విశాలమైన కాంపౌండ్, మధ్యలో ఖాళీస్థలం, చెట్లమధ్య కలెక్టర్ భవంతి. ఎక్కువగా జనం లేరు. వరండా మెట్లదగ్గిర ఒక కారు, ఒక జీపు ఉన్నాయి. నేను దగ్గిరకి వెళ్ళేసరికి కలెక్టర్ లోపల్నుంచి మెట్లు దిగి బయటకి వస్తున్నాడు.
అతడిని చూసి అలాగే ఆగిపోయాను.
అతడు నా క్లాస్ మేట్ పురుషోత్తమ్!
* * *
"అయితే ఫోర్జరీ కూడా చేస్తున్నావన్నమాట" అన్నాడతడు చేతిలో వున్న కాగితం పరిశీలించి నవ్వుతూ.
నేనుకూడా నవ్వేను. "నాకు మీ డిపార్ట్ మెంట్ ల మీద నమ్మకం పోయింది. ఇలా కూడా అవుతుందని నాకు నమ్మకంలేదు. అయినా ఓ రాయి విసిరి చూద్దామనుకున్నాను. అంతే!"
"పోలీసులతో ప్రయత్నం చేయలేదా?"
"అక్కడికీ వెళ్ళాను."
"ఏమన్నారు?"
"అసలు కేసు టేకప్ చేయటానికి ముందు యాభై రూపాయలవుతుందన్నారు."
పురుషోత్తమ్ ఫక్కున నవ్వాడు. "మీ డిపార్ట్ మెంటేగా?"
నేను మాట్లాడలేదు.
పోలీస్ స్టేషన్ లో జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
కేస్ బుక్ చేయటానికి యాభై- అవతలి వాడిని అరెస్ట్ చేయాలంటే వంద- అమ్మో, చిదానందమా? ఆయన మాజీ ఎమ్మెల్యే మనిషే- మేమీ కేసు తీసుకోము. యాభై కాదు వంద ఇచ్చినా సరే...
"ఎవరీ వూరి ఎమ్మెల్యే-" అని అడిగాను.
"ధర్మారావని... ఎందుకు?"
'ఏం లేదు. ఊరికనే. అతడికీ చిదానందానికీ దగ్గర సంబంధాలు న్నట్టున్నయే."
"తెలీదు. బహుశా ఫైనాన్సియరేమో"
"దేనికీ ఎలక్షన్లకా?" ఇద్దరం నవ్వుకున్నాం.
అతడు చేతిలో కాగితం తిరిగి నా కిచ్చేస్తూ "ఆ నారాయణని పిలిపించు. వీలైతే ఏదైనా చేద్దాం" అన్నాడు.
"నేను రేపు తీసుకురానా? వాళ్ళని తీసుకురావాలంటే ఘనాపురం వెళ్ళాలి..."
"ఛార్జి అప్పగించేసి నేనీ రోజు రిలీవు అయిపోతున్నాను. సాయంత్రం వెళ్ళిపోవాలని ప్లాను. ఈ రోజు నువ్వు కలవటం లక్..."
"మరీ పని?"
"దీని దేముంది? నారాయణతో పాటూ ఇలాటి వాళ్ళనే మరో నలుగురిని తీసుకురమ్మను. అందరూ కలిసి అర్జీ పెడితే ఆ చిదానందాన్ని నేను చీవాట్లు పెడతాను. నీక్కావలసింది నారాయణ కొడుకుని ఒక్కణ్ణి విడిపించటమే కదా! అంత చిన్న పనికోసం చిదానందం మాతో వైరం పెట్టుకుంటాడనుకోను. నా అంచనా కరెక్టయితే వాడిని వదిలేస్తాడు."
ఈ ఆలోచన బావుందనిపిస్తుంది. కుర్రవాడిని తీసుకెళ్ళి నారాయణ కుటుంబానికి అప్పగిస్తే నా మాట నెరవేరినట్టే.
"నేను వెళ్ళి కొంతమందిని పట్టుకొస్తాను" అన్నాను.
"కూర్చో కూర్చో. మళ్ళీ ఇంత ఎండలో అంతదూరం ఏం వెళ్తావులే. మా వాడిని పంపించి తెప్పిస్తాను" అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. రెండ్రోజుల్నుంచీ బాగా అలసిపోయి వున్నానేమో, బాగా నిద్ర పట్టింది.
తిరిగి మెలకువ వచ్చేసరికి సాయంత్రమవుతూ వుంది. మొహం కడుక్కుని బయటకు వచ్చాను. బయట తోటలో పురుషోత్తమ్ కి వీడ్కోలు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆఫీసు వాళ్ళు దండలూ అవీ తీసుకొచ్చి పెడుతున్నారు. ఫోటోగ్రాఫర్ వచ్చాడు. పురుషోత్తమ్ ఎవరితోనో షేక్ హాండ్ ఇస్తూ మాట్లాడుతున్నాడు.
