కొన్ని క్షణాలు ఆగి విగ్రహం "నీకు 'అబూబెన్-అడమ్' కథ తెలుసా? ఒక చిన్న ఇంగ్లీష్ పోయెమ్ ఇది! ఒక రోజు అర్థరాత్రి అబూకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే కోటి నక్షత్రాల కాంతితో ఒక దేవదూత ఏదో వ్రాసుకుంటున్నాడు. అతి శ్రద్ధగా అబూ అడిగాడు, "ఏం వ్రాస్తున్నావూ?" అని. దేవదూత సమాధానం చెప్పాడు "దేవుణ్ని అతి భక్తితో కొలిచేవాళ్ళ పేర్లు?"
అబూ అడిగాడు "అందులో నా పేరు ఉందా?"
"లేదు"
"పోనీలే! సాటి మనుషుల్ని ప్రేమించే వాళ్ళ జాబితా నువ్వు తయారుచేస్తే అందులో నా పేరు చేర్చు"
దేవదూత వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు మళ్ళా వచ్చాడు. వెనుకటి లాగే అతి శ్రద్ధగా వ్రాస్తున్నాడు.
అబూ అడిగాడు "ఏం వ్రాస్తున్నావూ"
"దేవుడు ప్రేమిస్తున్న మనుషుల పేర్లు! ఈ జాబితాలో నీ పేరు సువర్ణాక్షరాలతో ఉంది. మొట్ట మొదటి పంక్తిలో"
ఇదీ కథ. ఇప్పుడర్థమయిందా? నీకు దేవుడంటే భక్తి లేకపోవచ్చు. కానీ దేవుడు ప్రేమించే మనుష్యుల్లో నువ్వున్నావు. నిజానికి నేను సాయం చేసింది నీకు కాదు. ఆ కూలీ పిల్లాడికి! అయితే ఇది నేను నీకు చేసిన సాయంగా నువ్వనుకుంటున్నావు. నీలో ఈ లక్షణాన్ని దేవి ప్రేమిస్తోంది."
దిగ్భ్రాంతితో నిలబడ్డాడు రవి. శిలా విగ్రహాన్ని పరీక్షగా చూశాడు. ఎటు చూసినా శిల్పి పనితనమూ, జీవం ఉట్టిపడేలా మలచిన ప్రతిభ తప్ప మరేం కనపడలేదు.
"ఇంగ్లీషు మాటలు తెగ వాడేస్తున్నావు. ఇంగ్లీషు పద్యాల్లో కథలు చెప్తున్నావు. నువ్వేం దేవివి!" అన్నాడు.
నవ్వింది విగ్రహం.
"దేవి ఉంది అని నువ్వు ఒప్పుకుంటే ఆ దేవి సర్వజ్ఞురాలని కూడా ఒప్పుకోవాలి. అంతేకాని, నీ దేవి తెలుగుకీ, సంస్కృతానికీ, ఆంధ్రదేశానికీ మాత్రం పరిమితమంటే ఎలా?"
ప్రస్తుతానికి సెలవియ్యి. ఈ పిల్లాడిని వాళ్ళ అమ్మకప్పగించాలి! మరోసారి వచ్చి నీ "తత్త్వం" తెలుసుకుంటాను.
"తత్త్వం" అనే మాటని వ్యంగ్యంగా అనేక అర్థాలు స్ఫురించేలా ఉచ్ఛరించాడు రవి.
"వెల్ కం!"తన "తత్త్వాన్ని" గ్రహించగలిగిన భక్తులకి దేవి దాసాను దాసురాలు".
విగ్రహం కూడా "తత్త్వం" అనే మాట అంతే వ్యంగ్యంగా ఉచ్ఛరించింది.
పిల్లాడిని ఎత్తుకోబోయాడు రవి. అతడికిప్పుడు బాగా ఓపికొచ్చింది. రవి దగ్గిరికి రాకుండా బెదురుగా చూశాడు.
"రా! అమ్మ దగ్గిరకెళ్దాం" అన్నాడు రవి. వచ్చి చెయ్యిపట్టుకున్నాడు.
తనను కోటలోనికి తీసుకొచ్చిన కాషాయాంబధారిణి నుద్ధేశించి "నృసింహస్వామి లోయలోకి వెళ్ళటానికి నాకు దారి చూపిస్తారా?" అన్నాడు.
కాషాయాంబధారి రవితో కలిసి కోట బయటికి వచ్చాడు. ఇద్దరూ ఐరన్ గేట్ మీదుగా అగడ్త దాటారు.
"ఈ అగడ్త చాలా లోతుగా వుంటుందా?" అడిగాడు రవి.
"ఆ! అంతేకాదు. మొసళ్ళు కూడా ఉంటాయి."
రవి చూస్తూ ఉండగానే వాళ్ళు దాటివచ్చిన ఐరన్ గేట్ పైకి లేచిపోయింది. ఆ గేట్ కి ఐరన్ చైన్స్ ఉండటం గమనించాడు రవి. వాళ్ళకీ కోటకీ మధ్య అగడ్త తప్ప ఏ దారీ లేదు. ఈదుతూ కొద్దిగా తలపైకి పెట్టిన ఒక మొసలి కనిపించింది.
"ఇక్కడి నుంచి పది నిముషాల్లో బయటకి వెళ్ళగలిగే దగ్గిర దారి నేను చూపించగలను మీరొక షరతుకి ఒప్పుకుంటే...."
"ఏమిటది?"
"మీ కళ్ళు కనిపించకుండా కళ్ళకి గంతలు కడతాను. దారిలో మీరా కట్టు విప్పటానికి ప్రయత్నించకూడదు. ముందే ఆలోచించుకోండి. నా షరతుకి ఒప్పుకున్నట్లే నటించి దారిలో విప్పటానికి ప్రయత్నిస్తే మీకే ప్రమాదం జాగ్రత్త."
ఎక్కువసేపు ఆలోచించలేదు రవి. అతడికి చాలా అలసటగా వుంది. చేతి గడియారం అయిదున్నర చూపుతోంది. ఈ పాటికి జాతర అయిపోయి వుంటుంది.
"ఒప్పుకుంటున్నాను. దారిలో చూడటానికి ప్రయత్నించను"
"మరో విషయం మీకు కళ్ళకి గంతలు కట్టాక, మనం ఒక బెంచీలో కూర్చుంటాం. అది ఆకాశమార్గాన మనల్ని తీసుకెళ్తుంది. దారిలో కదల కూడదు."
"బెంచీ ఆకాశమార్గాన తీసుకెళుతుందా?"
"అవును"
కాషాయాంబధారి రవికీ, ఆ పిల్లాడికీ కళ్ళు కనపడకుండా గంతలు కట్టాడు. ఇద్దరినీ చెరో చేయి పట్టుకుని కొంతదూరం నడిపించాడు. ఆ తరువాత ముగ్గురూ ఒక కొయ్య బెంచీలో కూర్చున్నారు. ఆ బెంచీ నెమ్మదిగా పైకి లేచింది. తర్వాత గాలిలో తేలుతూ ప్రయాణం చెయ్యసాగింది. ఏమయితే అయ్యింది. ఒక్కసారి తన కళ్ళ గంతలు పీకేసి చూడాలనిపించింది రవికి.
అతడి మనసులో ఆలోచనలు పసికట్టినట్లు "కళ్ళ గంతలు విప్పటానికి ప్రయత్నించినా, కదిలినా మీ ప్రాణాలు దక్కవు. కృతఘ్నత దేవి సహించదు" అన్నాడు కాషాయాంబధారి.
రవి ప్రాణాలకయినా తెగించేవాడేకాని, "కృతజ్ఞత సహించదు" అన్న వాక్యాలు అతడిని కట్టిపడేశాయి. మాట ఇచ్చి మోసం చెయ్యటానికి అతని అంతరంగం ఒప్పుకోలేదు.
బెంచీ ఆకాశంలో తేలుతూ పోతోంది. పిల్లాడు రవి చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. కథల్లో చెప్పినట్లు కీలుగుఱ్ఱాలు కాదు. కీలు బెంచీలు నిజంగా ఉన్నాయా? ఆ బెంచీకి ఆనుకోవటానికి చేతులున్నాయి.
ఇద్దరు ముగ్గురు మాత్రమే పట్టేటంత చిన్నదిగా ఉందని ఒకరినొకరు ఒరుసుకుంటూ కూచోవటాన్ని బట్టి గ్రహించాడు రవి.
చల్లగా-హాయిగా వీస్తున్నాయి గాలులు. ఏవేవో పక్షుల కలకలా రావాలు వినిపిస్తున్నాయి. ఉండుండి గజ్జెలు ఘల్లుమంటున్న ధ్వని...
"ఆ గజ్జెల చప్పుడేమిటి?" అడిగాడు రవి.
"అవా? గజ్జెల దయ్యాలు" నవ్వాడు కాషాయాంబధారి! రవి మాట్లాడలేదు. దేవి, కాషాయాంబరాలు కట్టుకున్న ఈ ఆడవాళ్ళూ, మొగవాళ్ళూ అంతా ఏదో మాయలాగ ఉంది. అతనికి...ఉండుండి ఎక్కడో దూరం నుంచి గజ్జెల చప్పుడు వినిపిస్తూనే వుంది.
అంతలో ఆ ధ్వని! అర్థరాత్రివేళ డేరాలలోకి ఎవరో దూరంగా ఏడుస్తున్నట్లుగా కాదు. ఈ ధ్వనిలో ఏదో లయ వుంది. అనిల అన్నట్లు ఇది ఏదో సంగీతం లాగా వుంది.
"ఆ ధ్వని ఏమిటి?" అడక్కూడదు అనుకుంటూనే అడిగాడు రవి.
"అది దేవి పలికిస్తున్న జీవనాదం"
ఇదివరకులా వెటకారపు నవ్వుతో కాక, భక్తితో అన్నాడు కాషాయాంబధారి.
"జీవ నాదం" పేరు గమ్మత్తుగా తోచింది రవికి. భావగర్భితంగా ఉంది.
"ఏ వాయిద్యం మీద?"
"ఈ విశాల విశ్వమే ఆ దేవి వాయిద్యం!"