Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 23

   

      పరీక్ష పోయిందని తెలుసు.

    బాధ పడలేదు.
   
    ఆ కాగితమే ఇచ్చి ఇంటికొచ్చేసింది. ఏదో కసి కసి!
   
    ఆ 'కసే' అధోపాతాళపు మెట్టుమీద ఆమె జారిపోటానికి మొదటి మెట్టు.
   
    ఆ సంవత్సరం ఆమె పరీక్ష పోయింది.
   
                              *    *    *
   
    ఇంటికొచ్చీ రాగానే తల్లి ఒడిలో తల పెట్టుకుని భోరున ఏడ్చింది సాహితి.
   
    నిర్మల కంగారుపడి "ఏమైందమ్మా! ఏమైంది?" అంది.
   
    వెక్కుతూ తనకు తెలిసిన విషయమంతా చెప్పింది తల్లికి.
   
    గాఢమైన నిశ్శబ్దం.
   
    ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ నిర్మల నెమ్మదిగా అంది- "నాకీ విషయం తెలుసునమ్మా."
   
    ఆ మాటలకి సాహితికి దుఃఖం రాలేదు- ఆశ్చర్యం కలుగలేదు.
   
    భయం వేసింది.
   
    తల్లివైపు భయంగా, అయోమయంగా చూసింది.
   
    పరమహంసకి తనతో వివాహం జరక్కముందే ఇంకో వివాహం జరిగిందని తన తల్లికి తెలుసు! అయినా వూరుకుంది. అంతకంటే ముఖ్యంగా.....
   
    ఈ విషయం తనకి చె.....ప్ప....లే....దు.
   
                              *    *    *
   
    పరమహంస పదిహేను రోజుల్నుంచి ఇంటికి రావటంలేదు.
   
    నిర్మల దిగులుగా వుంటోంది.
   
    సాహితికి కోపం తగ్గిపోయి, ఆస్థానే తల్లిమీద జాలి....ఏం జరిగిందోనన్న ఆతృత చోటు చేసుకున్నాయి. పరమహంస ఆ టెక్నిక్ ని చాలాసార్లు ఉపయోగిస్తాడు. పది, పదిహేను రోజులు కనబడకుండా పోతాడు. తన 'అలక'ని ఆ విధంగా సున్నితంగా చూపిస్తాడు. తరువాత చిరునవ్వుతో వచ్చి, ఎదుటివాళ్ళని క్షమిస్తాడు. సాహితి ఆ రోజు కాలేజీ వదిలి బయటకొచ్చేసరికి నౌఖరు వరండా దగ్గర గొడుగు పట్టుకుని నిలబడ్డాడు.
   
    ఆ అమ్మాయి మనసంతా సంతోషంతో నిండిపోయింది. వర్షం రాబోతుందని తెలిసి, గొడుగిచ్చి మరీ పంపింది. ఎన్ని గొడవలున్నా తనని మర్చిపోదు అమ్మ పెళ్ళి చేసుకున్నా ధ్యాసంతా తనమీదే. కారు ఆగగానే పోర్టికోలో ఉత్సాహంగా దిగింది. పక్కనే మరొక కారుంది....కొత్తది!
   
    "ఇదెవరిది?"
   
    "పరమహంసగారిదమ్మా!"
   
    సాహితి మొహంలో నవ్వు మాయమైంది.
   
    "మమ్మీ ఏది?" అడిగింది.
   
    "పరమహంస బాబుగారి గదిలో వుందమ్మా."
   
    కాఫీ కప్పు ఆవిడ చేతిలో పెట్టేసి కోపంగా వెళ్ళి తలుపుల మీద గట్టిగా బాదింది సాహితి. తెరిచే వున్నాయి తలుపులు.
   
    పరమహంస సోఫాలో జారగిలబడి కూర్చున్నాడు. కాళ్ళు ఎదురుగా టీపాయ్ మీదున్నాయి. నిర్మల అతని కాళ్ళ దగ్గర కూర్చుని అరికాళ్ళకు మందు రాస్తోంది. సాహితిని అంత అకస్మాత్తుగా చూడగానే నిర్మల తడబడింది. పరమహంస మాత్రం చిన్నగా నవ్వాడు.
   
    "రామ్మా! సాహితీ! అలా నిలబడిపోయావేం? దగ్గరగా రా చాలా చిక్కిపోయావు" ఆ స్వరంలో ఎంతో ఆప్యాయత.
   
    సాహితి అదేమీ విననట్టుగా తల్లిచేసే పనినే చూస్తోంది. ఆవిడకు ఎందుకంత భక్తి అతడంటే? తండ్రికి ఈ విధంగా శుశ్రూష చేయడం ఎన్నడూ చూడలేదు. ఆమె ఆలోచన గ్రహించి నట్టుగా "మీ అంకుల్ చేసినపని చూడమ్మా.... కొత్తకారు కొనుక్కుని తిరుపతి వెళ్ళాలంటే కారులోనే వెళ్ళొచ్చుగ, నడిచి వెళ్ళారట. చెప్పులయినా లేకుండా కొండెక్కారట" ఆవిడ మాటలు తన ప్రవర్తనకు సంజాయిషీ యిస్తున్నట్లుగా లేవు. ఆ స్వరంలో ఆయనపట్ల భక్తిభావం కనిపించిందంతె.
   
    "అలా నిలబడిపోయావేం సాహితీ! దగ్గరకు రా తల్లీ" పరమహంస మరోసారి పిలిచాడు.
   
    "మీరు చేసిన పని నాకు నచ్చలేదు. మీరంటే అసహ్యమేస్తోంది" అంది సాహితి. ఆ అమ్మాయి ఎప్పుడూ అలా మాట్లాడలేదు. చాలా నెమ్మదయిన పిల్లగా పేరు తెచ్చుకుంది. అలాంటిది అంత మాటనేసరికి నిర్మల అదిరిపడింది. మొహంలో రక్తం ఇంకి పోయి పాలిపోయింది.
   
    "సాహితీ!" అని అరిచింది కోపంగా.
   
    "నువ్వూరుకో నిర్మలా! అమ్మాయితో నేను మాట్లాడతానుగా! ఇలా రామ్మా! నీకే విషయంలో కోపమొచ్చిందో అర్ధం చేసుకోగలను. అసలు జరిగిందేమిటో సావధానంగా విని అప్పటికీ తప్పు నాదేనంటే ఎలాంటి శిక్ష విధించాలో నువ్వే నిర్ణయించుకుందువు గాని."
   
    అతని మాటల్లో సిన్సియారిటీ, అంతకు మించిన మార్దవతా ఆమెను కాస్త మెత్తబడేలా చేశాయి. కానీ అక్కడ్నుంచి కదల్లేదు.
   
    "సాహితీ! అంకులంత ప్రేమగా పిలుస్తుంటే అక్కడే నిలబడ్డావేం? నౌఖర్లముందు నన్నల్లరి పెట్టాలనుకున్నావా? వచ్చి దగ్గరగా కూర్చుని జరిగిన విషయం తెలుసుకో" నిర్మల స్వరంలో వేదనకి ఆమె పూర్తిగా కదిలిపోయింది. వెళ్ళి సోఫాలో కూర్చుంది.
   
    "కాఫీ తాగావమ్మా?" అడిగాడు పరమహంస.
   
    "లేదు" అంది మెల్లగా అతడు సాలోచనగా భార్యవైపు చూశాడు.
   
    "సరే, మంగమ్మ ఇవ్వలేదా? రాగానే ఇవ్వమని చెప్పానే. ఉండు నేనే వెళ్ళి తెస్తా" నిర్మల బయటకు వెళ్ళిపోయింది....అదే ముఖ్యమైన పని అన్నట్టు!
   
    "సాహితీ!" చాలా ఆప్యాయంగా అన్నాడు పరమహంస. "నామీద నీకు కోపం వుండవచ్చు. చాలా దుర్మార్గుడిననే అభిప్రాయం పడిపోయి వుండవచ్చు. నీవే కాదు. నీ పరిస్థితిలో ఇంకెవరైనా వున్నట్టయితే నన్ను కత్తితో పొడిచి చంపేసేవారే. నువ్వంత మామూలుగా వున్నావంటే అది నీ నెమ్మదితనాన్ని సూచిస్తోంది. నీ తల్లిలాగా నువ్వూ నన్ను అర్ధం చేసుకోగలవని నాకు నమ్మకం కలుగుతోంది" అతడి కంఠం రుద్దమైంది. ఆమెకి ఏం మాట్లాడాలో తోచడం లేదు. ఇబ్బందిగా అనిపించింది. అతనన్నాడు. "నేను పెళ్ళి చేసుకున్న లక్ష్మి చాలా అభాగ్యురాలమ్మా! వయసు ముఫ్ఫై ఐదు దాటినా పెళ్ళికాలేదు. 'నా' అనేవారు లేరు....చాలా బీదపిల్ల....దూరపు బంధువులు ఆమెను వేధించడం మొదలుపెట్టారు. ఆ బాధని తట్టుకోలేక నా దగ్గరకొచ్చింది. రోజంతా మా భజనల్లో దిగులుగా కూర్చునేది.....భక్తి ద్వారా ముక్తి పొందడం మంచిదని ఆమెకు ఎప్పుడూ బోధిస్తుండేవాడిని. ఆమెకు నా పట్ల అభిమానం వుందనుకున్నాను గాని....అది మరో కోణంలోంచి వస్తుందని నేననుకోలేదు. ఆవిడ నన్ను పెళ్ళిచేసుకొమ్మని అడిగిన రోజున ఆశ్చర్యపోయాను అలా ఆలోచించడం తప్పని సర్దిచెప్పాను. ఆ రాత్రి ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. గాఢనిద్రలో వున్న నాకు ఆ విషయం ఎలా తెలిసిందో నాకే తెలియదు.....లేచి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కాపాడగలిగాను. అప్పుడే నాకు అర్ధమయింది....ఆమెను నేను పెళ్ళి చేసుకోవడం అన్నది భగవంతుడి ఆజ్ఞ అని. వచ్చి మీ మమ్మీకి చెప్పాను. ఆవిడా అర్ధం చేసుకొని ఒప్పుకుంది. చెప్పమ్మా.....నేను చేసిన దాంట్లో తప్పుందా?"
   
    సాహితి తలవంచుకుంది. ఆమెకేం చెప్పాలో తెలియలేదు. ఆమెకళ్ళ ముందు ఒక అభాగిని ఉరేసుకొంటున్న దృశ్యం కదలాడింది.
   
    అంతలో అతనన్నాడు...."అప్పట్లో నాలో నేను ఎంత ఘర్షణ పడ్డానో నీకు తెలియదు. కానీ ఆవిడ తృప్తి చూశాక అనిపించింది నేను చేసింది మంచిపనేనని. నీ తల్లికి ఇదంతా తెలియకుండా చేస్తే తప్పు..... కానీ చెప్పే చేశాను అర్ధం చేసుకుంది.... మీ మమ్మీకి ఈ విషయాలన్నీ తెలుసు. ఆవిడెంత సంతోషంగా వుందో చూశావుగా!"
   
    ఆమాట మాత్రం నిజం! తండ్రి బతికి వున్నప్పుడు లేని సంతోషం ఇప్పుడు తల్లి ముఖంలో కనిపిస్తుంది. సాహితి పూర్తిగా కరిగిపోయింది.
   
    "సారీ అంకుల్! తెలియక ఏదేదో అనేశాను" ఆయనకు చెప్పి తన గదిలోకి వచ్చేసింది. పరమహంస మాట్లాడినంతసేపు అంతా నిజమే, అది తప్పుకాదు అనిపించింది గానీ తర్వాత లాజిక్ కి అందనిదేదో వున్నట్లు బాధగా వుంది.
   
    ఎవరో ఉరివేసుకుంటున్నట్టు 'కల' వచ్చి, నిద్రలోంచి లేచివెళ్తే - ఆమె ఉరి వేసుకోకుండా ఇతడు వచ్చే వరకూ ఎందుకు ఆగింది? ఇది మొదటి అనుమానం. రెండోది మొదటి భార్యకు డైవర్స్ శాంక్షన్ కానంతవరకూ పెళ్ళి చేసుకోలేనని అన్నవాడు, లక్ష్మిని బహిరంగంగా పెళ్లెలా చేసుకున్నాడో అడగటం మర్చిపోయింది. తల్లి అతడికి కారు కొనిచ్చిందన్న విషయం కూడా!
   
                               *    *    *
   
    ఆ రాత్రి నిర్మలను దగ్గరకు తీసుకొని పరమహంస అన్నాడు- "నిన్ను చూస్తుంటే పదిహేనేళ్ళ కూతురుందని ఎవరూ అనుకోరు. పాతికేళ్ళుగా ఈ అందాన్ని నా కోసమే దాచి వుంచావనుకున్నప్పుడల్లా నా శరీరం జ్వలించిపోతుంది. నీకు చెప్పాలంటే నీ దగ్గర గడిపిన గంటలే నాకు నేనుగా.....నా కోసం జీవించే సమయంగా అనిపిస్తుంది." పరమహంస నోటినుంచి ఇలాంటి మాటలు వింటున్నప్పుడల్లా నిర్మలకు తనిన్నాళ్ళూ పోగొట్టుకున్న దేమిటో తెలిసివచ్చి నట్లనిపిస్తుంది. అతడి పట్ల భక్తి రెట్టింపవుతుంది.

 Previous Page Next Page