"మరింకా ఎవరూ రాలేదేమిటి?"
"వస్తారుసాబ్ ఒకరొకరే..." అన్నాడు. "ఇంతకీ మీకేమి కావాలి."
"తహసిల్దార్ ని కలుసుకోవాలి."
"ఆయనయితే పన్నెండింటి తర్వాత వస్తాడు."
వరండాలో బల్లమీద కూర్చున్నాను. మొట్టమొదటిసారి కాస్త విసుగేసింది. అనవసరంగా ఈ పనికి వప్పుకున్నానేమో అనిపించింది.
లోపల ఇద్దరు గుమాస్తాలు సిగరెట్లు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. మరో ముసలాయన ఇంకా రాని 'టీ' గురించి కుర్రాడిని కేకలేస్తున్నాడు. ఒక మూల టైప్ మిషన్ మీద మాత్రం ఒకావిడ చకచకా టైప్ చేస్తూంది కానీ అది ఇన్ లాండ్ లెటరు.
ఈ తాసిల్దారు మాత్రం వచ్చే సూచనలు ఏమీ కనబడటంలేదు. ఇంక ఇది లాభం లేదనుకుని, సెక్షన్ హెడ్ లా కనబడుతున్న వ్యక్తి దగ్గిరకి వెళ్ళాను. అతడికి దాదాపు యాభై అయిదేళ్ళుంటాయి. మధ్య మధ్యలో వక్కపొడి తింటూ, యాభై ఎనిమిదేళ్ళ రిటైర్ మెంట్ ప్రాశస్త్యం గురించి ఎవరితోనో లెక్చర్ లా చెపుతున్నాడు. మధ్యలో ఆటంకం కలిగినందుకు నన్నో పురుగులా చూస్తూ మొహం చిట్లించి "ఏం కావాలి" అని అడిగాడు.
విషయం సూటిగా చెప్పి 'తహసిల్దార్' ని కలుసుకోవాలన్నాను.
అంతా విని 'ఇంత చిన్న విషయానికి తాసిల్దారెందుకయ్యా. ఆ వరండా చివర కంప్లెయింట్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళు. సెక్షన్ నుంచి నోట్ పుటప్ కాకపోతే తాసిల్దార్ ఏ చర్యా తీసుకోడు" అన్నాడు.
అదీ నిజమే అనిపించింది. ఈ లోపులో తాసిల్దార్ కూడా వస్తాడు. ముందు సెక్షన్ లో నోట్ సిద్ధం చేసి వుంచితే మంచిదనిపించింది.
వరండా చివరి గదిలోకి వెళ్ళాను. అదృష్టవశాత్తూ గదిలో ఒక గుమాస్తాయే వున్నాడు. దాదాపు గోళ్ళు గిల్లుకుంటున్నట్టు ఖాళీగా వున్నాడు. నన్ను చూసి విశాలంగా నవ్వి, "రండి, ఏం కావాలి" అని అడిగాడు.
మొత్తం కథంతా చెప్పాను. శ్రద్ధగా విన్నాడు.
చివర్లో "ఎన్నాళ్ళయింది అప్పు తీసుకుని" అని అడిగాడు.
"ఏడెనిమిది సంవత్సరాలై వుంటుంది."
"ఘోరం, చాలా ఘోరం" అన్నాడు. "అయిదొందల అప్పుకి నాలుగెకరాలు లాక్కోవటం-"
"అంతేకాదు. కుర్రాడిని కూడా లాక్కోవటం" అన్నాను.
అతను బల్లగుద్ది "పెళ్ళాన్ని లాక్కోలేద్సార్ అందుకు సంతోషించాలి. ఈ వడ్డీ వ్యాపారస్తులు జలగల్లాంటివాళ్ళు. మొన్న రేసుల టైమ్ లో ఓ మార్వాడీ దగ్గిర రెండొందలు అప్పు తీసుకున్నాను. మొత్తం వాచీ, ఉంగరం అన్నీ లాక్కొన్నాడు" అన్నాడు.
"కంప్లెయింట్ తీసుకోండి" అన్నాను. "ఇలాంటి అరాచకానని వీలైనంత తొందరలో అణచటానికి ప్రయత్నించాలి.
"అందుకే తొందరగా వ్రాసి అక్కడెయ్యండి సార్" అన్నాడు.
నేను తెల్లబోయి, "మీ కంప్లెయింట్ సెక్షన్ కాదా" అన్నాను.
