బాపినీడు మాటలు తనకు కలిగించిన బాధ ముందు ఆ దెబ్బల బాధ మరిచిపోయింది రాగిణి.
"దుర్మార్గుడా! ఇదా, నువ్వు చేస్తున్న పని? ఇందుకా నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నది?"
"ఓహో! మరి తమ రెందుకండీ నన్ను పెళ్ళి చేసుకుంది? నన్ను అలా వీపు తిప్పనిచ్చి అడ్డమైన గాడిదలనీ రప్పించుకుని నా డబ్బుతో కులకటానికా? పదిమందిలో ఇష్టం వచ్చింట్లు ఊరిగి నా పరువు బజారు పాలు చేయతానికా? రోగ్! పెళ్ళట , పెళ్ళి.......ఎన్ని జన్మలకు తెలుస్తుందే పెళ్ళికి అర్ధం నీకు?"
కసిగా మాట్లాడుతున్న బాపినీడు ఫోన్ మ్రోగటంతో రాగిణిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్ లో మాట్లాడుతూ జేబులోంచి నీలం అట్ట ఉన్న చిన్న బైండు తీసి దానిలో ఏదో వ్రాసుకోవటం గమనించింది రాగిణి. అతడు ఇదివరలో కూడా అలానే కొన్ని ముఖ్య విషయాలు నోట్ చేసుకునేవాడని గుర్తుకొచ్చింది.
19
"లలితా! ఇవాళ సాయంత్రం మనం సినిమా కెళ్దాం!" అంది మణిమాల.
లలిత ఎప్పటిలా తల ఊపలేదు. ముఖం చిట్లించుకుని "ఇంక ఈ కపట నాటకాలూ సాగవూ మణిమాలా!" అనేసింది.
మణిమాల తరచుగా లలితను ఏదో ఒక ప్రోగ్రాం అంటూ బయలుదేర తీయ్యటమూ. చివరి క్షణంలో ఏదో వంకతో తను తప్పించుకుని మాధవరావునూ, లలితనూ మాత్రమే పంపాలని చూడటమూ, మాధవరావు తెలివిగా ఆ సమయానికి ఏదో ఒక పని ఉందని తప్పుకోవతమూ మామూలైపోయింది. ఎప్పటికప్పుడు మాధవరావుతో కలిసి బయలు దేరటానికి తను సిద్దమైనట్లు కనపడటమూ, అతడు తప్పుకోవటమూ, లలితకు చాలా అవమానంగా ఉంది. నిజానికి లలిత ఒప్పుకుంటున్నది మణిమాల మాటలు కాదనలేని మొహమాటంతో ......మాధవరావు కూడా తనతో కలిసి రావటానికి సిద్దపడితే , అప్పుడు తన మనసెలా ఉండేదో, దానికి లలిత దగ్గర సమాధానం లేదు.
ఒకపక్క ఈ అవమానమే భరింపలేకుండా ఉంటే అంతకంటే ఎక్కువగా బాధిస్తోంది నిరాశతో. "నేనేమయిపోయినా పరవాలేద"ని కృంగిపోతున్న మాధవరావు ముఖం.
అందుకే ఏమయితే అయిందని ధైర్యంగా ఎదుర్కొంది మణిమాలని.
"కపట నాటకాలా?" ఆశ్చర్యం నటిస్తూ అంది మణిమాల.
లలితకి మరింత మండిపోయింది.
"నువ్వు డాక్టర్ వినోద్ తో ఇష్టం వచ్చినట్లు తిరగటం కోసం మాధవరావుగారి కోక జతను చూసి పెట్టక్కర్లేదు. అందుకు నన్ను ఉపయోగించుకుంటానంటే నేను ఒప్పుకోను."
లలిత మాటలకు మణిమాల కోపం తెచ్చుకోలేదు సరికదా, తనకు అలవాటైన ధోరణిలో నిర్లక్ష్యంగా నవ్వింది.
"పూర్ లలితా! నేను డాక్టర్ వినోద్ తో కలిసి తిరగాలనుకుంటే అడ్డు చెప్పేదెవరు? అందుకోసం మాధవ్ కోక జతను చూడక్కర్లేదు నేను......"
లలితలో కసి పెరిగిపోతోంది.
"అయితే ఇంకేం? ఊరేగు? మధ్యలో నన్నెందుకు చంపుతావ్?
"మాధవ్ ని కూడా సుఖపడేలా చేద్దామని.........."
"ఆహా! ఎంత ప్రేమ! ఆదర్శ పత్నివంటే నువ్వే! కానీ ఇంత కాలమయినా ఆయన్ని నువ్వు అర్ధం చేసుకోలేదా? ఒక ధర్మానికి, ఒక నీతికీ కట్టుబడి ప్రవర్తించే మనిషి అయన. ఏ సుఖాలకోసమూ, తను అధర్మమని అనుకున్న మార్గంలో అడుగుపెట్టరు. భార్య చచ్చిపోతే మరొక పెళ్ళి చేసుకుంటారేమో! ధైర్యంగా విడాకులిచ్చి విడిపోతే మరొకరిని ప్రేమించగలరేమో! కానీ, తాళి కటిన భార్య ఉండగా ఏ పరిస్థితిల్లోనూ అయన మరొక జంటను వెతుక్కోరు. ఇంక ఈ వృధా ప్రయత్నాలు మానెయ్యి........"
మణిమాల మాట్లాడలేదు. లలితకు మరింత ధైర్యం వచ్చింది.
"మణిమాలా! నా మాట విను. ఉబిగుంటలో ఉన్న నిర్గంద కుసుమం కోసం పరుగులు పెట్టకు........"
"షటప్! గెటవుట్!" గట్టిగా అరిచింది మణిమాల.
"వెళుతున్నాను. కానీ మనం మళ్ళీ కబురు పంపగానే వస్తాను. మళ్ళీ చెప్తున్నాను. అదృష్టవంతులందరిలో అదృష్టవంతురాలివి జీవితాన్ని చేతులారా నరకం చేసుకోకు!"
లలిత వెళ్ళిపోయినా , మణిమాల చాలాసేపు ఆలోచిస్తూ కూచుండిపోయింది. చివరకు లేచి డాక్టర్ వినోద్ దగ్గరకే బయలుదేరింది. ఎప్పటిలాగే మాధవ్ కు స్లిప్ రాసి పెట్టింది.
రాత్రి పదిగంటల సమయంలో కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన మాధవరావు రాగిణి చూసి తెల్లబోయాడు.
గడగడ వణికిపోతోంది రాగిణి. "నన్ను లోపలకు రానియ్యరూ? లేకపోతే తిన్నగా ఏ రైలు కిందకో పోయి ఆత్మహత్య చేసుకోవాల్సిందే!"
"రండి! రండి!" అన్నాడు మాధవరావు.
ఆ రోజు బాపినీడు రాగిణి దగ్గిరే ఉన్నాడు. బాపినీడు ఉండటం వల్ల చౌకీదారు నిర్లక్ష్యంగా నిద్రపోతున్నాడు. రాగిణి ఇంతకు తెగిస్తుందని ఊహించలేని బాపినీడు బాగా తాగి మత్తుగా నిద్రపోతున్నాడు. అలాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వచ్చేసింది రాగిణి.
రాగిణి సాహసానికి మాధవరావు కూడా ఆశ్చర్యపోయాడు. అభిమానంగా రాగిణి చెయ్యి పట్టుకుని "ఎంత పని చేసావు రాగిణి! ఎంత ప్రమాదం?" అన్నాడు. "మీరీ మాత్రం ఆదరంగా మాట్లాడతానంటే ఇంకా ఎంత సాహసమైనా చేస్తాను." అంది రాగిణి చిరునవ్వుతో. మాధవరావు గతుక్కుమని రాగిణి చెయ్యి వదిలి దూరంగా కూచున్నాడు. పకపక నవ్వింది రాగిణి మెరుస్తున్న కళ్ళతో. ...మాధవరావు తేరుకుని "ఎందుకొచ్చారు?" అన్నాడు.
"మీకు సహాయం చెయ్యటానికే వచ్చాను. బాపినీడు తను ఎవరికి సహాయం చేసినా , ఏం చేసినా, ఆ వివరాలు డైరీలలాంటి చిన్న నీలి అట్ట బౌండు బుక్స్ లో రాసుకుంటాడు. అలాంటివి సాధారణంగా అతని బట్టల బీరువాలో ఒక షెల్ఫ్ లో ఉంటాయి. ఇంకా ఏవేవో కాగితాలు కూడా చూసినట్లు గుర్తు. ఇంతకంటే నాకేం తెలియదు."
మాధవరావు ఆలోచనలో పడ్డాడు. బాపినీడు లాంటి ప్రముఖువ్యక్తీ ఇంటిమీద రైడ్ చెయ్యటం మాటలు కాదు. ఒకవేళ ఏ ఆధారాలూ దొరక్కపోతే తన పని ఇరుకున పడుతుంది. కానీ, రాగిణి మాటలను బట్టి బాపినీడు ఏదో కుంబకోణం నడిపిస్తున్నట్లే ఉంది.
"మీరు నాకొక్క ఉపకారం చెయ్యాలి."
మళ్ళీ వణికిపోతూ అంది రాగిణి.
"ఏమిటి?" అనుమానంగా అడిగాడు మాధవరావు.
"దయచేసి నన్ను జైల్లో పెట్టించాలి!"
"నీకు మతి పోయిందా?" ఇదా, ఉపకారం?"
"అవును, ఇదే పెద్ద ఉపకారం. జైల్లో పోలీసు కాపలా మధ్య గాక, ఎక్కడున్నా నన్ను బాపినీడు బ్రతకనివ్వడు. నాకు బ్రతకాలని ఉంది. బాపినీడు అరెస్ట్ కావటం చూడటానికి బ్రతకాలని ఉంది. చెప్పండి. నన్ను జైల్లో పెడతారా? లేదా?"
మాధవరావు జాలిగా చూసాడు రాగిణిని.
చివరకు తనకు తానై జైలు కోరుకునే పరిస్థితికి వచ్చింది రాగిణి!
మాధవరావు అతి సాహసంతో బాపినీడు ఇంటిమీద రైడ్ చేసాడు. బాపినీడుకి వ్యవధి ఇయ్యకుండా రాగిణి తన దగ్గిరకు వచ్చిన వెంటనే రైడ్ చేసాడు. బాపినీడు ఇంట్లో బయటపడిన రకరకాల డాక్యుమెంట్స్ బట్టీ డైరీలను బట్టీ చాలా విషయాలు బయటపడ్డాయి.
బాపినీడు రెండు మూడు అక్రమ వ్యాపార సంస్థలతో లావాదేవీలున్నాయి. డబ్బు పెట్టుబడిగా పెట్టి అతడు అయిదారుగురిని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఆ అధికారాన్ని వినియోగించుకుని మళ్ళీ డబ్బు చేసుకుంటూన్నాడు. అతనికి ఇదీ ఒక రకమైన వ్యాపారమయిపోయింది. శ్యామలాంబ అతనికి కుడిచెయ్యిలా పనిచేస్తోంది. సేవాసదనంలో ఉన్న స్త్రీలనందరినీ వాళ్ళు సమయానుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లలో కూడా కొందరు బాపినీడుతో చేతులు కలిపిన వారున్నారు. అందుకే బాపినీడుకి మరీ అడ్డు లేకుండా పోయింది. గవర్నమెంట్ డబ్బు స్వాహ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో అయినా ఆ విషయం బయట పడక మానదు. అప్పుడెప్పుడో ఒకరిని సంఘానికీ, ప్రభుత్వానికి, దోషిగా చూపించాలి. ఆ సమయానికి ఎవరో ఒకరిని పావుగా వినియోగించుకుంటారు. రాజుని అలాగే ఉపయోగించుకున్నారు.
రాజు నిర్ధిషి అని రుజువయింది. బాపినీడు అరెస్టయ్యాడు.