Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 23

 

    రాగిణి మాట్లాడలేదు. అసలే బాధపడుతున్న రాగిణిని తను మరింత బాధ పెడుతున్నానా అనుకుంది. సంభాషణ మార్చాలని "రాగిణీ! నువ్వు నాకొక్క సహాయం చెయ్యగలవా?" అంది.
    రాగిణి ఉత్సాహంతో మొహమంతా వెలిగిపోతుండగా పట్టరాని సంతోషంతో "నేను నీకు సహాయం చెయ్యగలనా? తప్పకుండా చేస్తాను. చెప్పు" అంది.
    తనకు సహాయం చెయ్యటానికి రాగిణి ఇంత ఉత్సాహపడుతుందని లలిత ఏనాడూ అనుకోలేదు. అంతకు ముందు వరకు ఏడవటం వలన ఉబ్బిన ఆ ముఖంలో కొత్తగా వచ్చిన వికాసాన్ని చూస్తూ , "నేను ఎప్పుడూ నా ఆనందమే చూసుకుంటాను. మరొకరి అనందం కోసం నా అనందం త్యాగం చెయ్యను. అయినా నేను వచ్చిన పని చెప్తున్నాను. ఆలోచించుకుని చెయ్యగలిగితేనే చెయ్యి. నాకోసం కాదు. మాధవరావు గారి కోసం" అంది లలిత.
    "అయన కోసమయితే మరింత సంతోషంగా చేస్తాను చెప్పు."
    "బాపినీడుగారికి సంబంధించిన రహస్యాలు తెలుసుకుని చెప్పమన్నారు."
    "అదా........"
    "ఏం? ఇష్టం లేదా?"
    "ఇష్టం లేకపోవటం కాదు. నాకు కూడా ఏదీ సరిగ్గా తెలియదు. వాళ్ళు తెలియనివ్వరు. అన్ని విధాల జాగ్రత్తలో ఉంటారు. శ్యామలాంబగారు నన్ను ఎవరెవరి దగ్గిరకు పంపిస్తారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పగలను . ప్రస్తుతానికి నేను చెయ్యగలిగినదింతే!"
    రాగిణి చెప్పిన పేర్లన్నీ ఒక కాగితం మీద రాసుకుంది లలిత.
    "లలితా! నిన్నోక్కటి అడగనా?" సంకోచిస్తూ అంది రాగిణి.
    "అడుగు"
    "ఈ ప్రయత్నమంతా రాజు నిర్దోషి అని రుజువు చెయ్యటానికేనా? రాజును పెళ్ళి చేసుకోవాలనేనా ఈ తాపత్రయమంతా."
    కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది లలిత చివరకు సమాధానం చెప్పింది.
    "కాదు. రాజు గురించి నేనేమీ ఆలోచించటం లేదు."
    "మరి......?" రాగిణి ప్రశ్నార్ధకాన్ని అలాగే వదిలేసి "వెళ్ళొస్తాను" అని అక్కడ్నుంచి వచ్చేసింది లలిత.
    
