మరో రూమ్ లో ఇద్దరు ఆర్మీ ఆఫీసర్లు ప్రనూషని నిలువెల్లా పొగడ్తలతో అభినందిస్తున్నారు. చైతన్య అక్కడికి చేరుకున్నాడు. "మీరు మా క్యాంప్ లో కూడా ప్రోగ్రాం ఇస్తే సంతోషిస్తాం" ఒక ఆఫీసర్ అడిగాడు.
"తప్పకుండా" అన్నాడు చైతన్య. "మీ పై అధికారుల్నించి అనుమతి తీసుకోండి."
"ఆయనే దీన్ని అడగమన్నారు. మాది ఈస్ట్రన్ సెక్టార్."
ప్రనూష చప్పున చైతన్య వైపు చూసింది. చైతన్య ఆమెకి మాత్రమే తెలిసేలా నవ్వేడు. ఆమెకు అర్ధమైంది. వాళ్ళని ఈ ప్రోగ్రాంకి పిల్చింది కూడా అతనేనని ఊహించింది. చదరంగంలో మొదటి ఎత్తు ఆ విధంగా పూర్తయింది. ఆమెకు పట్టలేనంత సంతోషం కలిగింది. చైతన్య వాళ్ళతో ఏ యే తేదీల్లో వీలవుతుందో చెపుతున్నాడు. సైన్యంలో ఉన్నతాధికారులకి కుటుంబాల్తో సహా చూడటానికి ఒక ప్రోగ్రాం. సైనికులకి విడిగా ఒక ప్రోగ్రాం ఇస్తే బావుంటుందని అంటున్నాడు. రెండు దేశాలమధ్య మంచి బాంధవ్యం నెలకొనటానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ సాయపడతాయని భారత రాయబారి చెబుతున్నాడు. ఆమె అదేమీ వినటంలేదు. దాదాపు ఈ ఆపరేషన్ పూర్తయినట్టే.
"నిన్నెక్కడో చూసినట్టుందే?"
ఆమె వెనుకనుంచి వినపడింది కంఠం. ఆమె వెనక్కి చూసింది. ఇస్మాయిల్ ని ఎవరో ప్రశ్నిస్తున్నారు.
ఆమె వెన్నులోంచి జలదరింపు ఒళ్ళంతా పాకింది.
ఆ కంఠం ఆమెకి పరిచితమే!
నిద్రలోనయినా గుర్తుపట్టగలదు.
ఆమె చప్పున మొహం తిప్పుకుని స్తంభం పక్కకి తప్పుకుంది.
చైతన్య ఇదంతా గమనిస్తూనే వున్నాడు.
ఉన్నట్టుండి ప్రనూష ఆ విధంగా ఎందుకు భయపడిందో అర్ధంకాలేదు. అతడి అనుమానాన్ని నివృత్తి చేయటానికా అన్నట్టు ఇంతలో ఒక ఆఫీసర్ "మిస్టర్ చైతన్యా" అని పిలిచాడు. చైతన్య అటు చూశాడు.
అతడిని గ్రీన్ రూమ్ దగ్గర ఢీకొన్న వ్యక్తిని పరిచయం చేస్తూ "ఈయన మా చీఫ్-అజ్మరాలీ" అన్నాడు ఆఫీసర్.
ఒక్కసారిగా ఆ హాలంతా చల్లబడినట్లు అనిపించింది చైతన్యకి. ఇలాంటి సమయం వస్తుందని తెలుసుగానీ మరీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అప్రయత్నంగా చేయి సాచాడు.
ఎదుటిమనిషి ఆజానుబాహువు. మొహంలో క్రూరత్వంనిండి వుంది. అదో రకమైన సాడిస్టిక్ నవ్వు. వికృతంగా వుంది. చైతన్యతో చేయి కలిపి కూడా అతడు ఇస్మాయిల్ నే చూస్తున్నాడు.
"ఎక్కడ చూశాను నిన్ను?" మళ్ళీ అడిగాడు.
ఇస్మాయిల్ ఏం చెప్పాలో తోచనట్టు చైతన్యవైపు చూశాడు. ఆ బాధ్యతను తను తీసుకున్నాడు చైతన్య.
"అతడి పేరు ఇస్మాయిల్. నా సెక్రటరీ" అన్నాడు. "పూర్వం సైన్యంలో పనిచేశాడు."
అజ్మరాలీ మొహం విప్పారింది "కరెక్ట్. మేం యుద్ధంలో బంధించాము ఇతడిని. తర్వాత మీ దేశానికి వదిలేశాం! అఫ్ కోర్స్ చాలామందిని అలా వదిలేశామనుకో. అబ్బో ఆ రోజుల్లో వేల సంఖ్యలో దొరికారు మీ సైనికులు."
చైతన్య మొహం ఎర్రబడింది. సరి అయిన సమాధానం చెపుదామనుకున్నాడు. కానీ అది సమయంకాదని వూరుకున్నాడు.
ఈ లోపులో మరో ఆఫీసర్ అజ్మరాలీతో "సార్! మీరు చాలా బాగా డాన్స్ చేసిందని మెచ్చుకున్నారు ఈ అమ్మాయే" అన్నాడు. ఆ మాటలకి స్తంభం వెనుకనుంచి ప్రనూష బయటికి రాక తప్పలేదు.
రక్తం యింకి తెల్లగా పాలిపోయిన మొహంతో ప్రనూష ముందుకి అడుగువేసింది.
అజ్మరాలీ ఆమెవైపు తిరిగాడు.
చైతన్య ఊపిరి బిగపట్టాడు.
గ్రీన్ రూమ్ లోంచి పడుతున్న వెలుతురు ఆమె మొహంమీద ప్రతిబింబిస్తూంది.
ప్రనూష వేరే గెటప్ లో వుంది. అయినా సరే పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె అజ్మరాలీ వైపు కన్నార్పకుండా చూస్తోంది. ఆ చూపులో, వీలైతే అతడిని అక్కడికక్కడే చంపేద్దామన్నంత కసి కనబడుతోంది. ఆమె ఆ భావాన్ని దాచుకునే ప్రయత్నం ఏమీ చేయటంలేదు. చైతన్యకి ఆమె అక్కడినుంచి తొందరగా వెళ్ళిపోతే బావుణ్ణు అనిపిస్తోంది. ఆమె మాత్రం అటువంటి ప్రయత్నం చేయకుండా నవ్వుతూ "మా ప్రోగ్రామ్ మీకు నచ్చిందా?" అంది.
"అద్భుతం. నిజంగా అద్భుతం" అన్నాడు. అతడి కళ్ళల్లో కాంక్ష స్పష్టంగా కనిపిస్తూంది. చైతన్యకి సంతృప్తి కలిగింది..... అతడి కళ్ళల్లో కాంక్ష మాత్రమే వుంది. అనుమానం లేదు. అందుకు..!" ఈ లోపులో అజ్మరాలీ ప్రనూష భుజంమీద చేయి వేసి దూరంగా తీసుకెళ్ళాడు. చూసేవాళ్ళకి అది, ఒక తండ్రి తన కూతుర్ని దగ్గరగా చేయివేసి తీసుకెళ్లినట్టు వుంటుందిగానీ, అందులో కాంక్ష సునిశితమైన దృష్టి వున్నవాళ్ళకి వెంటనే అర్ధమవుతుంది. ఇలాంటి చర్యలు వయసు మీరిన దేశనాయకుల్లోనూ, మఠాధిపతుల దగ్గరా, వృద్ధ నటుల విషయంలోనూ గమనించవచ్చు.
అయితే చైతన్య ఇదంతా ఆలోచించటంలేదు. ఆమెతో అతడు ఏం మాట్లాడుతున్నాడా అన్న అనుమానంతో చైతన్యగుండె వేగంగా కొట్టుకుంటూంది.
"అమ్మాయ్! నువ్వు మా సెక్టార్ కొచ్చి మా సైనికులకి నీ అపురూపమైన నాట్యం చూపించాలి."
"మీ క్రింది ఆఫీసర్లు అడిగారు. సరే అన్నాను" అంది ప్రనూష. భుజంమీద పాములా పడిన చెయ్యిని తొలగించే ప్రయత్నం చేస్తూ.
