Previous Page Next Page 
వేగు చుక్క పేజి 22



    పెడబొబ్బలు పడుతున్న ఈ కొత్త మృగం ఏమిటో అర్ధం కానీ అడవి జంతువులన్నీ ఆగి, చెవులు రిక్కించి విన్నాయి.

   
                                *    *    *

    చిటపట శబ్దము చేస్తూ, అతి వేగంగా అనూహ్యని సమీపిస్తున్నాయి. మంటలు ఆ వేడికి కమిలిపోతోంది ఆమె శరీరం.

    కోతి వంటి మీద ఉన్న వెంట్రుకలు కొన్ని అంటుకుని చురచుర కాలిపోయాయి.

    ముళ్ళ పొదలను పక్కకు తోసేస్తూ, మంటల మధ్య ఉన్న అనూహ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు సాగర్. కానీ సాధ్యం కావడం లేదు. చాలా శ్రమగా ఉంది, ఆ పని.

    ఉన్నట్లుండి "హలో కేప్టెన్ సాబ్ గుడ్ డే! మేమ్ సాబ్" అని కేకలు వినబడ్డాయి ఆకాశంలో నుంచి ఎవరో దేవ దూతలు ఎలుగెత్తి పిలుస్తున్నట్టు.

    తల ఎత్తి చూశాడు సాగర్.

    అనూహ్య నిలుచున్నా ప్రదేశానికి కొంచెం వెనకగ్గా నిటారుగ్గా, కోట గోడలా ఉన్న కొండ ఒకటి ఉంది. దాని మీద నిలుచుని చేతులూపుతున్నారు ఫకర్, ఇబూకా.

    ఆ కొండ మీదికి అనూహ్యని చేర్చగలిగితే ప్రమాదం తప్పుతుంది కానీ ఎలా?

    వెంటనే సాగర్  దృష్టి దట్టంగా, మోకులాగా, ఒక దానికి ఒకటి అల్లుకుని ఉన్న అడవి తీగెల మీద పడింది. అవి కొండ శిఖరం మీద పుట్టి, తాడులా కిందికి వేళ్ళడుతున్నాయి.

    "ఇబూకా! ఆ తీగెలని ఇటు విసిరెయ్!" అన్నాడు సాగర్, చేతులు రెండూ నోటి పక్కన ఉంచి, పెద్దగా అరుస్తూ.

    రెండుసార్లు చెబితే గానీ ఇబూకాకి అర్ధం కాలేదు.

    ఈ లోగా-

    మంటలు అనూహ్య కాళ్ళ దాకా వచ్చేశాయి. పాదాలు రెండూ నేల మీద అనించి  నిలుచోవడానికి వెళ్ళేకుండా కిందంతా మంటలు!

    ఒక పాదం ఎత్తి, ఒక కాలి మీదే నిల్చుంది అనూహ్య.

    బాలన్సు తప్పితే తను కూడా ముళ్ళ మీద పడిపోతుంది.

    ఇబూకా వంగి అడవి తీగెలని అందుకుని, సాగర్ వైపు విసిరాడు.

    తాడు పట్టుకున్నట్లు వాటిని పట్టుకున్నాడు సాగర్, దాని సహాయంతో ఊగుతూ , ముళ్ళ కంచెల మీదుగా అనూహ్య ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఒక చేత్తో ఆమెని పసిపాపలా ఎత్తేసుకుని  లేపాడు.

    "క్విక్! నా భుజం మీదకి వచ్చి మెడచుట్టూ చేతులెయ్యి!"

    అతి ప్రయాస మీద అతని వీపు మీదికి ఎక్కి, మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంది అనూహ్య.

    అతను తాటిని ఒడిపి పట్టుకుని, గోడలా ఉన్న కొండకి పాదలుతన్ని పెట్టి, పైకి ఎగబాకాడు.

