Previous Page Next Page 
గ్రాఫాలజీ పేజి 21

                                 

    1. ఒక పని చేయటంలో వుండే పరమార్దం అర్దం చేసుకోవటానికి ప్రయత్నించి, ఓడిపోయి ...వేరొక పనిలో ఆత్మతృప్తి కలుగుతుందేమో నని ప్రయత్నించి.. అలా ప్రయత్నిస్తూ... చంచల స్వభావులుగా పేరు పొందుతారు.

    2. ధనాన్నీ, అధికారాన్నీ తృణపాయంగా భావించేమీరు పరిస్థితుల అసలు స్వరూపాన్ని అర్దం చేసుకోకపోతే సర్వం కోల్పోయినట్లుగా ఫీలవుతారు.

    3. ప్రయత్నిస్తే  మీరు మంచి కళాకారులవుతారు.

    4. మర్యాద, మన్నన, మంచినడవడిక ఒకరు నేర్పకుండానే తెలుసుకునే నేర్పుంది మీకు.

    5.మీ స్వేచ్చకీ, కలల ప్రపంచానికీ అడ్డుతగలనంతవరకూ వేరేవారి ఉనికిని పట్టించుకోకపోవడం మీ మంచి తనమే కాదు మీ బలహీనత కూడా.

    6. అవతల వాళ్లు ఎక్కువగా స్పందించే విషయాలకి మీరు స్పందించరు. ఎయిడ్స్ ఎంత బాధాకరమైన వ్యాధో, ఎంతటి ప్రమాదకరమైన భవిష్యత్తుకి దారి తీస్తూందో గొప్పగా వివరించి  చెప్తున్నారనుకొండి మీరందుకు కంగారు పడిపోరు.నెమ్మదిగా తలవూపి జాలిచూపెట్టి, ఆవులిస్తూ  అయిందా అన్నట్లు చూస్తారు.

    7. కప్పుల కొద్దీ నుంచి మిమ్మల్ని ఎక్కువ రక్షిస్తుందన్న అపోహతో ఇలాంటి వ్యసనాలకి లొంగిపోయే అవకాశం వుంది.

    8. కష్టాలు మిమ్మల్ని కట్టడి చేస్తే  అందమైన కలల ప్రపంచంలోకి జారిపోవాలని ప్రయత్నిస్తారే తప్ప ఆ కష్టాలను తొలగించుకోవాలన్న పట్టుదలను పెంపొందించుకోరు.

    9. మీరు ఒక రచయితైతే నెలల తరబడి బార్లలో సమయాన్ని గడిపేస్తూ, కధలకి కావలసిన ప్రేరణ పొందుతున్నామని మిమ్మల్ని మీరు మభ్య పెట్టుకోవచ్చు. నిజానికి మీరు పొందుతున్నది కధలకి కావలసిన ప్రేరణకాదు. అనారోగ్యం, బిల్లులు. ఇది తెలుసుకోడానికి మీకు చాలా కాలం పట్టవచ్చు.

    10. బెడ్రూమ్ లో పడుకొని భవిష్యత్ గురించి ఆలోచిస్తూ గడిపే మీరు మీ భావి కోసం వర్తమానాన్ని చేజార్చుకొనే అవకాశం వుంది.

    11. ఎప్పుడూ ఏదోలోకంలో తేలిపోతుండే మీరు మనసులో మాత్రం పరిస్థితులని కొత్తవారినీ, స్నేహితులనీ విశ్లేషించటంలో మునిగిపోతుంటారు.
    12. మీకు కావలసిన సమాచారం రాబట్టటానికి, ఇతరులు చెప్పలేని విషయాలు కూడా సూటిగా అడిగి వారిని ఇబ్బంది పెడతారు. తీరా అసలు విషయం మీరనుకున్నంత క్లిష్టమైనది కాకపోయేసరికి మీరు విసుగెత్తి డీలాపడతారు.

    13. మీరు క్వాంటిటీ కంటే, క్వాలిటీనే ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా మీస్నేహితుల విషయంలో ఇది బాగా వర్తిస్తుంది.

    14. మీలో ఎంతటి చంచలత్వం వున్నా, జీవితంపట్ల మీకుండే సదవగాహనవల్ల  ఇతరులు మిమ్ములను వేలెత్తి చూపలేరు.

    15. ప్రపంచంలో బాగా పేరుపొందిన చాలామందిలో మీలాగే చేతివ్రాత కుడివైపు జారిపోవడం అనేది కనిపిస్తుంది.

    16. గర్వంగా ప్రవర్తించటం, అతిగంభీరంగా వుండటం మీకునచ్చదు.

    17. మీ స్నేహితులలో లక్షాధికారుల నుంచీ, రిక్షాలాగే వాడి దాకా అందరూ వుంటారు.

    18. మనసులో కక్షలు పెట్టుకొని ఇతరుల ముందు అవమానించటం లాంటివి  మీరు అసలు సహించరు.
   
        9. అక్షరాల మధ్య వ్యత్యాసం

    దీనినే మరొకరకంగా అక్షరాల మధ్య తేడా అని కూడా అనొచ్చు.

    ఒక స్క్రిప్ట్ చూడగానే ఈ చేతివ్రాత బాగుంది అనిపించొచ్చు. అలాగే మరో స్క్రిప్ట్ చూస్తే ఈ వ్రాత బాగోలేదు అనిపించొచ్చు. ఒక స్క్రిప్ట్ బాగుండాలంటే అందులో అక్షరాలన్నీ అందంగా వుండాలనే రూల్ ఏమీ లేదు. ఒక స్క్రిప్ట్ బాగోలేదంటే అందులో అక్షరాలన్నీ సమానంగా లేకుండా వుండాలన్న రూల్ కూడా ఏం లేదు.  ఉదాహరణకి ఈ క్రింది రెండు స్క్రిప్ట్ లు పరిశీలించి చూడండి.

              

 Previous Page Next Page