ఈ లోపులో జీపు వచ్చింది. నారాయణా మరో నలుగురు గ్రామస్థులూ భయం భయంగా దిగారు. తమ దగ్గిరకి ఇలా అఫీషియల్ జీపు వస్తుందనీ, ఎక్కించుకుంటుందని వారు వూహించుకుని వుండరు. బిత్తర చూపులు చూసుకుంటూ నిలబడ్డారు. థాంక్స్ టూ గండ్రగొడ్డలి. నన్ను డబ్బు, హోదా ఉపయోగించ వద్దన్నావేగానీ 'స్నేహం' ఉపయోగించవద్దనలేదు. అది ఈ విధంగా ఉపయోగపడింది.
నవ్వుతూ వాళ్ళ దగ్గిరకి వెళ్ళాను. నన్ను చూడగానే నారాయణ మొహం విప్పారింది. బహుశా అంత రిలీఫ్ అతడెప్పుడూ అనుభవించి వుండడు. దగ్గరగా వచ్చి "దొరా" అన్నాడు. అతడి భుజంమీద చెయ్యి వేసి "నేనే పిలిపించాను" అన్నాను.
ఇంతలో పురుషోత్తమ్ అక్కడికి వచ్చాడు. "మనం లోపల కూర్చొని ఈ విషయం సెటిల్ చేద్దామా" అన్నాడు. నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. అంత హడావుడిలో వుండికూడా అతడు ఈ విషయంలో ఇంత చొరవ తీసుకోవటం..
వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళాను. ఇద్దరం చెరో కుర్చీలో కూర్చున్నాం.
వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడ్డారు. పురుషోత్తమ్ అడగటం ప్రారంభించాడు.
"చిదానందం దగ్గిర మీరందరూ అప్పు చేశారా?"
తలూపారు వాళ్ళు.
"నీ పొలం లాక్కొన్నాడా అతడు?" నారాయణని అడిగాడు.
నారాయణ తలూపాడు.
"కోర్టులో దావా వేశాడా? నువ్వే వ్రాసిచ్చావా?"
"నేనే వ్రాసిచ్చాను బాబూ"
"ఎందుకని?"
నారాయణ మాట్లాడలేదు. ధైర్యం చెపుతున్నట్టు - "ఇందులో నువ్వు భయపడవలసిన దేమీలేదు నారాయణా. అయ్యగారు మీకు సాయం చేస్తారు. ఉన్నదున్నట్టు చెప్పు" అన్నాను.
"అప్పు తీసుకున్న సొమ్ముమీద వడ్డీపోనూ, మిగతాది ఇచ్చి పొలం వ్రాయించుకొన్నాడు" అన్నాడు.
"ఎంతిచ్చాడు?" ఈసారి నేను అడిగాను.
"గుర్తులేదు దొరా"
"అయిదారు వేలిచ్చాడా?"
"అంత లేదు"
"రెండు మూడు వేలు?"
....
"వెయ్యి?"
.......
పురుషోత్తం అన్నాడు - "పోనీ వెయ్యి ఇచ్చాడనుకుందాం. అందులో అయిదువందలు అతడికి వెనక్కి ఇచ్చేసి నీ నోటు నువ్వు తీసుకోవచ్చు కదా. అతడి దగ్గిరే ఎందుకుంచేసేవు?"
"నోటు ఇవ్వనన్నాడు- డబ్బే ఇస్తానన్నాడు."
ఎందుకన్నాడో నాకు అర్ధమైంది. ఆ నోటు చాలా విలువైంది. కల్పవృక్షం లాటిది. నెలనెలా వడ్డీ సంపాదించి పెడుతుంది. దాన్ని వదులుకోడు చిదానందం. కావాలంటే ఇంకొంచెం డబ్బు ఇస్తాడు.
"నోటు ఇవ్వనన్నాడు- డబ్బే ఇస్తానన్నాడు. సరే, కానీ ఆ వెయ్యిలో సగం ఇచ్చేసి వుంటే నీకిన్ని కష్టాలు లేకపోవును కదా. నీ కొడుకు నీతోపాటే వుండేవాడు. అనవసరంగా పొలం తక్కువ ధరకి అమ్మేసేవ్! పైగా కొడుకుని కూడా ఇచ్చేసేవు."
"వెయ్యి ఏడ దొర. అయిదువేలాయే."
"నోటు రాసింది కాదు. నువ్వు తీసుకున్నది" పురుషోత్తమ్ అన్నాడు.
"నే దీసుకున్నదెంత? వెయ్యా? అయిదు వేలా?"
"అయిదువేలు" వినయంగా అన్నాడు నారాయణ.
నా చెవులని నేనే నమ్మలేక, అదిరిపడ్డట్టు లేచాను. పురుషోత్తమ్ నావైపు చూశాడు.
"నారాయణా! ఏమిటి నువ్వంటున్నది?" దాదాపు అరిచాను. "నువ్వు తీసుకున్నది అయిదొందలే. గుర్తు తెచ్చుకో. ఏమీ భయపడకు. ఉన్నదున్నట్టు చెప్పు-"
నారాయణ నావైపు చూడకుండా చెప్పాడు. "అయిదువేలు తీసుకున్నాన్దొరా! దానిమీద వడ్డీ కట్టలేక పొలం అమ్ముతానని చెప్పిన. అప్పటివరకూ పెరిగిన గిర్వి (వడ్డీ) మాపు చేసిండు, పైగా ఇంకో వెయ్యి ఇచ్చిండు. నెల నెలా నా కొడుక్కి తనఖ (జీతం) ఇస్తుండు"
"అయితే ఇప్పుడు నీ ఫిర్యాదు ఏమీ లేదంటావు"
నేను ఏదో అనే లోపులో నారాయణ అన్నాడు-
"ఏమీ లేద్దొరా"
సూదిపడితే వినబడేంత నిశ్శబ్దం అక్కడ వ్యాపించింది.
ఇంతలో ఎవరో పిలుస్తే పురుషోత్తమ్ బయటికి వెళ్ళాడు. బైట కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి. అంతా హడావుడిగా వుంది.
గదిలో మేం అయిదుగురం నిలబడి వున్నాం. వాళ్ళు నలుగురూ నావైపు చూస్తున్నారు. ఎప్పుడు ఇక్కడనుంచి వెళ్ళిపోయి బైటపడదామా అన్న తొందర వాళ్ళకళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనబడుతూంది.
* * *
"మిమ్మల్ని దేవుడు కూడా క్షమించలేడు" కోపంతో నిస్సహాయతతో నా గొంతు నాకే వికృతంగా ధ్వనించింది. వాళ్ళందరూ మౌనంగా వున్నారు. డ్రైవరునా మాటలు పట్టనట్టు నడిపిస్తున్నాడు. జీపు ఘనాపురం వైపు వెళుతూంది. వెనుకవైపు కూర్చొని వున్నారు వాళ్ళు తలలు దించుకుని... మాటలు రానట్టుగా...
"మీ కోసం నానా ఆఫీసులూ తిరిగాను. పోలీసు స్టేషనులకి వెళ్ళాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళూ పట్టుకున్నాను."
నారాయణ నెమ్మదిగా తలెత్తాడు. "పొలంబోయిన కొత్తలో నేనూ ఈ ఆఫీసుల చుట్టూ తిరిగాన్దొరా" అన్నాడు. నా ఇరిటేషన్ మరింత హెచ్చింది. "నువ్వు తిరగటం వేరు. నేను తిరగటం వేరు" అన్నాను. విసుగూ, కోపం మిళితమైన స్వరంతో "అలా తిరిగిన వాడివి, అంతా అవ్వొచ్చేసరికి అబద్ధం ఎందుకు చెప్పావు? ఈ పాటికి నీ కొడుకు నీతో పాటూ వుండేవాడు. వడ్డీ మాఫీ అయిపోయి వుండేది. ఒక చిన్న మాటతో మొత్తం అంతా నాశనం చేశావు."
"అదంత సులభం కాద్దొరా."
వెనుకవైపు వుండిపోయాడుగానీ లేకపోతే ఆ మాటలకి లాగిపెట్టి కొట్టేవాడిని. అంతలోనే వాళ్ళ అమాయకత్వానికి జాలి కూడా వేసింది. మోసపోవటం కూడా తమ జీవితంలో ఒక భాగమే నని భావించే వీళ్ళకి, తమ హక్కుల గురించి ఎవరు చెపుతారు? అయినా నేను పక్కనుండగా, కలెక్టర్ దగ్గిర నిజం చెప్పటానికి ఎందుకు వెనుకాడారు వీళ్ళు? ఎందుకు భయ...
భయం!
అప్పుడు నాకు విషయం అర్ధమైంది!!
చిదానందం అంటే వీళ్ళు భయపడుతున్నారు. అందుకే నిజం చెప్పలేదు... తలెత్తి వాళ్ళవైపు చూశాను. నా అనుమానం నిజమే అని నమ్మకం కుదిరింది. నా కళ్ళముందు చిదానందం రూపం కదలాడింది. పెద్దబొజ్జ, కళ్ళల్లో భయం. దాన్నికప్పి పుచ్చుకోవటానికి మేకపోతు గాంభీర్యం -అతడిని చూస్తే చిన్నపిల్లాడు కూడా భయపడడే! వీళ్ళెందుకు భయపడుతున్నారు?'