"కాదు. ఎంతమాత్రం కాదు- ఇది నీటి పారుదల- చిన్నకాల్వల విభాగం" అన్నాడు.
వళ్ళు మండి "మరిదంతా నాతో ఎందుకు చెప్పించా" రన్నాను ఆవేశాన్ని అణుచుకుంటూ.
"అదేమిటి గురూగారూ, ఇద్దరం తీరిగ్గానే ఉన్నాం. చెప్పుకుంటేనే కదా ఒకరి బాధలు ఒకరికి తెలిసేది" అన్నాడు.
"ఏడిసినట్టుంది. అయినా ఆఫీసులో తీరిగ్గా వుండటం ఏమిటి?"
"తెలుగుగంగ మా డిస్ట్రిక్టు వరకూ వచ్చి ఆగిపోయింది. అది కదిలేవరకూ తీరికే" అన్నాడు బల్లల్లోంచి రేస్ బుక్ తీస్తూ.
"సరే- ఇంతకీ కంప్లైంట్ సెక్షన్ ఎక్కడుంది?" అని అడిగాను విసుగ్గా.
"కంప్లైంట్స్ కి విడిగా సెక్షన్ అంటూఏమీ వుండదు. అదిగో ఆ పెట్టెలో వెయ్యటమే" అన్నాడు. 'వరండా చివర' అని ముందతను చెప్పింది సెక్షన్ కాదు. ఆ డబ్బా అన్నమాట. దానికి వేసివున్న తాళం స్థితి చూసి కాగితం ఇంకూ, వృధా చేయదల్చుకోలేదు. ఇంతలో జీపు వచ్చి ఆగింది. అందులోంచి ఒక ముసలాయన దిగాడు. దిగి లోపలికి వెళ్ళాడు.
హడావుడి చూడగానే అతడే తాసిల్దార్ అని అర్ధమయింది.
ప్యూన్ తో ఆయన్ని కలుసుకోవాలని చెప్పాను. పనేమిటి అని అడిగాడు. అప్పటికే బాగా విసుగెత్తి వున్నానేమో కోపం అరికాలినుంచి నెత్తికెక్కింది. "ఏం? ఏ పనో చెప్పకపోతే వెళ్ళనివ్వవా?" అని గద్దించాను.
ఇంకెవరైనా అయితే తగిన సమాధానం చెప్పేవాడేమోగానీ, నా జైలర్ పర్సనాలిటీ చూసి భయపడివుంటాడు. కాగితం మీద పేరు వ్రాసి ఇమ్మన్నాడు. నాలాటి వాళ్ళకే ఇన్ని ఇబ్బందులు యెదురవుతున్నాయో- మామూలు వాళ్ళ సంగతో అనుకుంటూ పేరు వ్రాసి లోపలికి పంపించాను. రెండు గంటల తరువాత పిలుపొచ్చింది. ఆయన బి.పి. టాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఆ గదీ, ఫైళ్ళూ, వాతావరణం ఆయన శరీరక పరిస్థితి లాగానే వున్నాయి.
"టైమ్ లేదోయ్. తొందరగా చెప్పు" అన్నాడు.
అయిదు నిమిషాల్లో అంతా చెప్పాను. మొదటి నిమిషంలో మొదటి సగం విన్నట్టున్నాడు. ఆ తరువాత ఫైళ్ళు చూసుకోవటంలో నిమగ్నుడయ్యాడు- నేను చెప్పటం పూర్తయ్యాక, "నువ్వు చెప్పిన దానికీ నాకూ ఏమిటి సంబంధం" అని అడిగాడు.
ఆ ప్రశ్నని ఊహించలేదు. ఆవేశంతో ఊగిపోయాను. "మీకు సంబంధం లేదా? మీరు కాకపోతే ఎవరు పట్టించుకుంటారు? కలెక్టర్ అంటే జిల్లాకి అధికారి కాదా? జిల్లా బాగోగులు చూడవలసిన బాధ్యత ఆయనది కాదా? ఆయనకి మేజిస్ట్రేట్ అధికారాలు లేవా?" అని గద్దించాను ఇంగ్లీషులో.
నా నోటి వెంట అంత ప్లూయెంట్ ఇంగ్లీషు వూహించక మొదట తెల్లబోయాడు. రెండ్రోజుల్నుంచీ బస్సుల్లోనూ, రెండెద్దుల బళ్ళలోనూ తిరగటం వల్ల నా ఆకారం ఎలా వుందో ఊహించుకోగలను. మొత్తానికి అతడు కాస్త దిగి వచ్చాడు. "కూర్చో" అన్నాడు ఎదురు కుర్చీ చూపిస్తూ. ఇంతసేపటికి.
కూర్చున్నాను.
"సరే, నువ్వు ఒక కుర్రాడి కోసం ఇంత కష్టపడుతున్నావు కాబట్టి మరికొన్ని పనులు చెయ్యాలి."
"ఏంటవి?"
"ఎన్నెకరా లన్నావు?"
"నాలుగెకరాలు."
"రిజిస్ట్రారాఫీసు కెళ్లి అసలు ఎంత రేటుకి స్థలం రిజిస్ట్రేషను జరిగింది కనుక్కో."
"అసలు ధరలో నాలుగోవంతుకి జరిగి వుంటుంది. అది వడ్డీకి సమానమై వుంటుంది. పూర్తి రేటుకి ఎవడూ రిజిస్ట్రీ చేయించడు." అన్నాను విసుగ్గా.
"అయితే ఇంకో పని చెయ్యి"
"ఏమిటి?""లేబర్ ఆక్టు ప్రకారం చిన్నపిల్లాడి చేత పనులు చేయించటం నేరం. ఎన్నేళ్ళ వాళ్ళని పనిలో తీసుకోవచ్చో నీకేమైనా తెలుసా?"
"తెలీదు."
"నాకూ తెలీదు. పన్నెండేళ్ళనుకుంటా. ఒక మెడికల్ నిపుణుడిని తీసుకెళ్ళి ఆ కుర్రవాడి వయస్సు పన్నెండు కన్నా తక్కువే అని ఒక సర్టిఫికెట్టు తీసుకో-
"సర్టిఫికేట్టిచ్చే డాక్టర్ ని లోపలికి- అంటే తన కాంపౌండ్ లోకి రానివ్వడు చిదానందం. ట్రెస్ పాస్ క్రింద అరెస్ట్ చేయిస్తాడు. ఆ కుర్రాడిని బయటికి వదలడు. ఎలా?"
"Unlawful prevention క్రింద కోర్టులో దావా వెయ్యి. తన కొడుకుని బయటకు వదిలేలా కోర్టుకి ఆర్జీ పెట్టుకొమ్మను నారాయణని! అమీనా సాయంతో ఆ కుర్రవాడిని డాక్టర్ చేత పరీక్షచేయించు. ఆ సర్టిఫికెట్టు తీసుకుని లేబర్ ఇన్ స్పెక్టర్ దగ్గిరకి వెళ్ళు. వాళ్లు ఆ వ్యాపారిమీద కేసు పెడతారు. అప్పుడు ఆ కుర్రవాడు బయటకి రాకేం చేస్తాడు."
"నేను కోర్టులో దావావేసి గెలిచి, దానిద్వారా ఆ కుర్రాడి దగ్గిరకి మెడికల్ నిపుణుడుని తీసుకెళ్ళేసరికి ఆ కుర్రాడికి పధ్నాలుగేళ్ళు నిండుతాయి" అన్నాను.
"మరెలా?" త్రిఇగి నన్నే ప్రశ్నించాడు.
లేచి నిలబడ్డాను. "ఎలా అని అడగటానికి కాదు నేను మీ దగ్గిరకి వచ్చింది. మీరేమైనా చూస్తారేమో అని తెలుసుకోవటానికి! ఇక తాసిల్దార్ గా, ఒక మండలానికి అధికారిగా ఏమిటి మీరు చేసే సాయం? ఈ విషయాన్ని అసెంబ్లీకి లాగుతాను. ఊరుకుంటాననుకోకండి..."
"అలా అనకు. కంప్లైట్ యివ్వు చూస్తాం"
"ఏం చూస్తారు?" ఆ కంప్లైంట్ బాక్సు ఏ ఆర్నెల్ల తరువాతో తేలుస్తారు. దాన్ని ఏ సెక్షన్ కి పంపాలో తెలియక మూణ్ణెళ్ళు మిసిలేనియస్ లో వుంచిమ్ తరువాత లా అండ్ ఆర్డర్ పంపుతారు. వాళ్ళు ఇది తమ పని కాదంటారు. నిజంగా భూములు ట్రాన్స్ ఫర్ జరిగిందా లేదా కనుక్కోమంటారు. ఫైలు రెవిన్యూకి వెళ్తూంది. ఆ సెక్షన్ లో నాలుగు నెలలుంటుంది. నైట్ కాలేజీలో 'లా' చదివిన గుమాస్తా తన విషయ పరిజ్ఞానాన్ని నిరూపించుకోవటానికి అసలీ కేసు సివిలు కాదు క్రిమినలు అంటాడు. పోలీస్ స్టేషన్ లో రిపోర్టిచ్చాడో లేదో కనుక్కోకుండా ఇలాంటి రిమార్కులు వ్రాయొద్దని 'క్వర్రీ' వేస్తాడు యువకుడైన గుమాస్తా ఉత్సాహాన్ని భరించలేని సెక్షన్ ఆఫీసర్! దాంతో, అసలు ఘనాపురంలో పోలీసుస్టేషన్ ఉందా లేదా అన్న విషయం తెలపమని ఫైలు హోండిపార్ట్ మెంట్ కి వెళుతుంది. ఇంతింత అప్పులు ఇస్తున్న వ్యాపారి, అసలు టాక్సులు కడుతున్నాడా లేదా అన్న అనుమానం వస్తుంది హోం సెక్రటరికి! వడ్డీలమీద వచ్చే టాక్సులు రాష్ట్రానికి చెందవనీ సెంటర్ కి చెందుతాయనీ క్లారిఫికేషన్ వస్తుంది. అయితే ఈ కేసుకీ రాష్ట్ర ప్రభుత్వానికీ సంబంధం లేదని వెనక్కి పంపుతారు. అక్కణ్ణుంచి ఫైలు రికార్డు సెక్షన్ కి వెళుతుంది-"
"భలే చెప్పావే, ఇదంతా నీకెలా తెలిసింది?"
"రెడ్ టేపిజం, బ్యూరోక్రసీ గురించి నా కిప్పుడిప్పుడే తెలుస్తూంది" బయటికి వస్తూ అన్నాను.
బయటకి వచ్చానే గానీ ఏం చెయ్యాలో తోచలేదు. పైకి కనబడినంత చిన్నది కాదు ఈ సమస్య అని యిప్పుడిప్పుడే తెలుస్తూంది. నాకు చిత్రమనిపించింది. కార్యాలయాల్లోనూ, కంపెనీల్లోనూ ఒకరు పని మానెయ్యదల్చుకుంటే చిన్న నోటీసుతో మానెయ్యవచ్చు. కానీ ఒక కుర్రవాడు తన భవిష్యత్తుని తాను నిర్ణయించుకునే స్థితిలో లేడు. కేవలం ఒక బీద కుటుంబంలో పుట్టటం వల్ల... తండ్రి గుడ్డిగా అయిదు వేలకి సంతకం పెట్టటంవల్ల!
అలా ఆలోచిస్తూ వుంటే అకస్మాత్తుగా స్పురించింది మెరుపులాంటి యోచన.
ఇంతకాలం నేను పొలాన్నీ, పిల్లవాడిని కలిపి ఆలోచిస్తున్నాను. పొలం తిరిగి నారాయణకి రావటం అనే ప్రశ్నేలేదు. దాని సంగతి మర్చి పోవటం మంచిది.
అలా మర్చిపోతే పిల్లవాడిని విడిపించటం పెద్ద సమస్యకాదు. ఒక రకంగా చెప్పాలంటే నారాయణ ప్రస్తుతం బికారి (ఇన్సాల్వెంట్). బికారులు పాత అప్పులుగానీ, వడ్డీలుగానీ చెల్లించనవసరం లేదు. ఐ.పి. పిటిషన్ లాటిది ఒకటి వ్రాసి నారాయణ సంతకం పెట్టినట్టు పెట్టాను. తను వడ్డీ గానీ అసలు గానీ, చెల్లించలేనని, తన కుమారుణ్ణి విడిపించమనీ ఆ అభ్యర్ధన.
దాన్ని తీసుకుని ఈసారి జిల్లా కలెక్టర్ దగ్గిరకి వెళ్ళాను.
కలెక్టర్ ఆఫీసులో లేడు. ఇంట్లో వున్నాడట. అప్పటికి మధ్యాహ్నమయింది. ఎండ మాడ్చేస్తూంది. ఒకవైపు విసుగూ, మరొకవైపు పట్టుదలా ఎక్కువ అవుతున్నాయి.