ఆ గ్రామంలో లక్ష్మీ కుటుంబాన్ని పట్టుకోవటం పెద్ద కష్టం కాలేదు. గోళీలాడుకునే కుర్రవాడు చెయ్యెత్తి- "అదిగో, ఆ ఇల్లే" అని దూరంగా ఉన్న పాకని చూపించాడు. చిన్న పాక అది. బీదతనాన్ని పోతపోసి కట్టినట్టుంది.
అటువైపు నడిచాను.
పాక బయట ఒకామె ఊడుస్తోంది. పాతికేళ్ళుంటాయి. చామన ఛాయలో వుంది. కట్టుకున్న చీరె మీద చిరుగుల్ని కప్పటానికి ఏమీ ప్రయత్నం చేసినట్టు లేదు.
దగ్గిరగా వస్తున్న నన్ను చూసి ఆశ్చర్యంగా చూస్తున్న ఆమెతో. "నువ్వేనా లక్ష్మివి?" అని అడిగాను.
"అవును బాబూ. మీరెవరు?"
"నా పేరు గోపి. నన్ను గండ్రగొడ్డలి పంపించాడు."
గండ్రగొడ్డలి పేరు వినగానే క్షణాల్లో అక్కడి దృశ్యం మారిపోయింది. ఆమె చేతిలోని చీపురు వదిలేసి, అది దిగ్భ్రాంతో సంభ్రమమో తెలియని స్థితిలో దగ్గరికి వచ్చేసింది. వెనక్కి తిరిగి చూడకుండానే 'అయ్యా- అయ్యా' అని పిలిచింది. లోపల్నుంచి ఒక మధ్యవయస్కుడు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. "ఈయన్ని అన్న పంపించిండంట."
"అన్నా?"
"ఔ.... పెద్దన్న."
తన కళ్ళని నమ్మలేనంత విస్మయం అతడి కళ్ళల్లో కనిపించింది
"నీ పేరు నారాయణా?" అని అడిగాను. నోట మాట రానట్టు తలూపాడు. వాళ్ళిద్దరి స్థితీ చూస్తుంటే నవ్వొచ్చింది. ఈ చుట్టుపక్క పల్లెల మీద గొడ్డలి ప్రభావం చాలా వుండి వుండాలి. ఆరోజు రాబిన్ హుడ్ విల్లంబులు పట్టుకుంటే ఈ రోజు ఇతడు గండ్రగొడ్డలి పట్టుకుని బహుశా విహారం చేస్తూ వుండి వుంటాడు.
"నన్ను అతడే పంపాడు. వీలైతే మీకేమైనా సాయం చేయమని... ఎవడో చిదానందం అనేవాడు మీ కొడుకుని వెట్టిచాకిరీకి తీసుకువెళ్ళాట్ట కదా. వాడ్నించి విడిపించమని అడిగాడు."
"పెద్దన్న ఎట్టున్నడు బాబూ"
ఊహించని ప్రశ్న యిది. తన కొడుకుని చాకిరీ నుంచి విడుదల చేయటానికి నేను వచ్చానని తెలిసి, ఆ విషయం చెప్పగానే వాళ్ళు ఉప్పొంగిపోతారనుకున్నాను. కానీ తన కొడుకు కన్నా అతడి యోగక్షేమాలు ముందు అడుగుతారనుకోలేదు. వెల్ డన్ రాబిన్ హుడ్! చాలా ప్రాశస్తం సంపాదించావు. కంగ్రాట్స్.
రేపోమాపో ఉరి తీస్తారని చెప్పలేక, "అతడు బాగానే ఉన్నాడు" అన్నాను. "ఈ చిదానందం అనే వాడు ఎక్కడుంటాడు? నీ కొడుకు ఎలా ఇరుక్కుపోయాడు?"
"లోపలికిరా సిన్నన్నా" అందామె. ఆమె కంఠంలో అదోలాటి ఆప్యాయత వుంది. నన్ను చిన్నన్నని చేసినందుకు నవ్వొచ్చింది. గండ్రగొడ్డలిని ఉరి తీయబోయేది నేనే అని తెలుస్తే ఎలా వుంటుందో?
పాకలోకి ప్రవేశించాను. చాలా చిన్న స్థలం వుంది. 'నాకేదైనా- ఇవ్వాలా, ఇచ్చింది నేను తీసుకుంటానా' అన్న అనుమానం వాళ్ళకి కలిగినట్టుంది. మొహమొహాలు చూసుకుంటున్నారు.
"నాకేమీ వద్దు. అసలేం జరిగిందో చెప్పండి-" అన్నాను. వీలైనంత తొందర్లో ఈ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలని వుంది. అక్కడ రేఖ ఇంకా పూర్తిగా తేరుకోలేదు. వంటరిగా వుంది.
వాళ్ళు ఇంకా ఏదీ చెప్పకపోయేసరికి "ఉన్నదున్నట్టు చెప్పండి. అసలీ చిదానందం ఎవడు? నీ కొడుకు వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు?" అని అడిగాను.
వాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో భార్య అందిస్తూ ఉండగా అతడు పూర్తిగా వివరించాడు. వాళ్ళ తెలంగాణా తెలుసు సగం అర్ధమైంది. సగం కాలేదు. కానీ జరిగింది మాత్రం పూర్తిగా కథలా నాకు తెలిసింది.
పది సంవత్సరాల క్రితం నారాయణకి నాలుగెకరాల పొలం వుండేది. కొత్తగా పెళ్ళయింది. ఇంతకన్నా కాస్త పెద్ద యిల్లు..... కాపురం సుఖంగా జరిగిపోతూ వుండేది. లక్ష్మికి నెల తప్పిన యేడు వర్షాలు సరీగ్గా కురవని కారణంగా అయిదొందలు అప్పు చేశాడు. ఆ తరువాత వచ్చిన పంటలో సగం వడ్డీకి పోయింది. అలా పోవడంవల్ల మరుసటి సంవత్సరం విత్తనాల గింజలకోసం మళ్ళీ అప్పు చేయవలసి వచ్చింది. ఈ రెండప్పులమీదా వడ్డీ చెల్లించటం కోసం, ఏ విత్తనాలు అప్పు తీసుకుని వేసేడో, ఆ విత్తనాలవల్ల వచ్చిన పంటంతా అప్పగించుకోవలసి వచ్చింది. ఆ తరువాత వ్యవసాయ ఖర్చులకి డబ్బుల్లేవు. మూడు సంవత్సరాల్లో వడ్డీ పెరిగిపోయింది. ముందు రెండెకరాలు వ్రాసిచ్చేడు. ఆ తరువాత మిగతా రెండకరాలు కూడా ఇచ్చెయ్యవలసి వచ్చింది. వ్యాపారి భూమి సొంతం చేసుకున్నాడు. ఏ భూమికి అతడు ఒకప్పుడు అధికారో, ఆ భూమిలోనే ప్రస్తుతం నారాయణ రైతు కూలీగా పని చేస్తున్నాడు. ఈ లోపులో లక్ష్మికి పుట్టిన కొడుక్కి ఏడేళ్ళు వచ్చినయ్. నెల నెలా చెల్లించటానికి నారాయణ దగ్గిర ఏమీ మిగల్లేదు. అందువల్ల నెల జీతానికి వడ్డీ చెల్లేసే పద్ధతి మీద చిదానందం ఆ కుర్రాణ్ణి తీసుకుపోయి పనిలో పెట్టుకున్నాడు. ఆ సంసారం అలా చితికిపోయింది. అదీ కథ.
అంతా చెప్పి నారాయణ అన్నాడు. "...సిన్న అప్పు మా కొంప ముంచింది బాబూ. ముందు పంట లాక్కొన్నాడు. తరువాత పొలం లాక్కొన్నాడు. ఆపైన పిల్లాడిని లాక్కొన్నాడు. ఏం తప్పు చేసేమని భగవంతుడు మాకీ శిక్ష ఎయ్యాలె? మేమేం తప్పు చేశామని? సెప్పు బాబూ సెప్పు"
ఎవరు చెపుతారు? కేన్స్ చెపుతాడా? మార్షల్ చెపుతాడా? డిగ్రీలో ఆర్ధికశాస్త్రం సబ్జెక్టు నాది. ఉత్పత్తిలో పని చేసేవాడికి కూలి, పెట్టుబడి దారుడికి వడ్డీ, నిర్వహించేవాడికి లాభమూ వస్తాయని మాకు చదువు చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతున్నది దానికి వ్యతిరేకంగా వుంది. నాలుగోవాడూ, మూడోవాడూ ఒకటై 'ఆక్టోపస్' లా పాకి, రెండోవాణ్ణి బంధించి, వాడి నుంచి మొదటి దాన్ని లాక్కొంటున్నారు. లాండ్-లేబర్-కాపిటల్- ఆర్గనైజెన్ అని నాలుగు లేవు. ఉన్నవి రెండే. లేబర్- ఎక్స్ ప్లాయిటేషన్.
చిన్న అప్పు. చిన్న అప్పు కారణంగా ఒక అమాయకుడు నాశనం అవటానికీ, ఒక షట్పాది బాహువుల్లో చేరిపోవటానికీ మార్షల్ థియరీలూ, కేనీషియన్ సిద్దాంతాలూ అవసరం లేదు. ఒక సంవత్సరం వర్షాలు పడలేదు అన్న చిన్న కారణం చాలు.
"నువ్వేం బాధపడకు నారాయణా! నీ కొడుకుని ఆ చిదానందం గాడి దగ్గిర్నుంచి విడిపించుకు తీసుకు వస్తాను. నిశ్చయంగా ఉండు" అని బయల్దేరాను.
చిన్న పట్నం చేరుకొనేసరికి సాయంత్రమైంది. నేరుగా వెళ్లి చిదానందాన్ని కలుసుకున్నాను. నేను వెళ్ళేసరికి అతను ఇంట్లోనే వున్నాడు.
* * *
చిదానందం నా వైపు తాపీగా చూశాడు. అంత విన్న తరువాత కూడా అతడి మొహంలో మార్పులేదు.
"అయిదొందల అప్పుకి నాలుగేళ్ళలో నాలుగెకరాలు లాక్కొన్నావు. వడ్డీమీద వడ్డీ కట్టావు. అసలు నీ వడ్డీ రేటెంత? ఏ కోర్టయినా దీన్ని వప్పుకుంటుందా? మర్యాదగా ఆ కుర్రవాడిని అప్పగించు. లేకపోతే నిన్ను కోర్టుకి లాగుతాను. అంతా బయట పెడతాను."
అతడూ అంతే తాపీగా "నీ పేరేమిటి బాబూ" అని అడిగాడు.
అతడంత నిబ్బరంగా వుండటం ఆశ్చర్యమనిపించింది. నేనెవర్నో చెపుదామనుకున్నాను. కానీ గొడ్డలి చెప్పొద్దన్నాడని, "కృష్ణమూర్తి" అన్నాను.
"చూడు కృష్ణమూర్తి! నేను చేసినదాన్లో తప్పేమీ లేదు. అతగాడు అప్పు తీసుకొన్నాడు. దానికి వడ్డీగా అతగాడి కొడుకుని నా దగ్గిర జీతానికి పెట్టాడు-"
"అయిదొందల అప్పుకి అయిదువేలు ఖరీదు చేసే పొలం మింగావు. అసలు నీ వడ్డీ రేటెంత?" ఆవేశాన్ని అణుచుకుంటూ అడిగాను.
అతడి మొహంలో ఆశ్చర్యం కనిపించింది. "అయిదొందలా" అని అడిగాడు. అవునన్నాను.
తన ముందున్న పెద్ద పెట్టెలాటి దాన్ని తెరిచాడు. అందులో ఎన్నో స్టాంపు పేపర్లున్నాయి. బహుశా చుట్టుపక్కల అన్ని పల్లెటూళ్ళకి సంబంధించినవి కావొచ్చు. ఎంతోమంది అదృష్టాలు ఈ చెక్క పెట్టెలో బంధీకృతమై వున్నాయనిపించింది. అతడిని చూసి ఆ క్షణం నాకు కలిగిన అసహ్యం బహుశా నా జీవితంలో ఎవరిమీద కలిగి వుండదు. అతడి పొట్టకూడా ఎదురుగా వున్న భోషాణంలా వుంది. 'ఏదైనా తప్పు చేయించి ఇతడిని ఒక్కసారి మా జైలుకి పంపించు భగవంతుడా! మొత్తం కొవ్వునంతా కరిగించి వెనక్కి పంపుతాను' అని కోరుకున్నాను.
అంతలో అతడు పెట్టెలోంచి ఒక కాగితం తీసి చదువుతూ "ఎవరూ? ఘనాపురం నారాయణా?" అని అడిగాడు. అవునన్నాను. అతడు స్టాంపు పేపరు చూపిస్తూ 'ఇదేనా' అంటూ ముందుకు తోశాడు. "అదే" అని అందుకుంటూ షాక్ తగిలినట్టు నిశ్చేష్టుడనయ్యాను.
అయిదువేల రూపాయలకి వ్రాయబడి వున్న స్టాంపు అది.
అతడు కాగితం తిరిగి లోపల పెట్టుకుంటూ వుండగా "ఇది అన్యాయం" అని అరిచాను. ఆ మాట ఆ గదిలో బహుశా అలా చాలామంది అరిచి వుంటారు. అతడిలో చలనం ఏమీలేదు. కామ్ గా పెట్టె సర్దుకుంటున్నాడు.
"ఒక చదువు రానివాడిని నువ్వు మోసం చేశావు. అయిదొందలు అని చెప్పి అయిదువేలకి నోటు వ్రాయించుకున్నావు."
"అలా అని ఎవరు చెప్పారు? నారాయణా?"
"నాకు మొత్తం కథ అంతా తెలుసు. ఎక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తే కోర్టు వప్పుకోదని ఎక్కువ మొత్తానికి నోటు రాయించుకున్నావు."
అతడు నిర్లక్ష్యంగా "నిజంగా జరిగేది, మేమందరం చేసేదీ అదే. కానీ ఎలా నిరూపిస్తావు? నీకేం సాక్ష్యాధారాలున్నాయ్?" అని అడిగాడు.
ఇదే ప్రశ్న కొన్ని రోజుల క్రితం జగన్నాధం అడిగాడు. ఫలితం అనుభవించాడు. కానీ ఇతడు? ఎవరూ తన నేమీ చెయ్యలేరన్న ధీమాతో వున్నాడు. నాలోని జైలరు రక్తం సలసల మరిగిపోయింది సాక్ష్యాధారాలు కావల్ట! అటూ ఇటూ చూశాను. గదిలో ఎవరూ లేరు. ఇద్దరమే వున్నాం.
పిడికిలి బిగించి దవడమీద గట్టిగా కొట్టాను. వెనక్కి విరుచుకు పడ్డాడు. ఒక్క క్షణం నోట మాట రాలేదు.
"ప్రతిదానికీ సాక్ష్యాధారాలుండవ్ రా! దీనికీ లేవు" అని అక్కణ్ణుంచి వచ్చేశాను. వెనుకనుంచి వాడి అరుపులు వినిపిస్తున్నాయి. బహుశా నౌఖర్లని పిలుస్తున్నాడనుకుంటాను. నేను ఆగలేదు.
బయటకైతే వచ్చేసేను గానీ ఏం చెయ్యాలో నాకుతోచలేదు.
సమస్య అలాగే వుండిపోయింది.
ఏ కోర్టుకి వెళ్ళినా అయిదు వేల మీద పన్నెండు శాతం వడ్డీ చట్టబద్దమే అని తీర్పు చెపుతుంది. ఆ వడ్డీకి బదులుగా నెల జీతం మీద వాడి కొడుకుని కమతంలో వుంచుకున్నానని చిదానందం వాదిస్తాడు. కావాలంటే వెంటనే వదిలేస్తానంటాడు. అలా వదిలేస్తే నారాయణ వడ్డీ కట్టవలసి వస్తుంది. "నేను వడ్డీ కట్టలేను, వాడిని మీరే వుంచుకోండి" అని నారాయణ అన్నా అన్నా ఆశ్చర్యపడనవసరం లేదు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుంది. అక్కణ్ణుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను. అక్కడా పని జరగలేదు. అక్కడ పరిస్థితి మరీ దారుణంగా వుంది.
అంతలో నాకో ఆలోచన వచ్చింది.
తహసిల్దార్ కి ఫిర్యాదు చేస్తే...?
ఎంతోమంది పిల్లవాళ్ళచేత ఇలా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాడని కంప్లెయింట్ చేసి అతడి సాయం చేత నారాయణ కొడుకుని విడిపించవచ్చు. టైమ్ చూసుకున్నాను. పావు తక్కువ పది అయింది.
నేను తహసిల్ ఆఫీసుకి వెళ్ళేసరికి పదింపావు అయింది. ఇంకా ఎవరూ రాలేదు.
"ఎన్నింటికి ఆఫీసు?" అని అడిగాను అక్కడున్న ప్యూన్ ని.
"పదింటికి సాబ్" అన్నాడు.