    అతని వెనకాలే ఎక్కి వచ్చింది ఉరాంగ్ ఉటాన్.

    వాళ్ళు పైదాకా వచ్చాక, అనూహ్యని అందుకుని పైకి లాక్కున్నారు ఫకర్, ఇబూకా.

    సాగర్ కూడా కొండ శిఖరం మీదకి వచ్చి నిలబడి, ఆయాసం తీర్చుకోవడం మొదలుపెట్టాడు.

    వినయంగా వంగి, అతనికి అభివాదం చేశాడు ఇబూకా. సంతోషం ప్రకటిస్తూ గంతులేశాడు ఫకర్ ఉరాంగ్ ఉటాన్ కూడా సురక్షితంగా ఉండడం అతనికి ఆనందాన్ని కలిగించింది.

    "హలో మిత్రమా! నువ్వెలా కలిశావ్ వీళ్ళతో!" అన్నాడు పలకరిస్తున్నట్లు.

    సమాధానంగా కిచకిచలాడి, అతని చేతిని పట్టుకుంది ఉరాంగ్ ఉటాన్.

    "మిమ్మల్ని ఇంక ఈ జన్మలో చూస్తానో చూడనో అని భయపడి పోయాను, కేప్టెన్ సాబ్" అన్నాడు ఇబూకా భక్తితో సాగర్ ని చూస్తూ.

    నవ్వాడు సాగర్. "మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమంగానే ఉన్నారని ఆశిద్దాం. ముందు మనం చాంగ్ ని రక్షించాలి"

    నోరెళ్ళబెట్టాడు ఇబూకా. "ఏమిటి! ఆ పరమ నీచుడు చాంగ్ ని రక్షిస్తారా! చూడండి కేప్టెన్ సాబ్! మీరు......."

    "పాపం యమ బాధపడుతున్నాడు అతను"

    "వద్దు కేప్టెన్ సాబ్ వాడి చావు వాణ్ణి చావనివ్వండి నా మాట వినండి!"

    క్షణం ఆపకుండా పెడబొబ్బలు పెడుతున్నాడు చాంగ్. అతని అరుపులతో అడవి అంతా మారుమ్రోగుతోంది.

    అంతలో_

    కొండకు రెండో వైపున మేఘంల దుమ్ము లేచింది. అసంఖ్యాకమైన గిట్టల చప్పుడు వినబడింది. లేళ్ళ మంద ఒకటి కొండ మొదలు పక్కగా ఛేంగు ఛేంగున గాల్లోకి ఎగిరి దూకుతూ పరిగెడుతున్నాయి.

    ఆ మందని తరుముతోంది ఒక హైనా. పరమ వికారంగా ఉంది దాని పూపు లావాటి మెడ. మెడ దగ్గర నుంచీ తోక దాకా ఏటవాలుగా వెనక్కి జారిపోయినట్లుంది దాని శరీరం. వంటి మీద అసహ్యమైన మచ్చలు.

    దాని దృష్టి అంతా నిండు చూలాలు అయిన ఒక ఆడ లేడి మీద ఉంది. ఏ నిమిషానైనా ప్రసవించడానికి సిద్దంగా ఉంది ఆ లేడి. ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెత్తలేక పరిగెడుతూ ఉంది అది దాని నోటి వెంబడి నురుగులు వస్తున్నాయి.

    ఆ లేడిని ఏకదీక్షగా తరుముతోంది హైనా.

    కొద్ది క్షణాల తర్వాత మందలో నుంచీ విడివడి పోయింది లేడి. క్రమంగా బాగా వెనుకబడి పోయింది.

    సరిగ్గా అదే సమయంలో-

    దానికి ప్రసవం కావడం మొదలయింది. నిస్సహాయంగా ఆగిపోయింది ఆడలేడి.

    బొమ్మలా ఉన్న చిన్నలేడి పిల్ల, మాతృ గర్బంలో నుంచీ కొద్దిగా బయటికి వచ్చింది భూమి మీద పడడానికి సిద్దంగా ఉంది.

    అప్పుడు దాన్ని చేరుకుంది హైనా, ఆ పిల్లని నోటితో కరచి పట్టుకుంది.

    సగం తల్లి కడుపులో, సగం హైనా నోట్లో ఉంది ఆ లేడిపిల్ల.

    కడుపు తరుక్కుపోయేలా అరుస్తోంది ఆ తల్లి.

    దుఃఖంతో, ఆగ్రహంతో వణికిపోయింది అనూహ్య! "యూ బాస్టర్డ్!" అని అరిచింది పిడికిళ్ళు బిగించి ఊపుతూ "వదులు వదిలి పెట్టేయ్ ఆ పసిపిల్లని."

    హైనా పళ్ళు ఆ పిల్లని మరింత గట్టిగా కరచి పట్టుకున్నాయి.

    "సాగర్! సాగర్! చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? వెళ్ళి ఆ లేడి పిల్లని రక్షించండి" అంది అనూహ్య ఆవేశంగా. ఆమె కళ్ళ నుంచి ధారగా కారిపోతున్నాయి కన్నీళ్ళు.

    అనునయంగా ఆమె భుజం మీద చెయ్యివేశాడు సాగర్. "టేకిక్ ఈజ్, టేకిట్ ఈజ్!"

    విదిలించుకుంది అనూహ్య.

    "ఒక తట్టు ఆ రాక్షసి పసికూనని చంపేస్తుంటే టేకిట్ ఈజ్ అంటారేమిటి? మీకు చేతకాకపోతే నేనే  చంపుతాను. ఆ హైనాని!" అంటూ వంగి రాయి ఒకటి తీసుకుని బలంగా హైనా వైపు విసిరింది.

    దుఃఖంలో ఆమె హిస్టీరిక్ ప్రవర్తిస్తోందని గ్రహించాడు సాగర్.

    తనకు దగ్గరలో రాయి ఒకటి పడగానే ఉలిక్కిపడి, నోట్లోని లేడి పిల్లని సగానికి కోరికేసింది హైనా. మిగతా సగం తల్లి గర్భంలోనే ఉండి పోయింది. తడబడుతున్న కాళ్ళతో నాలుగు అడుగులు వేసి కింద పడి పోయింది తల్లి జింక.

    హైనా తలెత్తి కొండ శిఖరంవైపు చూసి కోపంగా అరిచింది. "హ్హె హ్హె హ్హె హ్హె" అని మనిషి ఎవరో ఎకసెక్కెంగా, నవ్వుతున్నట్లు ఉంటుంది దాని అరుపు.

    "నువ్వు ఇక్కడే ఉండు! నేను చాంగ్ ని ఆ ముళ్ళపొదలో నుంచీ బయటకు తీసుకు వస్తాను" అని కదలబోయాడు సాగర్.

    కోపంతో ఊగిపోయింది అనూహ్య. "ఏమిటి? చాంగ్ ని రక్షిస్తారా? ఆ ముక్కుపచ్చలారని లేడి పిల్లని హైనా చంపేస్తుంటే చూస్తూ ఊరుకుని, ఈ హీనాతి  హీనమైన మనిషిని రక్షించాలని చూస్తున్నారా?"

    సహనంగా ఆ మాటలన్నీ విని, ఓపిగ్గా చెప్పడం మొదలెట్టాడు సాగర్.

    "అడవిలోకి వచ్చాక ఇక్కడ నిరంతరం సాగే గేమ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ ని మనం అంగీకరించక తప్పదు అనూహ్య! జింకలూ, దుప్పులూ లాంటివి హైనాలకు సహజమైన ఆహారం. పైగా, ఇలా హైనాలూ, చిరుతలూ, పులులూ లాంటి జంతువులు వేటాడి చంపడంవల్ల మొత్తం మీద లేళ్ళమండకే లాభం కలుగుతుంది."

    "ఇంకా నయం!"

    "ఇలా హైనాలకీ, తదితర మాంసారహర జంతువులకీ దొరికిపోయే లేళ్ళు సాధారణంగా అంత సామర్ధ్యం లేనివో, లేదా ముసలీ ముతకవో అయివుంటాయి అలాంటివి నశించిపోతూ, ఆరోగ్యవంతమైన శక్తివంతమైన లేళ్ళు మాత్రమే మందలో మిగులుతాయి.

    అది మందకే లాభం అవుతుంది.

    ఆఫ్రికాలో సెరెంగేటీ అనే ప్రదేశం గురించి విన్నావా అనూహ్యా! అక్కడ కూడా అంతే. ప్రతి సీజన్ లో దుప్పులూ, జిరాఫిలూ దూరాన ఉన్న కొండలవైపు తరలిపోవడం మొదలెడతాయి. ఆ కొండల మీద ఉన్న మేఘాల చేత ఆకర్షింపబడుతాయి అవి. మేఘాలు వర్షించి, అక్కడ ధారాళంగా గడ్డి పెరుగుతుందని తెలుసు వాటికి!

    అలా వలసపోతున్న ఆ మందలో కొన్ని మాత్రం వెనుకబడి పోతాయి.

    అంటే, అవి జీవితపు పరుగుపందెంలో నిలవలేకపోయాయన్నమాట.

    అలా వెనుకబడిపోయిన జంతువులు సింహాలువంటి జంతువులకి ఆహారమైపోతాయి.

    అది సృష్టి న్యాయం అనూహ్యా! సృష్టి తనని తాను బాలన్స్ చేసుకునే పద్దతి అది.

    ఏమీ మాట్లాడలేక ఊరికే ఉండిపోయింది అనూహ్య. కానీ ఆమె కళ్ళు మాత్రం ఇమ్కా వర్షించడం మానలేదు.

    ఆమెని దగ్గరికి తీసుకున్నాడు సాగర్. నెమ్మదిగా ఆమె కన్నీరు తుడిచాడు.

    అతని ఛాతీకి ఆనించి కొంచెం సేపు అలాగే ఉండిపోయింది, అనూహ్య.

    "ఒక్క నిమిషం అనూహ్యా! ఇప్పుడే వస్తాను" అంటూ మళ్ళీ తీగెలని అందుకుని ఊగి చాంగ్ దగ్గరికి వెళ్ళాడు సాగర్.

    మూలుగుతూ చూస్తున్నాడు చాంగ్.

    "చాంగ్! నా కాళ్ళు అందుకో!"

    అంత బాధలోనూ రోషంగా చూశాడు చాంగ్. ఈ అర్భకుడి కాళ్ళు తను పట్టుకోవడమా?

    కానీ అది తప్పు, తను బతికి బయటపడిడానికి మరో మార్గం లేదని తెలుసు అతనికి. అందుకని తన అయిష్టాన్ని తెలుపుతూ ముక్కుతో భయంకరంగా బుర్రుమని శబ్దం చేసి సాగర్ కాళ్ళు పట్టుకున్నాడు చాంగ్.

    తన కాళ్ళు నడుముల దగ్గర  నుంచీ ఊడిపోతాయేమోనపించింది సాగర్ కి ఆ బరువు మోస్తుంటే.

    పళ్ళ బిగువున  ఆ బాధని భరిస్తూ, బలమంతా ఉపయోగించి ఒక్క సాగి ఊగి చాంగ్ ని ముళ్ళపొదలలో నుంచీ బయటపడేశాడు. ఆ విసురుకీ, బరువుకీ ఫట్ మని తెగిపోయాయి తీగెలు.

    కింద పడగానే ముళ్ళన్నీ మరింతగా చాంగ్ శరీరంలో చొచ్చుకు పోయాయి.

 Previous Page Next Page