Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 26


    అతడి పెదాలమీద చిరునవ్వు కదలాడింది. ఎగిరి గంతేసి నాట్యం చేయాలనుకున్నాడు- ఆనందంగా నవ్వుకున్నాడు.


                      *    *    *    *


    కానీ అతడి ఆనందం ఎక్కువసేపు అంతే ఉధృతంగా నిలువలేదు.

    మరుసటిరోజు ప్రొద్దున్న కూడా ప్రసాద్ తిరిగిరాలేదు. ఆ సాయంత్రం కూడా రాలేదు. ఏమయ్యాడో తెలీదు. ప్రేమ ఏ విషయమూ చెప్పలేదు. ఆ రోజంతా ఆమె గంభీరంగానే ఉంది.

    వేణు మామూలుగా తన పని చూసుకుంటున్నాడన్న మాటేగానీ, అతడి మనసంతా ఆమెమీదే వుంది. అతడు సాయంత్రం తిరిగి వచ్చేవరకూ కూడా ఆమె తన రూమ్ బైటికి రాలేదు. ప్రసాద్ జాడ తెలియలేదు.

    అతడు బట్టలు మార్చుకుని ఆమెని పలకరించటానికి వెళ్ళాడు.

    ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు. పన్నెండు గంటల్లో ఆమె ఎంతగానో మారిపోయినట్టు అనిపించింది!

    అతడిని చూసి, "మనం ఇంకా ఇక్కడ ఎంతకాలం వుండాలి వేణూ?" అని అడిగింది. ఆమె కంఠం చాలా మామూలుగా వుంది. కానీ తరచి చూస్తే అందులో ఒక రకమైన అలజడి కనబడుతుంది.

    "ఇంకో రెండురోజులు వుండవలసి వస్తుందేమో" అన్నాడు.

    "నేనీ రాత్రికి వెళ్ళిపోదామనుకుంటున్నాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయించు."

    అతడు ఆమెవైపు విస్మయంగా చూశాడు. "ఇంతవరకూ వచ్చి మీరు...."

    "ఇంకే చర్చలు వద్దు. నేను ఇక్కడ ఇంకొక్క రోజు కూడా వుండలేను" అంది.

    "మరి ప్రసాద్?"

    "ఆ బాస్టర్డ్ గురించి నాతో మాట్లాడకు...."

    ఏదో జరిగింది! ఇద్దరిమధ్యా గత రాత్రి ఏదో జరిగే వుండాలి.

    వేణు ఆమెవైపు పరిశీలనగా చూశాడు. ఆమె మొహంలో ఏ భావమూ కనబడలేదు.

    'జరిగిందంతా ప్రసాదరావుకి తెలిస్తే అతడు ఎంత సంతోషిస్తాడో కదా' అనుకున్నాడు. ముఖ్యంగా తమ మధ్య అడ్డు తొలగిపోయింది.

    ఈ గొడవలో ప్రసాద్ బహుశా వెళ్ళిపోయుంటాడు.

    ప్రసాదరావూ, ప్రసాదూ ఒకే ట్రైన్ లో ప్రయాణం చేస్తూ వుండి వుంటారు అని వేణు నవ్వుకున్నాడు.

    అసలు జరిగిందేమిటో వేణుకి తెలీదు.

    కాటేజ్ లోంచి ప్రేమ పరుగెత్తుకు వచ్చి వేణు కారు ఎక్కేసేక- మరో జీపు వచ్చి ఆ కాటేజ్ ముందు ఆగింది. అందులోంచి ఇనస్పెక్టర్ దిగాడు.

    బయలుదేరటానికి సిద్ధంగా వున్న ప్రసాద్, పోలీసు జీపు చూసి అవాక్కయ్యాడు. కానీ అంతలోనే సర్దుకున్నాడు. సాధారణంగా అర్దరాత్రి పూట లాడ్జింగ్ కి పోలీసు జీపు వచ్చిందంటే అది రైడింగ్ కేసు కోసమే అయి వుంటుంది. అదృష్టవశాత్తూ ప్రేమ వెళ్ళిపోయింది. లేకపోతే చాలా ఇబ్బందికరమైన స్థితి ఏర్పడి వుండేది.

