"మీరు ఏం చేస్తూ వుంటారు?" షేక్ హాండ్ ఇస్తూ అడిగాడు రాకేష్.
రవి రాకేష్ ని పరిశీలిస్తున్నాడు. మ్యాజిక్ వల్ల తీక్షణమూ, చురుకుదనమూ రంగరించుకున్న అతడి కళ్ళకి రాకేష్ లో ఏదో అవలక్షణం కనపడుతూంది. ఏ...మి...ట...ది?
"మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు".
రవి తేరుకుని "నేనా? నేను మ్యాజిక్ లు చేస్తూ వుంటాను" అన్నాడు.
రాకేష్ పెద్దగా నవ్వి "మ్యాజిక్కులా అదేం ప్రొఫెషను?" అంటూ మళ్ళీ నవ్వేడు.
షాడో మాట్లాడలేదు.
"ఏది? ఏదైనా చిన్న మ్యాజిక్కు చేయండి చూద్దాం" అన్నాడు రాకేష్ మళ్ళీ. "మ్యాజిక్ అంటే ఏమిటి? గారడీయా, వస్తువుల్ని మాయం చేయటమా?"
షాడో అతడివైపు అసహ్యంగా చూసేడు. దాదాపు పదిహేను సంవత్సరాల తరువాత అన్నా చెల్లెళ్ళు కలుసుకున్నారు! తండ్రి చనిపోయిన బాధలో పరస్పరం ఓదార్చుకోవలసిన స్థితి ఇది! ఇప్పుడు ఏదైనా మ్యాజిక్ చేయమని కోరుతున్నాడు ఇతడు. అసలు ఇతడికి సంస్కారం వుందా?
రవి అతడి గుండెల దగ్గిర సుతారంగా కొట్టి "చెక్ షాడో" అంటూ అతడి కుడిచేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ "ఎప్పుడైనా చూపిస్తాలెండి" అంటూ కరచాలనం చేశాడు.
"ఊరికే అడిగాన్లెండి" అంటూ రాకేష్ అక్కణ్ణుంచి కదిలాడు. అతడి మనసంతా ఆనందంగా వుంది. ఇంత సులభంగా గౌరి డబ్బు ఇస్తుందనుకోలేదు. రవి రాకముందే తన పని అయిపోవటం మరింత సంతోషంగా వుంది.
ఇక ఈ రాత్రి శ్మశానంలో గడపాలి.
చంద్రోదయం అవటానికి ఇంకో పదినిముషాలు వుంది.
శ్మశానం ప్రవేశిస్తూ ఎందుకో యధాలాపంగా జేబుని చూసుకున్న రాకేష్ ఉలిక్కిపడ్డాడు. జేబులో చెక్కులేదు.
షాడో మొహం గుర్తొచ్చింది. "గారడీయా? వస్తువుల్ని కూడా మాయం చేస్తారా" అని తను అనటమూ, అతడు "చెక్ షాడో" అనటమూ గుర్తొచ్చింది. ఏదో అనుమానం వచ్చి, చప్పున చేతివైపు చూసుకున్నాడు. అతడి మొహంలో రక్తం ఇంకిపోయింది. మనిషి నిలువెల్లా వణికాడు.
చేతికి తాయెత్తు లేదు!
చంద్రుడి ఆగమనానికి నిదర్శనంగా ఒక చంద్రకిరణం అపుడే ఆకాశంలోంచి పొడుచుకొస్తూంది.
రాకేష్ పరుగెత్తసాగాడు. అప్పటికే అతడు చాలా దూరం వచ్చేశాడు. చంద్రోదయం లోపులో వెళ్ళి షాడో దగ్గిర అది తీసుకోవాలి. అతడికి తనమీద అంత ప్రాక్టికల్ జోకు వేసినందుకుగానూ, ఆ క్షణం షాడోని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. అతి కష్టంమీద తమాయించుకున్నాడు.
అతడు వెళ్ళేసరికి కేదారగౌరీ, రవీ మాట్లాడుకుంటున్నారు. అప్పటికి ఆమె తండ్రి తాలూకు జ్ఞాపకాల నుంచి తేరుకుంది.
"ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. నాకయితే సరీగ్గా జ్ఞాపకమే లేదు సుమా".
రవి నవ్వి వూరుకున్నాడు.
" 'నాన్న' వుండగా ఒక్కసారి వచ్చివుంటే ఎంత బావుండేది? నీకు తెలీదు కానీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టమే! పైకి అలా బింకంగా కనపడ్డారే తప్ప, నువ్వు వెళ్ళిపోవటంతో చాలా కృంగిపోయారు".
రవి మాట మర్చి, "ఇదేమిటి ఈ చెక్కు" అని అడిగాడు.
"రాకేష్ కావాలన్నాడు. నాన్నకి తనంటే కూడా చాలా ఇష్టం".
"కానీ నువ్వు అపాత్రదానం చేశావనిపిస్తూంది. ఎందుకో ఆ రాకేష్ ని చూస్తూంటే నాకంత సదభిప్రాయం కలగటంలేదు".
"ఛా. అలా అనకు. రాకేష్ గురించి నీకు తెలీదు" అంటూ తను సిద్దార్ధని చేసుకోవటం కోసం తండ్రిని అడగటం, రాకేష్ కూడా దానికి వప్పుకోవటం గురించి చెప్పింది. "ఎంతో మంచి మనసు అతడిది!"
దానికి రవి సమాధానం చెప్పలేదు. "ఈ తాయెత్తేమిటీ? అతడికీ ఈ దేముడూ దెయ్యాలమీద నమ్మకం వుందా" అని అడిగాడు.
"ఏమో! ఈ ఊళ్ళో కొత్తగా ఒక బాబా వెలిసాడులే. అతడు కట్టి వుంటాడు".
బాబా ప్రసక్తి రాగానే ఆమె మొహం ఎందుకో భయంతో వాడిపోయింది. అది పూర్తిగా భయంలాంటిది కూడా కాదు. అపశకునంలాటిది! సరీగ్గా కొన్ని రోజుల క్రితమే దానికి సంబంధించిన సంఘటన ఒకటి జరిగింది. అదే కారణం.
అవతార్ బాబా పేరు ఆ ఊర్లో అప్పటికే మార్మోగుతూంది. సిద్ధార్థ తల్లికి ఇటువంటి వాటిమీద కాస్త నమ్మకం వుంది. కోడల్ని తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళింది. అత్తగారి సంతృప్తి కోసం గౌరి దీనికి అభ్యంతరం చెప్పలేదు.
వీళ్ళు వెళ్ళేసరికి ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతూంది. బాబా తన సమయంలో కొంత భాగాన్ని దీనికోసం కేటాయించారు. ఒకరి తరువాత ఒకరు వెళ్ళి కూర్చుంటున్నారు. కాగితం మీద ప్రశ్న వ్రాసి యిస్తున్నారు. ఆయన సమాధానం చెపుతున్నాడు. ఒక అంకె, ఒక పువ్వు, ఒక రంగు చెప్తే ఆయనకాలంబట్టి లెక్కవేసి భవిష్యత్తు చెప్తారు. ఈ కార్యక్రమం జరిగే గంటసేపూ జనంతో కిటకిటలాడిపోతూంది ఆ ఆశ్రమప్రాంగణం. తమ భవిష్యత్తు తెలుసుకోవటం కోసం జనం తహతహలాడుతున్నారు.
గౌరి వంతు వచ్చింది.
సిద్ధార్థ తల్లి ప్రశ్న అడగబోయింది. ఆయన 'ష్' అన్నట్టు సైగ చేశాడు. పక్కనున్న శిష్యుడు గౌరికి చిన్న స్లిప్ యిచ్చాడు. దానిమీద ఆమె వ్రాసింది.
14. గులాబి, తెలుపు.
అత్తగారు మనసులో ప్రశ్న అడిగింది- 'బాబా? పాపా?' అని.
అవతార్ బాబా కళ్ళు మూసుకుని లెక్కవేశాడు. అంతర్ముఖుడై దేవతలతో మాట్లాడుతున్నట్టు ఆయన భృకుటి ముడిపడింది. శిష్యులు, ఆశ్రితులు ఆయనవైపే చూస్తున్నారు. అంతా నిశ్శబ్దం ఆవరించింది.
ఆయన నెమ్మదిగా కళ్ళు విప్పి "ఆడపిల్ల" అన్నాడు.
సిద్ధార్థ తల్లి మొహం వికసించింది. ఆయనకి ప్రణమిల్లి, తగురీతి సత్కరించి, కోడల్ని తీసుకుని అక్కడనుంచి వచ్చేసింది.
గౌరికి మాత్రం ఇదంతా ఏదో రమ్యమైన నాటకంలా కనబడింది. ఎలా జరుగుతుంది? ఇంత సింపుల్ గా- ఇంత సులభంగా - ఎలా చెప్పగలిగాడు ఈయన?
నాలుగురోజులు మధనపడి ఒక నిర్ణయానికి వచ్చింది.
తను చేస్తున్నది సాహసమనీ, పెద్దకొండతో తాము ఢీకొనబోతున్నాననీ ఆమెకి తెలుసు. కానీ సిద్ధాంతం గురించి ఎప్పుడూ మాట్లాడేవాడు ఆమె తండ్రి! సిద్ధాంతాన్ని ఆచరించి దాన్ని కార్యాచరణలో చేసి చూపించినవాడు ఆమె అన్న. అటువంటి వంశంలో పుట్టినది కాబట్టే ఆమెకి ఆ ధైర్యం స్వతహాగా వచ్చింది.
నాల్రోజుల తర్వాత ఆమె అదే సమయానికి మళ్ళీ వెళ్లింది. ఆమె వెళ్ళేసరికి ఆ కార్యక్రమమే జరుగుతూంది.
ప్రొఫెసర్ పుట్టన్న ప్రశ్న అడుగుతున్నాడు. బాబా సమాధానం చెపుతున్నాడు. "నిశ్చయంగా వచ్చే నెలలో నీకు విదేశ ప్రయాణం వుంది నాయనా. అక్కడ నీకు ప్రజలు నువ్వు చెప్పినదానికి హారతిపట్టి జేజేలు పలుకుతారు".
ఆ ముసలి ప్రొఫెసరు మొహం దివ్వెలా వెలిగింది. బాబా పాదాలకు శిరస్సు ఆనించాడు.
అంతలో ఆమెవంతు వచ్చింది.
'13, ఉమ్మెత్తపువ్వు, ఎర్రరంగు' అని కాగితం మీద వ్రాసి "నాకు ఆడపిల్ల పుడుతుందా? బాబు జన్మిస్తాడా? స్వామీ" అని అడిగింది. బాబా కొద్ది క్షణాలపాటు కళ్ళు మూసుకుని, తరువాత తెరచి, "మొగపిల్లవాడు" అన్నాడు.
ప్రేక్షకులు మరింత భక్తితో ఆయనవైపు చూశారు. సాష్టాంగపడమన్నట్టు భక్తులు ఆమెవైపు చూసేరు. ఆమె పర్సులోంచి మరో కాగితం తీసింది. నమ్రతగా "నాల్రోజుల క్రితం నేను వచ్చాను స్వామీ. అప్పుడు ఆడపిల్ల పుడుతుందని అన్నారాయె" అంటూ ఆ కాగితాన్ని ఆయన ముందుకు తోసింది.
సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం ఒక్కసారిగా అక్కడ ఆవరించింది. బాబాకి ఆమె చెప్పింది అర్ధమవటానికి కొంచెం సేపు పట్టింది. జేవురించిన మొహంతో "ఏమిటి నువ్వు అంటున్నది" అన్నాడు కోపంగా.
ఆమె తాపీగా, "ప్రజల్ని మోసం చెయ్యటం మానెయ్యండి అని వేడుకుంటున్నాను స్వామీ అంతే" అంది.
"ఈ మూర్ఖురాలిని ఇక్కడనుంచి గెంటివెయ్యండి" అని ఆజ్ఞాపించాడు స్వామి. ఈ లోపులోనే ఒక శిష్యుడు ఆమె చేతిరెక్క పట్టుకున్నాడు. ఒక్క ఉదుటున అతడి చేతిని విదిలించుకుని ఆమె చివ్వున లేస్తూ "మూర్ఖురాలిని నేను కాదు, వీళ్లు!" అంది చుట్టూ వున్నవాళ్ళని తర్జనితో చూపిస్తూ... "కడుపులో వున్నది ఆడపిల్ల అని తెల్లరంగూ, పధ్నాలుగు అంకె చెప్పిన పక్షంలో- ఆ రెంటికీ చేతులెత్తి నమస్కరించాలి. ఆ వున్న పిల్లని నాల్రోజుల్లో మొగాడిగా మార్చగలిగే శక్తి ఉమ్మెత్త పువ్వుకేగానీ వుంటే మేమంతా దేముళ్ళనీ, బాబాల్నీ పూజించటం మానేసి ఉమ్మెత్త పువ్వులని పూజించాలి" అంది ఆవేశంగా.
