Previous Page Next Page 
కాంతి కిరణాలు పేజి 20

 

                                         12

    ఇంకా మీ పని పూర్తికాలేదా?" మాధురి టేబుల్ దగ్గర కోస్తూ అడిగాడు సురేంద్ర. మాధురి తలెత్తి అతని వంక చూసి చిన్నగా నవ్వింది . "ఇంకా రెండు లెటర్స్ న్నాయ్. పది నిమిషాలపని" అంది మళ్ళీ టైప్ చేయడంలో నిమగ్నమైపోతూ.
    "ఓకే! నా సీట్లో కూర్చుంటాను అంతవరకూ!"
    ఆమె అతని వంక ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు తన కోసం ఎదురుచూడటం ?
    "నాతో ఏమయినా పని ఉందా?"
    "అవును"
    "సరే కూర్చోండి " అనేసి మళ్ళీ టైప్ చేసుకోసాగింది .
    సురేంద్ర తన సీట్లో కూర్చున్నాడు.
    దూరంగా మాధురి టైప్ చేస్తూ కనబడుతూనే ఉందతనికి. మిగతా సీట్లన్నీ ఖాళీ అయిపోయినయ్. అందరూ సరిగ్గా అయిందిటికే అఫీసులోంచి బయటపడతారు . పావుగంట గడిచిపోయింది.
    టైం చూసుకొన్నాడు సురేంద్ర.
    అయిదున్నరవుతోంది.
    హెడ్ క్లర్క్ హడావుడిగా ఆఫీసరు గడిలోకీ తన సీటు దగ్గరకూ పరుగెత్తుతున్నాడు.
    మరో పదినిముషాలకి పనిచేయడం ఆపి కాగితాలన్నీ ట్రేలోకి సర్దింది  మాధురి. తన హాండ్ బాగ్ పక్కనే ఉన్న పెట్టెలో నుంచి తీసి , అందులో అందులో అద్దం ఉంది కాబోలు. మొహం చూసుకొని చిన్న భరిణ లాంటి పెట్లోంచి పౌడర్ తీసుకొని మొఖానికి అద్దుకొంది. జుట్టు కూడా జాగ్రత్తగా సర్దుకొని బాగ్ భుజానికి తగిలించుకొని సురేంద్ర దగ్గిరకు నడిచింది.
    ఆమెను చూసి లేచి ఆమెతో పాటు బయటకు నడిచాడు సురేంద్ర.
    "ఏమిటి సంగతి?" అందామె రోడ్డు మీద కొచ్చాక.
    "నిజం చెప్పాలంటే ఏమీ లేదు " అన్నాడతను.
    "భలేవారే! ఇందాక అడిగితే ఏదో పని ఉందన్నారుగా?" తమాషాగా కళ్ళు తిప్పుతూ అందామె.
    "ఇవాళ మనసెం బావుండలేదండీ! అందుకే కొద్ది సేపు మీతో మాట్లాడుతూ గడపాలనిపించింది ."
    "అంటే - నాతో మాట్లాడితే మీ మనసు బావుంటుందన్న మాట?" నవ్వుతూ అందామె.
    సురేంద్ర తడబడ్డాడు.
    "అబ్బే ..... అలా అని కాదు గాని....."
    "మరిప్పుడు నాతో పాటు మాయింటి కొస్తున్నారా?"
    "మీ యింటికా?........ మరి మీకేమీ అభ్యంతరం ఉండదు కదా!" అడిగాడతను .
    "బాగుంది ! అభ్యంతరమేముందీ? స్నేహితులన్న తరువాత ఇళ్ళకు రాకపోకలుండవా ఏమిటి ?"
    సురేంద్ర ఆమెని లోలోపలే అభినందించాడు.
    ఇద్దరూ బస్ స్టాప్ దగ్గర నిలబడ్డారు.
    ఓ బస్ వచ్చి ఆగకుండానే వెళ్ళిపోయింది.
    "ఈ బస్సులతో చావుగా వుంది. రోజూ గంటసేపు టైం వెస్టవుతోందిక్కడ ......" అంది మాధురి టైం చూసుకొంటూ.
    "పోనీ మనం ఏదయినా హోటల్లో కాఫీ తీసుకెళ్తే" అడిగాడు సురేంద్ర.
    "సరే , పదండి !" అందామె.
    ఇద్దరూ ఓ ఖరీదయిన హోటల్లోకి నడిచారు.
    ఎయిర్ కండిషన్డ్ రూములో కూర్చున్నారు. లోపల చల్లగా వుంది. చలి వేస్తున్నట్లుంది. లైట్లు డిమ్  గా వెలుగు తున్నాయ్. పట్టపగలే చీకటి పడినట్లుంది. ఓ మూల నలుగురు అమ్మాయిలు 'శ్రీరాం ' అనే యువకుడి గురించి మాట్లాడుకొంటున్నారు.
    ఒక మూల ఓ కుటుంబరావు భార్యా పిల్లలతో కూర్చున్నాడు. ఇంకో పక్క ఓ కుర్రాడూ కుర్రదీ ప్రేమగా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకొంటున్నారు.
    "ఇంతకూ మీ మనసెందుకు బావుండలేదో తెలుసుకోవచ్చా?" అడిగింది మాధురి. గులాబ్ జామ్ నాజూగ్గా తింటూ.
    ఆ ప్రశ్నతో మనసంతా కెలికినట్లయింది సురెంద్రకి.
    "అది తెలుసుకోవాలనుకొకటే - మీరూ ఓ కధ వినాల్సోస్తుంది ......." అన్నాడు తలవంచుకొని.
    "చెప్పండి . వింటాను ........" గడ్డం కింద చేతులుంచు,కొని అందామె.
    "నాకు ఈ మధ్య వివాహం అయిన సంగతి మీకూ తెలుసు కదా!" అడిగాడతను.
    "ఎందుకు తెలీదు ? వాళ్ళ వాళ్ళ కెవరికో అనారోగ్యంగా వుందనీ -- అందువల్లనే మీ శ్రీమతి గారు మీతో ఇక్కడికి రాలేదని కూడా మీరే చెప్పారు ."
    "నిజమే , అలాగే చెప్పాను !" కొద్ది క్షణాలు టేబుల్ మీద గ్లాసుని చేత్తో తిప్పుతూ అన్నాడు.
    మాధురి అనుమానంగా , అతని వంక చూస్తోంది.
    "కానీ -- అది నిజం కాదు మాధురి గారూ!" భారంగా అన్నాడతను.
    "మరెందుకలా చెప్పారు ?"
    "అసలు సంగతి చెప్పేంత ధైర్యం లేక."
    "ఏమిటది ?"
    "నా భార్య -- నేనూ శాశ్వతంగా విడిపోయాం!"
    త్రుళ్ళిపడింది మాధురి.
    "విడిపోయారా?"
    "అవును !"
    "ఎలా ? ఎందుకు?"

 Previous Page Next Page