    "ఏం కావాలి మీకు?" అని అడిగాడు బింకంగా.

    "మీ లేడీ పార్ట్నర్ ఏది?" గదంతా కలియజూస్తూ అడిగాడు ఇనస్పెక్టర్.

    "లేడీ ఏమిటి? ఇది దారుణం. మీ మీద పరువు నష్టం దావావేస్తాను- అర్దరాత్రి వచ్చి నన్ను లేపినందుకు" అని దబాయించాడు.

    "ఓహో! సముద్రం పక్కన.... వూరికి దూరంగా.... కేవలం ఒంటరిగా వచ్చి పడుకున్నానంటావ్!! ఈ లాడ్జీ సంగతి మాకు తెలుసులే."

    "డోన్ట్ టాక్ నాన్సెన్స్" అన్నాడు ప్రసాద్ ధైర్యంగా. అమ్మాయి పక్కన లేకపోవటంతో అతడికి వీళ్ళు తననేం చెయ్యలేరన్న ధైర్యం వచ్చింది.

    "అయితే మీరొక్కరే వచ్చారన్నమాట?" అన్నాడు ఇనస్పెక్టర్.

    ఇనస్పెక్టర్ కాస్త మర్యాదగా అడిగేసరికి ఆ ధైర్యం మరింత పెరిగింది. "అవును కావాలంటే వెతుక్కోండి."

    ఇనస్పెక్టర్ చేతిలో వున్న హోటల్ రిజిష్టర్ విప్పి చూపిస్తూ, "మరి యిందులో మిస్టర్ అండ్ మిసెస్ ప్రసాద్ అని వ్రాసేరే?...." అన్నాడు. 

    ప్రసాద్ గతుక్కుమన్నాడు. తనింత సులభంగా ట్రాప్ లో పడుతున్నాడని అనుకోలేదు.

    "అదీ....అదీ...." అన్నాడు.

    "బహుశా మీ భార్య కాకపోవచ్చు, బ్రోతల్ అయి వుండవచ్చు. కాటేజ్ - కేవలం అలా వస్తే దొరుకుతుందని మీరు అలా వ్రాసి వుండవచ్చు" ఓరగా చూస్తూ అడిగాడు.

    "కాదు-కాదు" కంగారుపడ్డాడు ప్రసాద్. ఆమె బ్రోతల్ అని చెప్తే వెంటనే చర్య తీసుకునేట్టు వున్నాడు ఇన్ స్పెక్టర్.

    "మరెవరు?"

    ప్రసాద్ మాట్లాడలేదు. ప్రేమ సంగతి చెప్పే ధైర్యం అతడికి లేదు.

    ఇన్ స్పెక్టర్ తాపీగా అన్నాడు, "మిస్టర్ ప్రసాద్! మీరే బ్రోతల్ తోనూ యిక్కడికి రాలేదనీ, మీ గర్ల్ ప్రెండ్ తోనే వచ్చాననీ అంటున్నారు. కానీ, రాత్రికి రాత్రి ఆమె యేమైంది? మాకు చాలా అనుమానాలున్నాయి. అందులో సముద్రం కూడా దగ్గరే వుంది. సగం రాత్రిలో వెళ్ళిపోగలిగేది కేవలం వేశ్యే. మీరొకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ ని యిక్కడికి తీసుకొచ్చినట్టయితే ఆమె యెవరు? చిరునామా యేమిటి?? ఇవన్నీ మాకు చెప్పవలసి వుంటుంది."

    ప్రసాద్ గొంతు తడి ఆరిపోయింది. "ఆమె__ ఆమె చాలా గౌరవమైన కుటుంబం నుంచి వచ్చింది" అన్నాడు.

