తల్లి ఎంత దెబ్బలాడినా ప్రయోజనం లేక తిట్టుకుంటూ వెళ్ళిపోయింది.
గీత అక్క దగ్గిరగాచేరి "అక్కా! నిన్ను నిష్కారణంగా చిక్కుల్లో పెడుతున్నాను" అంది బాధగా- ఆమె తేలిగ్గా నవ్వేస్తూ "నీ మొహం. నాకే చికాకులూ లేవు కాని, నువ్వు ధైర్యంగా ఉండు" అంది.
తల ఊపింది గీత, నోరువిప్పి మాట్లాడితే ఏడుపొస్తుందేమోననే భయంచేత__
వారం రోజులు గడిచాయి.
ఆ రోజు కాలేజీకి వెళ్ళిన గీత ఇంటికి రాలేదు....మళ్ళా పెద్దదుమారం. అన్న తిట్లు, వదిన తిరస్కార చూపులు. తండ్రి మూలుగులు! తల్లి శోకాలు.
"ఎంత పని జరిగిందే. దాన్ని ఎవరెత్తుకు పోయారోనే! ఏం చేస్తారో, నా తల్లిని? కొంపదీసి దాన్ని ఏ భోగం కొంపలోనయినా పడేస్తారేమో, దాని బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి ఐపోతుందేమో!"
తానేవో ఊహించుకుంటు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది తల్లి.
"ఈ నిర్వాకానికేనా మా అందరితో పోట్లాడి దాన్ని నీ దగ్గిర ఉంచుకున్నావు?" అన్నాడు అన్న కోపంగా, డబాయింపుగా.
ఆ మాటల్లో గీత కనపడనందుకు బాధకంటే, వేదను సతాయించగలుగుతున్నందుకు సంతోషమే ఎక్కువగా ఉంది.
"నేను నా దగ్గిర ఉంచుకోలేదు, అదొక్కర్తే మనసున్న మనిషిగా నన్ను వదలలేకపోయింది" అనలేకపోయింది వేద. ఎందుకో ఆ సమయంలో వేదకి తనకు తనే దోషిననిపించింది. తన ఆశీర్వాదం లేకపోతే ఈ పెళ్ళి జరిగి ఉండేది కాదు. వాళ్ళ ప్రేమను నమ్మి పెళ్ళి జరిపించి, ఆశీర్వదించింది. ఇప్పుడు ఈ పరిణామాల కన్నింటికీ తను బాధ్యురాలు కాదా?
గొడవచేసి, వేదని తిట్టి అంతా వెళ్ళిపోయారు.
ఒక్కరితే కూచుని ఏడుస్తున్న వేద దగ్గిరకు వచ్చాడు జయపాల్. అతడిని చూడగానే వేద ఆడ సింహంలా ముందుకురికి అతని షర్టు పట్టుకుని "ఏం చేసావ్? నా చెల్లెలిని ఏం చేసావ్, చెప్పు" అని అరిచింది.
"ఉండు! ఉండు! వదులు!" అంటూ అతి ప్రయత్నం మీద తన షర్టు వదిలించుకున్నాడు జయపాల్. ఆ పెనుగులాటలో వేద సొమ్మసిల్లి కుర్చీలో కూలబడిపోయింది. జయపాల్ చొక్కా చిరిగిపోయింది.
"నిజంగా గీత సంగతి నాకేం తెలియదు. నీకు చెప్పకుండానే వెళ్ళిపోయిందా?" అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు.
ఆమె ఉరుముతున్నట్లు "నా దగ్గిర నటించకు. గీత ఎక్కడుందో నాకు అప్పజెప్పు. నీ కొడుకు జోలికి రానియ్యనులే!" అంది కోపంలోంచి ఏడుపులోకి దిగిపోతూ....
"ప్రామిస్! నాకు తెలియదు. గీతమీద నాకు కక్ష లేదు. కానీ దీన్ని__నీ చెల్లెలిని ఇంటి కోడలిగా ఎలా అంగీకరించను చెప్పు. అంతే! ఇప్పుడు నీరద్ - వాడే గీతను వదిలేసాడు గనుక నాకు అసలు కోపం లేదు. ఒక హోటల్ కొనిస్తాననేసరికి ప్రేయసిని వదిలేసాడు. ఇదా ప్రేమ! అహ్హహ్హ...." విరగబడి నవ్వాడు.
భరించలేని అసహ్యం కళ్ళనిండా నింపుకుని ఆ నవ్వుని చూసింది వేద.
ఆ అసహ్యం తేలిగ్గానే గుర్తించాడు జయపాల్. నవ్వు ఆపి వేద దగ్గిరగా వచ్చి భుజంమీద చెయ్యివేస్తూ "దిగులుపడకు! గీత ఎక్కడున్నా వెతికించి నీకు అప్పజెపుతాను. నీ కోసం ఏం చెయ్యను?" అన్నాడు అనునయంగా.
పురుగును దులపరించినట్లు ఆ చెయ్యి తోసిపారేసిందామె.
జయపాల్ ఆమె ముఖంలోకి అనుమానంగా చూస్తూ....
"నువ్వు తొందరపడి ఆ కేసెట్స్ బయట పెట్టవుగద!" అన్నాడు. ఆమె కొంచెంసేపు ఆలోచించి "ఇప్పుడప్పుడే బయట పెట్టను. ఇంకొక్క పది రోజులలోగా గీత జాడ తెలియకపోతే మాత్రం...." అంది కసిగా చూస్తూ.
"పదిరోజులు టైమ్ ఇచ్చావుగద! ఈలోగా నేను వండర్స్ చెయ్యగలను, సరే, రా! కొంచెంసేపు కులాసాగా గడుపుదాం!" అని దగ్గిరగా రాబోయాడు. ఛీత్కారం చేస్తూ దూరంగా జరిగిందామె.
"మిష్టర్ జయపాల్! నీకు నేను గాక చాలామంది గరల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరిలో నేనంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. కానీ అందుకు కారణం మాత్రం నీకు తెలియదు.
"విధిలేని పరిస్థితులలో నీకు గర్ల్ ఫ్రెండ్ నైనా, ఆ విధికి తలవంచి నా తనువుతోపాటు మనసునూ నీకు అర్పించాను. త్రికరణశుద్ధిగా నీ దానిని కావటానికి ప్రయత్నించాను. ఆ మమకారాన్ని అనుభవించావేకాని-అర్ధం చేసుకోలేకపోయావు. ఎదురు తిరస్కరించావు. మానసికంగానైనా ఏనాడు నీ భార్యను కాలేకపోయాను. అందుకే భార్యకులేని అధికారం నాకొకటి ఉంది...."
జయపాల్ తెల్లబోయి చూస్తూ "ఏమిటది?" అన్నాడు.
"నువ్వంటే, ఇష్టం లేనపుడు ఛీకొట్టి పొమ్మనే అధికారం, గెటవుట్!" తర్జనతో గుమ్మం చూపిస్తూ అరిచింది.
రగిలిపోయింది జయపాల్ కి.... "నిన్ను...." అంటు పిడికిళ్ళు బిగించి ఒక్క అడుగు ముందుకు వేసి అంతలో వెనక్కి తగ్గిపోయాడు.
చకచక ముఖంలో రంగులు మార్చుకుని "నువ్విప్పుడు చాలా కోపంలో ఉన్నావులే! నీచెల్లెల్ని వెతికి తీసుకొచ్చి అప్పుడు మాట్లాడతాను" అని వెళ్ళిపోయాడు.
17
నీరద్ వేద హోటల్ రిజిస్ట్రేషన్ లీగల్ గా పూర్తయింది. ఆ హోటల్ ప్రారంభోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసాడు జయపాల్.
కేంద్ర ఆర్ధిక మంత్రి వచ్చి ప్రారంభోత్సవం చేసారు. చాలా గ్రాండుగా టీపార్టి జరిగింది
ఆనాటి కల్చరల్ ప్రోగ్రాం నీరద్ డాన్స్ తోనే ప్రారంభమయింది. అతిధులందరూ చప్పట్లు కొట్టి డాన్స్ ను మెచ్చుకున్నారు.
ఆ సమయంలో హోటల్ ముందు ఎవరిదో కారు ఆగింది. ఆ కారులోంచి పెద్దకుటుంబంలోని వ్యక్తులుగా కనిపించే దంపతులతోపాటు గీత దిగింది. ముగ్గురూ లోపలికి వచ్చారు. గీతను చూడగానే నీరద్ గబగబ ఎదురు వెళ్ళి గీతచేతిలో తన చెయ్యి కలిపి అక్కడ ప్రముఖులందరికి "నా భార్య! గీత!" అని పరిచయం చేసాడు.
జయపాల్ ముఖం మండుతున్న అగ్నిగోళంలా అయిపోయింది. అతని లౌక్యమూ, వ్యాపారదక్షత, కపటమూ, చాతుర్యమూ, ఏవీ అతని హావభావాలు నిగ్రహించుకోవటానికి ఆ సమయంలో సహకరించలేదు. అతని ముఖం చూసి అక్కడివారందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుని వస్తోన్న నవ్వు అతిప్రయత్నంమీద నిగ్రహించుకున్నారు.
ఇది చాలదన్నట్లు "నా హోటల్ ప్రారంభోత్సవ శుభ సమయంలో మా వదినగారు శ్రీమతి వేదవతిగారు ఒక పాట పాడతారు" అని ఎనౌన్స్ చేసాడు.
అప్పటివరకు ఆమె అక్కడికి వచ్చిందని జయపాల్ కి తెలియదు. నిజానికి ఆ ఫంక్షన్ మొదటినుంచీ ఆమెలేదు. గీత వచ్చిందన్న ఫోన్ కాల్ అందుకుని వెంటనే వచ్చేసింది. అతి నిరాడంబరంగా ఉన్న ఆమె నిస్సంకోచంగా అందరిముందు పాడి నీరద్ చూపించిన కుర్చీలో కూచుంది.
జయపాల్ శరీరంలోంచి పొగలూ, సెగలూ వస్తున్నాయి. ముఖ్యంగా తన ఎదురుగా గౌరవనీయులయిన స్త్రీల మధ్య కూచున్న వేద చిరునవ్వును చూస్తోంటే అతనికి మండిపోతోంది. ఏ నగలూ అలంకరించుకోకపోయినా, ఖరీదయిన చీర కట్టుకోకపోయినా వింత ఆకర్షణతో వెలిగిపోతోంది వేద.
"నీరద్!" అని లోలోపల పళ్ళు నూరుకొంటున్న జయపాల్ దగ్గిరకి వచ్చి గీతతో సహా నమస్కరించి "అన్నివిధాలా మీ పేరు నిలబెట్టేలా ఆశీర్వదించండి డాడీ!" అన్నాడు వినయంగా.
వినేవాళ్ళకి అవి అత్యంత సహజమయిన మాటలుగా తోచవచ్చు గాని, ఆ మాటల్లో వ్యంగ్యం జయపాల్ ఒక్కడికే అర్ధమవుతుంది.
నిగ్రహించుకోవటం సాధ్యంగాక "గీత ఎక్కడనుంచి వచ్చింది?" అని అడిగేసాడు ఆశ్చర్యంగా....చిలిపిపనిచేసి తండ్రిని మాయచేసిన పసిపిల్లాడిలా హాయిగా నవ్వాడు నీరద్.
"ఇందులో ఆశ్చర్యం ఏం లేదు - గీతని నేనే నా క్లోజ్ ఫ్రెండ్ ఇంటిలో ఉండమన్నాను కొన్నాళ్ళు - నా మాట కాదనలేక వుంది. ఇవాళ ఇంత ఫంక్షన్ జరుగుతుంటే అసలైన యజమానురాలు రాకుండా ఎందుకుంటుందీ?" అన్నాడు.
జయపాల్ కి అర్ధమయింది__నీరద్ తెలివితేటల్లో తనను మించినవాడు-గీత వేదదగ్గిరే ఉంటే, హోటల్ రిజిస్ట్రేషన్ కి ముందుగానే గీతకు విడాకులిప్పించవచ్చునని భయపడ్డాడు. అందుకే ఆమెను మాయంచేశాడు.
తనే వెర్రిబాగులవాడు! నీరద్ నిజంగా గీతను వదిలేశాడనీ, ఆ ఆశాభామం భరించలేక ఆ అమ్మాయి పారిపోయిందనీ అనుకున్నాడు. పీడవదిలిపోయిందనుకున్నాడు. హమ్మో! ఎంత ఎత్తు? తననే మోసం చేశాడు.
జయపాల్ చూపులు వేదమీద పడ్డాయి. గర్వంగా నవ్వింది, వేద-అయితే వేదకికూడా అన్ని విషయాలూ తెలుసునన్నమాట, ఎంతబాగా నటించింది. ఆ కళ్ళనీళ్ళు, ఆ రోషం!....
ఓయ్! దేవుడా! ఆరోజు తన చొక్కా కూడా చింపేసింది. అందితే తన గుండెలు కూడా చీల్చేస్తుందనిపించింది, సరే కానియ్యి. ఈ జయపాల్ ని మోసగించటం అంత తేలికకాదు, తెలుస్తుంది వేదకి....
మరునాడు సాయంత్రం తియ్యగా నవ్వుతూ వేదదగ్గిరకు వచ్చాడు జయపాల్. వేద తిరస్కారంగా చూసి "మళ్ళీ ఎందుకొచ్చావిక్కడికి?" అంది.
"ఇంకా కోపమేనా? నీ చెల్లెలు వచ్చింది. ఆ భార్యాభర్తలిద్దరూ ఈ అమాయకుణ్ణి మోసంచేసి హోటల్ సంపాదించుకున్నారు. అంతా సుఖంగా ఉన్నారు. ఇంక నామీద కోపమెందుకు చెప్పు?" ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు.