"హలో! ప్రభాకర్!..."
హేమ! హేమప్రక్కన ఆవిడ... ఆ విలసి... త... ఆవిడ హేమతో ఎందుకొచ్చింది? హేమకూ ఆవిడకూ ఏం సంబంధం?
"ప్రభాకర్! ఏవిటలా చూస్తున్నావ్? నన్ను గుర్తుపట్టలేదా? విలసితను గుర్తుపట్టలేదా? విలసిత కనపడేసరికి నన్ను మరిచిపోయావా? లోకాన్నే మరిచిపోయావా?"
అప్పటికీ ప్రభాకర్ సమాధానం చెప్పలేడు. ఇద్దరినీ మార్చి మార్చి చూస్తూ నించున్నాడు.
"ఏమిటిది? డబ్బు సంపాదించేసరికి కళ్ళు కనిపించవంటారు. ఆ మాటలు అక్షరాలానిజమన్నమాట!" కటువుగా అంది హేమ.
విలసిత నవ్వింది. "ఊరుకోవే! పాపం అతడు నాలో పూర్వజన్మ పోలికలు వెతుక్కుంటున్నాడు" అంది.
విలసిత నవ్వింది. ఆ నవ్వులో...అవును! పోలికలు...పూర్వజన్మ పోలికలు కనిపిస్తున్నాయి.
"మీరు...నువ్వు..." తడబడిపోయాడు ప్రభాకర్...ప్రఖ్యాత న్యాయవాది ప్రభాకర్... తన వక్తృత్వంలో ఎవరినైనా ముగ్ధులను చేయగల ప్రభాకర్ మాటలురాక ఆగిపోయాడు...
"మన విలసిత! నువ్వు దేవతలా ఆరాధించిన విలసిత...ఈరోజు నువ్వు కోర్టులో దోషిగా నిరూపించిన విలసిత..."
ఒక్కొక్క మాట... ఆగి ఆగి పలికింది హేమ.
విలసిత నవ్వుతూ "హేమ నన్ను జామీనుమీద తీసుకొస్తానంటే నిన్ను కంగ్రాట్యులేట్ చెయ్యడానికి ఒప్పుకున్నాను. ఎంత చక్కగా వాదించావు?" అంది.
ఎర్రగా కాలిన ఇనుపసుత్తితో దెబ్బమీద దెబ్బపడుతున్నట్లుగా ఉంది ప్రభాకర్ మనసు ...
విలసిత...
ఆరోజు కన్నీళ్ళతో "ప్రభా! నన్ను అర్ధంచేసుకో! నేను పిరికిదాన్ని. సంఘాన్ని ఎదిరించలేను. నా వాళ్ళను కాదనలేను. ఎంతటి రంపపుకోతనైనా భరిస్తాను. కానీ నలుగురూ వేలెత్తిచూపే పని చెయ్యలేను. మా వాళ్ళు ఒక కులంకాని మన పెళ్ళికి ఒప్పుకోరు. నేను నీతో లేచి రాలేను. నన్ను మరిచిపో!" అని తనకు శాశ్వతంగా దూరమయిన విలసిత__ అమాయకత్వానికి మారు పేరులా మంచితనానికి మరో రూపులా ఉండే విలసిత...
"నువ్వు...మీరు...రామారావుగారికి విడాకులెందుకిచ్చారు?"
హేమ చిరాగ్గా చూసింది.
"ఎంత అర్ధం లేకుండా మాట్లాడుతున్నావు ప్రభాకర్! మన విలసిత విడాకులిస్తుందా మొగుడికి! ఎదుటివాళ్ళు చెప్పిందంతా నిజమని నమ్మేమూర్ఖత్వమే నీలో ఉంటే నువ్వేం లాయర్ వి?"
అవును! విలసిత మొగుడికి విడాకులివ్వదు. ఇచ్చినట్లు ఈనాడు కనిపిస్తున్నా ఏనాడూ తనంత తాను విడాకులివ్వలేదు. ఇవ్వాలని కూడా అనుకోలేదు.
సంప్రదాయ కుటుంబంలో పుట్టిన విలసిత తనలోనూ ఆ సంప్రదాయాల్నే జీర్ణించుకుంది. కాలేజీకి వెళ్ళినా వేషభాషల్లో ఎంత ఆధునికంగా ఉన్నా, పెద్దలను ఎదిరించి తనదైన జీవన విధానం నిర్ణయించుకునే దార్డ్యం మాత్రం అలవరచుకోలేక పోయింది. కన్నె వయసులో ప్రకృతి సహజంగా పొంగిన ఆర్ద్రభావాలన్నీ అంతరంగంలోనే అణచివేసుకుని పరమ బుద్దిగా తన బ్రతుకు తీర్చిదిద్దేభారాన్ని తలిదండ్రులకే అప్పగించింది. అప్పట్లో విలసిత చేయగలిగినదల్లా ప్రభాకర్ ను తలచుకుని అతడ్ని పెళ్ళిచేసుకోలేకపోయినందుకు కుమిలికుమిలి ఏడవటమే! అదే ఆవిడకు అతి సాహస కార్యంగా తోచింది.
పదివేలు కట్నమిచ్చి బి.యి. పాసయిన రామారావుకు విలసిత నిచ్చి పెళ్ళి చేసారు. పెళ్ళయిన క్రొత్తలోనే రామారావు ధోరణి విలసితకు భరింపరానిదిగా ఉండేది. అతనికి ఎప్పుడాగ్రహం వస్తుందో తెలియదు. ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. అన్నం వడ్డిస్తుండగా కూర బాగుండలేదనో, గ్లాసు శుభ్రంగా లేదనో, విలసితను తిట్టి, తింటూన్న కంచంలో చెయ్యి కడుక్కుని లేచిపోయేవాడు. ఇంటికొచ్చిన బంధువులముందు, స్నేహితులముందు, పనివాళ్ళముందు, చాకలాళ్ళముందు, చెడామడా తిట్టేసేవాడు.
ఇక అనుగ్రహం వచ్చినా అంతే తింటూ తింటూ ఎంగిలిచేత్తోనే కౌగిలించుకొనేవాడు. చుట్టుప్రక్కల ఎవరున్నారు అనైనా గమనించేవాడు కాడు. ఒళ్ళు హూనమయ్యేలా చాకిరీ చేసి వొళ్ళుమరిచి నిద్రపోతోంటే "ప్రేమ" అంటూ మీదపడి లేపేసేవాడు. లేవలేక బద్ధకిస్తే__గిల్లి కొరికి__నలిపి__తన ప్రేమను ప్రకటించేవాడు ....
ఈ యాతన భరించలేక ఒకసారి పుట్టింటికెళ్ళి ఏడ్చేసింది విలసిత. చెప్పిందంతా విని ఆశ్చర్యంగా బుగ్గన వేలేసుకుంది విలసిత విధవ మేనత్త. ఆవిడ ఆశ్చర్యం రామారావు ధోరణికి కాదు. విలసిత తాను కష్టాలు పడుతున్నానని అనుకున్నందుకు.
"చాల్లేవే! ఎవరైనా వింటే నవ్విపోతారు! ఇవి ఒక కష్టాలా? మీ మావయ్య కాఫీ వేడివేడిగా ఇయ్యలేదని రుబ్బుడు పత్రంతో నెత్తిమీద మొట్టేవారు. తను తెచ్చుకున్న ముండకి తలంటి సరిగ్గా పొయ్యలేదని వీపు వాయగొట్టేవారు. ఎన్నడైనా ఎవరితోనైనా ఒకమాట చెప్పుకున్నానా? ఎదిరించి అడిగానా? చాలు చాల్లే! వెళ్ళి లక్షణంగా కాపురం చేసుకో!"
