"ఏమిటి నువ్వంటున్నది?" అన్నాడు అయోమయంగా. "ఆ కిరాతకుల మధ్యకి.... ఆ శత్రు శిబిరాల్లోకి వృద్దురాలయిన నీ తల్లిని తీసుకు వెళతావా? మామూలు సీక్రెట్ ఏజంట్స్ కే సాధ్యం కాని ఆ విషవలయంలోకి నీ తల్లితో కలిసి ప్రవేశిస్తావా?"
"అవును" దృఢంగా అన్నాడు చైతన్యప్రసాద్. అంతకన్నా వేరే మార్గంలేదు. "ఏం అమ్మా- నువ్వేమంటావ్?"
రంగనాయకి తలెత్తి అన్నది- "ఆయన బ్రతికి వున్నారన్న ఒక్క మాటతోనే నా కడుపు నిండిపోయింది బాబూ! ఆయన్ని ఒక్కసారి చూడగలనన్న ఆశ తీరటంకోసం ప్రాణాలయినా అర్పించగలను." అతడు వినటం లేదు. తల్లి ఏం చెపుతుందో అతడికి తెలుసు. అతడి ఆలోచన అంతా, ఎలా అక్కడికి చేరుకోవటమా అని! ఈ విషయంలో ప్రభుత్వం నిస్సహాయమని అతడికి తెలుసు. శత్రుసైన్య శిబిరంలోకి ఒక సీక్రెట్ ఏజెంట్ వెళ్ళటమే కష్టం! దానికితోడు తల్లిని తీసుకెళ్ళడమంటే....
అసలు కలలోనయినా జరిగే విషయమేనా ఇది?
ఎలా ఆ దేశం వెళ్ళటం?
ఎలా ఆ సైనిక శిబిరాలని చేరటం?
చేరినా... ఎలా లోపలికి తల్లితో సహా ప్రవేశించటం.
అజ్మరాలీ, ఖాన్ లాంటి కిరాతకుల బారినుంచి ఎలా బ్రతికి బయటపడి, తండ్రిని తీసుకు....
.... అతని ఆలోచనలు అక్కడే ఆగిపోయినాయ్!
అ....జ్మ....రా....లీ...
ఆ పేరు స్పురణకి రాగానే వెంటనే జ్ఞాపకం వచ్చిన మరో పేరు...
ప్రనూష!
ఇద్దరి గమ్యమూ ఒక్కటే!
అవును! ప్రనూష తనకి సాయపడగలదు.
కొన్ని సంవత్సరాలుగా ఆమె అజ్మరాలీ మీద శోధనలు జరుపుతూ వుంది. వాళ్ళ గురించి అన్ని వివరాలు సేకరించింది. అజ్మరాలీని చంపటం కోసం జీవితాన్ని ధారపోసింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. పట్టుదలే ఊపిరిగా బ్రతికింది. అటువంటి ఆమెకు తను సాయపడితే?
ఆమె ఒంటరి యుద్ధానికి తను సైన్యంగా మారితే?
ఆ ఆలోచన రాగానే అతడు లేచాడు.
ఒక కొత్త అధ్యాయానికి అది ప్రారంభం.
* * * *
"ఇదేం ప్రప్రోజల్? నాకేం అర్ధంకావటంలేదు" అంది ప్రనూష. "నేను మిమ్మల్ని అడిగింది అజ్మరాలీని చంపటానికి నాకు సాయపడమని! మీ తండ్రిని వెనక్కు తీసుకురావటం అన్నది దానికి తోడయితే నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అందుకోసం మనతోపాటు మీ అమ్మగార్ని తీసుకు వెళ్ళటం అంటే... ఇదెలా సాధ్యం? నేను వూహించలేకపోతున్నాను."
చైతన్య కోపం అణుచుకుంటూ అన్నాడు. "నేనూ వూహించలేకపోయాను..... ఒక ఆడపిల్ల నన్ను పిచ్చివాడిలా ఆస్పత్రిలో చేరుస్తుందనీ, అటువంటి ఆడపిల్లతో మళ్లీ చేతులు కలుపుతాననీ నేనూ వూహించలేకపోయాను. మనం వూహించలేదని జరగాల్సింది జరక్కపోదు. కాబట్టి నీ వూహేమిటో నాకనవసరం. నువ్వు నీ మాటల్లో "నాకేమీ అభ్యంతరం లేద"న్నావు. దీనిని బట్టి నువ్వేదో సైన్యాన్ని నడిపించే మహారాణివి అనీ, నేను నీ క్రింద పనిచేసే నౌఖర్ననీ నువ్వు భావిస్తూ వుంటే అది చాలా తప్పు. నేనిక్కడికి వచ్చింది కేవలం నీకు అక్కడి పరిస్థితులన్నీ తెలుసనే ఉద్దేశ్యంతో. నువ్వు కాదంటే నేను వెళ్ళి అక్కడినుంచి నా తండ్రిని విడిపించుకు రాగలను. పోతే కొంత ఆలస్యం అవుతుందంతే."
ఇస్మాయిల్ మధ్యలో కల్పించుకుని "కలిసి పని చెయ్యవలసిన మీరిద్దరూ ఇలా మొదటినుంచీ దెబ్బలాడుకుంటే అసలు పని జరగదు. జరగవలసింది ఆలోచించండి" అన్నాడు.
"ఒక వృద్ధురాలు ఆ శత్రు సైనిక శిబిరాల్లోకి ప్రవేశించటం అసాధ్యం. ఆ విషయం ఆయనకి చెప్పండి" అంది ప్రనూష.
"ఒక స్త్రీ ప్రవేశించటం కూడా అసాధ్యమే. ఆ విషయం తను తెలుసుకుంటే మంచిదని చెప్పండి."
ప్రనూష లేచి "సరే మీ యిష్టం. మీ తల్లిగారిని తీసుకురండి. కానీ ఒక్క విషయం. అవకాశం దొరగ్గానే అజ్మరాలీని నేను చంపేస్తాను. అసాధ్యమైన పనుల కోసం నేను ఆగను. అది మాత్రం నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ సడలించబోని కండిషను" అన్నది.
"నా కండిషను కూడా అదే. నా తండ్రి దొరగ్గానే నేను ఆ దేశం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాను. అజ్మరాలీ మరణం వరకూ ఆగను. ఇది నా కండిషను."
ఇస్మాయిల్ ఇద్దరివైపు చూస్తూ అనుకున్నాడు. "ఇంత ఎడమొహం పెడమొహాలతో వీళ్ళు అసలు ఈ కార్యం సాధించగలరా?"
"మనం ఆ దేశం ఎలా వెళ్ళాలో నేను ప్లాన్ చేసి వుంచాను" అంది ప్రనూష. "మీరొప్పుకుంటే రేపే బయల్దేరవచ్చు."
"ఏం ప్లాన్ చేసి వుంచావు?"
"హెలికాప్టర్ మాట్లాడాను. బోర్డరు సరిహద్దుల్లో మనల్ని అది దింపుతుంది. అక్కడనుంచి రహస్యంగా మనం బోర్డరు దాటుతాం."
"నువ్వు ఇంగ్లీషు సినిమాలు బాగా చూస్తావనుకుంటానే?"
ఆమె మొహం రక్తవర్ణంతో ఎర్రబడింది. "ఏం నేనేమన్నాను?"
"బోర్డరు దాటి ఎక్కడికి వెళతాం? ఎలా వెళతాం? ఎంత దూరం వెళతాం? ఈ లోపులో ఆ సైనికులు మానని పట్టుకోరా? అక్రమంగా సరిహద్దు దాటామన్న ఒక చిన్న కారణం చాలు- మనల్ని ఉరితీయడానికి. అయినా ఆ అజ్మరాలీ వుండే ప్రదేశం, అదే- నా తండ్రిని వుంచిన జైలు ఎంత దూరం వుంది సరిహద్దుకి."
"దాదాపు అయిదొందల కిలోమీటర్లు."
"మరి? అయిదొందల కిలోమీటర్లు ఎలా వెళతాం? అదీ పాస్ పోర్టు లేకుండా అనధికారంగా ఆ సైనికుల మధ్యలో?"
ఆమె సమాధానం చెప్పలేదు. అతనన్నాడు- "ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడే చెబుతున్నాను. ఈ ఆపరేషన్ కు సంబంధించిన ప్రతీ ప్లానూ నేనే వేస్తాను. నువ్వేమైనా సలహా యివ్వొచ్చు. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం నాదే." అని ఆగి అన్నాడు.
"ఒక గ్రూపుగా ఇక్కణ్ణుంచి విదేశాల్లో ప్రోగ్రాం యివ్వటానికి మనం వెళతాం. నేను ఎలాగూ నటుడినే కాబట్టి ఎవరికీ అనుమానం రాదు. ముందు ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మనం చేరవలసిన చోటుకి చేరుకున్న తరువాత మిగతా ప్లాను ఆలోచిస్తాం."
"ఈ ప్లాను బాగానే వున్నట్టుంది."
"ఈ ప్లాను గురించి నువ్వేమీ సర్టిఫికెట్టు ఇవ్వనవసరం లేదు."
"మన గ్రూప్ లో నా తరఫు నుంచి డాక్టర్ పాల్ వుంటారు. మీకు గుర్తుందా? సైనిక శిబిరం నుంచి నన్ను తప్పించిన వ్యక్తి ఆయనే. సైన్యంలో పనిచేశాడు కాబట్టి ఆయన మనకి సాయపడవచ్చు."
"కానీ అజ్మరాలీ అతడిని గుర్తుపట్టవచ్చు. దానివల్ల మొదటికే ప్రమాదం."
"ప్రమాదం అంటూ వస్తే నాతోనే వస్తుంది. అజ్మరాలీ నన్ను బాగా గుర్తుపడతాడు. అందువల్ల పాల్ ని మనతో తీసుకెళ్ళటం వల్ల కొత్తగా వచ్చే ప్రమాదం అంటూ ఏమీలేదు."
చైతన్యకి ఆమె వాదన కరక్టే అనిపించింది. పాల్ సైన్యంలో పని చేశాడు. అనుభవమ వుంది- అది తమకి పనికి రావొచ్చు. ఎలాగూ వెళుతున్నది ట్రూపే కాబట్టి అభ్యంతరం వుండే అవసరంలేదు. అప్పటికి నలుగురయ్యారు. చైతన్య, అతడి తల్లి, ప్రనూష, డాక్టర్ పాల్.
"మీ కభ్యంతరం లేకపోతే నేనూ వస్తాను" అన్నాడు ఇస్మాయిల్- "జగదీష్ ఎక్కడుంటాడో, ఆ యుద్ధఖైదీల నివాస ప్రదేశ వివరాలేమిటో నాకు బాగా తెలుసు. అదీగాక మా పూర్వీకులు ఆ దేశంనుంచి వలస వచ్చారు కాబట్టి నాకు బాగా తెలిసిన వాళ్ళు అక్కడ కొందరున్నారు- వాళ్ళ సహాయం మనకి అవసరం పడవచ్చు."
ప్రనూష చైతన్య వైపు చూసింది.
అంతలో పక్కగదిలో ఫోన్ మ్రోగింది. ప్రనూష వెళ్ళి మాట్లాడి "చైతన్యా! మీకు ఫోన్" అంది. చైతన్య పక్కగదిలోకి వెళ్ళేసరికి రిసీవర్ పెట్టేసి వుంది. చైతన్య ఆశ్చర్యంగా చూశాడు.
ఆమె నవ్వి, "ఫోన్ నా మిత్రురాలి నుంచి నా కోసం. నేను మాట్లాడి పెట్టేశాను. ఇప్పుడు మిమ్మల్ని పిలిపించింది ఇస్మాయిల్ మనతో రావటం గురించి ఒంటరిగా మీతో చర్చించటానికి" అంది. ఆమె అనుమానం చైతన్యకి అర్ధమైంది. ఇస్మాయిల్ "ఆ" దేశానికి సంబంధించినవాడు. ఇప్పుడతన్ని తమతో తీసుకువెళ్లటం ప్రమాద హేతువేమోనని ఆమె ఆలోచిస్తున్నది. దానితో చైతన్య అన్నాడు- "ఇస్మాయిల్ భారతదేశ సైన్యంలో పని చేసినవాడు. మనదేశం అతనిమీద పెట్టిన నమ్మకం మనకి అతనిమీద వుండకపోవటం తప్పు."
"కానీ అతడు కొంతకాలం విదేశీ జైల్లో వున్నాడు. అతడు అక్కడినుంచి ఎలా బయటకు వచ్చాడో మనకి తెలీదు. పైగా అజ్మరాలీ తెలివితేటలు నేను స్వయంగా చూశాను. మీ తండ్రిగారితో నిజం చెప్పించటానికి అతడు ఖాన్ అనే అనుచరుడికి వరుణ్ అన్న పేరుపెట్టి భారతదేశపు ఏజెంట్ గా నాటకం ఆడించాడు, గుర్తుందా?"
చైతన్య తలూపాడు. ఆమె కొనసాగించింది.
"అన్ని నక్కజిత్తులు నటింపజేయగల అజ్మరాలీ ఈ ఇస్మాయిల్ ని మన దగ్గరకు ఎందుకు పంపి వుండకూడదు?'
"నా తండ్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ నిజం చెప్పటం లేదనీ, అతడిని స్వయంగా ఎంత బాధపెట్టినా లాభంలేదనీ, నా తల్లిని ఈ వుచ్చులోకి లాగటం కోసం అజ్మరాలీ ఈ నాటకం ఆడాడంటావా? నా తల్లిని చిత్రహింసలు పెట్టటం ద్వారా ఈ రహస్యం నా తండ్రినుంచి బయట పెట్టించటం కోసం ఇస్మాయిల్ ని పంపించాడంటావా?"
తను చెప్పదలుచుకున్నది అతడు సరిగ్గా గ్రహించినట్టు తలూపింది. అతడొక క్షణం ఆలోచించి అన్నాడు.
"ఇది నిజం కాకపోవచ్చు. ఇస్మాయిల్ గురించి నేను ఎంక్వయిరీ చేశాను. యుద్ధఖైదీల మార్పిడిలో అతడు మనదేశం వచ్చి సంవత్సరం కావొస్తూంది. నా తల్లిని పరాయి దేశానికి తీసుకువెళ్ళటానికి వచ్చిన గూఢచారి అయితే సంవత్సరం పాటు ఊరుకోడు. వెంటనే మమ్మల్ని చేరుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకో ఉదాహరణ ఏమిటంటే అతడు ఒకరోజు మా తల్లిని వెతుక్కుంటూ వచ్చి లోపల ప్రవేశం కోసం మా బంధువునని చెప్పాడు. అలా చెప్పినవాడు ఆ విషయం మర్చిపోయి ఆ రోజు శుక్రవారం అవటంతో హాలు మధ్యలో నమాజ్ చేస్తూ నా సెక్రటరీకి దొరికిపోయాడు. అతడు నిజంగా గూఢచారి అయితే ఇంత చిన్నచిన్న తప్పులు చేయడు. ముఖ్యంగా అతడు మనదేశం వచ్చి సంవత్సరం ఆగటం అన్నది అన్ని అనుమానాల్నీ దూరం చేస్తూంది." ప్రనూష అతనివైపు మెచ్చుకోలుగా చూసింది. తను కేవలం ఆలోచించిందంతే. అతడు ఆలోచించి వూరుకోకుండా దాని గురించి ఎంక్వయిరీ చేసి కొన్ని నిజాలు సేకరించి ఒక అభిప్రాయానికి వచ్చాడు. దూరదృష్టి, ప్రాక్టికాలిటీ ఒకేచోట కలిసిన మనిషి యితడు. తన ఎంపిక తప్పు కానందుకు ఆమె సంతోషించింది. ఆ ఉత్సాహంలో "మనం ఎప్పుడు బయల్దేరుతున్నాం?" అని అడిగింది.
"సరిగ్గా ఈ రోజునుంచి ఆర్నెల్ల తరువాత." ఆమె భరించలేనంత విస్మయంతో "ఆర్నెల్ల తరువాతా?" అంది.
"అవును." అన్నాడు చైతన్య. "మనం వెళుతున్నది మామూలు పనిమీద కాదు. ఎన్నో ప్రమాదాల్ని ఎదుర్కోవాలి. ఎంతోమందితో తలపడవలసి రావచ్చు. నేను ఏ పనిమీద వచ్చానో తెలుసుకోవటం కోసం విదేశీ సైన్యం నన్ను చిత్రహింస పెట్టవచ్చు. వీటన్నిటికీ నేను తట్టుకోవాలి మిమ్మల్ని వదిలి నేను ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించాక ఏ సాలెగూడులో ఇరుక్కుంటానో- దానికిముందే సర్వవిధాలా ప్రిపేర్ అయ్యి వుండాలి కదా?"