    ఇన్ స్పెక్టర్ నవ్వాడు. "అయితే పత్రికల వాళ్ళకి చాలా మేత అన్నమాట...." అంతలో అతడి కంఠం సీరియస్ అయింది. "ప్రసాద్! మీ స్నేహితురాలికి ఏ ప్రమాదమూ జరగలేదని మాకు నమ్మకం కలగాలి అంతవరకూ.... యూ ఆర్ అండర్ అరెస్ట్!"

    ....అయిదు నిమిషాల తరువాత అతడిని ఎక్కించుకుని పోలీసు జీపు ఊరివైపు సాగిపోయింది.

    ఏదో ఒక కారణం చెప్పి అతన్ని అరెస్ట్ చేసి రెండ్రోజులపాటు రిమాండ్ లో వుంచటానికి ప్రసాదరావు అయిదువేలు ఖర్చు పెట్టాడు.


                                            *    *    *    *  


    "ఆ బాస్టర్డ్ గురించి నాతో మాట్లాడకు" అని ప్రేమ అన్న తరువాత వేణు ఏదో ప్రశ్నించబోయాడు.

    కానీ ఆమె వినిపించుకోకుండా "నా టికెట్ బుక్ చేయించు, నేనీ రాత్రికి వెళ్ళిపోదామనుకుంటున్నాను" అని మళ్ళీ చెప్పింది.

    వేణు తటపటాయించి, మౌనంగా అక్కణ్నుంచి బయటకి వచ్చేసేడు.

    సాయంత్రం ఆరయింది.

    సముద్రం మీదనుంచి చల్లటిగాలి రావటం ప్రారంభమయింది.

    వేణు సందిగ్ధంలో పడ్డాడు. ఈ చర్చలు ఒకటి రెండు రోజుల్లో అయిపోతాయి. ఇప్పుడు ఈమె వెళ్ళిపోతే, మళ్ళీ ఈ కాగితాలన్నీ తీసుకుని తను వూరు వెళ్ళాలి. ఇటువంటి విషయాల్లో ఎప్పటికప్పుడు సంతకాలు అయిపోవటమే మంచిది. ఆలస్యం జరిగితే అవతలివాళ్ళు తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం వుంది.అయినా ఆమె చెప్పింది కాబట్టి తప్పదు.

    అతడు ఫోనులో ట్రావెలింగ్ ఏజెంటుకి ఆ రాత్రి ప్రయాణం గురించి చెప్పాడు.

    వేణు ఫోను పెట్టేశాడు. అతడి మనసంతా అదోలా వుంది.

    పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత ఆవరించుకున్న లాటి నిశ్శబ్దం.

    అతడికి నవ్వుకూడా వచ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతూంటే తనకెందుకు దిగులు?

    అతడు ఫోనువైపు చూసేడు. ఆమెకు ఫోను చెయ్యాలనే కోర్కెను ఆపుకోలేకపోయాడు. మళ్ళీ సందిగ్ధత__ ఆమె ఏమనుకుంటుందో ఏమో అని.

    తటపటాయిస్తూనే ఫోను ఎత్తి ఆమె గదికి కనెక్షన్ ఇమ్మని అడిగాడు.

    అవతలి గదిలో ఫోను రింగవుతున్న శబ్దం వినిపిస్తూంది. ఎందుకో తెలీకుండా అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    అవతల్నుంచి ఫోను ఎత్తిన శబ్దం. ప్రేమ కంఠం- "హలో!" అని వినబడింది.

    "నేను వేణూని. మీ గదికి వస్తున్నాను."

    "సరే."

    ఆమె ముక్తసరిగా అనటంతో అతడు పెదవి కొరుక్కుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. తరువాత ఏదో ఆలోచన స్పురించినట్లు చేతికందిన ఫైలు పట్టుకుని ఆమె గది వైపు నడిచాడు.

    అతడు వెళ్ళేసరికి ఆమె కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చూస్తుంది. అప్పటివరకూ పడుకుని లేచినట్టు_ చెదిరిన జుట్టూ, పడకా తెలియజేస్తున్నాయి.

    అతడు ఎదురుగా కూర్చుంటూ, "మీరు వెళ్ళేలోపులో కొన్ని కాగితాలమీద సంతకాలు కావాలి" అంటూ ఫైలు విప్పసాగాడు.