"రెండు మూడు రోజుల్లో ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాము."
ఆమె తెల్లబోయి, "రెండు మూడు రోజుల్లోనా? మాకు రావల్పిండిలో ప్రోగ్రామ్స్ వున్నాయే" అంది. అతడు తేలిగ్గా, "కేన్సిల్ చేయిద్దాం" అన్నాడు.
అతడి మాటల్లో "మా దేశంలో సైన్యం తలచుకుంటే చేయలేనిది ఏముంది?" అన్న అర్ధం ధ్వనించింది.
ఆమె క్లుప్తంగా. "సరే మీ యిష్టం" అంది. ఆమె వెనుదిరిగి వస్తూంటే, "అమ్మాయ్ నీ పేరు" అన్నాడు. ఆమె మొహంలో ఏ భావమూ లేకుండా "ఝాన్సీ" అని అక్కడినుండి వచ్చేసింది.
ఆమె దగ్గరకి వచ్చాక చైతన్య అడిగాడు. ఆమె జరిగినదంతా చెప్పింది.
"అతడికే మాత్రమూ అనుమానం రాలేదంటారా?"
"రాలేదు. ఆ విషయం నేను నిశ్చయంగా చెప్పగలను."
అతడు మరి రెట్టించలేదు.
హోటల్ కొచ్చేసరికి పదకొండు దాటింది.
మరుసటిరోజు ప్రొద్దున ఎనిమిదింటికి ప్రనూషకి ఎవరో విజిటర్ వచ్చాడని కబురొచ్చింది. అంతలోనే తలుపు లోపలకి రావటం కూడా చూసింది. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. ఆ వచ్చింది అజ్మరాలీ! అది పంచతార హోటల్ కాబట్టి ముందు వేరే సిటౌట్ వుంది. అక్కడ కూర్చుని ఆమెకోసం ఎదురు చూస్తున్నాడు అతడు. ఆమెకి పాలుబోలేదు. తన రూమ్ నుంచి చైతన్యకి ఫోన్ చేసింది. "ముందుగదిలో అజ్మరాలీ కూర్చుని వున్నాడు. నిన్నంటే పూర్తి మేకప్ లో వున్నాను కాబట్టి తెలియలేదు. ఇప్పుడు ఇబ్బంది వస్తుందేమో" అంది.
"ఫేషియల్ కి ముందు మొహానికి వేసుకునే 'ఫేమ్' లాటిది రాసుకో. ఒక గంటవరకూ దాన్ని తీయటానికి వీలుపడదని ఇబ్బందిగా రెండు నిమిషాలు కూర్చో. అతడిని తొందరగా వదిలించుకున్నట్టు వుంటుంది. నిన్నూ అతడు గుర్తుపట్టలేడు" అన్నాడు చైతన్య ఫోన్ లో.
అంత తొందరగా, ఏ మాత్రం తడబాటు లేకుండా అతడు పరిష్కారం ఆలోచించి చెప్పిన విధానం ఆమెని సంభ్రమంలో ముంచింది. ఒక స్త్రీ మగవాడిలో మాటకారితనాన్ని ఇష్టపడవచ్చు. దానికి వ్యతిరేకంగా మరో స్త్రీ మితభాషత్వాన్ని ఇష్టపడవచ్చు.
ఒక స్త్రీ మగతనాన్ని ఇష్టపడవచ్చు లేదా దానికి వ్యతిరేకంగా మరో స్త్రీ నాజూకుతనాన్ని ఇష్టపడవచ్చు.
ఒక స్త్రీ అందాన్ని ఇష్టపడవచ్చు లేదా మరో స్త్రీ మొరటుగా ఉండటం ఇష్టపడవచ్చు.
ఇన్ని విషయాల్లో ఇన్ని వ్యతిరేకతలు వున్న ప్రతీ స్త్రీ మగవాడిలో నిర్ద్వందంగా ఇష్టపడే ఒకే ఒక గుణం.... ఇంటిలిజెన్స్!
