Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 20


    ఆ విషయమే నిజమైతే- మేమెంతో జాగ్రత్తగా పరిరక్షిస్తూన్న ఈ నాలుగు గోడల గదుల్లో- మా కఠినత్వానికి గురి అవుతున్న వారిలో కూడా కొన్ని పావులు వుండవచ్చు.
    ఈ చర్చ గండ్రగొడ్డలి దగ్గరకు వచ్చింది.
    "అవును." అన్నాడు. "మనుష్యులు తయారు చేసుకున్న పావులు కొన్ని, వ్యవస్థ తయారు చేసిన పావులు కొన్ని."
    "అంటే?"
    "జగన్నాధంలాటి వాళ్ళని దామోదరంలాటి వాళ్ళు తయారు చేస్తారు. నాలాంటి వాళ్ళని వ్యవస్థ తయారు చేస్తుంది-"
    నవ్వేను. "ప్రతివాడూ చేస్తున్న పనులకీ, దానివల్ల తను అనుభవిస్తున్న దానికీ, తనకి అనువుగా కొన్ని వాదనలు నిర్మించుకొంటాడు. అవి నిజమన్న భ్రమలో తనేమీ తప్పు చేయలేదనీ, గొప్ప మానసికానందాన్ని పొందుతూ వుంటాడు. EVERYBODY WANTS TRUTH TO BE ON HIS SIDE. BUT NOBODY WANTS TO BE ON THE SIDE OF TRUTH" అన్నాను. నా మాటల్లో కాస్త హేళన ధ్వనించిందా? ఏమో-
    అయితే అతడు తిరిగి వాదన చేయలేదు. క్లుప్తంగా "నువ్వు చాలా ఎదగాలి" అని మాత్రం అని వూరుకున్నాడు.
    "అంటే" అన్నాను. అతడు మాట్లాడలేదు. ఇక మాట్లాడవలసింది ఏమీ లేదన్నట్టు తల తిప్పుకున్నాడు. "నాకు వివరణ కావాలి" కటువుగా అన్నాను. కూ తరువాత అతడితో ఎక్కువ మాట్లాడుతున్నాను. అతడి మరణం కూడా మరెంతో దూరంలో లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో ఉరితీత ఆర్డర్లు వస్తాయి. "ఎదగటం అంటే ఏమిటి?"
    "ఒక విషయాన్ని ఒకే కోణంలో నుంచి కాకుండా, తల కాస్త పైకెత్తి రెండు వైపుల్నుంచీ చూడగలగటం."
    "ఇందులో రెండు కోణాలు ఏమీ లేవు. ఉన్నదొక్కటే. అదే- నేరం."
    "మనిషికి మనసుకన్నా పెద్ద న్యాయమూర్తి ఇంకొకరు వుంటారని నేను అనుకోను. మనసు ఇది తప్పని చెపుతూనే వుంటుంది. నువ్వన్నట్టు, తను చేస్తున్న పనిని మనిషి సమర్ధించుకోవటం కోసం కొన్ని కారణాలు, సిద్ధాంతాలు నిర్మించుకుంటాడు. కానీ తన నేరం బయటపడేసరికి అతడు తనచుట్టూ నిర్మించుకున్న ఈ 'బింకం' సడలిపోతుంది. 'భయం, వేదన, దిగులు' లాంటివి ఒక్కసారిగా చుట్టుముడతాయి."
    నాకు 'జగన్నాధం' ఆఖరి క్షణాలు గుర్తొచ్చాయి. నిజమే, తన నేరం బయటపడేసరికి వణికి పోయాడు. మనిషి వికృత రూపం బయటకొచ్చింది.
    గండ్రగొడ్డలి చెప్పుకుపోతున్నాడు. "తను తప్పు చేయలేదన్న నమ్మకం ఉన్న మనిషిని ఏ బాధగానీ భయంగానీ దరిచేరలేవు. కొందరు వయస్సు పైబడుతున్నా చిన్నవారిలా స్వచ్చంగా కనిపిస్తారు. వారిని జాగ్రత్తగా గమనించు. ఎన్ని బాధల్లో వున్నా వారి మోహంలో దిగులు గానీ ఆందోళనగానీ కనబడదు. తాము తప్పు చేయలేదన్న సంగతి వారికి తెలుసన్నమాట. మనసుతో సత్సంబంధాలు వున్న వారిలో మాత్రమే ఈ చిరునవ్వు కనబడుతుంది. తాము చేస్తున్న పనిని మనసా వాచా నమ్మిన వాళ్లు వారు. మిన్ను విరిగి మీద పడుతున్నా బెదరని స్థయిర్యం రావాలంటే నువ్వు చేసిన పనిలో ఏ తప్పూ లేదని నీకు నమ్మకం కుదరాలి. నువ్వు అన్నావు- ప్రతి మనిషీ తను చేసిన పనిని, అది హత్య అయినా సరే- దానిని సమర్ధించుకునే వాదనని నిజం లేదని ఏ మాత్రం మనసుకి అపనమ్మకం కలిగినా, ఆ ధైర్యం పెళుసులా పగిలిపోయి, మనిషి కృంగి పోవటం ప్రారంభిస్తాడు. అదే ఓటమికి చిహ్నం. నమ్మకంలో దుఃఖం వుండదు"
    "నువ్వు చాలా హాయ్పొతెటికల్ గా మాట్లాడుతున్నావు. అటువంటి వాళ్ళు పుస్తకాల్లో వుంటే వుండవచ్చు. నిజ జీవితంలో అటువంటివారు వుండరు."
    "ఉండరా?"
    "నాకు కనబడలేదు."
    "నిజంగా కనపడలేదా?"
    "లేదు."
    "నిజంగా లేదా?"
    'లేదు' అనబోయి ఆగాను. నా ఎదురుగా వున్న వ్యక్తి పది రోజుల్లో ఉరికంబం ఎక్కబోతూ కూడా చిరునవ్వుతో నిలబడిన వ్యక్తి-
    ఒక చిన్న కుదుపు! సముద్రాంతర్భాగంలో చిన్న కదలిక, పెద్ద ఉప్పెనలా మారి మొత్తం నగరాన్నే కదిలించి వేసినట్టు నన్ను కదిలించి వేసింది. 'జగన్నాధం' మరణానికి ముందు స్థితికీ, ఇతడి స్థితికీ ఎంత తేడా! నిజమేనా? కేవలం మనిషిని బాధపెట్టేది 'తప్పు' చేశానన్న భావనేనా?...అంతలో నాకొక అనుమానం కలిగింది. తలెత్తి అతడి దృఢమైన శరీరం వైపు, కరుణతోనూ, సాటి మనుష్యుల పట్ల దయతోనూ నిండివున్న ఆ స్వచ్చమైన కళ్ళకేసి చూస్తూ అడిగాను.
    "నీ కెన్నేళ్ళు గండ్రగొడ్డలీ?"
    అతడు మొట్టమొదటిసారి ఫక్కున నవ్వేడు. మొట్టమొదటిసారి అతడలా నవ్వటం. "ఎంతనుకుంటున్నావ్?"
    "ముప్పై- ముప్పై అయిదు"
    "కాదు. నలభై ఎనిమిది."
    నేను వెంటనే ఏమీ అనలేదు.
    "నీ వయసెంత ఆఫీసర్?"
    "పాతిక"
    "ఇంకా ముందు ముందు చాలా జీవితం వుంది. నేనుండకపోయినా నా మాటలు గుర్తుంచుకో ఆఫీసర్. ఎప్పటికయినా వాటిల్లో నిజం వుందని గుర్తిస్తావు."
    ఎందుకో ఆ క్షణం అతడిమీద నాకు అవ్యాజమైన ప్రేమ కలిగింది. బహుశా నన్ను రక్షించినందుకు కావొచ్చు. లేదా అతడి మాటల్లో ధ్వనించిన ఆర్తివల్ల కావొచ్చు.
    "నీ కోసం ఏమైనా చెయ్యగలిగేది వుంటే చెప్పు గండ్రగొడ్డలీ" అన్నాను. "ఒక జైలు ఆఫీసర్ గా ఆఖరి కోరిక అడగటంలేదు. కృతజ్ఞతా పూర్వకంగా నీకు నేను చేయగలిగేది వుంటే చేస్తాను."
    అతడు నావేపు సాలోచనగా చూశాడు. వెంటనే జవాబు చెప్పకుండా ఆగి, "చేస్తావా?" అని అడిగాడు.
    "నా విధులకు భంగం కలిగించనిది ఏదయినా సరే-" ముందు జాగ్రత్తతో అన్నాను. అతడి మొహంలో మళ్ళీ నవ్వు. 'సరే!' అన్నాడు. "ఇక్కడికి యాభై కిలోమీటర్ల దూరంలో ఘనాపురం అనే గ్రామం వుంది తెలుసా?"
    "తెలుసు."
    "ఆ వూరిలో నారాయణ- లక్ష్మి అనే దంపతులున్నారు. వాళ్ళ కొడుకుని చిదానందం అనే వడ్డీవ్యాపారి వెట్టిచాకిరీకి తీసుకెళ్ళి తన కమతంలో పెట్టుకున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చేజారిపోయినందుకు వాళ్ళ దుఃఖం మిన్నేరవుతూంది. ఆ కుర్రవాణ్ణి తిరిగి ఆ దంపతులకి అప్పగించగలవా? ఇదొక్కటే ఈ మధ్యకాలంలో నేను చేయలేకపోయింది. పోలీసుల వేటనుంచి తప్పించుకోవటానికే నా చివరిరోజులు వెచ్చించవలసి రావటంతో ఈ పని పూర్తి చేయలేకపోయాను. అయినా ఇది నా మనసుని వెంటాడుతూనే వుంది. నువ్వు చెయ్యగలవా ఆఫీసర్ ఈ పని? చేసి నా కొచ్చిచెప్పగలవా? నేను ఉరికంబం ఎక్కేలోపులో నువ్వు వచ్చి చెప్తే, అది విని హాయిగా ఆఖరి శ్వాస విడుస్తాను" ఆశగా అడిగాడు.
    "చేస్తాను" అన్నాను తేలిగ్గా. "వెట్టిచాకిరీ నిషేధం. చిదానందాన్ని అరెస్టు చేయిస్తాను'.
    "నీ ఇష్టం. నువ్వేమైనా చెయ్యి, కానీ రెండు షరతులు. నువ్వు పోలీస్ ఇన్ స్పెక్టర్ వి అని ఎక్కడా చెప్పకూడదు. రెండోది. ఈ పనికి డబ్బులు ఉపయోగించకూడదు."
    "అక్కర్లేదు. అవేమీ చేయను. మామూలుగానే వెళ్ళి సాధించుకు వస్తాను. నువ్వు నిశ్చలంగా వుండు గండ్రగొడ్డలీ. రెండు మూడు రోజుల్లోనే నీకా వార్త చెపుతాను."
    నేను వెనుదిరిగాను.
    వెనుక అతడు నిశ్చలంగా నిలబడి వున్నాడు.
                                                     10
    'నేను అర్జెంటుగా పల్లె కెళ్ళాలమ్మా. రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను." హడావుడిగా లోపలికి వెళ్తూ అన్నాను. అమ్మనుంచి జవాబు లేదు. లోపల గదంతా చీకటిగా వుంది. 'అమ్మా' అంటూ లైటు వేశాను.
    ఆ స్థితిలో అమ్మను నేనెప్పుడూ చూడలేదు.
    ఇరవై లంఖణాలు చేసినట్టు వుందామె. ఎప్పటినుంచి ఏడుస్తూ వుందో తెలీదు. అమ్మని అలా చూడటం అదే మొదటిసారి. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ మొహంమీద చిరునవ్వునే చూశాను.
    'అమ్మా' ఆందోళనగా దగ్గిరకి వెళ్తూ అన్నాను. ఆమె చప్పున లేచి కళ్ళు తుడుచుకుంటూ "రారా" అంది భోజనం పెట్టనా."
    "ఏమైంది? ఏమైందమ్మా?" ఆమె ప్రశ్నని పట్టించుకోకుండా అడిగాను.
    "ఏముంది. ఏమీ లేదే"
    ఒకసారి అలా అంటే ఇక చెప్పదని తెలుసు. నేను కూడా మొహం విచారంగా పెట్టి విషాదంగా నవ్వుతూ, "ఎందుకమ్మా దాచటానికి ప్రయత్నిస్తావు. నాకు తెలుసు... అంతా తెలిసింది" అన్నాను. ఆమె ఉలిక్కిపడి "ఏం తెలిసింది" అంది.
    "నువ్వెందుకు ఏడుస్తున్నావో? ఆ కారణం."
    ఆమె మాట్లాడలేదు. దగ్గరగా వెళ్ళి "ఏమిటో చెప్పవామ్మా" అని అడిగాను.
    "రేఖ ఎక్కడుందిరా?"
    "ఇందుకా అమ్మా నీ బాధ" అన్నాను. బాగా నవ్వొచ్చింది నాకు. "చూశావా, పోలీస్ డిపార్టుమెంట్ అంటే ఎంత గొప్పదో. నిజానికి నాకేమీ తెలీదు. కేవలం నీ మనసులో ఏముందో తెలుసుకోవటానికో అలా అబద్ధమాడాను" దగ్గిరకి వెళ్ళి పక్కన మోకాళ్ళమీద కూర్చుంటూ అన్నాను- "జగన్నాధం మరణానికి కారణం నీ కొడుకే అన్న భావాన్ని నీ మనసులోంచి తుడిచెయ్యమ్మా. ఇలా కాకపోయినా ఇంకోలా అయినా అతడు మరణించే వాడే. ఒక రేఖ సంగతంటవా? నీ కభ్యంతరం లేకపోతే మనతోనే వుంటుంది నీ కోడలిగా."
    ఆమె లేస్తూ ఇక ఆ విషయంతో ఏమీ చర్చించవలసింది లేదన్నట్టు "భోజనానికి పద. ఊరెళ్ళాలన్నావు కదా?" అంది. విషయం అంత సులభంగా తేలిపోయినందుకు సంతోషిస్తూ వంటింటిలోకి నడిచాను.
    విషయం అంతా తొందరగా తేలదని తరువాత ర్ధమైంది.
                                               *    *    *  
    ఘనాపురం చాలా చిన్న వూరు. తెలంగాణా వాతావరణం నూటికి నూరుపాళ్ళు వున్న గ్రామం. వెయ్యి, రెండువేల కన్నా ఎక్కువ గడపలుండవు. ఆ వూరికి నాలుగైదు కిలోమీటర్ల అవతల చిన్న పట్నం ఉండటంవల్ల ప్రతీ అవసరానికీ గ్రామస్థులు అక్కడికే వెళ్తూ ఉంటారు.

 Previous Page Next Page