Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 20


    సరోజ అందమైనది. ఎవరైనా ఆకట్టుకోగలిగించే ఆకర్షణ ఉంది ఆ అమ్మాయి ముఖంలో. ఆ ఆకర్షణ కంటే బలీయంగా కుమార్ మనసును ఆకర్షిస్తూన్నది. సరోజ చూపించే ఆత్మీయత, తన తల్లి ఇష్టానికి కూడా వ్యతిరేకంగా సరోజ అందించే అనురాగాన్ని కాదనలేకపోతోంది కుమార్ యువక హృదయం.
    కుమార్ సైకిల్ మీద కాలేజి నుంచి ఇంటికి వస్తోంటే నడిరోడ్డుమీదనే చెయ్యి అడ్డుపెట్టి "స్టాప్!" అని అడ్డుగా నిలబడింది సరోజ__ఆ సాహసానికి ఆశ్చర్యపోతూ సైకిల్ దిగి "ఏమిటిది సరోజా! నడిరోడ్డుమీద?" అన్నాడు.
    సరోజ సైకిల్ కి అడ్డుతొలిగి కుమార్ పక్కగా నడుస్తూ "ఏం చెయ్యమంటావు బావా! నా ప్రాణానికి ఇల్లుకంటె నడిరోడ్డే బాగుంది-మా అమ్మదొక గోల! మా అత్తది మరొక పద్ధతి__ఏ రకంగా అయితేనేం, మన ప్రాణానికి? ఇక నీతో మాట్లాడటానికి నాకు నడిరోడ్డే శరణ్యం!" అంది.
    చక్కని వెంకటగిరి చీరలో, వాలుజడలో పువ్వులతో నిండుగా తయారయి వచ్చిన సరోజను ఆప్యాయంగా చూస్తూ "ఎందుకు? నాతో మాట్లాడటం?" అన్నాడు.
    సరోజ కుమార్ చూపులను గుర్తించింది. మురిసిపోయింది.
    "ఎందుకా? నీతో మాట్లాడకుండా నేను బ్రతకలేను గనుక__ నువ్వు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు కనుక! ఆ సంగతి ఒప్పుకోలేని పిరికి మహారాజువి గనుక!"
    "ఆపాపు! నా ధైర్యసాహసాలు చూపించవలసిన సమయం వచ్చినపుడు చూపిస్తాను-మనం ఇలా నడిరోడ్డుమీద సరసాలాడు కోవటం చూసేవాళ్ళకి బాగుండదు!"
    "నీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను-సరే! అయితే, పార్కుకే వెళ్దాం పద! అక్కడ మనం సరసాలాడుకుంటే చూసేవాళ్ళకి బాగుంటుందా?"
    "ఏయ్! అల్లరిపిల్లా! బొత్తిగా సిగ్గులేకుండా పోతోంది నీకు!"
    "ఎందుకు బావా! నా సిగ్గు నువ్వు కాపాడతావనే నమ్మకం లేకపోతేగా!-ఇది దేవదాసులో డైలాగు! మనకథ 'దేవదాసు' కథ కాకూడదనుకో! నేను కానివ్వనులె! అంచేత, పార్క్ లో కూచుందాంరా!"
    "వద్దు సరోజా! ఎవరైనా చూస్తే."
    "ఏం చూస్తే? అది చూసి అందరూ నిన్ను గురించి చెప్పుకుంటారని భయమా? అప్పుడు, పాపం, అబ్బాయిగారికి పెళ్ళికాదని బెంగా? జుజుజుజు....దిగులుపడకు! ఏ పరిస్థితుల్లోనయినా నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను-మరొకతెను చచ్చినా నిన్ను పెళ్ళాడనివ్వను."
    "నాభయం నాకోసం కాదు__నీ కోసమే! మీ అమ్మకు తెలిస్తే."
    "ఆహా! కథానాయకా! త్యాగధనా! నీకా చింతవలదు- నేను పదునెనిమిదేండ్ల బాలా కుమారినే అయినాను, నా విషయములు నేను చూసుకొనగలుగు సామర్ధ్యము నాకున్నది. నా జీవితము నేను చక్కదిద్దు కొనగలను. నీవును ధైర్యముతో నీ జీవితమును నీవు కోరినట్లే తీర్చి దిద్దుకొనుమని ఉపదేశించుచున్నాను-ప్రస్తుతము పార్కులోనికి రమ్ము-అటు పిమ్మట."
    "నోరు మూయుము."  
    నవ్వుతూ కసురుకున్నా సరోజతో కలిసి పార్కుకి వెళ్ళక తప్పలేదు కుమార్ కి__గట్టిగా తప్పించుకోవాలని కుమార్ కూడా కోరుకోవటం లేదు. అప్పటినుండే సరోజా కుమార్ లు ఏ పార్క్ లోనో కూచుని కబుర్లు చెప్పుకోవటం మామూలయి పోయింది.
    ఒకసారి వాళ్ళిద్దరినీ పార్కులో తెలిసిన వాళ్ళెవరో చూసి అనురాధకు చెప్పారు-అనురాధ మండిపోయింది__ సరోజ ఇంటికి రాగానే ఆ చెంపా, ఈ చెంపా వాయించి "ఇంతవరకూ ఎక్కడున్నావే?" అంది-సరోజ బాధగా చెంప పట్టుకుని అభిమానం గాయపడగా రోషంతో "చెంపలు వాయించకుండా అడిగినా సమాధానం చెప్పే దానిని-బావతో పార్కులో కూచున్నాను" అంది, నిర్లక్ష్యంగా. ఆ పెంకితనానికి నిర్ఘాంతపోయింది అనూరాధ.
    "బావ! ఎవడే నీకు బావ?"
    "అత్తయ్య కన్న కొడుకులా పెంచింది కనుక బావ అన్నాను పోనీ, 'కుమార్' అనే అంటాను."
    "నిజంగా వాడు మీ అత్త కొడుకే అయితే నేను ఏమీ మాట్లాడక పోయేదానిని-ఎవడినో పట్టుకుని బావ అంటూ వాడితో తిరుగుతానంటావేమే?"
    "నిజంగా కుమార్ అత్తయ్య కొడుకే అయితే నేను బావతో అసలు తిరిగేదాన్ని కాదు. డాక్టర్లంతా, మేనరికాలు ఆరోగ్యానికి మంచివి కావంటున్నారు-బావ ఎవడో కనుకనే బావనే పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాను."
    "పెళ్ళి! నువ్వు వాడిని పెళ్ళి చేసుకుంటావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్ళి జరగనివ్వను."
    "అయితే, నీ కంఠంలో ప్రాణం ఉండగా అసలు నా పెళ్ళి జరగదులే!"
    మొండిగా సమాధానం చెప్పేసి తన ముందునించి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయిన సరోజను చూస్తోంటే, మతిపోయినట్లే అయింది అనూరాధకి.

 Previous Page Next Page