                                           18

    మోహన్ విడుదలయ్యాడు . మాధవరావు ప్రయత్నం వల్ల మోహన్ కి ఉద్యోగం కూడా దొరికింది. జానకమ్మ కోలుకుంది. లేచి తిరుగుతోంది.
    రాజు వచ్చాడు. వస్తూ వెంకట్రావు కోసం పళ్ళూ, మిఠాయిలు తీసుకొచ్చాడు. వెంకట్రావు ఆనందంగా వాటి నందుకున్నాడు. జానకమ్మ కి చక్కని లక్ష్మి విగ్రహం తీసుకొచ్చాడు. "ఎందుకు బాబూ!" అంటూ కాదనలేక తీసుకుంది జానకమ్మ. మోహన్ కి మంచి పర్స్ ఇచ్చాడు. లలితకు చక్కని రాదాకృష్ణుల విగ్రహం కానుకగా తెచ్చాడు . లలిత మాత్రం అది తీసుకోలేదు.
    "ప్లీజ్! తీసుకో లలితా! నీకోసం షాపులన్నీ గాలించి తెచ్చాను." అన్నాడు రాజు.
    'ఆయామ్ సారీ రాజూ! పరాయివాళ్ళ నుండి బహుమతులు తీసుకోవటం నాకు అలవాటు లేదు."
    రాజు ముఖం చిన్నబోయింది.
    "ఈనాడు నేను కొంచెం కష్టదశలో ఉన్నానని చిన్న చూపు చూడకు లలితా! మళ్ళీ నాకు మంచి రోజులు రాకపోవు." నిష్టూరంగా అన్నాడు.
    నిర్ఘాంతపోయింది లలిత!
    నెపం తనమీద వేస్తున్నాడు రాజు. భరింపరాని కోపం వచ్చినా నిగ్రహించుకుంది. శాంతంగా సమాధానం చెప్పింది.
    "మారుతున్న దశలను బట్టి మనసు మార్చుకోవటం నాకు అలవాటు లేదు రాజు! ఎదుటి మనుష్యులను అర్ధం చేసుకున్నప్పుడు మాత్రం దానికి అనుగుణంగా నా మనసు మార్చుకుంటాను."
    రాజు సమాధానం చెప్పలేకపోయాడు."
    ఇదెక్కడి రాజు! ఇలాంటి రాజు నా  తను ప్రేమించింది! ఆరోజుల్లో రాజులోని ఈ మూర్తి తనకు కనబడకుండా ఎక్కడ దాక్కుంది? ఆలోచిస్తుంది లలిత.
    "మోహన్ కి మాధవరావుగారి ప్రయత్నం వల్లే ఉద్యోగం దొరికిందటగా!" ఉన్నట్లుండి అడిగాడు రాజు.
    "అవును. ఎవరో ఒకరి ప్రయత్నం లేకుండా ఉద్యోగాలు దొరికే రోజులు కావు కదా, ఇవి!"
    "అంతే ! అంతే! లలితా! దయచేసి కొంచెం నా విషయం కూడా మాధవరావుగారికి చెప్పవూ?"
    లలిత మనసులో చీదర తారాస్థాయికి నందుకుంది. రాజుని ఎడిపించాలనిపించింది.
    "నేను చెప్తే అయన చేస్తారని నమ్మకమేనా రాజూ?"
    "తప్పకుండా చేస్తారు. ఆయనకు నువ్వంటే చాలా అభిమానం!"
    "ఎంత అభిమానం ఉంటె మాత్రం? మొగవాళ్ళు తాము అభిమానించే వ్యక్తులకి ఊరికే సాయం చేయరు. ఆ అభిమానం తిరిగి పొందగలిగినప్పుడే చేస్తారు!"
    "నీకూ ఆయనంటే అభిమానమేగా లలితా!"
    "ఆ సంగతి నీకు తెలుసా రాజూ!"
    "ఎందుకు తెలియదు? అందరికీ తెలుసు!"
    "ఒహో! అందరికీ తెలుసన్నమాట! అయితే నువ్వు నన్నెలా పెళ్ళి చెసుకుంటావ్!"
    "అదేమిటి లలితా!"
    "ఛీ! ఛీ! సిగ్గులేదూ?"
    అప్పటికి లలిత తన నెక్కడికి లాక్కుపోతోందో రాజుకి అరమయింది. అవమానంతో లోలోపల ఉడికిపోయాడు. రాజు అవస్థ అర్ధం చేసుకున్న లలిత హాయిగా నవ్వింది.
    దిగ్గున లేచి వెళ్ళిపోయాడు రాజు.
    'పరవాలేదు' అనుకుంది లలిత.
    రాగిణి దగ్గిరనుండి లలిత తెచ్చి ఇచ్చిన పేర్లు చూసిన మాధవరావుకు మతిపోయినట్లయింది. వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఎంతో పరపతి గల వాళ్ళు. అలాంటి వ్యక్తుల విషయంలో అనుమానించి విచారణ సాగించటం మాటలు కాదు. అయినా మాధవరావు సాహసిచాడు. విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. శ్యామలాంబగారు రాగిణిని, ఇంకా రాగిణి లాంటి వాళ్ళనూ ఉపయోగించి, ఆయా ఆఫీసర్ల చేత అనేక రకాల గ్రాంటులు సేంక్షన్ చేయించుకుంది. వీటిల్లో చాలా సంస్థలు కేవలం కాగితాల మీదనే ఉన్నాయి . మరికొన్ని నామమాత్రంగా ఉన్నాయి.
    ఈ విషయాలన్నీ అన్ని వివరాలతో పత్రికలలో వచ్చాయి. ఆ ఆఫీసర్ల మీద ఏక్షన్ తీసుకున్నారు. బాపినీడుకు రగిలిపోయింది. కోపంగా రాగిణి దగ్గిర  కొచ్చి బెల్టుతో గొడ్డును బాదినట్లు బాదాడు.
    "నాకేం తెలియదు." అని గోలపెట్టింది రాగిణి.
    "తెలీదూ! నువ్వు కాకపొతే , ఆ మాధవరావుకీ సమాచారం అందజేసింది ఎవరు? దొంగ రాస్కెల్! ఎంత గుండెలు తీసిన బంటువే! ఇంటిముందు కాపలా పెట్టాను. ఫోన్ కాల్స్ చెక్ చేయిస్తున్నాను. అయినా ఎలాగో ఒకలాగ సాధించావు. చెప్పు వాడికీ సమాచారం ఎలా అందించావో చెప్పు........"
    మళ్ళీ బాదాడు బాపినీడు.

 Previous Page Next Page