* * * *
ప్రనూషతో ఫోను మాట్లాడి పెట్టేసేక చైతన్యకి ఇబ్బందిగా అనిపించింది. నిన్నరాత్రి ఫంక్షన్ లో కలిసిన అజ్మరాలీ, మరుసటిరోజు ప్రొద్దున్నే హోటల్ కి ఎందుకొచ్చాడు? కేవలం ఆ అమ్మాయిపట్ల ఆకర్షితుడయ్యా? లేక ఏదైనా అనుమానం వచ్చా?
అతడు తన గదిలో కూర్చోలేక పోయాడు. అక్కడ ప్రనూష ఏం ఇబ్బంది పడుతూందో అని ఆమె గదికి బయల్దేరాడు.
ఆమె రూమ్ తలుపు పూర్తిగా వేసి లేదు. సందులోంచి ప్రనూష కనబడుతూంది. అతడు సూచించిన విధంగానే మొహానికి క్రీమ్ రాసుకుని ఇబ్బందిగా మాట్లాడుతూంది. అజ్మరాలీ ఆమె కష్టాన్ని గమనించినట్టు లేడు. తీరుబడిగా కూర్చుని కబుర్లు చెపుతున్నాడు.
"నీకు నాట్యంలో ఎంతకాలం నుంచి ప్రవేశం వుంది?"
"చిన్నతనం నుండీ..."
"చక్కని పర్సనాలిటీ నీది. నాట్యానికి సరిపోతుంది! ఈ చైతన్య నీకు ఎంతకాలంగా తెలుసు?"
"అయన అక్కడ సినిమాల్లో హీరో. నా నాట్యం చూసి ఈ ట్రూప్ కి రమ్మని ఆహ్వానించారు. నేను సరే అన్నాను."
"మీ నాన్నగారు ఏం పనిచేస్తూ వుంటారు?"
"కలెక్టరు"
ఆ సమాధానానికి అజ్మరాలీ మొహంలో భావాలు ఎలా మారతాయో అని చూడటానికి ప్రయత్నించాడు చైతన్య. కానీ కనపడలేదు.
"మీ అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తూ వుంటారా?"
"లేదండీ"
ఇక ఆ ప్రశ్నల పరంపర ఆగదని చైతన్య లోపలికి అడుగుపెట్టాడు. అజ్మరాలీ అతడిని చూసి చేయి అందిస్తూ "రేపే మీ ప్రయాణం. రేపురాత్రి మా ఆర్మీ క్యాంప్ లో ప్రోగ్రామ్" అన్నాడు.
చైతన్య అభ్యంతరం చెపుతున్నట్టు "కానీ రేపు రావల్పిండిలో మాకు..." అంటూ ఏదో చెప్పబోయాడు. అజ్మరాలీ అతడి మాటలు మధ్యలో కట్ చేస్తూ, "ఆ ప్రోగ్రామ్ కాన్సిల్ చెయ్యమని నిన్నరాత్రే కబురు చేశాను" అని లేచి "వెళ్ళొస్తాను" అన్నాడు.
అతడు వెళ్లిపోయాక ప్రనూష చైతన్యవైపు చూసి నవ్వింది "బ్రతికించారు. పది నిమిషాల నుంచీ తింటున్నాడు" చైతన్య నవ్వలేదు. "నిన్నింకా అతడు ఏం అడిగాడు?" అన్నాడు.
"లోకాభిరామాయణం.... మా కుటుంబ విషయాలు వగైరా... " తేలిగ్గా అంది ప్రనూష. "ఏదో ఒక మిషమీద మరి కాసేపు కూర్చోవాలని అతడి ఇంటరెస్టు...."
"నా కెందుకో అతడిని చూస్తూంటే అలా అనిపించటంలేదు. ఒక అనుమానాన్ని తీర్చుకోవటం కోసమో, లేకపోతే అంతా తెలిసి, నిన్ను ఆట పట్టించటం కోసమో నీ చుట్టూ తిరుగుతున్నాడని నా ఉద్దేశ్యం."
"అలా అనుమానంతో వచ్చినవాడు ఇంతసేపూ ఎందుకు వూరుకుంటాడు? మనల్ని చూసిన వెంటనే నా పాస్ పోర్టు పరీక్ష చేస్తే అసలు విషయం తెలిసిపోతుందిగా" అంది.