Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 21


    కొంచెం ఆగి కొనసాగించాడు.

    "షూటింగ్ లో పాల్గొనడానికి శరీరాన్ని కంట్రోల్ లో వుంచుకోవటం వేరు. యుద్ధానికి బయలుదేరే ముందు తీసుకోవలసిన ట్రైనింగ్ వేరు."

    ఆమెకు అప్పుడు అర్ధంకాలేదు.

    ఆర్నెల్లపాటు అతడిని గమనించాక అర్ధమైంది.

    అది ట్రైనింగ్ కాదు.

    తపస్సు!

    చేతిలో వున్న షూటింగ్ లు నెలరోజుల్లో పూర్తి చేశాడు.

    తరువాత దీనిమీద ఏకాగ్రత నిలిపాడు. రోజుకి నాలుగు గంటలపాటు ఎక్సర్సైజు. సముద్ర తీరంలో పరుగెత్తటం- గంటల తరబడి అరచేతుల్ని చేతులమీద కొట్టటం- ఒక మిషన్ లా తయారయ్యాడు. మెడిటేషన్ మనిషికెంత సాయపడుతుందో ఆమె పుస్తకాల్లో చదివింది. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది. జలపాత ప్రవాహపు ధార నెత్తిమీద పడుతూంటే ఒంటికాలిమీద నిలబడటం, ప్రొద్దున్న నాలుగింటికి లేచి రెండు గంటలపాటు జాగింగ్ చేయటంతో అతడి దినచర్య ప్రారంభమయ్యేది.

    చైతన్య అకస్మాత్తుగా తన చిత్రాల్ని తగ్గించుకోవటం పరిశ్రమలో కలవరం రేపింది. అసలు కారణం తెలిసినవారు నలుగురే. చైతన్య, ప్రనూష, ఇస్మాయిల్, రంగనాయకి.

    ఆ ఆర్నెల్లూ రంగనాయకి మానసిక స్థితి వర్ణనాతీతం.

    నుదుట కుంకుమ ధరించే అవకాశం లేదు. అది రకరకాల అనుమానాలకి దారితీస్తుందని ఆమె బొట్టు పెట్టుకోలేదు. మరో వైపు అక్కడ శత్రు శిబిరంలో భర్త ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో అన్న వేదన. భర్త గురించి తెలియకపోవటం వేరు. భర్త మరణించలేదనీ, సంవత్సరం క్రితంవరకూ బ్రతికే వున్నాడని తెలిసి ఇప్పుడు ఎలా వున్నాడో తెలియకపోవటం వేరు. ఈ అయోమయ స్థితిలో ఆమె ఆర్నెల్లు నరకయాతన అనుభవించింది.

    ఆ ఆర్నెల్లలో చైతన్య శరీరంలో వచ్చిన మార్పు ప్రనూషనే ఆశ్చర్యంలో నింపింది. అతడి శరీరం ఉక్కులా మారింది. ముఖంలో కొత్త వర్చస్సు వచ్చింది. కళ్ళు మరింత తీక్షణతని సంతరించుకున్నాయ్. ఇతరులతో మాట్లాడటం పూర్తిగా తగ్గించాడు. ప్రనూష దగ్గర వున్న వివరాలన్నీ దాదాపు కంఠతా వచ్చాయతడికి. భారతదేశం నుంచి డాన్స్ ట్రూప్ విదేశాల్లో నెలరోజులపాటు ప్రోగ్రామ్స్, యివ్వటానికి ప్రభుత్వం అనుమతి యిచ్చింది. కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ మొదలయిన పట్టణాల్లో ఈ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. చైతన్య లాంటి స్టార్ ఈ దేశం తరపున వెళ్ళటం అభిమానులకు చాలా సంతోషాన్నిచ్చింది. అసలు కారణం ఎవరికీ తెలీదు.

    "మనతోపాటు పిస్టల్ లాంటి ఆయుధాలు తీసుకువెళ్ళొద్దు. అక్కడికెళ్ళివాటిని కొనుక్కుందాం ఆ దేశంలో మనకి కావలసినంత విదేశీ కరెన్సీ కోసం నేను ఏర్పాటు చేశాను. దాని సంగతి సరే, నువ్వు మాత్రం నీ ఆకారం, మేకప్ అన్నీ పూర్తిగా మార్చుకో వలసి వుంటుంది. ఏ సందర్భంలోనైనా అజ్మరాలీ మనకు తారసపడవచ్చు. అతడు నిన్ను గుర్తుపట్టకూడదు." ఆమె తలూపింది. ఇంకో పదిరోజుల్లో ప్రయాణమనగా అతడి తల్లి అతడిని అడిగింది- "చైతన్యా! మనతోపాటు ఎవరొస్తున్నార్రా?" చైతన్య చెప్పాడు డాన్సర్స్, బాకీట్రూప్, మానేజర్ వగైరా "నా తరపు నుంచి నేను ఒకర్ని తీసుకురావచ్చా బాబూ!" అడిగింది.

