వేద ఆలోచనలో పడింది. ఇప్పటికి సమస్య ఒకవిధంగా పరిష్కారమయినట్లే! ఇతనితో విరోధం పనికిరాదు. ఇతణ్ణి మంచిచేసుకుని చెల్లెలికి ఏ ఆపదారాకుండా చూసుకోవాలి.
జాపిన అతడి చేతుల్లో వాలిపోయింది. గర్వంగా నవ్వాడు జయపాల్. చాలారోజుల తర్వాత వేద మనసారా అతడికి తనను తనర్పించుకుని స్వర్గసుఖాలు చూపించింది.
"యు ఆర్ మార్వలెస్!" అన్నాడు జయపాల్. నవ్వింది వేద. ఇద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరుండగా బెల్ మ్రోగింది.
"నువ్వు ఉండు! నేను తలుపు తీస్తాను" అని లేచాడు జయపాల్. అతడు మామూలుగా లేచిఉంటే వేదకు ఏమీ అనిపించేదికాదేమో, కానీ "నువ్వు వుండు" అనటంతో వేదకు అనుమానం తోచి క్రిందపడివున్న చీరను అస్తవ్యస్తంగా వంటికి చుట్టుకుని తనూ హాల్లోకి వచ్చింది. ఇద్దరు అపరిచిత వ్యక్తులు జయపాల్ తెరిచిన ద్వారంలోంచి లోపలికొస్తున్నారు. ఆమె మనసు కీడుని శంకించింది.
కెవ్వున కేకపెట్టింది__జయపాల్ వెంటనే ఆమెదగ్గిరకు వచ్చి ఆమె నోరు గట్టిగా నొక్కేసాడు. ఆ వచ్చిన వాళ్ళలో ఒకడు తలుపు బోల్టు పెట్టేసాడు.
జయపాల్ ఈడ్చుకుంటూ వేదను లాక్కొచ్చి మంచంమీద పడేశాడు. పిస్టల్ నుదుటికి గురిపెట్టి "అరిచావంటే జాగ్రత్త! ఈ గుండు నీ తలలోంచి పోతుంది" అన్నాడు.
జరుగుతున్నదేమిటో ఆమెకు అర్ధమయింది. "ఏంకావాలి మీకు?" అంది.
"ఆ కేసెట్స్ ఏ బేంక్ లాకర్ లో దాచావో చెప్పు."
వేద నవ్వింది "మీరు తెలుసుకోలేదా?"
ఇలాంటి ప్రమాదాన్ని అనుమానించిన వేద, జయపాల్ సామర్ధ్యం తెలిసిన వేద, ఆ కేసెట్స్ తన పేరుమీద బేంక్ లాకర్ లో ఉంచక శ్రీనివాస్ పేరుమీద ఉంచింది. లాకర్ కీ కూడా అతడిదగ్గిరే ఉంచింది.
"ఎవరి పేరుమీద దాచావో చెప్పు. ఆ కీ ఎక్కడుందో చెప్పు."
"చెప్పను."
"చెప్పకపోతే చస్తాను."
"చచ్చినా చెప్పను."
"నీ పని ఇలాకాదు?" అని జయపాల్ పక్కనున్నవాడికి సైగ చేసాడు-అతడు చురకత్తితో వేద భుజందగ్గిర సర్రున పొడిచి "చెప్తావా? చెప్పవా?" అన్నాడు.
"అబ్బా!" అంటూ ఆమె వెనక్కి పడిపోయింది. ఇంతక్రితం తల్లోంచి రాలిన పువ్వులపైన వెచ్చని నెత్తురు దొర్లింది. వాడు చురకత్తి మళ్ళీ పైకెత్తి "చెప్తావా? చెప్పవా" అన్నాడు.
వేద సమాధానం చెప్పకుండా జయపాల్ ముఖంలోకి చూసి నవ్వి "జయపాల్! నువ్వు కొనుక్కున ఈ శరీరాన్ని, నీకు ఆనందం అందించిన ఈ శరీరాన్ని నువ్వు చంపుకోగలవు అంతే! కాని నా చెల్లెలిని ఏం చెయ్యలేవు. ఆ ఏర్పాట్లన్నీ చేసాను" అంది.
