"కారణం నేనిప్పుడే చెప్పలేదు మీకంటే అప్తులేవరూ ప్రస్తుతం నాకు లేరు. చెప్పలనిపించిన రోజున తప్పక చెప్తాను ...."
"సరేసరే -- చెప్పమని నేనేం బలవంతం చేయటం లేదు లెండి" చిరునవ్వుతో అందామె.
ఇద్దరూ కాఫీ తాగసాగారు.
"ఇంటి కెళ్ళాలంటే భయంగా ఉంటోంది మాధురి గారూ. మా అమ్మాకి -- నేనలా చేశానని కోపంగా వుంది. నాతో సరిగ్గా మాటాడటం లేదు.... ఇలాంటి పరిస్థితుల్లో మనసెలా వుంటుంది చెప్పండి...."
మాధురికి అతన్ని చూస్తే జాలి కలిగింది. కొద్దిసేపు ఇద్దరూ మాటల్లేకుండానే కూర్చుండి పోయారు.
"ఇంక వేళదామా?" అంది మాధురి కొంతసేపటి తర్వాత.
టైం చూసుకొన్నాడు సురేంద్ర.
"ఏడయింది! ఇంకొక్క గంట ఉండలేరూ? తరువాత నేనేదయినా సినిమా కేళతాను - సెకండ్ షోకి!" అడిగాడు తను దీనంగా .
"సరే - పదండి . కాసేపలా నడుద్దాం" అంది మాధురి బయటకు నడుస్తూ.
ఇద్దరూ పక్కపక్కనే నడవసాగారు.
"మన ఆఫీసులో రామారావు వున్నాడు చూశారా! అతను ఎవరో ఒకమ్మాయిని ఉంచుకొన్నాడట---- ఇక్కడ ! డబ్బంతా ఈ అమ్మాయికే ఖర్చు చేస్తున్నాడట ప్రొద్దున్న వాళ్ళ ఊరు నుంచి అతని తండ్రి . అతని భార్య వచ్చి సంగతంతా మన ఆఫీసరు గారికి చెప్పుకొని ఏడ్చారు......"
"అరె పాపం!" జాలి పడ్డాడు సురేంద్ర.
"ఆఫీసరు గారు పిలిచి రామారావుని బాగా చీవాట్లేశారు. భార్యనీ తండ్రిని సరిగ్గా చూడకపోతే ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుందని బెదిరించారు. దాంతో భయపడిపోయాడు. అతని భార్య ఎంత బావుందనుకొన్నారు ? చాలా అందంగా వుంది. ఆ అమ్మాయినే కావాలని కోరి మరీ చేసుకొన్నాడట. మరి ఇప్పుడిదెం రోగమో ..."
సురేంద్రకి మనసు కలుక్కుమంది.
"ఒకవేళ అతని భార్యదే తప్పుందేమో ....... అతనలా మారడానికి."
"ఆఖరికి మగాడనిపించారు ----మీరు కూడా ......" హేళనగా అంది ఆమె.
"మగాళ్ళ కెప్పుడూ తప్పులన్నీ ఆడదే చేస్తుందన్న దురభిప్రాయం ఏర్పడిపోయింది. ఎప్పటికి మారుతుందో ఏమో వాళ్ళ ధోరణి....."
ఏవేవో మాట్లాడుతూనే నడుస్తోంది మాధురి . ఆమెతో పాటు తనూ మాటలలో చాలాదూరం నడిచాడు సురేంద్ర.
"ఆ! వచ్చేశాం! ఇదిగో! ఇదే మా యిల్లు." అంది మాధురి రోడ్డుకి పక్కగానే ఉన్న పెంకుటిల్లు చూపుతూ.
"ఓహో ! అలాగా?"
"ఇంటిలోకి రండి! బయట నుంచే వెళ్ళిపోతారా ఏమిటి? నవ్వుతూ అందామె.
కాదనలేక ఆమెతో పాటు ఇంటిలోకి నడిచాడతను. ఒక పెద్దగది -- ఒక వంటిల్లు ఉన్నాయ్ అక్కడ! అంతే! ఆ పెద్ద గదే డ్రాయింగ్ రూమూ , బెడ్ రూమూ! ఆ గదిలో ఓ పక్కగా మంచం ఉంది. దాని మీద ఉదయం మాధురి విడిచిన చీర ఒకటి అలాగే పడివుంది.
"ఇక నేను వెళ్ళనా మరి?" అడిగాడతను.
"మీ సెకండ్ షో మొదలవడానికి ఇంకా చాలా టైముందిలెండి ......కూర్చోండి !" అందామె నవ్వుతూ.
అలా నవ్వుతున్నప్పుడు ద్విగుణీకృతమయ్యే ఆమె అందాన్ని రెప్ప వేయకుండా చూడసాగాడతను.
అతనేదురుగ్గా మరో కుర్చీలో తనూ కూర్చుంది మాధురి.
ఓ ముసలామె ఆ గదిలోకి ఏదో మాట్లాడుతూ రాబోయి అతన్ని చూసి ఆగిపోయింది.
"మా ఆఫీస్ లోనే పని చేస్తారమ్మా ఈయన. పేరు సురేంద్ర ....." అంది మాధురి.
"అలాగా ! ఇప్పుడే 'టీ' చేసుకొస్తాను----------" అంటూ లోపలకు నడవబోయింది.
"వద్దమ్మా ! ఇప్పుడే .....మాధురి -- నేనూ హోటల్లో తాగి వచ్చాం ......" మొహమాటంగా అన్నాడు సురేంద్ర.
"ఫర్వాలేదు ! మళ్ళీ తీసుకొందాం!"అంది మాధురి.
మరింకేమీ మాట్లాడలేకపోయాడు సురేంద్ర. ముసలామె లోపలకు వెళ్ళిపోయింది.
"ఆమె మా అమ్మ! ఇక్కడుండేది మేమిద్దరమే. మా తమ్ముడు భువనేశ్వర్ లో మా మామయ్య దగ్గరుండి అక్కడే చదువుకొంటున్నాడు ....."
"మరి మీ నాన్నగారు...."
"లేరు ! అయన పోయి ఏడెనిమిదేళ్ళయిపోయింది ........"
"ఓ! అయామ్ సారీ....."
కొద్ది నిముషాల్లో తనే లోపలి కెళ్ళి ఇద్దరికీ రెండు కప్పులలో 'టీ' తీసుకొచ్చింది మాధురి.
"మా నాన్నగారు పోయినందుకు నేనేం బాధపడటం లేదు సురేంద్రగారు ........." అందామె 'టీ' తాగుతూ.
సురేంద్ర ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు.
"అవును ! అయన మంచిమనిషి కాదు! త్రాగుడికి అలవాటుపడ్డ మనిషి! ఎప్పుడూ తాగివచ్చి అమ్మనీ, నన్నూ కొడుతుండేవాడు....... నిజానికి ఆయనేప్పుడు పోతారా అని నేను ఎదురు చూసేదాన్ని........."
వళ్ళు జలదరించినట్లయింది సురేంద్రకి.
ప్రపంచంలో ఎన్ని రకాల సమస్యలు!
"మరి ......... నేనిక వెళ్ళి రానా?"
"వెళ్ళండి! వచ్చిన దగ్గర్నుంచీ చిలకలాగా 'వెళ్ళిరానా. వెళ్ళిరానా ' అని ఒకటే గొడవ చేస్తున్నారు!"
అతను నవ్వుతూ లేచి నుంచున్నాడు.