    చైతన్య తల మునకలయ్యేటంత ఆశ్చర్యంతో "ఎవరమ్మా?" అన్నాడు. అతడికి ఆమె చెపుతున్నది కొంచెంసేపు అర్ధంకాలేదు. ఇదేదో చిన్నపిల్లల వ్యవహారంలా తల్లి భావిస్తున్నదేమో అని కూడా అతడు అనుకున్నాడు. మనం వెళుతున్నది పిక్నిక్ కి కాదమ్మా అని అందామనుకుని మళ్ళీ తల్లి బాధపడుతుందేమో అని వూరుకున్నాడు.

    అక్కడే అతడు తప్పుగా ఆలోచించాడు. అతడికి తెలియని కథ వెనుక వేరే వుంది. తాము ప్రవేశిస్తున్నది, మృత్యుముఖంలోకి అని ఆమెకి తెలుసు. తన భర్తకోసం ఆమె దాన్ని చిరునవ్వుతో స్వీకరించింది. కొడుకుని కూడా ఆయత్తం చేసింది. ఈ ప్రయత్నంలో ఇద్దరి ప్రాణాలు పోయే అవకాశం వుందని తెలిసినా ఆమె వెనుదీయలేదు. లక్ష్మిని మాత్రం ఏం చేయాలో ఆమెకు తెలీదు. నెలరోజులపాటు విదేశీ టూర్ లో వెళ్తున్నారని తెలియగానే లక్ష్మి ఆమె వద్ద చేరి తాను కూడా వస్తానన్నది. రంగనాయకి ఎంత చెప్పినా వినలేదు. చివరికి రంగనాయకి ఆ అమ్మాయికి మొత్తం కథంతా చెప్పింది. అలా చెప్పటంలో ప్రమాదం ఏమీ కనపడలేదు. వాళ్ళు ఏ పనిమీద వెళుతున్నారో తెలిశాక లక్ష్మి పట్టుదల మరింత ఎక్కువ అయింది. తనని కూడా తీసుకువెళతామని మాట ఇచ్చేదాకా వదలలేదు. అందుకే రంగనాయకి కొడుకు మీద ఇంత వత్తిడి తీసుకు వచ్చింది. చైతన్య ఒప్పుకున్నాడు.

    అక్కడివరకూ వెళ్ళాక తను ఎలాగూ ట్రూప్ నుంచి విడివడి ట్రూప్ ని వెనక్కి పంపించి వేస్తాడు. లక్ష్మి రావటంలో అభ్యంతరం ఏమీలేదు. తాము ఏ పనిమీద వెళుతున్నామో రంగనాయకి లక్ష్మికి చెప్పేసిందన్న సంగతి చైతన్యకి తెలీదు.


                        11


    "వెల్ కమ్! వెల్ కమ్ టు అవర్ కంట్రీ" విదేశాంగమంత్రి నవాబ్ ఆలీఖాన్ చేయి సాచుతూ అన్నాడు. భారత రాయబారి కూడా విమానాశ్రయానికి వచ్చాడు. దాదాపు ఇరవై మంది ట్రూపు. ప్రముఖుల్ని చైతన్య పరిచయం చేశాడు. డాక్టర్ రాయన్, ఇస్మాయిల్, సుబ్బరాజు, తన తల్లి, లక్ష్మి, ప్రనూ.... తనని రిసీవ్ చేసుకోవటం కోసం భారత రాయబారి రావటం గర్వంగా అనిపించింది చైతన్యకి. అతడికి బాగా ఆశ్చర్యంగా అనిపించింది మాత్రం ప్రనూష ఆకృతిలో చేసుకున్న మార్పు. ఆమెని భారతదేశంలో చూసినవారు ఇప్పుడు చూస్తే వెంటనే గుర్తుపట్టలేరు. ఆ విషయంలో చైతన్య చాలా సంతృప్తిగా ఫీలయ్యాడు. ఆ సాయంత్రం ఇండియన్ ఎంబసీ వారిచ్చిన డిన్నర్ లో పాల్గొన్నారు. ఆ దేశంలో పనిచేసే భారత రాయబారి పేరు శ్రీవాత్సవ. చాలా కలుపుగోరు మనిషి. తమిళుడు. "మా పిల్లలందరూ మీ ఫాన్సు. దాదాపు మీ చిత్రాలన్నీ తమిళంలోకి డబ్బింగ్ అవుతాయనుకుంటాను."