జయపాల్ రెచ్చిపోయి "ఊ" అన్నాడు కత్తిపట్టుకున్నవాడితో__అతడు మళ్ళీ పొడుస్తూ "చెపుతావా? చెప్పవా?" అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
ఏ అజ్ఞాతశక్తినో ధ్యానిస్తున్నట్లు కళ్ళు మూసుకుంది. జయపాల్ ఆదేశాలందుకుంటూ ఆ వ్యక్తి వేద శరీరమంతా కత్తితో కుళ్ళబొడిచాడు. ఏ మంచంమీద ఆమె శరీరంతో ఆనందాన్ని అనుభవించాడో, ఆ మంచం మీదనే ఆమె శరీరంలోంచి పరమరాక్షసంగా రక్తం ప్రవహింపచేస్తున్నాడు జయపాల్. ఆమెకి స్పృహతప్పిపోయింది.
"ఇక పోదాంపదండి! గంటకో అరగంటకో దీని ప్రాణాలుపోతాయి ఇంకా మనమెందుకిక్కడ?" అని ఆ వ్యక్తులిద్దరినీ ముందు పంపేసి ఆ తరువాత తను తలుపులు జేరవేసి నిశ్చింతగా వెళ్ళిపోయాడు జయపాల్....
జయపాల్ తో ఘర్షణ ప్రారంభమయిన దగ్గిరనుండే తన జాగ్రత్తలో తానుండటానికి అన్నివిధాలా ప్రయత్నిస్తోంది ఆమె.
త్రాగిన మైకంలో అతడి మాటలు విన్న వేదకి, అతడెంతటి రాక్షసుడో అర్ధమయింది. జయపాల్ సామాన్యుడుకాదు. సాధారణంగా వేద బెదిరింపులకి అతడు లొంగిపోడు. కానీ, అత్యంత ప్రమాదకరమయినవీ ఆనాటివరకూ బయటపడనివీ, కొన్ని రహస్యాలు ఆమెకి వినిపించే సరికి, అతడికి నిజంగానే తన మాటలన్నీ, ఆమె రికార్డుచేసిందని నమ్మకం కుదిరింది, ఇంకా ఏమేమి మాట్లాడానో అని భయం పట్టుకుంది.
టెన్షన్ లో ఉన్న బ్రైన్ త్రాగిన మైకంలో రిలాక్స్ అయ్యేసరికి మనసులో ఉన్నవన్నీ రిజర్వేషన్స్ లేకుండా బయటకి వచ్చేస్తాయి. ఆ సంగతి జయపాల్ కి తెలుసు- అందుకే ఎలాంటి పార్టీలోనయినా తననుతాను అదుపులో ఉంచుకుంటాడు. అతనికి సంపూర్ణమైన విశ్రాంతి స్థానం వేద ఇల్లు. అక్కడ తననుతను అదుపులో పెట్టుకునే ప్రయత్నమేదీ అతడు చెయ్యలేదు.
తనకు విశ్రాంతిస్థానమని నమ్మిన చోటినుండే ఆపద ఎదురయింది.
అతడిని ఎదుర్కొన్న ఓడించగలిగే ఆయుధం తనకి ఉందనితెలిసాక జయపాల్ ఊరుకోడని వేదకి తెలుసు. అందుకే అహర్నిశలూ తనతో ఉండే పనిమనిషిని ఏర్పాటు చేసుకుంది. దొడ్డివైపుకి తలుపులు తెరుచుకునే స్టోర్ రూమ్ లో దాని బస ఏర్పాటు చేసింది.
ఏదైనా గొడవ జరుగుతున్నట్లు తోచగానే ఆటోలో వెళ్ళిపోయి శ్రీనివాస్ కి చెప్పమంది. శ్రీనివాస్ ఇల్లు చూపించి, శ్రీనివాస్ కి పరిచయం చేసింది. కొంత డబ్బిచ్చి ఎప్పుడూ దగ్గిర ఉంచుకోమంది. వేద సొంత చెల్లెలిలా చూసుకోబట్టి ఆ పనిమనిషికి ఆమెపట్ల ఎంతో విశ్వాసం ఏర్పడింది.
వేద కేక వినగానే తలుపు సందులోనుంచి ఆపద పసికట్టింది. వెంటనే దొడ్డివైపునుంచి బయటపడింది. కానీ అంత రాత్రివేళ ఆటో దొరకటం కష్టమయింది. ఎలాగో ఆటో సంపాదించి శ్రీనివాస్ కి కబురందించేసరికి కొంత ఆలస్యమైంది. శ్రీనివాస్ వెంటనే వెనకా ముందు ఆలోచించకుండా వచ్చేసాడు__
అతడు వచ్చేసరికి రక్తపుమడుగులో ఉంది వేద....స్పృహ వస్తూ, పోతూ ఉంది. ఊపిరి అందటం కష్టమైపోతూవుంది.
"వేదా!" అని ఆర్తనాదం చేసాడు! శ్రీనివాస్ ఆ దృశ్యంచూసి భరించలేక__ఆమెదగ్గిరగా వచ్చేసి అక్కడి రక్తప్రవాహాలుకూడా లెక్కచెయ్యకుండా__
వేద తల తన ఒళ్ళోకి తీసుకుని "వేదా!" అన్నాడు__ఆమె కళ్ళు తెరిచింది. ఆరిపోబోయే దీపంలా నవ్వింది.
"వచ్చావా?" అంది.
"కొద్దిగా ముందు రావలసింది. అంతా ఐపోయాక వచ్చాను-" ఎలాగైనా ఆమెకు ఊపిరి అందించగలనేమో అన్నట్లు గుండెలు రాస్తూ అన్నాడు.
ఆమె మాట్లాడలేకపోతోంది__చూపు నిలపలేకపోతోంది. కష్టంమీద ఆగాగి మాట్లాడటానికి ప్రయత్నించసాగింది.
"మంచిదయింది....ముందువస్తే....ఆ రాక్షసులు....నిన్నూ."
"వెధవలు! వెంటనే పోలీసురిపోర్టిచ్చి.... ...."
"వద్దు! వద్దు.... .... ...." శ్రీనివాస్ చెయ్యి తన చేత్తో పట్టుకోబోయింది. సాధ్యంకాలేదు. తనే ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
ఏదో చెప్పాలని విశ్వప్రయత్నం చేస్తోంది. శరీరం నుండి తప్పించుకుపోవాలని చూసే ఊపిరిని అందుకోవటానికి తెగ ఆరాటపడిపోతోంది....
"నువ్వు....నువ్వు....పోలీసులకి రిపోర్టు ఇస్తే నీకు ఆపద....అంతేకాదు, ఆ లాకర్....నీ పేరుమీద ఉందని.... అతడికి....అనుమానం గీతకు ప్రమాదం.
మాటలు విరిగిపోతున్నాయి....శరీరంనిండా లెక్కలేనన్ని కత్తిపోట్లు కళ్ళుతిరిగిపోయాయి శ్రీనివాస్ కి. ఎంత దారుణమైన చిత్రవధ.
"శ్రీనివాస్!....నువ్వు....అప్పుడు.... ....నీతో రమ్మన్నావు. గుర్తుందా?....రానన్నాను....కారణం అడిగావు.... అప్పుడు చెప్పలేకపోయాను....చెప్పనా?మరణసమయంలో....చెపుతున్నాను....అతడికి....నేను....ఎవరైనా....నాకు....అతడు....భర్త.... అనుకున్నాను...."
మాటలు స్పష్టంగా రావటంలేదు. తడబడుతున్నాయి. కళ్ళు తేలిపోతున్నాయి.
"మాట్లాడకు. విశ్రాంతి తీసుకో!" అన్నాడు శ్రీనివాస్. "దాహం" అంటూ సైగచేసింది.
కూజాలోంచి నీళ్ళువంచి గ్లాసులోపోసి త్రాగించాడు. రెండుగుటకలు కంటె తాగలేకపోయింది. ఆయాసపడుతూనే మెరుస్తూన్న కళ్ళతో "నా అనుకోగలిగే వ్యక్తి, నన్ను ఆదుకోవటానికి....ఉన్నాడనుకుంటే ఎంత సంతృప్తి?" అంది.
"వేదా!" అన్నాడు బాధగా. ఒకప్పుడు ఆమె సాత్విక సౌందర్యాన్ని చూసి ఎంతో అబ్బురపడ్డాడు.
ఏమి అపూర్వవరం?' అనుకున్నాడు ఆరాధనతో. ఆ వరమే శాపమయి ఈ అమాయకురాలిని ఇలా నిర్ధాక్షిణ్యంగా కబళిస్తుందని మాత్రం ఊహించలేకపోయాడు.
"శ్రీనివాస్....ఇప్పుడు చెప్పు....నేను భర్తచేతుల్లో చచ్చిన పతివ్రతలా స్వర్గానికి పోతానా? గర్ల్ ఫ్రెండ్ లా బ్రతికినందుకు....తగిన శిక్ష అనుభవించి నరకానికి పోతానా?....నిర్ణయించు. స్వర్గమా?....నర...."
ఆ నోరు శాశ్వతంగా మూతపడిపోయింది.
__* THE END *__