ఆమె మాట్లాడలేదు. ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు అతను.
"మీరు ప్రేమని కాదన్న ఆ వ్యక్తి ఎవరో చెబుతారా?" అడిగాడు.
"ఏ వ్యక్తి?"
"అదే....అతను! ఎవరయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాడో అతను."
"నాకెవరూ చెప్పలేదే."
తెల్లబోయాడు కౌశిక్.
"చెప్పలేదా?"
"ముమ్మాటికీ చెప్పలేదు. చెప్పాడని నేనూ అనలేదుగా."
బిత్తరపోయి సర్దుకున్నాడు.
"ఇట్సాల్ రైట్....మరెవరి మీద అనుమానం పడుతున్నారో చెప్పండి?"
"అనుమానమా! నాకెవరిమీదా, ఏ మాత్రమూ అనుమానం లేదు అని ఇప్పటికే నాలుగుసార్లు చెప్పాను."
"బట్! డాక్టర్ దగ్గర, ప్లీడర్ల దగ్గర, పోలీస్ డిపార్ట్ మెంటు దగ్గరా నిజాల్ని దాచడం మంచిదికాదు."
"నేను దాచేటందుకు అసలు నిజాలుంటే కదా!"
"కారణాలు ఏమయితేనేం. మీరు వైజాగ్ లో ప్రదర్శన జరపడానికి వీల్లేదు."
"ఎందుకు?"
"మీ లైఫ్ కి రిస్క్ వుంది కనుక."
"ఆ రిస్క్ ఇక్కడ కూడా వుంది కదా?"
"పబ్లిక్ ఫంక్షన్ లో లైఫ్ రిస్క్ ఎక్కువ."
"అక్కడే తక్కువని నా ఉద్దేశ్యం."
ఆమె సమాధానాలు వితండవాదంలా అనిపిస్తున్నాయి. అసహనాన్ని త్వరగా తెప్పిస్తున్నాయి. బట్ కంట్రోల్ చేసుకుంటున్నాడు.
"పబ్లిక్ ఫంక్షన్స్ లో, ప్రోగ్రామ్స్ లో రిస్క్ తక్కువా! అదెలా?" అతనిలో కనపడబోతున్న అసహనాన్ని ఏ మాత్రం బయటకు తెలియనీయకుండా అన్నాడు.
"ఎలా అంటే....చాలా మంది జనం వుంటారు కాబట్టి....అందరి మధ్యలో ఒకరిని చంపటం అంత తేలిక కాదు కాబట్టి...."
రెండు చేతుల వేళ్ళను క్రాస్ చేసినట్లు పెట్టి ఆమె చెప్పేది వింటున్నాడు.
"నేను ఒంటరిగా వున్న సమయంలో అయితే నిర్భయంగా చంపవచ్చు" మళ్ళీ ఆమె అంది.
"క్షమించండి. మీ ఆర్గ్యుమెంటుతో నేను ఏకీభవించలేను. మీరు వైజాగ్ లో ప్రోగ్రాం ఇవ్వటానికి ఏ మాత్రం ఒప్పుకోను."
"బట్....అది నా జీవితాశయం. రిస్క్ అయినా ప్రోగ్రాం ఇవ్వటం మానను. అంతేకాదు అక్కడి ఆర్గనైజర్స్ నాకు లక్షల్లో డబ్బు అడ్వాన్స్ పేచేశారు. టికెట్స్ అమ్మేసి వుంటారు. ఇంక మూడు రోజులలో ప్రోగ్రాం యివ్వాలి. నా ఆర్కెస్ట్రా అంతా కూడా యిప్పటికే వైజాగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను నా స్వంత కారణాలు అడ్డు పెట్టుకుని ప్రోగ్రాం యివ్వను అంటే ఎంతవరకు బావుంటుంది? ఆర్గనైజర్స్ కి ఎంత నష్టం? వాళ్ళ దృష్ట్యా అయినా నేను పెర్ ఫార్మెన్స్ యివ్వక తప్పదు."
తల పట్టుకున్నాడు కౌశిక్.
ఆమె చెప్పన దాంట్లో కూడా నిజం వుంది. ఇప్పుడు ఆమె ప్రోగ్రాం యివ్వను అంటే ఆర్గనైజర్స్ అంతా యుద్ధానికి వస్తారు. టికెట్స్ కొన్న వాళ్ళంతా తన్నటానికి తయారు అవుతారు. కానీ ఆమెకు అక్కడ ప్రోగ్రాం యివ్వటానికి అనుమతిస్తే....ప్రమాదం అనేది ఎటునుండి వస్తుందో చెప్పటం కూడా కష్టం అయిపోతుంది. అందువల్ల అదీ సమస్యే.
కొద్దిక్షణాలు వాళ్ళ మధ్య మాటలు లేవు.
"చూడండి! మీరు ఇండియన్ సిటిజన్ కూడా కాదు. ఫారిన్స్ సిటిజన్ గా వచ్చారు. మీకు సింగర్ గా మంచి పేరు కూడా వుంది. మీరు యిక్కడ వుండగా పొరపాటుగా జరగకూడనిది ఏమయినా జరిగితే....అందుకు భారత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. అందువల్ల అందరి విషయం ఎలా వున్నా, మిమ్మల్ని మాత్రం జాగ్రత్తగా తిరిగిపంపించాలి? కాబట్టి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వెళదాం.వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు. మీరు ఇండియా వదిలివెళ్ళేవరకు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటుచేయటానికి వీలవుతుంది...." అతనింకా ఏదో చెప్పేటంతలో అతని వాగ్ధోరణికి అడ్డుపడిందామె.
"జస్ట్ మినిట్....నాదొక రిక్వెస్ట్" అంది.
ఏమిటన్నట్లు చూశాడు.
"ఏమీ లేదు! దయచేసి మీరు పోలీస్ స్టేషన్ లో రిపోర్టు ఇవ్వద్దు. కేసు రిజస్టరూ చేయించవద్దు."
"ఎందుకు?"
"ఈ కేసంటూ రిజిస్టర్ అయితే ఇంక ఇండియాలో నా ప్రోగ్రాం అవదు. సెక్యూరిటీ రీజన్స్ అంటారు. ఎక్కడికీ కదలకుండా ఆపేస్తారు. వెనక్కి ఇంగ్లండ్ పంపిస్తారు. అందువల్ల మీరు ఆ పని చేయవద్దు. ప్లీజ్....దిసీజ్ మై హంబుల్ రిక్వెస్ట్" అంది చేతులు జోడిస్తూ.
ఇంకేం మాట్లాడలేదు కౌశిక్.
మూడు నాలుగు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
టేబుల్ అంచుమీద చూపుడు వేలికొనతో పిచ్చి గీతలు గీస్తోంది ఆమె.
ఒక నిర్ణయానికి వచ్చాడు అతను.
"చూడండి....నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను చెప్పినట్లుగా చేస్తారా?" అడిగాడు.
"ఏమిటది?"
"మీరన్నట్లుగా నేను ఈ విషయం గురించి కంప్లెయింట్ ఇవ్వను. ఎవ్వరికీ చెప్పను. బట్....మీరు మాత్రం నేను చెప్పినట్లుగా నడుచుకుంటానని మాటివ్వాలి."
క్షణకాలం ఆలోచించి "సరే" అందామె.
"రైట్....ఇకనుంచి మీరు ఇండియా వదిలి....కనీసం ఆంధ్రా వదిలి వెళ్ళేవరకు నేను చెప్పినట్లుగానే చేయాలి.
"అలాగే....చెప్పండి ఏం చెయ్యాలో?"
"ముందుగా ....మీ వైజాగ్ ప్రోగ్రాం కేన్సిల్ చేయండి."
తెల్లబోయిందామె.
"ఏమిటి? మళ్ళీ అదే మాటా....ఇదా మీరు చెప్పేది?" అసహనంగా అందామె.
"ప్రోగ్రాం కేన్సిల్ చేయద్దు. కనీసం వారంపాటు వాయిదా వేసినట్లుగా చెప్పండి."
"ఆ తరువాత"
ఆ తరువాత ఎలాగయినా మీ ప్రోగ్రాం జరిపించుదాం."
"నమ్మకమేనా?"
"హండ్రెడ్ పర్సంట్"
"కానీ....ఆర్గనైజర్స్ ఒప్పుకోకపోతే?"
"ఆ విషయం నాకు వదిలెయ్యండి. వాళ్ళని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను."
"వాళ్ళు ఒప్పుకోకపోతే?"
తిరిగి ఆమె అదే ప్రశ్న అడగటంతో అతని కళ్ళు ఎర్రగా మారాయి.
ఇంక మాట్లాడలేదు ఆమె.
టేబుల్ మీది ఫోన్ ని దగ్గరకు లాక్కున్నాడు కౌశిక్.
"వైజాగ్ లో ప్రోగ్రాం ఆర్గనైజర్స్ నెంబరు, వాళ్ళ పేరు....చెప్పండి....మాట్లాడదాం" అన్నాడు. ఆమె చెప్పే నెంబరు డయల్ చేయటానికి సిద్ధపడుతూ.
* * * *
"ఇక్కడ సెబాస్టియన్ అంటే ఎవరు?"
చిన్నదిగా వున్న ఆ పెంకుటింటి ముందుకు వచ్చి జావా మోటాడ్ బైక్ ఆపి అడిగాడు ఆ వ్యక్తి.
"నువ్వెవరు?" ఇంటి తలుపు దగ్గర కూర్చున్న ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు ఎదురు ప్రశ్నించాడు.
"నా పేరు నూరూల్. నన్ను కోటగిరి బాలయ్యగారు పంపించారు" చెప్పాడా వ్యక్తి.
బైక్ స్టాండ్ వేసి నిలబడ్డాడు నూరూల్.
చిన్నదిగా వున్న ఆ పెంకుటింట్లోకి తొంగిచూశాడు.
బయట గదిలో రెండు రుబ్బింగ్ మిషన్లు వున్నాయి. వాటిలో ఏదో పిండి గ్రైండ్ అవుతోంది. ఓ యాభై ఏళ్ళ వయస్సున్న వ్యక్తి అప్పుడప్పుడు అందులో నీళ్ళు పోసి పిండిని పలుచన చేస్తున్నాడు.
కిలో పిండి రుబ్బుటకు ఒక రూపాయి అని చిన్న అట్ట మీద రాసి అక్కడ తగిలించి వుంది.
ఎవరో గుండ్రంగా అక్షరాలు రాయటానికి చేసిన ప్రయత్నంలా వుంది అది.
రెండు నిమిషాలు గడిచాయి.
ఆ కుర్రాడు బయటకు రాలేదు.
పిండి రుబ్బటం పూర్తి అయినట్లుంది. ఒక మిషన్ ఆఫ్ చేశాడు ఆ వ్యక్తి.
అప్పటివరకు చెవులు చిల్లులుపడేలా వస్తున్న సౌండ్ సగం తగ్గిపోయింది. ఆగిన ఆ మెషిన్ లోంచి మెత్తగా ఆయన పిండిని చేత్తో ముద్దలుగా తీసి అక్కడున్న స్టీలు క్యారియర్ లో వేశాడతను.
సుమారు పదేళ్ళ వయస్సున్న చిన్నపిల్ల ఆ క్యారియర్ అందుకొని రెండు రూపాయల నోటు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది.
లోపలికి వెళ్ళిన ఆ కుర్రాడు బయటికి వచ్చాడు.
"మిమ్మల్ని రమ్మంటున్నారు రండి" అన్నాడు లోపలికి నడుస్తూ.
అతన్ని అనుసరించాడు సూరుల్.
ఎత్తు తక్కువగా వున్న ఆ తలుపు దగ్గర వంగి లోపలికి నడివాల్సి వచ్చింది నూరుల్ కి. కారణం అతని ఎత్తు ఆరడుగులు.