    "అవుతాయి. కానీ ఈ దేశంలో మీకు ఎక్కడ దొరుకుతాయి అవి?"

    "స్మగ్లింగ్. భారతదేశంలో తయారయ్యే ప్రతిదీ దాదాపు ఇక్కడికి స్మగుల్డ్ అవుతుంది. పూర్వం ఇక్కడి ప్రొడ్యూసర్లు కేవలం హిందీ సినిమాలు మాత్రమే చూసి కాపీ కొట్టేవారు. ఇప్పుడు దక్షిణ భారతదేశపు సినిమాలు కూడా చూస్తున్నాను.... పనికొస్తాయేమోనని."

    "మా వాళ్ళూ తక్కువ తినలేదులెండి. మంచి పాకిస్తానీ కథ దొరుకుతే క్షణాల్లో అది మనదేశంలో సినిమాగా తయారవుతుంది" సంభాషణ కొనసాగిస్తూ అన్నాడు. ఆ సాయంత్రం భారత రాయబారి ఆ ట్రూప్ కి విందు యిచ్చాడు. విదేశీయులు కూడా వచ్చారు. "ఈ రెండు దేశాల సంబంధాలు ఎలా వున్నాయి?" అడిగాడు చైతన్య.

    "పైకి చాలా సుహృద్భావంతో వున్నట్టు వుంటారు. కానీ ఎవరి ప్లాన్స్ వారికి వుంటాయి. నిర్మొహమాటంగా చెప్పాలంటే పక్కదేశంలో వైరం ఎల్లప్పుడూ కొనసాగాల్సిందే. రాజకీయాలకి అది చాలా ముఖ్యం. అప్పుడే ప్రజలు స్వదేశీ సమస్యలు కొంత వరకూ మర్చిపోతారు."

    "మళ్ళీ యుద్ధం వస్తుందంటారా?"

    "బహుశా ఇప్పట్లో రాదు. పాకిస్తాన్ తన వ్యూహం మార్చుకుంది. డైరెక్టు యుద్ధం కాకుండా- సరిహద్దు రాష్ట్రాల్లో కల్లోలం రేపటం ద్వారా అలజడి సృష్టిస్తూంది. మన దేశం బంగ్లాదేశ్ ని విడగొట్టింది. ఆ ప్రతీకారం తీర్చుకోవటం కోసం అని ఆ దేశం వాదన..... పైకి చెప్పకపోయినా వారి వుద్దేశ్యం అదే."

    "భారతదేశం నుంచి రాష్ట్రాలు విడిపోతే అది పక్కదేశానికి ఏం లాభం?"

    "చాలా లాభాలున్నాయి. ఇన్ కంటాక్స్. రైల్వే, విమాన, (విదేశీ యాత్రికుల రెవిన్యూ తగ్గిపోయి-సెంట్రల్ బలహీనం అవుతుంది. అసలివన్నీ పక్కన వుంచండి. ఎవరూ ఊహించని ప్రమాదం మరోవైపు నుంచి వస్తూంది. మన దేశంలో ఫామిలీప్లానింగ్ పట్ల మనవాళ్ళు బాగా మొగ్గుచూపుతున్నారు. యాభై సంవత్సరాల తర్వాత హిందూ జనాభా నిష్పత్తి బాగా తగ్గిపోతుంది. ఈ విషయం చాలామంది గుర్తించటంలేదు."

    "మీరు బి.జె.పి.ని సపోర్టు చేస్తున్నట్టున్నారే" నవ్వుతూ అన్నాడు చైతన్య.

    "కాదు. ఉన్న విషయాలు చెబుతున్నాను. నిజానికి ఒక రాయబారిగా నేనీ విషయాలన్నీ మాట్లాడగూడదు. కానీ ఇవన్నీ గుండెలు మండిపోయే విషయాలు. మతంకన్నా దేశం ముఖ్యం అనే భావం మనుషుల్లో కలగడం లేదు. అదే బాధ.

    "యుద్ధం వస్తే చాలామంది పట్టుబడతారు కదా. వారినేం చేస్తారు?" టాపిక్ ని జాగ్రత్తగా తనకి కావలసిన మార్గంలోకి తీసుకొస్తూ అన్నాడు చైతన్య.

    "రహస్యాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. కొంతమందిని చంపేస్తారు. పరస్పరం యుద్ధఖైదీల్ని మార్చుకోవటం కూడా జరుగుతుంది."

    "మన సైనికులు ఇంకా ఎవరయినా వున్నారా బందీలుగా-"

    "ఇప్పుడా? ఇప్పటివరకూ ఎవరుంటారు? యుద్ధం జరిగి చాలా సంవత్సరాలయిందిగా?"