అవతార్ బాబా కూడా అంతే ఆవేశంగా లేచి "పరమ పావనమైన జ్యోతిష శాస్త్రాన్నే చులకన చేసిన నువ్వు అతి త్వరలోనే దానికి తగిన శిక్ష అనుభవిస్తావు. ఇదిగో ఇదే నా శాపం" అంటూ కమండలంలో నుంచి నీరు తీసి ఆమెమీద జల్లుతూ 'ఎర్రరంగూ, పదమూడు అంకె, ఉమ్మెత పువ్వులతో అవహేళన చేసినందుకుగాను నీ కడుపున అష్టావక్రుడు పుట్టుగాక! పుట్టిన వెంటనే అతడు నిన్నూ, నీ భర్తనీ చంపుగాక! అండ పిండ బ్రహ్మాదులెదురైనా దీన్ని ఆపలేకుండుగాక" అన్నాడు.
ఆ ప్రాంగణంలో వున్న జనమంతా హాహాకారాలు చేసేరు. అతడి శాపంకన్నా వారి అజ్ఞానం గౌరిని బాధపెట్టింది. సాధారణంగా ఆమె తొణకదు. ఆమెకు తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. చుట్టూ వున్నవాళ్ళు చేతులెత్తి చేసే ప్రార్ధనలూ, వణికే వాళ్ళ శరీరాలూ ఆమెకు మరింత ఏవగింపు కలిగించాయి. ఎప్పుడూ కోపం తెచ్చుకోని ఆమె, ఆవేశంతో అతడి చేతిలో కమండలం లాక్కొని అతడిమీదే ఆ నీళ్ళు గుమ్మరిస్తూ "ఈ నీళ్ళకే ఆ శక్తి వున్న పక్షంలో రెండ్రోజుల్లో నీ నోటివాక్కు పడిపోవుగాక! ఇదే నా శాపం" అనేసి అక్కణ్ణుంచి వచ్చేసింది.
వచ్చాక భయమేసింది అత్తగారేమన్నా అంటుందేమోనని.
కానీ ఆశ్చర్యవశాత్తు ఆమె ఏమీ అనలేదు.
సిద్ధార్థ మాత్రం "మనకెందుకు వచ్చిన గొడవ గౌరీ ఇదంతా" అన్నాడు. ఆమె మాట్లాడలేదు.
"ప్రజల్ని మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ వుంటారు. అందర్నీ రక్షించటానికి మనం కంకణం కట్టుకోలేదుకదా. వాళ్ళకి ఏ శక్తులూ లేకపోవచ్చు. కానీ దేముడూ, దెయ్యమూ, దుష్టశక్తీ వున్నాయి. అలాగే కొందరు మహాపురుషులు కూడా వున్నారు".
ఆమెకి సంతోషం వేసింది. కనీసం మోసం గురించి, అతడు వప్పుకున్నందుకు.
ఆ తరువాత ఆ సంగతి మర్చిపోయింది.
మళ్ళీ ఇప్పుడు అన్న దగ్గర ఆ సంగతి గుర్తొచ్చింది. ఎంతయినా ఆమె స్త్రీ. పైగా వట్టిమనిషి కూడా కాదు. ఆ సంఘటన జరిగిన తరువాత గ్రామంలో అందరూ ఆమెని చిత్రంగా చూస్తున్నారు. తరచు ఇంటికొచ్చే వాళ్ళుకూడా రావటం మానెయ్యటాన్ని ఆమె గమనించి బాధపడింది. గ్రామం అలాంటిది- అని సరిపెట్టుకోబుద్ధికాలేదు. ఎంత సరిపెట్టుకున్నా మనసు అదోలా వుంటూంది. ఈ పరిస్థితుల్లో అలా వుండం మంచిదికాదు అని తెలిసినా ఏం చెయ్యగలదు?