Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 23

 

    "ఇవాళ సాయంత్రం ఆఫీస్ నుంచి తిన్నగా మా ఇంటికొచ్చేయండి."
    "ఎందుకు ?"
    "మీరూ వచ్చాక చెప్తాను కదా ."
    "అలాగే ! మీరు రమ్మని అజ్ఞాపినే కాదని ఎలా చెప్పగలను ?"
    "అయితే మరి నేనిక వెళ్ళిపోతున్నాను " అంది లేచి నుంచుంటూ.
    "ఎక్కడికి ?" ఆశ్చర్యంగా అడిగాడు సురేంద్ర.
    "ఇంటికి !"
    "అదేమిటి?"
    "ఇవాళ లీవ్ తీసుకోడానికొచ్చాను. మిమ్మల్ని ఆహ్వానించడం మరో పని! రెండూ అయినాయ్."
    ఆమె వెళ్ళిపోయింది .
    ఆమె వెళ్ళిపోయిన తర్వాత తనని తనే చాలాసేపు నిందించుకొన్నాడతను. మాధురి రమ్మనగానే తనెందుకు వప్పుకున్నాడు! రాలేనని ఎందుకు చెప్పలేకపోయాడు తన యందు ఆమెకు లేని గౌరవం - తను మాత్రం ఆమె కెందుకివ్వాలి? ఇంతకూ తనను ఇంటికి రమ్మనడానికి కారణం ఏమిటి ? సెలవెందుకు పెట్టిందివాళ? తను వెళ్ళకుండా ఉంటే ఎలా వుంటుంది ? బాధపడుతుందా ? ఏమీ నిర్ణయించుకోలేక సాయంత్రం ఆమె ఇంటి వేపే నడిచాడతను.
    గడపలోనే నుంచుని ఎదుర్చుస్తుంది ఆమె.
    "రండి ......" అంది నవ్వుతూ.
    ఆవేళ ఆమె రూపం సరికొత్త అందాన్ని సంతరించుకొన్నట్లుంది.
    లోపలకు నడిచి కుర్చీలో కూర్చున్నాడతను.
    అప్పటికే లోకుల మరో నలుగురు మగవాళ్ళు కూర్చుని ఉన్నారు. అందులో ఒకతను కాలేజి విద్యార్ధిలా కనిపించాడు.
    "ఈయన సురేంద్ర మా ఆఫీస్ లో పని చేస్తారు ....." అంటూ వారికి పరిచయం చేసింది సురేంద్రని.
    "ఈయన మా ఫాదర్ ప్రెండ్ ! ఈయన నా ఎలిమెంటరీ స్కూల్ మేట్ - రాజు -- ఈయన నరసింహంగారు. మా ఇంటి పక్క గదిలో ఉంటారు. ఇతను శంకర్ నాతొ కాలేజీలో చదివాడు ఆఫ్ కోర్స్ రెండుసార్లు తప్పి ఇంకా చదువుతూనే ఉన్నాడు."
    అందరికీ నమస్కరించాడు సురేంద్ర.
    మరికొద్దిసేపటిలో అందరికీ స్వీట్ లు, హాట్ లు ప్లేటు లలో పెట్టి తీసుకొచ్చి అందించిందామె.
    "ఇంతకూ ఇవాళ ఈ హడావుడేమిటో చెప్పనే లేదు " నవ్వుతూ అన్నాడు సురేంద్ర.
    "మీకు తెలియదా? ఇవాళ మాధురి పుట్టింది. గంటసేపయింది లెండి పుట్టి ...." అన్నాడు శంకర్ ఆమె వంక చూస్తూ.
    "ఈమె కందరూ మొగస్నేహితులేనా ?" అనుకొన్నాడు సురేంద్ర బాధగా.
    ఆడపిల్లలకీ అడస్నేహితులుంటేనే అందంగా వుంటుంది కాని అలా ఉండేటట్టయితే తనీనాడు ఆమెకు ఇంత దగ్గరయ్యే అవకాశమే ఉండేది కాదేమో.
    కాఫీ తాగాక అందరూ వెళ్ళిపోయారు.
    "మరి నేనూ శెలవు తీసుకోనా?" అడిగాడు సురేంద్ర.
    "ఆగండి! మీకు తొందరేముందీ?" నవ్వుతూ అందామె.
    "నాకు మీమీద చాలా కోపంగా ఉంది ....."అన్నాడు సురేంద్ర కోపం నటిస్తూ.
    "ఎందుకూ?"
    "ఇవాళ మీ "బర్త్ డే" అని నాతో ముందే ఎందుకూ చెప్పలేదు ."
    "చెబితే ఏం చేసేవారు?"
    "అది మీ కనవసరం ."
    "బావుంది ! నా సంగతి నాకనవసరమేమిటి ?"
    సురేంద్ర ఏమీ మాట్లాడలేదు. నవ్వుతోన్న ఆమె వంకే చూస్తూ కూర్చుండి పోయాడు. చటుక్కున ఆలోచన వచ్చిందతనికి. మాధురినిప్పుడు మార్కెట్ కి తీసుకెళ్ళి ఏదయినా ప్రజంటేషన్ కొనినే? తననింతవరకూ ఏ ఆడపిల్లా పుట్టినరోజుకి పిలవలేదు.
    "మీరూ చేసిన తప్పుకి శిక్షమిటో తెలుసా ?" అడిగడతను.
    "ఎమిటట?"
    "ఇప్పుడు నాతో అలా షికారుకి రావడం ."
    "ఇప్పుడా?"
    "అవును ."
    కొద్ది క్షణాలు అలోచించి "సరే - పదండి " అంది.
    ఇద్దరూ రోడ్డు పక్కనే నడవసాగారు. ఖాళీగా వస్తున్న అటో రిక్షా పిలిచాడతను.
    "ఎక్కడికిప్పుడు?" అడిగిందామె.
    "అదేమీ అడగకూడదు...."
    మార్కెట్ లో అటో దిగి ఇద్దరూ ఓ పెద్ద బట్టల షాపులోకి నడిచారు.
    "ఎవరికి బట్టలు?" అక్కడే ఆగిపోతూ అడిగిందామె.
    ఆమె చేయి పట్టుకొని కౌంటర్ దగ్గరకు బలవంతంగా లాక్కేళ్ళాడతను. అతని చనువుకి ఆశ్చర్యపోయిందామె. సురేంద్రకు ఆమె స్పర్శ పులకరింతలు కలుగజేసింది. అలా చేయి పట్టుకు లాగాలని తను అలోకోలేదసలు -- అంతా అకస్మాత్తుగా జరిగిపోయింది. నెమ్మదిగా అతని చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొందామె.
    రకరకాల చీరలు చూపిస్తున్నాడు షాపువాడు.
    ఓ చీర పైకి లాగి "ఇదెలా వుంది మీకు ?" అనడిగాడు సురేంద్ర.
    "బాగానే వుంది " అంది మాధురి.
    "ఈ చీరకి తగిన బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చి పాక్ చేయండి " అన్నాడతను.
    రెండింటికీ నూట అరవై రూపాయలు బిల్లు చెల్లించాడతను. అతని వెనకనే మౌనంగా బయటకు నడిచింది మాధురి.

 Previous Page Next Page