    "సరిహద్దు దాటుతూ పట్టుబడినవాళ్ళు వుండవచ్చు. గూఢచారిచర్యలు సాగిస్తూ దొరికిపోయిన వాళ్ళు వుండవచ్చు. లేదా యుద్ధంలో దొరికి తిరిగి మన దేశానికి ఇవ్వటానికి వీలులేని మేధావులు వుండొచ్చు."

    "కరెక్టే. వాళ్ళని రహస్యంగా జైళ్ళలోనే వుంచుతారు. ముఖ్యంగా మీరు చివర్లో చెప్పిన మేధావుల వివరాలయితే అసలు తెలియనివ్వరు. వాళ్ళు బ్రతికి వున్నట్టు, ఖైదీలుగా వున్నట్టు, మనకు తెలుస్తుంది. కానీ మనం ఏమీ చేయలేము. ఆ పేరుగల వ్యక్తి అసలు మాకు దొరకలేదని వాదిస్తారు."

    "అలాంటి కేసులు ఏమైనా వున్నాయా"

    "ఉదాహరణకి జగదీష్ అనే రాడార్ స్పెషలిస్ట్ ఒకాయన వుండేవారు."

    చైతన్య మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. ఆవేశాన్ని ఉత్సుకతనీ అతికష్టంమీద కంట్రోల్ చేసుకొని మామూలుగా కనపడటానికి ప్రయత్నించాడు. "ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం అతడు శత్రుసైన్యానికి చిక్కాడు. అతడు బందీగా ఉన్నట్టు మన సైనికులు చెప్పారు. కానీ మనం ఏమీ చెయ్యలేకపోయాం. ఐక్యరాజ్యసమితి కూడా ఏమీ సాధించలేక పోయింది."

    "మన గూఢచారులు?"

    "అవన్నీ సినిమాల్లోనే సాధ్యం. ఆ జైళ్ళలోకి వెళ్ళటమే సాధ్యంకాదు. మనం ఎక్కువ వత్తిడి చేస్తే జగదీష్ ని చంపేసే ప్రమాదం కూడా వుంది. అందుకని ఇక ఆ ప్రయత్నం విరమించుకుంది మన ప్రభుత్వం."

    "జగదీష్ బ్రతికే వున్నాడని రూఢీగా తెలిసిందా?" కంఠం క్యాజువల్ గా వుంచుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

    "తెలీదు. ఈ మధ్యకాలంలో ఖైదీలెవరూ విడుదల కాలేదు. అందువల్ల అతడి వివరాలు బయటకు రాలేదు" అంతకన్నా ఎక్కువ ప్రశ్నలడిగితే అనుమానం వస్తుందని టాపిక్ మార్చేశాడు చైతన్య.

    రెండు రోజుల తర్వాత వాళ్లు తమ మొదటి ప్రోగ్రాం ఇచ్చారు. ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. ఒక గొప్ప డాన్స్ డైరెక్టర్ చేత మద్రాసులో ప్రత్యేకంగా కొరియోగ్రఫీ తయారు చేయించాడు చైతన్య. ఆ బాలేలో అతడితోపాటు లక్ష్మీ, పదిమంది డాన్సర్లు, ప్రనూష పాల్గొన్నారు. రంగనాయకి ముందు వరుసలో కూర్చుంది. ఆమె మనసిక్కడలేదు. ఎప్పుడు భర్తని కలుసుకోగలనా అని తపించిపోతూంది. అయినా అంత ఉద్వేగంలో కూడా కొడుకు నాట్యం చూసి చలించింది. తెరమీద చూడటమే తప్ప చైతన్య అంతబాగా డాన్స్ చేయగలడని ఆమెకి తెలీదు. ఈ కార్యక్రమం పట్ల సంతోషించని వ్యక్తి ఎవరయినా వుంటే అది ప్రనూషే. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎందుకో ఆమెకి అర్ధం కాలేదు. అనవసరంగా సమయం వృధా అవుతుందని ఆమె వుద్దేశ్యం. ప్రోగ్రాం పూర్తయ్యాక చైతన్య గ్రీన్ రూమ్ వైపు వెళుతుంటే ఒక వ్యక్తి అతడిని ఢీకొన్నాడు. పొడవుగా, లావుగా వున్నాడు. కనీసం సారీ కూడా చెప్పలేదు. బొంగురు గొంతుతో "ప్రోగ్రాం బావుంది" అన్నాడు పొడిపొడిగా. చైతన్య భుజానికి బలంగా తగిలింది దెబ్బ. ఆ నొప్పి ఓర్చుకుంటూ "థాంక్స్" అన్నాడు.

 Previous Page Next Page