెపుతోంది.

    ఈ లోపులో అతని ఆలోచనలకి భంగం కలిగిస్తూ దూరంగా లైటు వెలిగింది.

    అతడు కళ్ళు చిట్లించి చూశాడు.

    రెండు నిముషాల తర్వాత లైటు ఆరిపోయింది.

    అతడి మనసు మరింత వికలమైపోయింది.

    వాళ్ళింకా మేలుకునే వున్నారన్నమాట! ఇంత అర్దరాత్రి వరకూ కబుర్లు చెప్పుకుంటూనే వున్నారు. అతడికి ఆమెమీద విపరీతమైన కోపం వచ్చింది. అది కోపం కూడా కాదు- కసీ.... ఉక్రోషం.... నిస్సహాయత.... అన్నీ. ఆమెమీద అధికారం లేదు. కానీ ఏదో చెయ్యాలని కోరిక.

    మళ్ళీ లైటు వెలిగింది!

    అతడికి లోపల ఏం జరుగుతున్నదీ అర్ధంకాలేదు.

    ఇంతలో కాటేజీ తలుపు దఢేలున తెరుచుకుంది. ప్రేమ గుమ్మం లోంచి బయటికి రాబోతూంది.

    అతడికి తను చూస్తున్నది కలో - నిజమో అర్ధంకాలేదు. ఆమెను చూసి అతడు చప్పున రోడ్డు ప్రక్కనుంచి లైటు వెలుతురులోకి వచ్చాడు.

    ఆమె కూడా అతడిని అంత హఠాత్తుగా అక్కడ చూసేసరికి బిత్తరపోయింది. కానీ ఆమె మొహంలో చిరాకుగానీ తనమీద చేస్తూన్న గూడచారి చర్యపై కోపంగానీ కనబడలేదు.

    విసురుగా మెట్లు దిగి అతడి దగ్గరికి వస్తూ, "కారు వుందా?" అని అడిగింది.

    వేణు వెంటనే సమాధానం చెప్పకుండా ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు. కానీ ఆ మసక చీకటిలో ఆమె మొహంలో ఏ భావాలు ప్రస్పుటమౌతున్నాయో అతడు గమనించలేకపోయాడు. కానీ ఆమె ఏదో విపరీతమైన ఒత్తిడిలో వున్నట్లు గ్రహించగలిగాడు.

    ప్రేమ తిరిగి తన ప్రశ్న రెట్టించబోయేటంతలో అతడు కలలో నుంచి తేరుకున్న వాడిలా తెప్పరిల్లి "ఉంది మేడమ్!" అంటూ దూరంగా ఉన్న టాక్సీవైపు సైగచేశాడు. అది వచ్చి ఆగగానే ఆమె యెక్కి కూర్చుంది. అతడూ యెక్కి తలుపు వేశాడు. కారు కదులుతూ వుంటే కాటేజ్ వైపు చూశాడు.

    లోపల్నుంచి రాబోతూ వున్న ప్రసాద్ కదులుతూ వున్న కారును చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోతున్నట్టు తలుపుని పట్టుకుని నిలబడిపోవటం స్పష్టంగా కనిపించింది.


                                                  *    *    *    *


    కారులో అసలు ప్రేమ మాట్లాడలేదు. ముందు సీట్లో కూర్చున్న వేణు యేదో అనబోతూ వెనక్కి తిరిగి చూసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

    దాదాపు అరగంటలో కారు హోటలుకి చేరుకుంది.

    అతడు టాక్సీకి డబ్బులిచ్చి పంపించేలోపులో ఆమె రిసెప్షన్ వద్దకు నడిచి తన గది తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోయింది. వేణు కూడా తీసుకున్నాడు. ఆమె కనీసం ఒక్కమాటైనా మాట్లాడుతుందని ఆశించాడతను.

    తన గది తాళం తీయబోతూ పక్కగదివైపు చూశాడు. ఆమె లోపలికి వెళ్ళిపోయినట్టు తలుపులు మూసి వున్నాయి. అతడూ తలుపు ఎందుకో తెరిచి తన గదిలోకి ప్రవేశించాడు. అతడికి ఆ క్షణం ఒంటరిగా, చిరాకుగా అనిపించింది. ఒళ్ళు మళ్ళీ కొంచెం వెచ్చగా వున్నట్టు కూడా అనిపించసాగింది.

    బూట్లలోంచి కాళ్ళు తీసేసి బట్టలు కూడా మార్చుకోకుండా అలాగే నిస్త్రాణగా పక్కమీద వాలిపోయాడు. అలా ఎంతసేపు గడిచిందో తెలీదు. కళ్ళకు చెయ్యి అడ్డు పెట్టుకుని కదలకుండా చాలాసేపు పడుకున్నాడు.

    ఇంతలో ఆ గది నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ టెలిఫోన్ మ్రోగింది. అతడు రిసీవర్ యెత్తి, "హల్లో!" అన్నాడు.

    "వేణూ!" అటునుంచి ఆమె కంఠం వినబడింది.

    ఆ సమయంలో ఆ కాల్ ని ఊహించకపోవటంతో రిసీవర్ మీద అతడి చెయ్యి అప్రయత్నంగా బిగుసుకుంది.

    ఆమె ఏదో చెప్పాలని ఆగిపోయినట్టు నిశ్శబ్దం. రిసీవర్ వైర్ కదిలిన చప్పుడు.... చిన్న తటపటాయింపు.... అతడు మళ్ళీ "హలో!" అన్నాడు.

    "ఇదంతా మీ గురించే.... మీరలా రెచ్చగొట్టకపోయి వుంటే నేనలా వెళ్ళేదాన్నే కాదు. మీరే చేసేరిదంతా.... మీదే తప్పు.... నాదేం కాదు తెలుసా?" అని అతడు ఏదో అనబోయేంతలో ఫోన్ పెట్టేసింది.

    అతడు అప్రతిభుడయ్యాడు.

    __ఆమె అలా గదిలోంచి బయటికి వచ్చేసి, తనని చూడగానే "కారుందా?" అని అడగటం. మౌనంగా ఎక్కి కూర్చోవటం__ యిదంతా చూసి, లోపల ఏదో జరిగిందని గ్రహించాడు. ఇప్పుడు ఆమె తనకి ఫోన్ చేయటం, తప్పంతా తనమీద తోసెయ్యటం, చిన్నపిల్లలా ఉక్రోషపడటం- అంతా చూస్తూంటే నవ్వొస్తూంది.  ఒక కెరటం వచ్చి తగిలినట్టూ అతడి మనసంతా ఆనందంతో నిండిపోయింది.

    ఎందుకో తెలియని సంతోషం!!

    ప్రేమ యింత చికాకులో కూడా కోపాన్ని ప్రదర్శించటానికి తననే ఎన్నుకుంది.

    అంటే.... తన ముద్ర ఆమె మీద కాస్తో కూస్తో పడిందన్నమాట! ఆమె ఆలోచనలలో తను చోటుచేసుకున్నాడు. ఇది తక్కువ విజయమేమీ కాదు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra