"నేను ఆన్సర్ పేపర్స్ అన్నీ ప్రిన్సిపాల్ కి అప్పాజెపుతున్నాను- నువ్వు మాట్లాడవలసిన దేమైనా ఉంటే, ఆయనతో మాట్లాడు!" అన్నాడు తీక్షణంగా.
చంద్రశేఖర్ తీక్షణత్వానికి రవి కొంచెం కూడా బెదరలేదు. నిర్లక్ష్యంగా, పొగరుగా, ఛాలెంజ్ చేస్తున్నట్లుగా నవ్వాడు.
ఒక పావుగంట తర్వాత సానుభూతిలో మురళి ఏం చేస్తున్నాడో, చూద్దామని ఆ హాల్ లోకి వచ్చిన చంద్రశేఖర్ తన కళ్ళను తను నమ్మలేక పోయాడు. మురళి చేతిలో ఆన్సర్ పేపర్ ఉంది. రవి దగ్గిరుండి పుస్తకాలూ, గైడ్లూ తెరిచిపెట్టి మురళికి సాయం చేస్తున్నాడు. మురళి చకచకా వ్రాసేస్తున్నాడు. చంద్రశేఖర్ ని చూసి మురళి ఒక్క క్షణం ఆగాడు. అతని ముఖం కొద్దిగా పాలిపోయింది. రవి వెంటనే "ఊఁ....రాయి!" అని మురళికి ధైర్యం చెప్పి, చంద్రశేఖర్ దగ్గిరకి వచ్చి "సార్! ఈ హాల్ లో మీ డ్యూటీ అయిపోయింది. మీరు వెళ్ళిపొండి. మర్యాదగా చెప్తున్నాను" అన్నాడు. చంద్రశేఖర్ తల వంచుకుని బయటకు వచ్చేశాడు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ ప్రమేయం ఉన్నప్పుడు తనేం చెయ్యగలడు?
తరువాత మూర్తిని అడిగాడు.
రవి ప్రిన్సిపాల్ కి బంధువా? అతడు ఎన్నోసార్లు ప్రిన్సిపాల్ మద్దతుతో లెక్చరర్స్ ని ఫూల్స్ చెయ్యగలిగాడు!"
మూర్తి అదొక మాదిరిగా నవ్వి "బంధువు కాదుకాని, అంత కంటె దగ్గిర! మనం-మనం ఒకటి అనుకొనేటంత ఐక్య భావం!" అన్నాడు.
"అంటే?"
"అయ్యో! వెర్రి నాయనా! ఈ కాలేజిలో పని చేస్తున్నావు. ఇంత సామాన్య విషయాలు తెలియవా?.... చౌకీదారుకి కూడా తెలుసునే!"
"నిజంగా? ఏమిటా దేవ రహస్యాలు?"
"భలేమాట వాడావు! ఎంతైనా తెలుగు లెక్చరర్ వి. నిజంగా ఇది దేవ రహస్యమే! అంటే అందరికీ తెలిసినా, ఎవరిమటుకు వారు తెలియదనుకోవలసినది! తెలియనట్లు నటించవలసినది!"
"అలాగే నటిస్తాను చెప్పండి!"
"రవి స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్. యూనియన్ మనీ రవి, ప్రిన్సిపాల్ - ఇద్దరూ ఫిఫ్టీ, ఫిఫ్టీ....అలానే అన్నీ ఫిఫ్టీ. ఫిఫ్టీ!....అంతే! సింపుల్!"
నిర్ఘాంత పోయాడు చంద్రశేఖర్. అతనికేం మాట్లాడాలో తోచలేదు. మాట్లాడవలసింది కూడా ఏం లేదు....
అమాయకులైన విద్యార్ధుల జీవితాలు ఇలాంటి సుడిగుండాల్లో చిక్కుకుని నాశనం కావలసిందేనా? ఈ పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉంటే, జాతి భవిష్యత్తు ఏమయిపోతుంది?
తన బిడ్డ చదువుకుని బాగుపడాలని ఆరాటపడే మాతృమూర్తి సత్యవతి గుర్తుకు వచ్చింది చంద్రశేఖర్ కి. ఆవిడతో ఈ విషయాలన్నీ చెప్పవలసిన బాధ్యత తనకుందని అనిపించింది. ఆ సాయంత్రమే కాంతారావు ఇంటికి వెళ్లి, సత్యవతితోనూ కాంతారావుతోనూ జరిగినదంతా వివరించాడు. సత్యవతి చాలా బాధపడుతూ "నేనేం చెయ్యాలో నాకేం అర్ధం కావటంలేదు మాస్టారు! అక్కడికీ ఇంట్లో వాడిచేత చదివించాను" అంది. మురళిని అక్కడికి పిలిపించింది. చంద్రశేఖర్ ని చూడగానే ఆయన తన తల్లితో ఏం చెప్పి ఉంటాడో ఊహించగలిగాడు మురళి. భయపడుతూ నిలబడ్డాడు.
"ఏం మురళీ! నువ్వు అసలు ఏమీ చదవకుండానే పరీక్ష కెళ్ళావా? కాపీ కొట్టకపోతే వ్రాయలేవా?" కోపంగా అడిగింది సత్యవతి.
మురళి బిక్కముఖం వేసుకుని "చదివాను. ఆలోచిస్తే ఏదో వ్రాయగలను. కానీ, అందరూ చక్కగా చూసి వ్రాస్తున్నారు. వాళ్ళకి నూటికీ నూరు మార్కులూ వస్తాయి. నా అంతట నేను ఏదో రాస్తే నాకు అన్ని మార్కులొస్తాయి?" అన్నాడు.
అదీ సంగతి! చుట్టూ అందరూ చూసి వ్రాస్తున్నారు. అలా వ్రాయటంవల్ల వాళ్ళకు (మురళి లాంటి అమాయకుల దృష్టిలో) నూటికీ నూరు మార్కులు వచ్చేస్తున్నాయి! అంత 'లాభాన్ని' తను మాత్రం ఎందుకు వదులుకోవాలి? ఏవరేజ్ స్టూడెంట్సంతా ఇలాగే నాశనమయిపోతున్నారు.
"పోనీ flying squad వచ్చాకయినా, నీకు తోచింది ఎందుకు వ్రాయలేదు?"
"వాళ్ళు వచ్చినా ప్రక్కనే నిలబడ్డారు. నా దగ్గిరున్న చీటీలు పట్టుకుంటారేమోననే భయంతో ఉన్న మతిపోయింది. ఏమీ ఆలోచించలేకపోయాను!"
ఏమనగలదు సత్యవతి!
"ఏడిశావ్ లే! రేపటి పరీక్షకయినా బుద్ధిగా చదువు! రేపు కూడా ఇలా చీటీలు పట్టుకెళ్ళేవంటే ముందు నేనే నిన్ను పరీక్షకు వెళ్ళనియ్యను." అంది.