విలసిత చెప్తున్నదంతా ఏదో అర్ధంలేని అల్పవిషయం లాగా తేల్చిపారేసింది ఆవిడ..."అలాగా! నేనేం కష్టాలు పడటంలేదా?" అని ఆశ్చర్యంగా తనలో తాను అనుకుని కళ్ళు తుడుచుకుంది విలసిత.
కూతురు పుట్టింతరువాత విలసిత ఆనందానికి అంతులేకపోయింది. ఆ పాపను చూసుకుని తన కష్టాలన్నీ మరచిపోవాలనుకుంది...కానీ, ఆ ఆశకూడా నిలవలేదు. సుధ నెలల పిల్లగా ఉన్నప్పటినుంచీ తన మాటే శాసనంగా సాగనిచ్చేవాడు. ఆకలికి సుధ ఏడుస్తోంటే పాలు పట్టినిచ్చేవాడు కాదు.
"ఇంకా టైమ్ కాలేదు. అరగంట ఆగికాని పట్టడానికి వీల్లేదు." అనేవాడు.
టైం అయిందని విలసితకు తెలుసు. కానీ ఆ మాట రామారావుకు చెప్పీ ప్రయోజనంలేదు. అతను పట్టిన కుందేటికి ఎప్పుడూ మూడే కాళ్ళు...ఆకలికి ఏడ్చే సుధను ఓదార్చలేక సతమత మవుతోంటే ఎదురు విసుక్కునేవాడు.
"ఛ! ఛ! ఏడ్చేపిల్లను ఊరుకోబెట్టడంకూడా చేతకాదు. వెధవకొంప కొంచెంసేపు నిద్రపోవడానికి కూడా వీల్లేదు." అనేవాడు.
అతడు యింట్లో ఉండకుండా కంపెనీలో ఉన్నప్పుడే ప్రాణానికి హాయిగా ఉండేది విలసితకు. అంతలో రామారావుకి రిట్రెంచ్ మెంట్ వచ్చింది. ఆ పిల్ల పుట్టటంవల్లనే తన ఉద్యోగం పోయిందని ఆ పసిపిల్లమీద విసుక్కునేవాడు. అప్పుడప్పుడు ఆ పసిదాన్ని కొట్టేవాడు. సుధవంటిమీద దెబ్బ పడినప్పుడు ప్రాణాలు ఎంత తల్లడిల్లిపోయినా నోరువిప్పి ఏమీ అనలేకపోయేది విలసిత.
రామారావుకి వర్క్ షాప్ పెట్టుకోవాలనే ఆలోచన వచ్చింది. కట్నంగా ఇచ్చిన పదివేలూ చాలక విలసిత వంటి మీద నగలు కూడా కావలసి వచ్చాయి. మాట్లాడక తన నగలన్నీ తీసి యిచ్చింది విలసిత. రామారావు అదృష్టం తిరిగింది. అతని వర్క్ షాప్ దినదినాభివృద్ది పొందింది. లక్షాధికారి అయ్యాడు. అతని ఐశ్వర్యంతోపాటు అతని అహం కూడా దినదినాభివృద్ది చెందింది. ఆ సంపద - ఆ చీరలూ__ఆ నగలూ_ఇవేవీ విలసితకు ఒక్క క్షణంకూడా ఆనందాన్ని కలిగించలేకపోయాయి.
ఆ రోజు రామారావుతోపాటు ఎవరో వయ్యారి కూడా ఇంటికొచ్చింది. ఇటీవల అతనితోపాటు ఇలా ఎవరో ఒకరు రావటమూ, వికవికలూ, పకపకలూ, ఇవన్నీ అలవాటైపోయాయి విలసితకు. మొదట్లో ఎంతో బాధపడింది. రానురాను పట్టించుకోవటం మానేసింది. కానీ, ఈసారి వచ్చిన వయ్యారి మామూలుగా మాట్లాడి వెళ్ళిపోలేదు. హాయిగా అక్కడే ఉండిపోయింది.