Previous Page Next Page 
గర్ల్ ఫ్రండ్ పేజి 22

    "అవును!"
    "హోటల్ సక్సెస్ ఫుల్ గా రన్ చెయ్యగలవనే నమ్మకం నీకుందా?"
    "నా సొంత హోటలుంటే, బంగారం కురిపించగలను."
    "నేను తలుచుకుంటే,రెండురోజుల్లో నువ్వు హోటలు ప్రొప్రైటర్ వి కాగలవని తెలుసా?"
    "తెలుసు."
    "మరి నన్నెందుకడగలేదు?"
    "నేను పూర్తిగా మీ ఆధీనంలో ఉంటే తప్ప మీరు నాకోసం అంత పెట్టుబడి పెట్టరని...."
    ఇంతసేపటికి జయపాల్ నవ్వాడు.
    "కరెక్టు! సరే! నీ ముందు ఒక ఆఫర్ ఉంచుతున్నాను. నువ్వు గీతని వదిలేస్తే హోటలుకొని, లేదా కట్టించి అన్ని హంగులతో నీ పేర రిజిస్టర్ చేయిస్తాను."
    ఉలిక్కిపడ్డాడు నీరద్. కానీ వెంటనే ఆవేశంగా ఏ సమాధానమూ చెప్పలేదు.
    "ఆలోచించుకో!" అన్నాడు జయపాల్ ఊరిస్తున్నట్లు.
    నీరద్ లేచి తల్లిదగ్గరకు వచ్చాడు. మీనాక్షి పరమానందంతో ఫలహారం పెట్టింది. ఆకలి లేకపోయినా తిన్నాడు-గీతను తిట్టిపోసింది. అంతా విన్నాడు.
    "కొంపతీసి ఆ అమ్మాయి నీ0ళ్ళుపోసుకుందేమిటిరా?" అంది కొంత ఆశతో_కొంత భయంతో.
    నీరద్ నవ్వి "లేదు" అని వచ్చేశాడు.
    ఆ రాత్రంతా అతను నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. గీత రెండుమూడుసార్లు, "అలా ఉన్నావేం?" అంటే సమాధానం చెప్పలేదు.
    ఎంత పొద్దెక్కినా ఇంకా నిద్రలేవని నీరద్ ని "లే, బండనిద్ర" అని గట్టిగా కుదుపుతూ లేవగొట్టింది. కళ్ళు తెరిచిన నీరద్ గీత ముఖాన్ని తన రెండు చేతులతో బంధించి అలా చూస్తూ ఉండిపోయాడు చాలాసేపటి వరకూ
    గీత పైపైకి కావాలని విసుక్కుంటూ "అబ్బ? పొద్దుటే ఏమిటిది! వదులు" అని తన ముఖాన్ని వదిలించుకోబోయింది.
    నీరద్ కళ్ళలో ఏదో ఆవేదనలాంటిది తెరలా కదిలింది. గీత వెంటనే అతని పక్కన కూచుని తన చెక్కిలి అతని చెక్కిలికానించి, "ఏమిటిది? నేనేదో సరదాకంటే? కాలేజి మానేసి ఇలాగే కూచుండిపోనా, చెప్పు" అంది మృదువుగా.
    నీరద్ గీత ముఖాన్ని వదిలిలేచాడు. ఏం మాట్లాడలేదు.
    అతని ముఖాన ఏవో మబ్బులు తారట్లాడటం గమనించి ఆమె మనసంతా ఎలాగో ఐపోయింది.
    కాఫీ త్రాగుతూ ప్రారంభించాడు. "గీతా, నువ్వు కొద్దిరోజులు మీ అక్కదగ్గిర ఉండాలి."
    "ఆ!" అంది గీత అదిరిపాటుతో.
    తాగుతున్న కాఫీకప్పు పక్కకి పెట్టేసి గీతచుట్టూ చేతులువేసి హృదయానికి చేర్చుకుని "ప్లీజ్. మనకోసం నువ్వు కొంతకాలం ఇది భరించాలి! నామీద నమ్మకంలేదూ!" అన్నాడు.
    గీత మాట్లాడలేకపోతోంది. కళ్ళుమాత్రం కన్నీళ్ళు కురిపిస్తున్నాయి నీరద్ ఎంత తుడుస్తున్నా అవి ఆగటంలేదు. ఆ కళ్ళమీద ముద్దు పెట్టుకుంటు "నువ్విలా అయిపోతే, నేనేం చెయ్యలేను. మనం మంచి హోదా సంపాదించుకోవటానికి, మా నాన్నకు ఏమాత్రం భయపడక్కరలేని దశకు ఎదిగిపోవటానికి....నిన్ను కాస్త ఈ ఇబ్బంది పడమంటున్నాను" అన్నాడు.
    అప్పటికీ గీత మనసు కుదుటపడలేదు. నోటితో ఏం అనలేక కళ్ళతోనే తన అయిష్టాన్ని ప్రకటించింది.
    "గీతా! నన్ను అర్ధం చేసుకో! డాన్సర్ గా నాకు టేలెంట్, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉన్నాయి నిజమే. కానీ, ఏపనీ చెయ్యకుండా యిలా గడపటంకూడా నాకంత బాగుండలేదు. ఇన్నాళ్ళకు నా సామర్ధ్యాన్ని నిరూపించుకునే అవకాశం రాబోతోంది. నువ్వు బాగా కో ఆపరేట్ చెయ్యకపోతే నేనేం చెయ్యలేను. నేనుమాత్రం నిన్నొదిలి ఉండగలనా, చెప్పు?" అన్నాడు.
    ఏదో ఒకవిధంగా తన సామర్ధ్యాన్ని రుజువు చెయ్యాలనే ఆరాటం అతని కళ్ళలో చదవగలిగింది గీత. కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ వెక్కుతూ అంగీకారసూచకంగా తలఊపింది.
    ఆ సాయంత్రమే గీతను వేదదగ్గిర దింపాడు నీరద్. సూట్ కేస్ తో వచ్చిన గీతను చూసి ఆశ్చర్యంగా "ఇదేమిటి? ఆ సూట్ కేస్ దేనికి!" అంది వేద.
    "అక్కా! నీరద్ నన్ను నీ దగ్గిర కొంతకాలం ఉండమన్నాడు" అని అక్కను కౌగిలించుకుని బావురుమంది గీత.
                                                                          16
    నీరద్ తన పెళ్ళికి ఇచ్చిన పబ్లిసిటీకంటే పదిరెట్లు ఎక్కువ పబ్లిసిటి ఇచ్చాడు జయపాల్, నీరద్ గీతను వదిలేసిన వార్తకి__
    "నీరద్ తండ్రితో కలిసిపోయాడు- గీతను వదిలేసాడు," ఏ నోట విన్నా ఇదేమాట!
    "ఆ! లేకపోతే అతడు గీతను ఏలుకుంటాడని ఎవరనుకున్నారు? ఈ గొప్పవాళ్ళంతా ఇంతే. పెళ్ళిపేరుతో మోజుతీరేవరకూ వాడుకుని తర్వాత వదిలేసాడు" అన్నారు. గీత అంత భాగ్యవంతుణ్ని పెళ్ళి చేసుకున్నందుకు అప్పటివరకూ ఈర్ష్యతో మగ్గిపోయిన కొందరు ఆడవాళ్ళు__ 
    ప్రతిరోజూ గీత దగ్గిరకు వచ్చి అనేక రకాల కుతూహలాలతో గీతను ప్రశ్నించి పరామర్శించేవారితో కిటకిటలాడిపోసాగింది వేద ఇల్లు__
    వేద తల్లి గుండెబాదుకుంటూ వచ్చింది- "ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? మాతో తీసుకుపోయి లక్షణంగా పెళ్ళిచేస్తామంటే దెయ్యంలా అడ్డుపడ్డావు - నీకసలు అదంటే ఈర్ష్య. నీకు దక్కని సంసార జీవితం దానికి మాత్రం ఎందుకు దక్కాలని చేతులారా ఇలా చేశావు-అయ్యోరాత! ఒక కూతురి బ్రతుకు అధ్వాన్నమయినా, మరో కూతురికైనా లక్షణంగా పెళ్ళిచేసి ముద్దూముచ్చటా తీర్చుకుందామనుకున్నాను. నువ్వు పడనిస్తావా?" అని ఏడుస్తూనే ఉక్రోషంతో వేదని తిట్టిపోసింది.
    ఒక్కమాటకి కూడా సమాధానం చెప్పకుండా నిర్జీవ ప్రతిమలా కూచుండిపోయింది వేద....అలా కూచున్న వేదని చూసి ఛీత్కారం చేస్తూ గీత చెయ్యిపట్టుకుని.
    "ఇప్పటికైనా మాతో రా. మీ అన్న ఏదో ఇంత సంపాదిస్తున్నాడుగా. ఎలాగో ఒకలా, ఏదో ఒక ఊరికి తీసుకెళ్ళి ఇంత కట్నం గుమ్మరించి నిన్నే అయ్య చేతిలోనయినా పెడితే మా ప్రాణం కుదుటపడుతుంది-" అంది.
    గీత పిచ్చిదానిలా చూసి కెవ్వున ఒక కేకపెట్టి తల్లిచేయి విదిలించుకుంది భయంతో - వేదకి మతిపోయింది. ఏమి సమాజం! ఏమి విలువలు.
    "రావూ! నాకు తెలుసు. సిరి అబ్బదుగాని, చిడు మబ్బుతుందని దాని వెధవగుణాలన్నీ నీకు పట్టుబడ్డాయి. ఇక్కడుంటే, ఇష్టమొచ్చినట్టు ఊరేగవచ్చు అని ఆశపడుతున్నావేకాని, నాలుగురోజులుపోయి ఈ వయసుడిగి ముసలితనం మీదపడ్డాక, ఈ సోకులన్నీ ఏమైపోతాయో, ఆలోచించటంలేదు" అంది తల్లి కసిగా__
    కన్నతల్లి ఇలా మాట్లాడుతోంది. మౌనంగావింటూ కూచుంది వేద, గీత సహించలేదు, పిల్లత్రాచులా లేచింది__
    "అక్కయ్య గుణాలు రావాలంటే మాత్రం అందరికీ ఎలా వస్తాయమ్మా! కుటుంబంకోసం నిలువునా ఆహుతి కాగలిగే ఔదార్యం ఎంతమందిలో వుంటుంది?
    "ఇక నా వృద్ధాప్యం గురించి మాత్రం దిగులు దేనికి? ఈలోగా ఎలాగో ఒకలాగ ఒక ఆడపిల్లని సంపాదిస్తాలే! వృద్ధాప్యంలో నా భారమంతా ఆ పిల్లమీదపడేసి ఎదురు నీతులు చెపుతూ పెత్తనం చెలాయిస్తాను!" అనేసింది....
    నిర్ఘాంతపోయింది తల్లి__ఆవిడ అప్పటివరకూ ఆ ధోరణిలో ఆలోచించలేదు-తల్లిప్రాణం! ఒక కూతురి జీవితం భగ్నమైనా, మరొక కూతురి జీవితమైనా కుదుటపరచాలని తాపత్రయం. ఆవిడకి తెలిసినంత వరకూ ఆడదాని జీవితంలో కుదుటపడటమంటే, పెళ్ళి, సంసారం అంతవరకే, ఆ తరువాత ఇల్లూ వాకిలీ, నగలూ, చీరలూ-వగైరా వగైరా,....అంతకుమించి ఆవిడ ఊహలు సాగవు-ఎంతైనా తల్లి! గీత మాటల్లో నిజాన్ని కాదనలేదు. గీత ఎక్కుపెట్టి విడిచిన బాణం ఆవిడకి  సూటిగా గుండెల్లోతగిలింది- "నాకర్మ! నాకర్మ!" అంటూ కుమిలికుమిలి ఏడ్చింది. చివరకు ఎర్రబారిన కళ్ళలో వేదను దీనంగా చూస్తూ "వేదా! దానిని నాతో పంపెయ్యవే. ఇక్కడుంటే, దాని బ్రతుకు నాశనమయిపోతుందే" అంది.
    అప్పుడు వేద నోరుతెరిచి "తొందరపడి ఎలాగో ఒకలాగ గీతకు ఇంకో పెళ్ళి చెయ్యటంవల్ల పరిస్థితులు చక్కబడవమ్మా. కొంచెం రోజులాగి చూద్దాం. ఏం జరుగుతుందో?" అంది__
    "ఇంకా ఏమిటే చూసేది? అంతా సర్వనాశనమయ్యాక చూసేందుకేం వుంటుందే?" తల్లి ఏడుస్తూ దీర్ఘాలు తీసేస్తోంది.
    ఇక ఆమె మాట్లాడలేదు-మాట్లాడిన ప్రయోజనం ఉండదు__
    "నాకు తెలుసు. నీకు కుళ్ళు-అది బాగుపడితే చూసి ఓర్చలేవు-" అని ఆఖరు అస్త్రం వదిలింది తల్లి - వేద నవ్వింది. లోకంలో అజ్ఞానులను చూసి యోగి నవ్వినట్లు__

 Previous Page Next Page