అతన్ని ఎవరూ గమనించలేదు. అందరూ నిద్రలో వున్నారు.
రైలు కూత వేసింది.
అతడు కళ్ళు రుద్దుకున్నాడు.
కిటికీలోంచి బైటకు చూశాడు.
అతడి చూపు నీటిమీద నుంచి ఎండిపోయిన చెరకు తోటమీద పడింది.
వెన్నెల్లో ఎండిన చెరకు పిప్పి తెల్లగా మెరుస్తూంది.
రైలు కదిలింది.
కొంచెం దూరం వెళ్ళేక దూరంగా మంట కనపడి, తలను మరింత వంచి చూసేడు.
చెరకు తోట దగ్గర పెద్ద మంట.
రైలు వేగం పుంజుకున్న కొద్దీ ఆ మంట దూరం అయిపోయింది. అతడు దాన్నే చూస్తూ వుండిపోయాడు. ఎండిన చెరుకుని మంట బెడ్తారని అతడికి తెలుసు. అతడికి తెలియనిదల్లా ఆ మంట తను కన్ను నులుముకోవటం వల్ల వచ్చిందనే -
అతడు ఆ మంటనే చూస్తూ రెండు నిమిషాల పాటు వుండిపోవడం మంచిది అయింది. అతడేగాని తలతిప్పి కంపార్ట్మెంట్ లోకి చూసి వుంటే అందులో వున్న వాళ్ళందరూ మసి అయి వుండేవారు.
అరుత్యుంద ద్వారా.
*********
ఆ మహాపట్టణాన్ని చూసి అతడికి క్షణం ఏం చెయ్యాలో తోచలేదు. అందులోనూ అతడు రైలు దిగేసరికి తొమ్మిదిన్నరయింది. ఆఫీసులకి వెళ్ళే జనంతోనూ రిక్షా వాళ్ళతోనూ అంతా హడావుడిగా వుంది.
అతడు ఏదైనా ఊర్లో దిగగానే చేసే మొదటి పని స్త్రీల కళాశాలలు ఎన్ని వున్నాయి అని వాకబు చేయటం, అయితే ఆ నగరంలో అది అంత సులభంగా దొరకలేదు. కొంచెం కష్టపడవలసి వచ్చింది.
స్నానం భోజనం వీటికి అంత ప్రాముఖ్యత లేదు. పట్టుకోవాలి- ఎలాగైనా ఆ తులసి మరణించే లోపులో పట్టుకోవాలి. అదే ధ్యేయం.
మళ్లీ మామూలు తతంగమే. అయితే ఈ సారి గేటు దగ్గర గూర్ఖా లేడు. యూనివర్శిటీ క్యాంపస్ లో అది కో ఎడ్యుకేషన్ కాలేజీ అందువల్ల దార్కా సరాసరి లోపలికి వెళ్ళిపోగలిగేడు. కాలేజీ అంతా నిర్మానుష్యంగా వుంది. అతడు ఆఫీసు రూములోకి ప్రవేశించాడు. ఇద్దరు ముగ్గురు క్లర్కులు పని చేసుకుంటున్నారు. ఒక క్లర్కు ముందు నలుగురు అయిదుగురు అమ్మాయిలు మార్కుల మెమొరాండంలు కోసం గుమికూడి వున్నారు.
దార్కా గుమ్మం దగ్గరే నిలబడి చుట్టూ చూసేడు. మొదట్లో అతడికి భయంగాను జంకుగాను వుండేది. ఆ తరువాత తరువాత అలవాటై పోయింది. ఎవరిని ఎలా "టాకిల్" చేయాలో తెలుసు అతడికి.
"ఇదిగో" అన్నాడు ఒక ఫ్యూను దుస్తుల్లో వున్న వ్యక్తిని చూసి.
"నాకో సాయం చేయాలి చేస్తారా?" ఇలా అంటున్నప్పుడు ఒక పది రూపాయల నోటుని కింద జేబులోంచి తీసి పై జేబులోకి మార్చుకున్నాడు.
అతడు అది గమనించకుండా "ఏం సాయం" అని అడిగాడు.
"నాకు అటెండెన్స్ రిజిష్టర్ కావాలి. ఒక అమ్మాయిని ఆమెకు తెలియకుండానే చూడాలి" అని రహస్యంగా చెప్పాడు.
"ఎందుకు చూడడం" అతడూ రహస్యంగానే అడిగేడు.
వీడికి, ఈ మాత్రం లోకజ్ఞానం కూడా లేదేమని తనలో తను విసుక్కొని "పెళ్ళి చూపులకి ముందు ఒకసారి చూద్దామని" అన్నాడు. పెళ్ళిచూపులు అనే మాట వినపడి, అమ్మాయిలు ఓరగా అతడివైపు చూసేరు.
"పెళ్ళి చూపులకి ముందా?" అని గెడ్డం గోక్కుని, ఐడియా బాగానే వుంది కానబ్బాయ్ - నేనిక్కడ ఫ్యూన్ ని కాదు.
పాఠాలు చెప్పేవాణ్ని. నా పేరు పండిత్ ప్రొఫెసర్ పండిత్" అన్నాడు.
దార్కా దెబ్బతిన్నట్టూ ఆయనవైపు చూసి "సారీ" అన్నాడు. ఈ లోపులో అమ్మాయిలు వాళ్ళని చుట్టుముట్టేరు. ఇద్దరమ్మాయిలు జీన్స్ లో వున్నారు. ఒకమ్మాయి గులాబిరంగు చీర కట్టుకుంది. యింకో అమ్మాయి పంజాబీ డ్రెస్ లో వుంది. వాళ్ళని చూడలేదు దార్కా.
"ఎవరీ ప్రవరాఖ్యుడు" అందో అమ్మాయి.
"ష్ -ఊరుకో" అని మందలించి, "ఏంకావాలి మీకు?" అని అడిగింది గులాబీరంగు చీరె కట్టుకున్న అమ్మాయి.
దార్కా కి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. అతడు అంతకు ముందెన్నడూ ఇలా అమ్మాయిల్తో మాట్లాడిన వాడు కాడు. అందులో వీళ్ళు తనని ఏడిపించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళలా వున్నారు. అతడు తడబడి "ఏం లేదు , ఏం లేదు" అని అక్కడినుండి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు.
పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి "ఆ అమ్మాయి పేరు చెప్పండి గల్లీ గల్లీ వెతికి పట్టుకుంటాము" అంది తాము అంతా విన్నట్టు సూచిస్తూ.