    అయితే దానిపట్ల ఆమెలో ఆసక్తి కనిపించలేదు. నిరాసక్తంగా వాటివైపు చూస్తూ, "ఏం కాగితాలు ఇవి?" అంది.

    "ఈ నాలుగు రోజులూ మేం చర్చించిన విషయాలు."

    "వీటితో దయానందానికి ఏ సంబంధమూ లేదా?"

    "దయానందానికి ఏం సంబంధం?" ఆశ్చర్యపోతూ అడిగాడు.

    "అదేమిటి వేణూ! నీకు తెలీదా! నాన్నగారి చాలా వ్యాపారాల్లో దయానందం భాగస్వామి."

    వేణు స్థబ్దుడయ్యాడు. ఈ విషయం అంతవరకూ అతడికి తెలీదు. కానీ వెంటనే అతడు తేరుకున్నాడు. ఆమె చెప్పిన ఆ వార్త అతడికి సంతోషాన్ని కలుగజేసింది.

    ఇంతసేపూ ప్రేమ మూడీగా వుండటానికి కారణం ఏమిటా__ అనుకున్నాడు. ఇప్పుడర్ధమయింది.

    గెస్ట్ హౌస్ లో యేదో గొడవ జరిగింది. ప్రసాద్ అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి తండ్రికి ఏవేవో రంగులు పులిమి చెబుతాడు.

    తన మూలంగా భాగస్తుల్లో గొడవ వస్తుందని ఈ అమ్మాయి భయపడుతుంది. ఆ భయం అర్ధరహితమని నచ్చచెప్పాలి. అలా నచ్చచెబుతూ దగ్గిరవ్వాలి.

    'దగ్గరవటం' విషయం గుర్తొచ్చేసరికి కళ్ళముందు ప్రసాదరావు కనబడ్డాడు. "ఏం? ఇంకా ఎంత టైము కావాలి?" అని ఎదురుగా నిలబడి అడుగుతున్నట్టు అనిపించింది.

    "ఏమిటాలోచిస్తున్నారు?"

    అతడు తన మనసులో కదులుతున్న విషయాల్ని బయటపడకుండా, "ఈ వ్యాపారంలో దయానందానికేమీ సంబంధం లేదు. ఇది మీ పేరుమీదే వుంది" అన్నాడు.

    ఆమె కాగితాలు అందుకుని, అతడు చూపించిన చోటల్లా సంతకాలు పెట్టసాగింది. ఆమె అలా వరుసగా సంతకాలు పెట్టడం చూసి అతడు నవ్వుతూ, "ఇంత పెద్ద బిజినెస్ కి యజమానురాలయి వుండి, కాగితాల్ని చూడకుండా సంతకం పెట్టటం అపాయకరం" అన్నాడు.

    ఆమె నవ్వలేదు. "ఒకరిమీద ఒకరికి ఆ మాత్రం నమ్మకం వుండాలి వేణూ! ఆప్ట్రాల్ మనం మనుష్యులం కదా!" అంది.

    కమ్చీతో కొట్టినట్లయింది. కానీ వెంటనే సర్దుకుని, "నమ్మకం వుండటం గొప్పకాదు. నమ్మకాన్ని నిలబెట్టుకోవటం గొప్ప_ మనుష్యులమయినందుకు" అన్నాడు.

    ఆమె చప్పున అతడివంక చూసి, అతడు తనవంకే చూడటం గమనించి- కళ్ళు దించుకుని తన పనిలో నిమగ్నమయింది. ఆమె ఆఖరి సంతకం చేస్తూ వుండగా, ఫోను మ్రోగింది.

    వేణు వెళ్ళి అందుకున్నాడు.

    అవతలినుంచి ట్రావెలింగ్ ఏజెంట్ మాట్లాడుతూ టిక్కెట్ కన్ఫర్మ్ అయిన సంగతి చెప్పాడు. "ఎన్నింటికి?" అడిగాడు వేణు.

 Previous Page Next Page