గతుక్కుమంది తులసి. మేనేజర్ కుర్చీలో కూచున్నప్పుడు ఉన్నట్లుగా లేడు సూర్యం.... తులసికి కూడా సంకోచం వదిలిపోవటం మొదలుపెట్టింది....
"మీలాంటి వంటవాడు నాకేం అక్కర్లేదు. నాకు వంట రాదనుకున్నారా? కావాలంటే శాంపిల్ గా ఇప్పుడు కాఫీ నేనే చేసి మీకిస్తాను."
"రండి! చేసి పెట్టండి."
సూర్యంతోపాటు శుచిగా, శుభ్రంగా ఉన్న ఆ వంటింట్లోకి ప్రవేశించి సూర్యం కాఫీపొడి, పంచదార అందిస్తోంటే_ కాఫీ తయారుచేసి కప్పుల్లో పోసుకుని, అతనితో కలిసి త్రాగుతోంటే ఇటీవలి కాలంలో తానెన్నడూ అనుభవించనంత హాయి కలిగింది తులసికి. కాఫీ కప్పుమీదుగా తులసి ముఖంలోకి చూస్తూనే ఉన్నాడు సూర్యం. అతడలా చూస్తున్నాడని అర్థం చేసుకుని కళ్ళెత్తలేకపోతోంది తులసి....
"ఇవాళ నేను మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా?"
తులసిలో సంకోచం పూర్తిగా వదిలిపోయింది.
"ఇన్నాళ్ళుగా ఎందుకు పిలవలేదో తెలిస్తేగద, ఇప్పుడు ఎందుకు పిలిచారో తెలియటానికి...."
"పిలిచి ఏం ప్రయోజనమని ఇన్నాళ్ళూ పిలవలేదు."
"అంటే? ఇప్పుడేం ప్రయోజనమని పిలిచినట్టు?" సూర్యం చిలిపిగా నవ్వాడు.
"ఏం ఆడవాళ్ళు! అన్నింటికీ ఆశ్చర్యాలే! ఇన్నాళ్ళూ మీకివ్వటానికి నాదగ్గర ఏమీలేదు. నిన్న జీతాలు అందాయిగా! అందుకని మీకోసం చిన్న ఉంగరం కొన్నాను. అది ఇయ్యటానికి పిలిచాను."
సభ్యత కూడా మరిచిపోయి ఆశ్చర్యంగా చూసింది తులసి_
"అదిగో! మళ్ళీ ఆశ్చర్యం! అవును మేడమ్, నాకు బ్యాంక్ లో నయాపైసలేదు. జీతం వస్తేనే గడుస్తుంది....."
"అది కాదు.....అది కాదు...." అంది తులసి తడబడి.
"చిన్నతనంలో మీరు నాకు స్వెట్టర్ ప్రజంట్ చేశారు. అది ఈ నాటికీ నా దగ్గరే ఉంది, ఆ రోజుల్లో నేను మీకేమీ ఇవ్వలేకపోయాను. ఈ ఉంగరం తీసుకుంటారా?"
చిన్న అట్టపెట్టె తెరిచి ముత్యాల ఉంగరం చూపించాడు సూర్యం.
"ఆ రోజుల్లోనూ, ఈ రోజుల్లోనూ కూడా మీకు నేనిచ్చినదేమీ లేదు. మీ దగ్గర నుంచే తీసుకుంటున్నాను."
తలవంచుకుని అంది తులసి.....
"ఆ రోజుల్లో మీరు నాకిచ్చిందేమిటో మీకర్థం కాదు. అప్పుడు_మీరే లేకపోతే ఆనాడు అ పరిస్థితులకు నేను ఎలా తట్టుకోగలిగేవాణ్ణో అనుకుంటూ ఉంటాను ఎప్పుడూ.... ఇది తీసుకోండి_ఆనాటి మీ అభిమానానికి వెలకట్టటం కాదు. ఇది నా తృప్తికోసం...
