బలవంతంగా ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు మూసుకొంది సావిత్రి. ఉదయం మెలకువ వచ్చేసరికి బాగా ఆలస్యం అయిపోయింది. త్వరత్వరగా వంట ముగించి ఆఫీస్ కీ బయలుదేరింది. అతను అప్పుడే తనకోసం ఎదురుచూస్తూ కనిపించాడు.
"మీకోసమే వస్తున్నాను. ఇవాళ మీరు ఐదు నిమిషాలు ఆలస్యంగా బయలుదేరారు..." అన్నాడు నవ్వుతూ.
అంటే తను ఖచ్చితంగా ఏ టైముకి బయలుదేరి తిరిగొచ్చేదీ కూడా ఇతగాడి దగ్గర రికార్డ్ ఉందన్నమాట.
"ఇవాళ నిద్ర మెలకువ రావడం ఆలస్యం అయిపోయింది__" నవ్వుతూ అంది తను.
ఇద్దరూ పక్కపక్కనే నడువసాగేరు. కోఠి చేరుకుని బస్ స్టాప్ లో నిలబడ్డారు. బస్ లు చాలా రష్ గా ఉన్నాయి. ఒక బస్ లో ముందునుంచీ తను ఎక్కగలిగినా శంకర్ ఎక్కలేకపోయేసరికి మళ్ళీ దిగిపోవాల్సొచ్చింది.
"మీకు నా మూలాన ఆలస్యం అయిపోతోందనుకొంటాను!" నవ్వుతూ అన్నాడు శంకర్.
తనూ నవ్వి ఊరుకొంది. మరొక్క పావుగంట మాత్రమే మిగిలింది ఆఫీస్ చేరుకోడానికి.
"పోనీ ఆటోలో వెళితే టైముకి చేరుకోగలమేమో అతనే తిరిగి అన్నాడు.
తనూ అదే అనుకొంటోందప్పుడు. పదింటికి ఆఫీస్ లో ఉండకపోతే లేనిపోని గొడవలు తయారవుతాయ్. హెడ్ క్లర్క్ తనవేపు కళ్ళజోడులోనుంచి అదోరకంగా చూస్తాడు... "పావుగంట లేటా...?" అంటాడు అధికార స్వరంతో.
తను తప్పయి పోయిందని వప్పుకొంటే మరిన్ని సమస్య లెదురవుతాయ్. తనతో సరసాలు మొదలెడతాడు. చనువు తీసుకోడానికి ప్రయత్నిస్తాడు. తనను ఆకర్షించడానికి ఎన్నో కబుర్లు చెప్తాడు.
తనకు వయసు మళ్ళినట్లు కనబడుతున్నా తనలోని యవ్వనం చెక్కుచెదరకుండా అలాగే ఉందనీ, అందరూ తనకి ముప్పై తొమ్మిదేళ్ళంటే నమ్మటంలేదనీ, పాతికేళ్ళకంటే యెక్కువ వుండవంటున్నారనీ_ఒకటేమిటీ_తనకి అసహ్యం, చిరాకూ కూడా పుట్టుకొస్తాయ్. కాని అవి రెండూ ప్రదర్శించడానికి వీల్లేని ఇరకాటంలో వుండిపోతుంది. ఓసారి శాంత అలాగే పదినిమిషాలు ఆలస్యంగా వచ్చింది ఆఫీసుకి. అది సాకుగా తీసుకొని ఆమెని "సాయంత్రం సినిమా కొస్తావా?" అనడిగేశాడు. శాంతకి కోపం వచ్చి అక్కడే ఇష్టమొచ్చినట్లు దులిపేసి ఆ రోజుకి శెలవు చీటీ ఇచ్చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అప్పటినుంచీ అంత ధైర్యంగా ఆడపిల్లల జోలికి రావడం తగ్గించాడు.
ఆటోని పిలిచింది సావిత్రి...ఇద్దరూ చెరో చివరకూ కూర్చున్నారు. తీరా ఆఫీసు చేరుకొన్నాక అతనిని తన వెంబడి లోపలకు తీసుకెళ్ళాలా వద్దా అన్న ఆలోచనలో పడింది సావిత్రి. అందరూ తామిద్దరినీ చూసి_తరువాత "అతనెవరూ" అని అడిగితే ఏమి చెప్పగలదు? ఉన్నదున్నట్లు చెప్పినా లేనిపోని అర్ధాలు తీసుకోరని ఎలా అనుకోగలదు? అలా అనిచెప్పి అతనిని బయట నిలబెట్టి మాట్లాడటం కూడా ఆమెకు నచ్చలేదు. అది ఎవరికంటన్నా పడితే మరిన్ని కథలకు ఆస్కారమవుతుంది.
సరాసరి ఆమె టేబుల్ దగ్గరకు నడిచారిద్దరూ.
"కూర్చోండి?" అంది స్టూల్ కి అతనివేపు జరుపుతూ. అతను టేబుల్ మీద రెండు చేతులూ పెట్టుకొని కూర్చున్నాడు. అందరి చూపులూ తమవైపే ఉండటం గమనించింది సావిత్రి. రిజిష్టర్ లో సంతకం పెట్టి తిరిగివచ్చి తన సీట్లో కూర్చుందామె. సొరుగులో నుంచి అప్లికేషన్స్ బయటకు తీసి అతనికందించింది.
అన్నీ ఓమారు చూసుకొని "థాంక్యూ మీకు చాలా శ్రమ ఇచ్చాను" అన్నాడు తను నవ్వుతూ.
"ఇందులో శ్రమేముందిలెండి! అయినా నామూలాన మీకే ఇప్పుడు మా ఆఫీసుకి రావాల్సిన శ్రమ కలిగింది." అంది తనూ నవ్వేస్తూ.
"మీ ఆఫీసులో ఏమయినా టెంపరరీ వేకెన్సీలు వస్తాయా?" అడిగాడతను.
"ఊహు? అదివరకలా వేకెన్సీలు రావడం, మా ఆఫీసరే అపాయింట్ చేసుకోవడం జరుగుతూండేది కాని_ ఆ మధ్య ఆ పద్ధతి రద్దయిపోయింది. అన్నీ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజ్ నుంచి రావాల్సిందే...అదీగాక ఇప్పుడసలు వేకెన్సీలే లేవు" వివరంగా చెప్పింది సావిత్రి...దూరంగా కూర్చున్న హేమలత, శారద తనవంకే ఆసక్తిగా చూడటం ఆమెకోవిధమయిన గర్వాన్ని కలుగజేసింది...బహుశా అతనిలాంటి అందమయిన యువకుడితో మాట్లాడడం_వాళ్ళకు ఈర్ష్య కలిగిస్తుందేమో! తననీ, శాంతనీ అదివరలో వాళ్ళంతా ఊరికే అవహేళన జేస్తుండేవారు...మగాళ్ళతో సోషల్ గా తిరగరని, మగ ఫ్రెండ్ ఎవరూ లేరనీ, యింకా తామిద్దరిలోనూ బూజుపట్టిన భావాలు వదలలేదనీ__