తులసి కొంచెంసేపు తలవంచుకుని తరువాత వణుకుతోన్న తన చేతిని అతని ముందుకు చాచింది. సూర్యం ఆ చేతిని తన చేత్తో పట్టుకుని, ఉంగరాన్ని తులసి వ్రేలికి పెట్టాడు.
11
మూలిగే నక్కమీద తాడిపండు అన్నట్లు అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న సంసారంలో జానకికి గుండెపోటు ప్రారంభమయింది. ముందు హార్టు అటాక్ అనుకుని కంగారుపడ్డారు. తీరా హాస్పిటల్ లో జాయిన్ చేయించిన తరువాత హార్టు అటాక్ కాదని, అదేదో చాలా పొడుగు పేరు చెప్పాడు డాక్టర్, మొత్తంమీద బలహీనం కారణంగా వచ్చిన జబ్బు అని తేల్చారు. తీసుకుపోవలసిన మందులూ, టానిక్కు లిస్ట్ రాసి ఇచ్చాడు. బాగా విశ్రాంతి తీసుకోవాలని కూడా చెప్పాడు.
ప్రాణికి పుట్టుకతోనే మృత్యుభయం కూడా వెన్నంటి ఉండేదేమో! తెల్లవారింది మొదలు "వెధవ బ్రతుకు! చావైనా రాదు__" అని పదిసార్లు తిట్టుకునే జానకికి తాను చచ్చిపోతానేమోననే భయం తలెత్తింది. ఏ కాస్త గుండెనొప్పి వచ్చినా చచ్చిపోతున్నట్లు ఊహించుకుని, అందరికీ అప్పగింతలు పెట్టి ఏడుస్తూ రామనామం జపించుకుంటూ..... మరో డాక్టర్ దగ్గరకు వెళ్ళి, మంచి మందులు తీసుకురమ్మని గొడవ చేసింది. మందులు శ్రద్ధగా వేసుకునేది. టానిక్ అయిపోయాక తులసి ఒక్కరోజు ఆలస్యం చేసినా, "తులసీ! నాకు టానిక్ తేలేదే? నీకు నా విషయంలోనే అశ్రద్ధ" అని సన్నగా సతాయించేది.
తల్లిలో ఈ మార్పుచూసి తెల్లబోయింది తులసి. ఈ వ్యక్తి తన తల్లేనా? ఉండీ, లేని సంసారంలో ఉన్న కూరా నారా, ముందు తండ్రికీ, తరువాత పిల్లలకూ పెట్టేసి, ఊరగాయ ముక్కతో, మజ్జిగనీళ్ళతో తన తల్లి భోజనం ముగించుకోవటం తులసికి బాగా తెలుసు. పండుగలొస్తే తనకు, అక్కకు కొత్త చీరలు కొని, పాత చీరతోనే సంతృప్తిగా నవ్వే తల్లిని మరిచిపోలేదు తులసి. మనుష్యులిలా ఎందుకు మారిపోతారు? సుఖమంటే ఏమిటో? ఆలోచించకుండా తనను పెంచి పెద్దచేసిన తల్లిని స్వార్థపరురాలని ఎలా నిందించగలదు?
జానకికి హార్టు అటాక్ అనుకున్నప్పుడు మాత్రం జగన్నాథం పంతులు విపరీతంగా తల్లడిల్లిపోయాడు. "జానకి లేకుండా నేనెలా బ్రతకాలి?" అని ఏడ్చేశాడు కూడా..... కానీ, జానకిది హార్టు అటాక్ కాదనీ, గుండెకు సంబంధించిన దీర్ఘరోగమనీ తెలియగానే ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, "ఇలాంటి రోగాలు ఉత్తుత్తి మందులకు లొంగవు. ఏదైనా కొండ ప్రాంతానికి.... చక్కని గాలి, నీళ్ళూ ఉండేచోటికి తీసికెళ్ళి మంచి స్పెషల్ వైద్యం చేయాలి. నేను బాగా డబ్బు సంపాదించి".... అంటూ జానకి తలక్రింద ఉన్న అయిదు రూపాయలు జానకి అరుస్తున్నా వినిపించుకోకుండా జేబులో వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు.